ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నిధుల బదిలీలో రాష్ట్రాలకు అన్యాయం

ABN, Publish Date - Sep 12 , 2024 | 01:01 AM

ఆర్థిక వనరుల సమీకరణలో మొదటి నుంచీ కేంద్ర ప్రభుత్వానికి అపారమైన అవకాశాలు లభిస్తూ ఉండగా, రాష్ట్రాలకు మాత్రం అపరిమిత బాధ్యతలు సంక్రమిస్తున్నాయి. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ, ఆర్థిక వనరులను...

ఆర్థిక వనరుల సమీకరణలో మొదటి నుంచీ కేంద్ర ప్రభుత్వానికి అపారమైన అవకాశాలు లభిస్తూ ఉండగా, రాష్ట్రాలకు మాత్రం అపరిమిత బాధ్యతలు సంక్రమిస్తున్నాయి. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ, ఆర్థిక వనరులను పొందికగా వినియోగిస్తూ మెరుగైన ఫలితాలు సాధిస్తున్న రాష్ట్రాలు ఈ సందర్భంగా ఓ విధమైన వివక్షకు, అన్యాయానికీ గురవుతున్నాయి. ‘సహకార ఫెడరలిజం’ పేరుతో రాష్ట్రాలకు పన్నులలో వాటాలను 41 శాతానికి పెంచామని కేంద్రం గర్వంగా చెప్పుకుంటున్నది గానీ ఆచరణలో అందుకు భిన్నంగా జరుగుతోంది.

అంతర్జాతీయంగా పేరొందిన ఆర్థికవేత్త, నీతి ఆయోగ్‌ మొదటి వైస్‌ చైర్మన్‌ డా. అరవింద్‌ పనగరియా అధ్యక్షతన ఏర్పడిన 16వ ఆర్థిక సంఘం ఈ విషయంలో నెలకొన్న అసమతుల్యతలను సరిదిద్దుతుందనీ, ఆరోగ్యవంతమైన ఆర్థిక వనరుల పంపిణీ జరిగేట్లు నిర్దుష్టమైన సిఫార్సులు చేయగలదనీ ఆశిద్దాం. తెలంగాణ రాష్ట్రాన్ని మొదటి పదేళ్లలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రాల చెంత నిలబెట్టి, దేశంలోనే జీడీపీలో అగ్రగామి రాష్ట్రంగా అభివృద్ధి చేసిన ఘనత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి దక్కుతుంది. ఆగస్టు, 2021లో నీతి ఆయోగ్‌ స్వయంగా, ‘‘రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వృద్ధి, సగటు వార్షిక రేటు కంటే ఎక్కువ నమోదైంది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుండి 9 శాతం, ఇది అంతకు ముందు సాధించిన వృద్ధి రేటు కంటే గణనీయంగా ఎక్కువ’’ అని ప్రశంసించడం గమనార్హం.


కేంద్రం వద్ద ఆపారమైన ఆర్థిక వనరులను సమకూర్చుకునే అవకాశాలు ఉండగా, రాష్ట్రాలకు అత్యధికంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అందుకు ప్రధాన కారణం, కేంద్రం తన ఆదాయాన్ని పన్నుయేతర మార్గాల ద్వారా పెంచుకుంటూ, వాటిల్లో రాష్ట్రాలకు వాటా లేకుండా చేయడమే. కేంద్రం సెస్‌, సర్‌ చార్జీల ద్వారా తన ఆదాయం మరింత పెంచుకుంటున్నది. ఈ మొత్తాలను తగ్గించాలని ఆర్థిక సంఘం సిఫార్సు చేసినప్పటికీ 2020–21లో మొత్తం పన్నుల ఆదాయంలో ఈ మొత్తం 20శాతం మేరకు ఉండటం గమనార్హం.

2015–16లో పన్నుల వాటాగా రాష్ట్రాలకు బదిలీ చేసిన రూ.84,579 కోట్లకు రెట్టింపుకు పైగా రూ.1,75,736 కోట్లను కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాల ద్వారా బదిలీ చేశారు. అదేవిధంగా, 2024–25లో ఆర్థిక సంఘం నిధులు రూ.1,32,378 కోట్లు మాత్రమే కాగా, కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాల ద్వారా రూ.4,79,605 కోట్లను బదిలీ చేశారు. కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలు చాలావరకు రాష్ట్రాల పరిధిలోని అంశాలకు సంబంధించినవే కావడంతో రాష్ట్రాల ఆర్థిక స్వయంప్రతిపత్తిని దెబ్బతీసే విధంగా ఈ నిధుల బదిలీ ఉంటోంది.


ప్రతి ఐదేళ్లకు ఒకసారి, ఆర్థిక సంఘం కాల వ్యవధిలో కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలను సమీక్షించాలని నిర్ణయించినా, దాన్నింకా అమలు జరపడం లేదు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సభ్యునిగా ఉన్న ఈ అంశపు మంత్రుల ఉపసంఘం కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలను ఐచ్ఛికం చేయాలని సిఫార్సు చేసినా దాన్నింకా అమలుపరచడం లేదు. ఇప్పుడు రాష్ట్రాలు ఎదుర్కొంటున్న వనరుల కొరత దృష్ట్యా పన్నులలో రాష్ట్రాల వాటాను 41 శాతం నుండి 50 శాతానికి పెంచాల్సి ఉంది. 20 శాతంగా ఉన్న పన్నేతర ఆదాయాన్ని ఈ పరిధిలోకి తీసుకురాగలిగితే, ఇలా చేయడం ఓ సమస్య కాబోదు.

1960–61లో రూ.175 కోట్లు మాత్రమే ఉన్న ఈ పన్నేతర ఆదాయం 2022–23 నాటికి రూ.2.85 లక్షల కోట్లకు, 2024–25 నాటికి రూ.5.47 లక్షల కోట్లకు పెరగడం గమనార్హం. అంటే, క్రమంగా కేంద్రం రాష్ట్రాలకు పన్నులలో వాటాను ఎగ్గొట్టే విధంగా ఈ ఆదాయాలను పెంచుకుంటూ పోతోంది. నీతి ఆయోగ్‌ను ఏర్పాటు చేస్తూ కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన తీర్మానంలో, రాష్ట్రాలు తమ ఆర్థిక వనరులకు కేంద్రంపై ఆధారపడే అవసరం లేకుండా, స్వతంత్రంగా–నిర్ణయాత్మకంగా వ్యవహరించాలనే లక్ష్యాన్ని ప్రస్తావించడాన్ని ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవాలి.


నిధుల పంపిణీలో క్రమంగా అసమానతలు పెరుగుతున్నాయి. తక్కువ తలసరి ఆదాయం గల రాష్ట్రాలకు ఎక్కువ నిధులు సమకూర్చుతున్నారు. వెనుకబడిన రాష్ట్రాల అవసరాలను కేంద్రం పరిగణలోకి తీసుకోవాలనటంలో ఎవరికీ అభ్యంతరాలుండవు. అందుకోసం ఆయా రాష్ట్రాలలో మౌలిక సదుపాయాలను పెంపొందించడం పట్ల ఎక్కువగా దృష్టి సారించాలి. ప్రస్తుతం కేంద్రం, ఆదాయ–కార్పొరేట్‌ పన్నులలో రూ.1.40 లక్షల కోట్ల మేరకు సర్‌చార్జీలను ఎటువంటి నిర్దిష్ట ప్రయోజనం పేర్కొనకుండా వసూలు చేస్తున్నది. ఈ మొత్తం భారత కన్సాలిడేషన్‌ నిధిలో చేరుతున్నది. ఈ మొత్తాన్ని వెనుకబడిన రాష్ట్రాల మౌలిక సదుపాయాల నిధికి కేటాయిస్తే, అభివృద్ధి చెందిన రాష్ట్రాలను నిరుత్సాహపరచకుండానే వెనుకబడిన రాష్ట్రాల అభివృద్ధికి దోహదపడ్డట్టవుతుంది.

రాష్ట్రాల ఆదాయంలో 80శాతం వరకు పన్నుల ద్వారానే సమకూరుతోంది. ప్రస్తుతం పన్నుల వసూళ్ళల్లో నిబద్ధతను పాటించే రాష్ట్రాలకు 2.5 శాతంగా మాత్రమే ఇస్తున్న వెయిటేజీని 10శాతానికి పెంచాలి. గతంలో ఆర్థిక కమిషన్‌, జనాభా నియంత్రణకు కేటాయించిన 12.5 శాతం వెయిటేజీని 16వ ఆర్థిక సంఘం కూడా కొనసాగించాలి. 2026లో నియోజకవర్గాల పునర్విభజన–పరిణామాల కారణంగా జనాభా నియంత్రణలో మెరుగైన పనితీరు కనబరచిన రాష్ట్రాల ప్రయోజనాలు భంగపడే ప్రమాదముంది. పన్నుల పంపిణీలో తెలంగాణ వాటా 2014–15లో 2.437 శాతంగా ఉంటే, 14వ ఆర్థిక సంఘం (2015–16 నుంచి 2019–20) నాటికి 2.133 శాతానికి తగ్గింది. 15వ ఆర్థిక సంఘం (2021–25) నాటికి అది మరింత తగ్గి 2.102 శాతంగా మారుతోంది.


స్థానిక సంస్థలకు నిధులను 50 శాతానికి పెంచడంతో పాటు, వాటిని 80 శాతం జనాభా, 20 శాతం విస్తీర్ణం నిష్పత్తి ప్రాతిపదికన ఇవ్వాలి. గత ఆర్థిక సంఘం 90 శాతం జనాభాను ప్రాతిపదికగా తీసుకోవడంతో గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ నిధులు లభించాయి. 40 శాతం వరకు పట్టణ ప్రాంతాలున్న తెలంగాణ వంటి రాష్ట్రాలకు తక్కువ నిధులు సమకూరాయి.

రాష్ట్రాల విపత్తు నిధిని 15వ ఆర్థిక సంఘం 100 శాతం పెంచింది. ప్రస్తుతం కనీసం 60శాతం పెంచాలి. విపత్తు నిధిలో రాష్ట్రాలు 10శాతం మాత్రమే చెల్లించాలని, మిగిలిన 90 శాతం కేంద్రం సమకూర్చాలని 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసినప్పటికీ కేంద్రం అమలు చేయలేదు. అదేవిధంగా, తీవ్రమైన ప్రకృతి విపత్తు సంబంధించినప్పుడు 100 శాతం విపత్తు నిధులను ఉపయోగించుకొనే నిబంధనలను తొలగించి, గతంలో మాదిరిగా 50శాతానికి పరిమితం చేయాలి. మరోవైపు పేరుకుపోయిన డిస్కమ్‌ల అప్పులు, కరోనా సమయంలో (2020–21, 2021–22) కేంద్ర సూచనలపై రాష్ట్రాలు చేసిన అప్పులు రాష్ట్రాలపై పెనుభారమౌతున్నాయి. అందుకనే కరోనా సంబంధిత రుణాలను కేంద్రానికే బదిలీ చేయాలి.


తెలంగాణాలో ప్రధాన నదులైన కృష్ణా, గోదావరి సముద్రానికి 70–150 అడుగుల ఎత్తులో ప్రవహిస్తున్నాయి. అందుచేత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్మించిన ఎత్తిపోతల పథకాలతో తెలంగాణలో ఇప్పుడు దేశంలోనే అత్యధికంగా వరి ఉత్పత్తి అవుతోంది. ఎత్తిపోతల పథకాల నిర్వహణ కోసం తెలంగాణకు ప్రత్యేకంగా రూ.40,000 కోట్ల నిధులను ఆర్థిక సంఘం కేటాయించాలి. ‘పాలమూరు–రంగారెడ్డి’ ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించి దీని నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టాలి.

ఇంటింటికి పంపుల ద్వారా త్రాగు నీరిచ్చే పథకాన్ని కేంద్రం ప్రారంభించడానికి ముందే తెలంగాణ ‘మిషన్‌ భగీరథ’ను పూర్తి చేసింది. ఈ పథకం నిర్వహణకు ప్రత్యేకంగా రూ.20,000 కోట్ల నిధులను ఆర్థిక సంఘం సిఫార్సు చేయాలి.

14వ ఆర్థిక సంఘం వరకు కూడా, అవి చేసిన సిఫార్సులను కేంద్రం పూర్తిగా ఆమోదించి, అమలు చేస్తూ ఉండేది. కానీ 15వ ఆర్థిక సంఘం నుంచి కేంద్రం ధోరణి మారింది. 2019–20, 2020–21లలో నిధుల పంపిణీ తగ్గుదలను గుర్తించి, 2020–21లో ప్రత్యేకంగా రూ.723కోట్లు కేటాయించాలని 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసినా కేంద్రం పట్టించుకోలేదు. 2021–22 నుండి 2025–28 వరకు 15వ ఆర్థిక సంఘం నిర్దిష్ట రంగాలకు రూ.3,024 కోట్లు, నిర్దిష్ట రాష్ట్రాలకు రూ.2,350 కోట్లను బదిలీ చేయాలని సిఫార్సు చేసింది. కానీ ఈ గ్రాంట్లను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది.


డా. అరవింద్‌ పనగరియా నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌గా ఉన్న సమయంలో జూలై, 2016లో మిషన్‌ భగీరథకు రూ.19,205 కోట్లు, మిషన్‌ కాకతీయకు రూ.5,000 కోట్లు నిధులు ఇవ్వాలని కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖకు చేసిన సిఫార్సును సహితం కేంద్రం పట్టించుకోలేదు. నిధుల బదిలీల్లో కేంద్రం అనుసరిస్తున్న అవాంఛనీయ ధోరణులను కట్టడి చేసేలా 16వ ఆర్థిక సంఘం నిర్దుష్టమైన సిఫార్సులు చేయడంతో పాటు, రాజ్యాంగబద్ధమైన ఈ సంఘం సిఫార్సులను కేంద్రం అమలుపరిచేలా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

టి. హరీశ్‌రావు

ఎమ్మెల్యే, మాజీ మంత్రి

Updated Date - Sep 12 , 2024 | 01:01 AM

Advertising
Advertising