ఈ మేధావుల త్యాగాలు వృథా అవుతాయా?
ABN, Publish Date - Oct 16 , 2024 | 04:02 AM
కొందరు కొన్ని జీవితాలను ఎందుకు ఎంచుకుంటారో తెలియదు. మూడు దశాబ్దాల క్రితం ఢిల్లీలో ఖల్సా కాలేజీలో విద్యార్థులకు ఆర్థిక శాస్త్రం బోధించే సివి సుబ్బారావు అక్కడితో సరిపెట్టుకోకుండా పౌరహక్కుల ఉద్యమంలో విస్తృతంగా...
కొందరు కొన్ని జీవితాలను ఎందుకు ఎంచుకుంటారో తెలియదు. మూడు దశాబ్దాల క్రితం ఢిల్లీలో ఖల్సా కాలేజీలో విద్యార్థులకు ఆర్థిక శాస్త్రం బోధించే సివి సుబ్బారావు అక్కడితో సరిపెట్టుకోకుండా పౌరహక్కుల ఉద్యమంలో విస్తృతంగా పనిచేసేవారు. ఎమర్జెన్సీలో అనేకమంది నేతలతో పాటు అరెస్టయిన వారిలో సుబ్బారావు ఒకరు. విశాఖపట్టణంకు చెందిన సుబ్బారావు ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న ప్రజాందోళనల గురించి మాత్రమే కాదు. దేశంలో ఎక్కడ ప్రజలకు సామూహికంగా ఏ అన్యాయం జరిగినట్లు సమాచారం వచ్చినా నిజనిర్ధారణ కమిటీల పేరుతో టీమ్‌ను వేసుకుని వెళ్లి ప్రజలను కలుసుకుని నివేదికలు సమర్పించేవారు. 1984లో సిక్కుల ఊచకోత జరిగినప్పుడు సుబ్బారావు సారథ్యంలో ప్రజల్లోకి వెళ్లి వాస్తవాలు సేకరించిన పౌరహక్కుల సంఘాలు ‘ఎవరు నేరస్థులు’ అన్న శీర్షికతో నివేదిక ప్రచురించాయి. అందులో ఢిల్లీ కాంగ్రెస్ నేతలు జరిపిన దారుణాలను పూసగుచ్చినట్లు వివరించారు. సిక్కుల ఊచకోతపై ఇప్పటికీ ఈ నివేదికలోనే సాధికారిక సమాచారం లభిస్తుంది. మానవ హక్కుల ఉల్లంఘనపై నిష్పాక్షికంగా, ఇరువైపులా వాస్తవాలను పరిశీలించాలనే విషయంలో సుబ్బారావుకు, బాలగోపాల్‌కు ఒకే రకమైన అభిప్రాయాలు ఉండేవి. సుబ్బారావు పౌరహక్కుల మీద కాకుండా రాజకీయార్థిక శాస్త్రం, సాహిత్యంపై దృష్టి కేంద్రీకరించి ఉంటే అద్భుతమైన రచనలు వచ్చేవి. ఆయన ‘విభాత సంధ్యలు’ ఇప్పటికీ సాహిత్య విద్యార్థులకు ఒక ప్రామాణిక గ్రంథం. ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా 24గంటలు పనిచేయడం, విస్తృత పర్యటనలు చేయడం మూలంగా ఆయన 1994లో గుండెపోటుతో మరణించారు. ఢిల్లీ విద్యుత్ శ్మశానవాటికలో ఆయన భౌతిక కాయానికి అంత్యక్రియలు జరిగినప్పుడు వందలాది విద్యార్థులు, అధ్యాపకులు హాజరయ్యారు.
యలవర్తి నవీన్ బాబు (బాపట్ల ప్రాంతీయుడు) ఢిల్లీ జెఎన్‌యులో పిహెచ్‌డి చేస్తూ ఉండేవారు. ‘వర్ణం నుంచి జాతి వరకు’ అనే ఒక అద్భుతమైన పరిశోధనా పత్రాన్ని ఆయన వెలువరించారు. ఋగ్వేద కాలం నుంచి ఇప్పటి వరకు వర్ణ వ్యవస్థను ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక పరిణామంలో భాగంగా ఆయన ఈ పుస్తకంలో వివరించారు. నవీన్ బతికి ఉంటే ఇంకా ఎన్ని ఉత్తమ రచనలు చేసేవారో కదా. ఉన్నట్లుండి ఆయన విశాఖపట్టణం సమీపంలోని ఒక గ్రామంలో 2000 సంవత్సరంలో పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో మరణించారని ఒక రోజు పేపర్లో వార్త చదివి దిగ్భ్రాంతి చెందాను.
ఢిల్లీలో నిజాముద్దీన్ ప్రాంతంలో ఒక చిన్న గదిలో బిడి శర్మ అనే మాజీ ఐఏఎస్ అధికారి నివసించేవారు. మాథమెటిక్స్‌లో పిహెచ్‌డి చేసిన ఆయన సివిల్ సర్వీస్‌కు ఎంపికై బస్తర్ జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. ఒక దశలో కరువు పరిస్థితుల్లో ఎవరి ఆదేశాలకోసం ఎదురు చూడకుండా ఫుడ్ కార్పోరేషన్ గోదాములు తెరిపించి అన్నార్తులకు ఆహార ధాన్యాలు సరఫరా చేయించారు. జాతీయ షెడ్యూల్డు కులాలు, జాతుల కమిషన్ కమిషనర్‌గా ఆయన ప్రచురించిన అద్భుతమైన నివేదికలే అణగారిన వర్గాలకోసం సబ్ ప్లాన్ వంటి పలు విధాన నిర్ణయాలు చేసేందుకు కారణమయ్యాయి. పదవీ విరమణ చేసిన తర్వాత మళ్లీ బస్తర్‌కు వెళ్లి ఆదివాసుల హక్కుల కోసం ‘భారత్ జనాందోళన్’ అనే సంస్థ ప్రారంభించి అనేక ఆందోళనలు నిర్వహించారు. స్లీపర్ క్లాసు రైళ్లలో, సిటీ బస్సులు, ఆటోల్లో ప్రయాణిస్తూ తన ఆదాయమంతా ఆదివాసీల కోసమే ఖర్చు చేసేవారు. 2012లో సుకుమా జిల్లా కలెక్టర్ అలెక్స్ పాల్ మీనన్‌ను నక్సలైట్లు కిడ్నాప్ చేసినప్పుడు ప్రొఫెసర్ హరగోపాల్‌తో కలిసి ఆయనను విడుదల చేయించడంలో కీలకపాత్ర పోషించారు. 2015లో శర్మ మరణించారు.
ఆరోగ్య, వైద్య రంగంలో అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన డాక్టర వినాయక్ సేన్ జెఎన్‌యులో సోషల్ మెడిసిన్, కమ్యూనిటీ హెల్త్ కేంద్రంలో ఫ్యాకల్టీ సభ్యుడుగా ఉండేవారు. తర్వాత ఈ ఉద్యోగాన్ని వదులుకుని పౌర హక్కులకోసం పనిచేయడం ప్రారంభించారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్‌కు వెళ్లి తన భార్య డాక్టర్ ఇలీనా సేన్‌తో కలిసి ‘రూపాంతర్’ అనే ఎన్జీవో స్థాపించి అనేక గ్రామాల్లో మద్యపానానికి, స్త్రీలపై ఆత్యాచారాలకు వ్యతిరేకంగా చైతన్యం కల్పించారు. ఆదివాసీల్లో పోషకాహార విలువల లేమిపై ఆందోళన వ్యక్తం చేసేవారు. పేద ప్రజలకోసం ఆసుపత్రి స్థాపించారు. 2000లో ఛత్తీస్‌గఢ్ ఏర్పడినప్పుడు ఆయనను ఆరోగ్య వ్యవహారాలపై ప్రభుత్వ సలహాదారుగా ఉండమని ఆ రాష్ట్ర ప్రభుత్వం కోరింది. 2005లో ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్లకు వ్యతిరేకంగా సల్వాజుడుం ప్రారంభించినప్పుడు ఆయన దానివల్ల జరుగుతున్న దారుణాలను వెలుగులోకి తీసుకురావడం ప్రారంభించారు. ఇదే ఆయన అరెస్టుకు కారణమైంది. తాను సల్వాజుడుంతో పాటు మావోయిస్టుల హింసాకాండను కూడా ఖండించానని చెప్పుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ఆయనను సుప్రీంకోర్టు బెయిల్‌పై విడుదల చేసింది. ఆయన విడుదలైన రెండేళ్లకు 2007లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి సల్వాజుడుంను రాజ్యాంగ వ్యతిరేకమని ప్రకటించారు.
మరో మేధావి బాలగోపాల్. ఢిల్లీలో స్లీపర్ క్లాస్ కోచ్ దిగి కనీసం పది మైళ్లు నడుస్తూ ఇంటికి వచ్చేవారు. ఎప్పుడో ఉతికినట్లున్న షర్టు, అరిగిన చెప్పులు. వచ్చీ రాగానే తన బ్యాగు లోంచి పాత టైప్ మిషన్ తీసి ఏదో నిజనిర్ధారణ కమిటీ నివేదిక టైప్ చేయడం మొదలు పెట్టేవారు. ఆయన కూడా జెఎన్‌యులో చదివినవారే. బహుముఖ ప్రతిభాశాలి అయిన బాలగోపాల్ ఏ రంగంలో ప్రవేశించినా ఉన్నత ఫలితాలు సాధించగలిగేవారు. కాని ఆయన మానవ హక్కుల రంగాన్ని కోరుకున్నారు. గ్రామగ్రామాలూ తిరిగారు. మావోయిస్టుల్లోని చీకటి కోణాలనూ ప్రశ్నించారు. ‘ఒక నాగరిక సమాజంలో మనిషి నేరస్థుడని నిరూ పించేంతవరకూ ఆతడు మనిషిగా అన్ని హక్కులు అనుభవించాలి. ప్రజాస్వామ్యమంటే ఓట్లు వేయడం మాత్రమే కాదు. అది ఒక జీవన విధానంగా ఉండాలన్నదే నా ఆకాంక్ష’ అన్న బాలగోపాల్ కొన్ని ఉన్నతమైన విలువలకోసం పోరాడారు. కాని ఆ విలువలను ఇవాళ న్యాయస్థానాలు కూడా పాటించలేకపోతున్నాయి.
వీరందరి కోవకు చెందిన మేధావే రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో మరణించిన అమలాపురానికి చెందిన జిఎన్ సాయిబాబా. వినాయక్ సేన్ మాదిరే ఆయననూ మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో అరెస్టు చేశారు. ఇద్దరి వద్దా కీలకమైన హార్డ్ డిస్క్‌లు లభించాయని పోలీసులు ఆరోపించారు. ఇద్దరి విషయంలోనూ అంతర్జాతీయ సంస్థలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. అయితే సాయిబాబా తీవ్ర అంగవైకల్యానికి గురికావడం, అనేక ఆరోగ్యసమస్యలు ఎదుర్కొన్నప్పటికీ ఆయన పట్ల అమానుషంగా వ్యవహరించారని ప్రభుత్వ సంస్థలు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నాయి. దాదాపు పదేళ్లు జైలులో ఉన్నా, ఆయనపై ఆరోపణలను రుజువు చేయలేకపోయారు. సాయిబాబాకు ఒక సమయంలో బెయిల్ వచ్చినప్పటికీ సుప్రీంకోర్టు ఆగమేఘాలపై శనివారం నాడు కూడా విచారణ జరిపి బెయిల్ నిరాకరించింది. సాయిబాబా ఉదంతం నేర న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాలను వెల్లడించింది. న్యాయవ్యవస్థ తీరుతెన్నులను కూడా ప్రశ్నార్థకం చేసింది. జైళ్లలో కులాల ఆధారంగా పనులు కేటాయించాలని బ్రిటిష్ కాలం నాటి జైళ్ల మ్యాన్యువల్స్‌లో ఉన్న నిబంధనలను రద్దు చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ తాజాగా తీర్పునివ్వడం సాయిబాబా జైళ్లలో కుల వ్యవస్థ గురించి చెప్పిన విషయాలు నిజమేనని రుజువు చేశాయి. అసలు సాయిబాబా అంగవైకల్యాన్ని తట్టుకుని ఢిల్లీలో మంచి అధ్యాపకుడుగా కొనసాగుతూ ఉండకుండా మానవ హక్కులు, ఆదివాసీ పోరాటాలు అంటూ ఎందుకు ప్రభుత్వ వ్యతిరేకతను కొని తెచ్చుకోవాల్సి వచ్చింది? సాయిబాబా మాత్రమే కాదు, బాలగోపాల్, సుబ్బారావు, నవీన్, బిడి శర్మ, వినాయక్ సేన్, సుధా భరద్వాజ్ లాంటి వారు ఎందుకు తాము కోల్పోయిన వ్యక్తిగత జీవితాలను పట్టించుకోకుండా ప్రజల హక్కుల కోసం పోరాడాలని అనుకున్నారు?
మేధావులను అరెస్టు చేయడం, మావోయిస్టులతో వారికి సంబంధాలను నిరూపించే ప్రయత్నం చేయడం, మావోయిజాన్ని తుదముట్టించాలనుకోవడం బీజేపీ హయాంలో ప్రారంభమైంది కాదు. 2013లోనే సాయిబాబా ఢిల్లీ నివాసంలో గడ్చిరోలి పోలీసులు వచ్చి సోదా చేశారు. అదే క్రమంలో ఆయనకు వ్యతిరేకంగా కేసు నమోదు చేశారు. సాయిబాబాకు డాక్టరేట్ డిగ్రీ ప్రదానం చేసిన అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీయే మావోయిస్టులను ఉక్కుపాదంతో అణిచివేయాలని పిలుపునిచ్చారు. హోంమంత్రిగా చిదంబరం ఉన్న కాలంలో ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరిట మావోయిస్టుల నిర్మూలన ప్రారంభమైంది. నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మావోయిజాన్ని ‘దేశ అంతర్గత భద్రతకు తీవ్ర ముప్పుగా’ ప్రకటించారు. ఇప్పుడు హోంమంత్రి అమిత్ షా ఒక డెడ్‌లైన్ పెట్టుకుని ప్రయత్నిస్తున్నారు. గతంలో కంటే ఎక్కువగా ఇప్పుడు రాష్ట్రాల మధ్య సమన్వయం, సాంకేతిక నైపుణ్యాన్ని ఉపయోగించడం పెరిగింది. అధికారంలో ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా మావోయిస్టుల పట్ల వైఖరి మారే అవకాశాలు లేవు. అదే సమయంలో ప్రజలకు ఆహార ధాన్యాలు ఉచితంగా సరఫరా చేయడం, పింఛన్ల పేరిట నిధులు మంజూరు చేయడం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం కూడా కేవలం ఓటు బ్యాంకు దృష్టితో కాకుండా వారిలో అశాంతి పెరగకుండా ఉండేందుకేనన్న విషయం గమనించాలి.
అయినా జీవితాలను త్యాగం చేసే మేధావులు ఏ పరిష్కారాలను సూచిస్తున్నారు? కుప్పలు తెప్పలుగా చెట్ల ఆకుల మధ్య కూలిపోయిన యువతీ యువకుల తెరుచుకున్న కళ్లు ఏ ప్రపంచాన్ని ఆశిస్తున్నాయి? నిరంతరం ఇరువైపులా కొనసాగుతున్న హింసవల్ల సమాజంలో ఏ మార్పు జరుగుతున్నదో ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒకే రోజు 30 మంది మరణించినా కనురెప్ప కూడా తడవని పరిస్థితి ఏర్పడుతోంది. సుదీర్ఘకాలంగా జరుగుతున్న ఈ పరస్పర హననానికి విరామం పలికి ఆచరణసాధ్యమైన పరిష్కారాల కోసం ప్రయత్నించాల్సిన తరుణం ఆసన్నమైంది. పరిష్కారాల గురించి ఆలోచించకుండా కేవలం సమస్యలపైనే ఆలోచించలేమని బాలగోపాల్ ఊరికే అనలేదు.
ఎ. కృష్ణారావు
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)
Updated Date - Oct 16 , 2024 | 04:02 AM