టిఫిన్ హోటల్లో ఆవిష్కరణ
ABN, Publish Date - Aug 05 , 2024 | 05:36 AM
మానేపల్లి హృషీ కేశవరావు నా పూర్తి పేరు. ‘ఉదయించని ఉదయాలు’ నా మొదటి కవితా సంపుటి పేరు. 1962 సెప్టెంబర్‌లో విడుదలైంది. ముఖచిత్రం నా మిత్రుడు, చిత్రకారుడు శ్రీ అబ్బూరి గోపాలకృష్ణ డిజైన్ చేశాడు...
నా మొదటి పుస్తకం
మానేపల్లి హృషీ కేశవరావు నా పూర్తి పేరు. ‘ఉదయించని ఉదయాలు’ నా మొదటి కవితా సంపుటి పేరు. 1962 సెప్టెంబర్‌లో విడుదలైంది. ముఖచిత్రం నా మిత్రుడు, చిత్రకారుడు శ్రీ అబ్బూరి గోపాలకృష్ణ డిజైన్ చేశాడు.
ఒకప్పుడు హైదరాబాద్ చిక్కడపల్లిలో ‘స్వరాజ్’ అనే హోటల్ ఉండేది. ఒక రోజున పదిమంది మిత్రులం ఉదయం తొమ్మిది గంటలకు ఆ హోటల్‌కి చేరుకున్నాం. పెద్ద టేబుల్ చుట్టూ కూర్చుని అందరం ఒకేసారి ‘ఉదయించని ఉదయాలు’ పుస్తకాన్ని ఆవిష్కరించాం. హాలు లేదు. వేదిక లేదు. అధ్యక్షుడు, ఆవిష్కర్త, ముఖ్య అతిథులు, ఉపన్యాసకులు– ఎవరూ లేరు. పూలదండలు, శాలువాలు ఏమీ లేవు. పదిమంది మిత్రులు, ఓ కవితా సంపుటిని ఆవిష్కరించడం తదనంతర కాలంలో, సాహిత్యంలో అదొక అరుదైన సంఘటనగా నిలిచింది.
ఇక– ఆ హోటల్లో, ఆ రోజున, ఆవిష్కరణ తరువాత, నేను సర్వర్‌ని పిలిచి– ‘‘మేం మరో రెండు గంటలు యిక్కడే వుంటాం, టిఫిన్ చేస్తాం, అలాగే యీ రెండు గంటల్లో ఎవరెవరు టిఫిన్ చెయ్యడానికి వస్తారో, వెళ్లేటప్పుడు వాళ్ల బిల్లులు నాకు యివ్వు, మొత్తం నేనే చెల్లిస్తాను, యీ విషయం వాళ్లకు చెప్పు’’ అన్నాను. సర్వర్ వాళ్లకు అదే చెప్పాడు. టిఫిన్ చేసి వెళ్లేటప్పుడు వాళ్లు మా దగ్గరకొచ్చి విషయమేమిటని అడిగారు. ‘‘నా కవిత్వ పుస్తకం ఆవిష్కరణ జరిగింది. ఆ సందర్భంగా మీకు టిఫిన్ అందజెయ్యాలనుకున్నాం’’ అంటూ పుస్తకం ఓ కాపీ వాళ్లకు యిచ్చాం. వాళ్లంతా చాలా సంతోషించారు. మరుసటి రోజున పత్రికలలో యీ సంఘటన ఒక విశేషమైన వార్తగా వచ్చింది.
తరువాతి కాలంలో– శ్రీ కె.వి. రమణారెడ్డి, శ్రీ కేతవరపు రామకోటిశాస్త్రి, విజయవాడ ఆకాశవాణిలోని శ్రీవాత్సవ మొదలైన ప్రముఖులు ఆయా పత్రికలలో ‘ఉదయించని ఉదయాలు’ సంపుటిని ప్రశంసా పూర్వకంగా సమీక్షించారు. ఈ సంపుటితో ఆధునిక కవిత్వం ఓ మలుపు తిరిగిందని, కొత్త కవిత్వంతో, కొత్త అధ్యాయం ప్రారంభమైందని ప్రకటించారు. కె.వి.ఆర్ ఒక అడుగు ముందుకు వేసి, యీ సంపుటి ఖండికలతో వున్నప్పటికీ, మొత్తంగా చూస్తే, కవితా నిర్మాణం చూస్తే, ఒక ‘నవ్య కావ్యం’గా కనిపిస్తున్నది అంటూ– ప్రతి ఖండికనూ తీసుకుని, దాని విశిష్టతను వివరంగా, సుదీర్ఘంగా తెలియజేశారు.
వెంటనే, కె.వి.ఆర్ సమీక్షను తీవ్రంగా ఆక్షేపిస్తూ శ్రీ జె. నీలకంఠశాస్త్రి అనే పాఠకుడు తన ఘాటైన స్పందనను ఒక పెద్ద ఉత్తరంలో తెలియజేశారు. ఆయన అభ్యంతరాలు ఏమిటంటే– అసలు ‘ఉదయించని ఉదయాలు’ లోనిది కవిత్వమే కాదన్నారు. తరువాత– ‘‘ప్రకృతిలోని ప్రతి జీవనాంశానికీ, దాని పెరుగుదలలో ఏర్పడే వివిధ దశలకూ పేర్లు ఉంటాయి. ఉదాహరణకు– ఒక మొక్కను తీసుకుందాం– ఆ మొక్కకు మొగ్గ వేస్తుంది. అది, తరువాత పువ్వు అవుతుంది, అదే కాయ అవుతుంది– యిలా ప్రతి దశకూ ఓ పేరు ఉంటుంది. అలాగే– ‘ఉదయించని ఉదయాలు’లో– ఉదయానికి పూర్వం– ఉదయించని ఉదయం ఒక దశ, ఆ దశకు ఒక పేరు వుండాలిగదా! అదేమిటో చెప్పాలి గదా!’’ అన్నాడాయన. తరువాత మరికొన్ని చిన్నవైన అభ్యంత రాలు చెప్పి, చివర్లో– ‘‘కొత్త కవులకు ప్రోత్సహించ వచ్చు, కాని, యీ నవ్య కావ్య కవిని అంతగా ఆకాశాని కెత్తెయ్యాలా!’’ అన్నారు. దానిపై కె.వి.ఆర్– నీలకంఠశాస్త్రి లేవనెత్తిన ప్రతి అంశానికీ సమాధానమిస్తూ, మరొక సారి ఆధునిక సాహిత్యంలో ‘ఉదయించని ఉదయాలు’ స్థానాన్ని తెలియజేస్తూ పెద్ద వ్యాసమే రాశారు.
కొన్నేళ్లు గడిచిన తరువాత, ఓ సభ సందర్భంగా నేనూ, కె.వి.ఆర్ కలుసుకోవడం జరిగింది. మాట మధ్యలో– ‘‘సర్– ఆ నీలకంఠశాస్ర్తిగారెవరో మీకు తెలిసిందా?’’ అని అడిగాను. ‘‘తెలియలేదండి’’ అన్నారు. ‘‘నాకు తెలుసు’’ అన్నాను. ‘‘చెప్పండి ఆయనెవరు’’ అని ఆసక్తిగా అడిగారు. దానికి– ‘‘ఆ నీలకంఠ శాస్త్రి ఎవరో కాదు, నేనే’’ అన్నాను. ఆయన ఆశ్చర్యం నుంచి యింకా తేరుకోకముందే– నేను కొనసాగిస్తూ– ‘‘మీరు ‘ఉదయించని ఉదయాలు’ సంపుటిని గొప్పగా సమీక్షించారు. ఒకవేళ– ప్రతికూలంగా, మిమ్మల్ని ప్రశ్నిస్తే, మీ సమాధానం ఎలా వుంటుందో తెలియాలనే ఉద్దేశంతో అలా రాశాను’’ అన్నాను. ఆశ్చర్యం నుంచి తేరుకున్న తరువాత– ఆయన యిలా అన్నారు– ‘‘ఒక కవి తన కవిత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ, మరొక పేరుతో రాయడం ఊహించలేనంత గొప్ప విషయం. అదొక సాహసం. బహుశా, మరెవ్వరూ చెయ్యలేని సాహసం’’ అంటూ– చాలా సంతోషించారు.
నగ్నముని
Updated Date - Aug 05 , 2024 | 05:37 AM