వణుకుతున్న నగరాలకు ఊరట ఎప్పుడు?
ABN, Publish Date - Sep 11 , 2024 | 04:57 AM
ఇప్పుడు దేశంలో వర్షం హోరు తప్ప మరేదీ వినపడడం లేదు. ఉదయం, రాత్రీ అన్న తేడా లేకుండా వర్షం కురుస్తున్న చప్పుడు వినపడుతోంది. ఆకాశంలో దట్టంగా అలముకున్న మేఘాలను చూస్తే...
ఇప్పుడు దేశంలో వర్షం హోరు తప్ప మరేదీ వినపడడం లేదు. ఉదయం, రాత్రీ అన్న తేడా లేకుండా వర్షం కురుస్తున్న చప్పుడు వినపడుతోంది. ఆకాశంలో దట్టంగా అలముకున్న మేఘాలను చూస్తే భయం వేస్తోంది. దేశమంతా చిరపుంజీగా మారిందా అన్న అనుమానం వేస్తోంది. దేశ రాజధాని ఢిల్లీతో సహా ఇవాళ అనేక నగరాలలో వర్షాల వల్ల నీరు రోడ్లపై ప్రవహిస్తోంది. రోడ్లను దాటి, సందుగొందులను చుట్టి ఇళ్లలోకి వస్తోంది. భవనాల నేలమాళిగలలోకి కూడా నీరు ప్రవహిస్తోంది. చెట్లు నేల కూలి నిస్సహాయంగా చూస్తున్నాయి. యమునా పరివాహక ప్రాంతాల్లో ఉన్న దిక్కుమొక్కులేని జనం ఫుట్‌పాత్‌లపైకి వచ్చి టెంట్లలో తలదాచుకుంటున్నారు. గత నెల ఢిల్లీలోని రాజేంద్రనగర్‌లో ఒక ఐఏఎస్ కోచింగ్ సంస్థ అండర్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన లైబ్రరీలోకి నీరు ప్రవహించి ముగ్గురు విద్యార్థులు; ఒక పార్క్‌లో వాననీటిలో మునిగి ఒక ఏడేళ్ల బాలుడు మరణించారు. కేరళలోని వయనాడుతో ప్రారంభించి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, పంజాబ్, ఉత్తర ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిషా, గుజరాత్, హర్యానా, బిహార్, పశ్చిమ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, గోవాలోని అనేక ప్రాంతాల్లో ఎందరో కుండపోత వర్షాలు, పెను వరదలకు గురై మరణించారు. అనేక చోట్ల వాహనాలు కొట్టుకుపోయాయి. ఫలితంగా ఎన్నో కుటుంబాలవారు తమ ఆప్తులను కోల్పోవడం జరిగింది. విజయవాడలో గత రెండు దశాబ్దాల్లో ఏనాడూ లేనంతగా సంభవించిన వర్షాలు, వరదలు అల్లకల్లోలం సృష్టించాయి.
ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే దేశంలో రాజస్థాన్‌తో పాటు అనేక రాష్ట్రాల్లో మహిళలు తాగు నీటికోసం మైళ్ళకొద్దీ నడవాల్సిన పరిస్థితి ఇప్పటికీ ఉన్నది! దేశవ్యాప్తంగా 60 కోట్లమంది తీవ్ర నీటి ఎద్దడికి గురవుతున్నారని, స్వచ్ఛమైన నీరు లభించనందువల్ల ఏటా 2 లక్షలమంది మరణిస్తున్నారని, దేశంలో 70 శాతం నీరు కలుషితమైందని సౌత్ ఆసియా ఫోరమ్ వెల్లడించింది. యేల్ యూనివర్సిటీ 2022లో చేసిన అధ్యయనంలో కలుషితమైన తాగునీటిపై నిర్ణయించిన సూచికలో 200 దేశాల్లో భారత్ 141వ స్థానంలో ఉన్నది. ‘Water, Water every where but not a drop to drink’ (ఎక్కడ చూసినా నీరే కాని చుక్క నీరు త్రాగలేము) అని ఒకప్పుడు సముద్రం గురించి మాట్లాడుకునేవారం. ఇప్పడు ఆ సముద్రం మన వీధుల్లోకే వచ్చింది. జగత్తు అంతా జల ప్రళయం ఏర్పడితే దేవుడు ఒక పడవను పంపించి అందర్నీ కాపాడాడని బైబిల్‌లో ఒక కథనం ఉంది. ఇప్పుడు మనం రోజూ తిరిగే రోడ్లే నదులుగా మారినప్పుడు, నీటిలో ఇరుక్కుని కొట్టుకుపోతునప్పుడు ఎందరో మానవ దేవుళ్లు కాపాడాల్సి వస్తోంది.
మరో వారం రోజులు దేశమంతా ఇలాగే వర్షాలు కురుస్తాయని, ఒక చోట తగ్గినా మరో చోట వానలు ఆగవని ఢిల్లీలోని ఐఎండి అధికారులు చెబుతున్నారు. ప్రధానమంత్రి స్వంత రాష్ట్రమైన గుజరాత్‌లో కనీసం 15 జిల్లాల్లో పరిస్థితి ఘోరంగా ఉన్నది జామ్‌నగర్ నగరంలో వర్షాలు కురిసిన తర్వాత వీధులన్నీ భారీ చెత్తతో నిండిపోయాయి. వాటిని తొలగించేందుకు అధికారులు రాత్రింబవళ్లు పనిచేయాల్సి వచ్చింది. కచ్ ప్రాంతంలో పరిస్థితి పునరుద్ధరించడం ప్రభుత్వానికి తలకు మించిన పని అయింది. ముఖ్యంగా వడోదరా నగరంలో ఆగస్టు 26 నుంచి 12 రోజుల పాటు వర్షాలు కురిశాయి, వరదలు ముంచెత్తాయి. అజ్వా రిజర్వాయర్ నుంచి విశ్వామిత్రి నదికి నీరు వదలడంతో అనేక లోతట్టు ప్రాంతాలలో ఉన్న ఇళ్లు మునిగిపోయాయి. అపార్ట్ మెంట్లలోకి కూడా నీరు ప్రవహిస్తోంది. వరద నీళ్లలో మొసళ్లు కూడా దర్శనమిస్తున్నాయి! వేలాది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఎన్ని ఆహారపొట్లాలు సరఫరా చేసినా సరిపోవడం లేదు. మృత్యుభయంతో వణికిపోతున్న ప్రజలు బీజేపీ నేతలు కనపడితే మండిపడుతున్నారు. విజయవాడలో చంద్రబాబునాయుడు, ఇతర నేతలు దైర్యంగా ప్రజల వద్దకు వెళ్లి వారికి భరోసా ఇవ్వడంతో పాటు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటుంటే గుజరాత్‌లో నేతలు కనీసం ప్రజల వద్దకు వెళ్లేందుకు సాహసించలేకపోతున్నారు.
నిజానికి నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లో ఎండిపోయిన సబర్మతీ నదీతలంపై పిల్లలు క్రికెట్ ఆడుతుంటే చూశారు. ఎక్కడికక్కడ ఆక్రమణలు జరగడం, పారిశ్రామిక కాలుష్య పదార్థాలు వదలడంతో అసలు ఆ నది అనేదే ఒకటున్నదన్న విషయం జనం మరిచిపోయారు. సర్దార్ సరోవర్ ఆనకట్ట ఎత్తు పెంచడం ద్వారా నీటి నిల్వను పెంచి కాలువల ద్వారా సబర్మతీ నదిలోకి నీరు మళ్లించారు. భారీ వర్షాలు వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతాలకు ప్రవహించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సబర్మతీ నది కోసమే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒకవైపు పాదచారులు, సైక్లిస్టులు వెళ్లేందుకు రహదారులు ఏర్పరిచారు. మరో వైపు విద్యాసంస్థలు, విహార స్థలాలు, వాణిజ్య సముదాయాలను నిర్మించారు. మరి ఇవే నిర్మాణ కార్యక్రమాలను వడోదరాలో ఎందుకు ఆయన చేపట్టలేకపోయారు?
తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థితులు, విశృంఖలమైన పట్టణ అభివృద్ధి, అస్తవ్యస్తమైన డ్రైనేజి వ్యవస్థ కారణంగానే ఈ వరదలు సంభవించాయని గాంధీనగర్ లోని ఐఐటీ పరిశోధకులు తేల్చారు. మరి స్మార్ట్ సిటీల గురించి ప్రచారం చేసిన మోదీ తాను ముఖ్యమంత్రిగా ఉన్న 13 ఏళ్లలో స్వంత రాష్ట్రంలో నగరాలను ప్రజావసరాలకు తగ్గట్లుగా ఎందుకు తీర్చిదిద్దలేకపోయారు? మోదీ ప్రధాని అయ్యాక గంగానది ప్రక్షాళనకోసం నమామి గంగే ప్రాజెక్టును ప్రారంభించారు. కాని హరిద్వార్‌తో సహా చాలా చోట్ల ఇంకా ఘాట్‌ల వద్ద చెత్తాచెదారం పేరుకుని ఉన్నది. కాన్పూర్‌లో గంగానదిలో దురాక్రమణలు జరగడం, ప్రక్షాళన సరిగా లేకపోవడంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
అసలు స్మార్ట్ సిటీ అంటే ఏమిటి? రహదారులు, భవనాలు, కమ్యూనికేషన్ సౌకర్యాలు, మెట్రో రైలు మార్గాలు నిర్మించడమా? హైదరాబాద్‌లో జరిగినట్లు రియల్ ఎస్టేట్, కాంట్రాక్టర్ల స్వార్థాలకు అప్పజెప్పడమా? నదులను, చెరువులను నాశనం చేయడమా? పర్యావరణాన్ని కాలరాయడమా? మన సహజవనరులు, మన మానవవనరులు, మన చారిత్రక వారసత్వ సంపదను దృష్టిలో ఉంచుకోకుండా పైకి కళ్లకు జిగేలుమనిపించే ఎన్ని అందమైన నగరాలను నిర్మించినా అవి ఆధునిక సమాధులుగా మారతాయే కాని జీవన సౌందర్యాన్ని ప్రతిబింబించలేవు. మరే దేశంలోనైనా కొల్లేరు వంటి సరస్సు ఉంటే గొప్ప పక్షుల అధ్యయన కేంద్రంగా, పర్యాటన స్థలంగా అభివృద్ధి చేసి ఉపాధి కల్పించేవారని ప్రముఖ పర్యావరణవేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత తల్లావఝ్ఝల పతంజలి శాస్త్రి రాశారు. ఆ కొల్లేరు దురాక్రమణల దుష్ఫలితాలు కూడా ఈ వరదల సమయంలో ప్రజలు ఎదుర్కొంటున్నారు.
మోదీ ప్రధాని అయ్యాక కొత్త విద్యుత్ చట్టాలను ప్రవేశపెట్టారు. అయితే అన్ని రాష్ట్రాల్లో నదులు, చెరువుల భూములను దురాక్రమించే వారి ఆటకట్టించేందుకు కేంద్ర స్థాయిలో ఒక చట్టాన్ని ఎందుకు తీసుకురాలేకపోయారు? అటువంటి చట్టాన్ని ఒకదాన్ని ప్రవేశపెట్టి ఉన్నట్టయితే ఇవాళ తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైడ్రా అన్న సంస్థను రంగంలోకి దించాల్సిన అవసరం ఉండేది కాదు. నాడు ముఖ్యమంత్రి పీవీ నరసింహారావు కాంగ్రెస్ విధానాలు నిర్దేశించిన ప్రకారమే భూసంస్కరణలను అమలు చేశారు. దీని ఫలితంగా పీవీకి పదవీ ముప్పు ఏర్పడింది. అయితే అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఆయనను పదవి కోల్పోకుండా కాపాడలేకపోయారు. ఇవాళ కొందరు కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ వద్దకు వెళ్లి హైడ్రాపై మొరపెట్టుకున్నా వారు పట్టించుకోకుండా రేవంత్‌నే బలపరచడం, ఆయన వివరణతో ఏకీభవించడం ఒక కీలక పరిణామం.
‘మూసీ నది ఒడ్డున నిలబడి చూస్తుంటే కోటలు, గోడలు, బురుజులు, ఒక పక్క బేగం బజారు, చక్కటి చెట్లు, ఎంతో మనోజ్ఞమైన దృశ్యాలు. నదిలో పలువురు స్నానం చేస్తున్నారు. చెలమలు త్రవ్వి నీరు తీసుకుని వెళుతున్నారు. మీర్ ఆలం చెరువు ఎంతో విశాలంగా ఆకట్టుకుంటోంది..’ అని 1860లో నైజాం రాజ్యంలో పనిచేసిన మెడోస్ టైలర్ తన ఆత్మకథలో రాశారు. (ప్రముఖ జర్నలిస్టు జి. కృష్ణ ఈ ఆత్మకథను తెలుగులో అనువదించారు). 1908లో మూసీకి పెద్ద ఎత్తున వరదలు వచ్చి నగరం బాగా దెబ్బతిన్నది. అఫ్జల్‌గంజ్ లోనే 11 అడుగుల ఎత్తుకు నీరు చేరుకుంది. దీనితో నిజాం ఒక ట్రస్టు నేర్పాటు చేసి, ప్రముఖ ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలను ఉపయోగించుకున్నారు. ఆ తర్వాతే ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్‌లను నిర్మించారు. వీటి వల్ల నగరానికి తాగునీరు పుష్కలంగా లభించేది. ‘హైదరాబాద్‌ను ప్రతి ముఖ్యమంత్రీ ఏదో రకంగా తన ముద్ర పడేలా అభివృద్ధి పరిచారు. మరి మీ బ్రాండ్ ఏమి చూపించబోతున్నారు..?’ అని ఇటీవల ఢిల్లీకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని అడిగాను. మూసీ రివర్ ఫ్రంట్‌ను అభివృద్ధిపరుస్తానని ఆయన చెప్పారు. అది నిజంగా జరిగినప్పుడే మెడోస్ టైలర్ తన ఆత్మకథలో వర్ణించినట్లు మూసీనదికి పూర్వవైభవం లభిస్తుంది.
ఏమైనా అసాధారణ వర్షం కురిసినప్పుడు, వాతావరణ శాఖ ఎంత హెచ్చరించినా మన ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేని స్థితి కనపడుతోంది. విజయవాడ, జైపూర్, చండీగఢ్, గురుగ్రామ్, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాలను వర్షాల ముంచెత్తిన తీరు మన ప్రభుత్వాల సమర్థ సమాయత్తతను ప్రశ్నార్థకం చేస్తోంది. బయటకు రావద్దని, అప్రమత్తంగా ఉండాలని చెప్పడం, జనాన్ని మరో చోటకు తరలించడం, ఆహార పొట్లాల సరఫరా చేయడం ప్రభుత్వానికి అలవాటైంది. కాని వరదలు తగ్గిన తర్వాతనైనా భావి అవసరాల దృష్టిలో మౌలిక సదుపాయాలను కల్పించడం, నగరాలను విస్తరించడం అవసరం. విశ్వనగరాలు, వికసిత్ భారత్‌లు ఏర్పరుస్తామన్న మన నేతలకు ఈ వర్షాలు, వరదలు ఎన్నో గుణపాఠాలు నేర్పాయనడంలో సందేహం లేదు.
ఎ. కృష్ణారావు
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)
Updated Date - Sep 11 , 2024 | 04:57 AM