భారత్–జర్మనీ హరిత భాగస్వామ్యం
ABN, Publish Date - Oct 29 , 2024 | 12:49 AM
జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్ ఈ నెల 25, 26, 27 తేదీలలో భారత్‌లో పర్యటించిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలను సమగ్రంగా పెంపొందించుకునే లక్ష్యంతో విస్తృత చర్చలు జరిపారు....
జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్ ఈ నెల 25, 26, 27 తేదీలలో భారత్‌లో పర్యటించిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలను సమగ్రంగా పెంపొందించుకునే లక్ష్యంతో విస్తృత చర్చలు జరిపారు. ఆసియా–పసిఫిక్ కాన్ఫరెన్స్ ఆఫ్ జర్మన్ బిజినెస్ 2024 సదస్సును ఇరువురూ సంయుక్తంగా ప్రారంభించారు. 7వ ఇండో–జర్మన్ కన్సల్టేషన్స్‌ను ఆరంభించారు.
ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్ నాయకత్వంలో జర్మన్ కేబినెట్ ఈ నెల 16న సమున్నత ఆశయాలు, లక్ష్యాలతో కూడిన ‘ఫోకస్ ఆన్ ఇండియా’ వ్యూహాన్ని ఆమోదించింది. ఇది భారత్–జర్మనీ సంబంధాలలో గుణాత్మక మార్పులకు దోహదం చేయగలదనే ఆశాభావం ఇరు దేశాలలోనూ వ్యక్తమవుతోంది. భారత్–జర్మనీ వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఈ ఏడాదితో 25 సంవత్సరాలు పూర్తవుతాయని, రాబోయే 25 ఏళ్లలో ఈ భాగస్వామ్యం మరిన్ని శిఖరాలను అధిరోహించి, మరింత ఔన్నత్యాన్ని సంతరించుకోగలదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రెండు శక్తిమంతమైన ప్రజాస్వామ్య వ్యవస్థలు, అగ్రగామి ఆర్థిక వ్యవస్థలు ప్రపంచ శ్రేయస్సుకు పరస్పరం ఎలా సహకరించుకోగలవో ‘ఫోకస్ ఆన్ ఇండియా’ వ్యూహ ప్రణాళిక విశదం చేస్తుందని ఆయన అన్నారు.
ధరిత్రి జీవ వైవిధ్యాన్ని, వాతావరణాన్ని సంరక్షించడంలోను ఐక్యరాజ్యసమితి 2020 ఎజెండా నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల పరిపూర్తిలోను భారత్ ఒక కీలక పాత్ర నిర్వహించిందని ‘ఫోకస్ ఆన్ ఇండియా’ వ్యూహ ప్రణాళిక మున్నుడి పేర్కొన్నది. అంతర్జాతీయ న్యాయ నియమాలు, శాసనవిహిత అంతర్జాతీయ వ్యవస్థ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న ప్రాంతంలో భారత్ ఒక స్థిరీకృత శక్తిగా ఉన్నదని ఆ వ్యూహ పత్రం పేర్కొంది. జర్మనీకి భారత్ నిపుణ కార్మికశక్తిని విశేష స్థాయిలో సమకూర్చతుందని కూడా ‘ఫోకస్ ఆన్ ఇండియా’ ప్రశంసించింది.
భారత్–జర్మనీ వ్యూహాత్మక భాగస్వామ్యంలో, 2022లో ఇరుదేశాలు ఆమోదించిన భారత్–జర్మనీ హరిత, సుస్థిరాభివృద్ధి భాగస్వామ్యం ఒక ప్రధాన అంతర్భాగంగా ఉన్నది. ఈ హరిత భాగస్వామ్యంలో భాగంగా భారత్‌లో ఇంధన పరివర్తనకు గాను జర్మనీకి చెందిన కెఎఫ్‌డబ్ల్యు బ్యాంక్ 100 కోట్ల యూరోల ఆర్థిక సహాయాన్ని అందించింది. ఫోటోవోల్టాయిక్ సిస్టమ్స్, పవర్ లైన్స్, ఓపెన్ స్పేస్ ఫెసిలిటీస్‌ను అభివృద్ధిపరిచేందుకు ఈ నిధులను మదుపు చేశారు.
ఈ హరిత భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే లక్ష్యంతో ఇటీవల గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ‘రి–ఇన్వెస్ట్’ పునరుద్ధరణీయ ఇంధన మదుపుదారుల సమావేశం నొకదాన్ని నిర్వహించారు. జర్మనీతో సహా పలుదేశాల ఉన్నత స్థాయి రాజకీయ, పారిశ్రామిక ప్రతినిధులు ఆ సదస్సులో పాల్గొన్నారు. ‘భారత్ ఒక అభివృద్ధి చెందుతున్న దేశమే అయినప్పటికీ తొమ్మిదేళ్ల క్రితం పారిస్ వాతావరణ సదస్సు నిర్దేశించిన వాతావరణ పరిరక్షణ లక్ష్యాల పరిపూర్తిలో ముందంజలో ఉందని’ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన ప్రారంభోపన్యాసంలో అన్నారు. హరిత పరివర్తనను ఒక ప్రజా ఉద్యమంగా భారత్ పరిగణిస్తుందని అంటూ పిఎమ్ సూర్యఘర్ మఫ్త్ బిజలి యోజనతో భారత్‌లో ప్రతి గృహమూ ఒక విద్యుత్ ఉత్పత్తిదారుగా రూపొందనున్నదని నరేంద్ర మోదీ అన్నారు. ‘ఇంధన పరివర్తన లక్ష్యాలను భారత్ సాధించగలిగితే అంతిమంగా సమస్త ప్రపంచమూ లబ్ధి పొందుతుందని జర్మన్ ప్రభుత్వ ఆర్థిక సహకార మంత్రి స్వెన్జ షుల్జె అన్నారు. 140 కోట్ల మందికి పైగా ఉన్న భారతీయులు తమ విద్యుత్ అవసరాలను పవన, సౌరశక్తి నుంచి సమకూర్చుకోగలిగినప్పుడే వాతావరణ మార్పు సంక్షోభం నిలిచిపోగలదని జర్మన్ మంత్రి అన్నారు.
భారత్–జర్మనీ హరిత భాగస్వామ్యంలో భాగంగా వాతావరణ మార్పు సంబంధిత అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక పాలనా సంస్థలు, మరీ ముఖ్యంగా పౌర సమాజ సంస్థలతో ప్రభావశీల, పారదర్శక చర్చలు జరపవలసిన అవసరమున్నది. శిలాజ ఇంధనాల వినియోగం వల్ల వాతావరణ సంక్షోభం ఏర్పడుతున్న నేపథ్యంలో ఇంధన వినియోగంలో మౌలిక మార్పులు రావలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆ మార్పులు కర్బన ఉద్గారాలు సాధ్యమైనంత తక్కువ స్థాయిలో ఉండేందుకు తప్పక దోహదం చేయాలి. ఇందుకు అనేక రంగాలలో ముఖ్యంగా ఇంధన ఉత్పత్తి, చలనశీలత, ఆహారోత్పత్తి, చిన్న పరిశ్రమలు, గృహ అవసరాలకు ఇంధన వినియోగం, మరీ ముఖ్యంగా జీవనశైలీ రీతుల్లోను మౌలిక మార్పులు సాధించవలసిన అవసరమున్నది. ఇంధన వ్యవస్థల పరివర్తనలో పౌరులు చొరవతో కీలకపాత్ర వహించడం చాలా ముఖ్యం.
పునరుద్ధరణీయ ఇంధన ఉత్పత్తిలో ప్రపంచంలో చైనా ప్రథమ స్థానంలో ఉండగా జర్మనీ ద్వితీయ స్థానంలో ఉన్నది. భారత్ ఈ విషయంలో జర్మనీకి దరిదాపుల్లో ఉన్నది. అయితే జర్మన్ విద్యుత్ వినియోగదారులు ప్రొజ్యూమర్స్ (ఇంధన వినియోగదారులే ఇంధనాన్ని ఉత్పత్తి చేసుకునేవారుగా ఉండడం)గా పరిణమించడం అంతకంతకూ అధికమవుతోంది. అంతే కాదు సమష్టిగా ఇంధనాన్ని ఉత్పత్తి చేసుకునే కార్యకలాపాలలో భాగస్వాములు అవుతున్నారు. జర్మనీలో ఇప్పుడు 847 ఇంధన సహకార సంఘాలు ఉన్నాయి. వీటిలో 2,20,000 మంది పౌరులు భాగస్వాములుగా ఉన్నారు. ఈ ఇంధన సహకార సంఘాలలో 80 శాతానికి పైగా ఫోటో వొల్టాయిక్ వ్యవస్థలను నిర్వహిస్తున్నారు ఈ ఇంధన సహకార సంఘాలు 2020 సంవత్సరంలో 8.8 టెరావాట్ హరిత విద్యుత్‌ను ఉత్పత్తి చేశాయి.
రమేష్ చెన్నమనేని
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు
Updated Date - Oct 29 , 2024 | 12:49 AM