రాజకీయ అస్త్రాలుగా ‘చొరబాట్లు’
ABN, Publish Date - Nov 20 , 2024 | 02:12 AM
దేశ సరిహద్దుల భద్రత అనేది ప్రపంచంలోని ఏ దేశానికైనా అత్యంత కీలకం, ప్రాధాన్యమున్న అంశం. ఒక్క భూమార్గంలోనే కాకుండా జల, ఆకాశ మార్గాలలో కూడా పహారా కాస్తుంటారు. ముంబాయి, న్యూఢిల్లీల కంటే కూడా...
దేశ సరిహద్దుల భద్రత అనేది ప్రపంచంలోని ఏ దేశానికైనా అత్యంత కీలకం, ప్రాధాన్యమున్న అంశం. ఒక్క భూమార్గంలోనే కాకుండా జల, ఆకాశ మార్గాలలో కూడా పహారా కాస్తుంటారు. ముంబాయి, న్యూఢిల్లీల కంటే కూడా ఎక్కువగా జార్ఖండ్ – పశ్చిమ బెంగాల్ గగనంలో ఎగిరే ప్రతి పక్షిపై సైతం భారత వాయుసేన కన్నేసి ఉంచుతుంది అంటే ఆశ్చర్యం కలుగుతుంది. దేశ సరిహద్దులను కాపాడటం సాయుధ బలగాల విధి. ఈ దృష్ట్యా భారతదేశ సరిహద్దుల భద్రత అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం.
సరిహద్దుల ఆవలి వైపు నుండి ఎవరైనా అక్రమంగా మన మాతృభూమికి అడ్డుదారిన వస్తున్నారంటే అది ఒక రకమైన భద్రతా వైఫల్యం. కేంద్రంలో గత పదేళ్లుగా నరేంద్ర మోదీ ప్రభుత్వం అక్రమ చొరబాటుదారుల విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తోంది. ప్రత్యేకించి ఎన్నికల సందర్భంగా చొరబాటుదారుల గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఆ తర్వాత మిన్నకుండిపోతుంది! సరిహద్దుల్లోని అస్సోం, పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాలలో ఖుస్బెటియా (చొరబాటుదారులు)ల గురించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా పదే పదే అరోపణలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు సరిహద్దు రాష్ట్రాలు దాటి వాటిని ఆనుకుని ఉన్న రాష్ట్రాలలో కూడ చొరబాటుదారులు అనే ఒక అంశాన్ని ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ శ్రేణులు ఎన్నికల ప్రచారాస్త్రంగా వాడుకుంటున్నారు. జార్ఖండ్ శాసనసభ ఎన్నికలలో కేవలం బంగ్లాదేశ్ చొరబాటుదారులు అనే ఏకైక అంశం ఆధారంగా బీజేపీ అగ్రనాయకత్వం ప్రచారం చేస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దేశంలో కెల్లా ఎక్కువ ఖనిజ సంపద ఉన్న రాష్ట్రంగా ఉన్నా పేదరికంలో ముగ్గుతున్న జార్ఖండ్‌లో అభివృద్ధి, సంక్షేమంకు బదులుగా చొరబాటుదారులు అనే అంశాన్నే కమలనాథులు ప్రచారాస్త్రంగా ఉపయోగించుకుంటున్నారు.
ప్రాంతీయ రాజకీయ పక్షాలకు సైద్ధాంతిక విరోధి అయిన బీజేపీ జార్ఖండ్ రాష్ట్రంలోని బలీయమైన జె.యం.యం.ను రాజకీయంగా నిలువరించడానికి విస్తృతంగా చేస్తున్న చొరబాటుదారుల ప్రచారం, ఒక రకంగా, దేశ సరిహద్దులపై నిరంతరం పహరా కాస్తూ మాతృభూమి రక్షణకై ప్రాణాలు అర్పించే వీర జవాన్‌లను అవమానపరచడమే కాదూ? అంతర్జాతీయ సరిహద్దులు కలిగిన రాష్ట్రాలలో సాధారణంగా, సరిహద్దులకు సమీపంలో ఉన్న భూభాగం కేంద్ర ప్రభుత్వ అజమాయిషీలో ఉంటుంది. ఆ విధంగా పశ్చిమ బెంగాల్‌లో బంగ్లాదేశ్ సరిహద్దుకు 50 కిలోమీటర్ల దూరం వరకు భారత భూభాగం రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో కాకుండా కేంద్ర హోం శాఖ అధీనంలో ఉంటుంది. మరి బంగ్లాదేశ్ చొరబాటుదారులు అమిత్ షా అజమాయిషీలోని 50 కిలోమీటర్ల దూరాన్ని సురక్షితంగా దాటితే గానీ మమత బెనర్జీ రాష్ట్రానికి, ఆ తరువాత దాన్ని దాటి జార్ఖండ్‌కు చేరుకోలేరు కదా.
అక్రమంగా, అడ్డదారిన ఒక్క జార్ఖండే అని ఏమిటి, దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రానికి అయినా ఎవరైనా విదేశీయులు వస్తే నిస్సందేహాంగా అడ్డుకోవాలి, ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండకూడదు. అయితే చొరబాటుదారులకు ఆశ్రయం కల్పిస్తున్నారని జార్ఖండ్ సర్కార్‌ను నిందిస్తున్న కేంద్రం, మరి చొరబాటుదారులు దేశ భూభాగంలో అడుగుపెడుతుండగా ఎందుకు అడ్డుకోలేకపోయింది? ఇదీ ఇప్పుడు అడగవలసిన ప్రశ్న.
అధికారికంగా, దర్జగా వీసా పొంది భారత్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఉన్నప్పుడు అడ్డదారిన ఎవరు, ఎందుకు వస్తారు? ఇక అధికారికంగా గమనిస్తే, ప్రపంచంలోకెల్లా అత్యధిక భారతీయ వీసాలు పొందే దేశం బంగ్లాదేశ్. అశ్చర్యం ఏమిటంటే అత్యంత సన్నిహిత దేశానికి మాత్రమే వీసా రుసుం చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది, బంగ్లాదేశీయులు ఒక్క రూపాయి కూడ చెల్లించవల్సిన అవసరం లేకుండా భారతీయ వీసా పొందె అవకాశాన్ని మోదీ సర్కారు కల్పించింది. ఈ రకంగా సందర్శక వీసాలు పొందినవారు తమ దేశానికి తిరిగి వెళ్లిపోతారు. అయితే ఒకవేళ ఆఫ్రికన్ల తరహా భారతదేశంలో తిష్ఠ వేస్తే వారిని గుర్తించి, పట్టుకుని వెనక్కి పంపే నిఘా వ్యవస్ధ ఎంత వరకు పని చేస్తుందనేది కూడా ఒక ప్రశ్నే.
ఆదివాసీ తెగల సంఖ్య తగ్గిపోతుందని బీజేపీ చేస్తున్న వాదన సరైనదే. అయితే ఈ పరిస్ధితి ఒక్క జార్ఖండ్‌కే పరిమితం కాలేదు. తెలుగునాట ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఛత్తీస్‌ఘఢ్ దాకా గిరిజనుల ప్రాబల్యం అన్ని ప్రాంతాలలోనూ తగ్గిపోయింది. కారణమేమిటి? అటవీ ప్రాంతాలలో అభివృద్ధి కొరవడి జీవనోపాధికై మైదాన ప్రాంతాలకు వలసలు వెళ్ళడం వలన గిరిజనుల జనాభా తగ్గిపోతోంది.
కేవలం బెంగాలీ భాష మాట్లాడుతున్నందుకు భూమి పుత్రులు అయిన స్ధానికులను కూడ మతం ఆధారంగా బంగ్లాదేశీయులు అని ముద్ర వేస్తున్నారు. ఇది ఆందోళనకరం. జార్ఖండ్ ఓటర్లలో సగభాగంగా ఉన్న ఆదివాసీ, ముస్లిం ఓటర్లలో అత్యధికులు హేమంత్ సోరెన్ నాయకత్వానికి బాసటగా నిలుస్తున్నారన్న రాజకీయ అక్కసుతో బీజేపీ నాయకత్వం బంగ్లా చొరబాటుదారుల ఆంశాన్ని ప్రస్తావిస్తుందని విమర్శకులు చేస్తున్న వాదనలో సహేతుకత ఉంది.
చొరబాటుదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి, దీనిపై ఎవరికీ ఆక్షేపణ లేదు. అయితే చొరబాట్లను ప్రతి ఎన్నికలలో ఒక రాజకీయ అంశంగా ప్రస్తావించడం దేనిని సూచిస్తుంది? చొరబాట్లను నిర్మూలించలేమనే కాదూ? ఇది ఓటర్లకు ఒక తప్పుడు సంకేతం పంపుతుంది. అంతే కాదు, దేశ సరిహద్దుల రక్షణకు నిరంతరం అప్రమత్తంగా శ్రమించే వీర జవాన్ల త్యాగాలను అవమానించడమే అవుతుంది.
మొహమ్మద్ ఇర్ఫాన్
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)
Updated Date - Nov 20 , 2024 | 02:13 AM