‘లడ్కీ బహిన్’ గెలుపు గుర్రమేనా?
ABN, Publish Date - Oct 25 , 2024 | 03:02 AM
వచ్చే నెల 20న మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్ర ప్రజలే కాదు, యావద్దేశ జనులూ ఆ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండనున్నాయనే ఉత్కంఠతో ఉన్నారు. ఇప్పుడు మహారాష్ట్రలోను...
వచ్చే నెల 20న మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్ర ప్రజలే కాదు, యావద్దేశ జనులూ ఆ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండనున్నాయనే ఉత్కంఠతో ఉన్నారు. ఇప్పుడు మహారాష్ట్రలోను, విశాల భాతదేశంలోను ప్రజల పిచ్చాపాటీలో రెండు మాటలు ప్రధానంగా వినపడుతున్నాయి. అవి: ‘లడ్కీ బహిన్’. అది ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం సరికొత్తగా అమలుపరుస్తున్న ‘సంక్షేమ’ పథకం. దాని కింద సంవత్సరాదాయం రూ. రెండున్నర లక్షల కంటే తక్కువగా ఉన్న ప్రతి కుటుంబానికి నెలా నెలా ఆ కుటుంబ గృహిణికి రూ.1500 బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ఇప్పుడు ఈ ఉదార ఆర్థిక హాయమే చర్చనీయాంశంగా ఉన్నది. అయితే అది ఒక నిర్ణాయకమైన రాజకీయ ప్రశ్నను కూడా లేవనెత్తుతున్నది: గత ఆగస్టు నుంచి రెండు కోట్ల మందికి పైగా మహిళల బ్యాంకు ఖాతాలలో జమ చేస్తున్న డబ్బు పాలక మహాయుతి కూటమి ప్రభుత్వంపై ప్రబలంగా ఉన్న ప్రజా వ్యతిరేకతను తొలగించగలదా?
రాష్ట్రాలలో గానివ్వండి లేదా కేంద్రంలో గానివ్వండి అధికారంలో ఉన్న ఏ పార్టీ ప్రభుత్వమైనా ఎన్నికల ముందు నిర్దిష్ట సామాజిక సమూహాలకు నగదు సహాయం పేరిట లంచాలు ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. అయితే ఇందుకు ముందెన్నడూ ఇంత హఠాత్తుగా, నిస్సిగ్గుగా, ఆర్థిక పర్యవసానాలను పట్టించుకోకుండా ఓటర్లకు ప్రత్యక్ష నగదు చెల్లింపులు చేయడం జరగలేదు. నవంబర్ 20న తమ ఓటు వేసేనాటికి లడ్కీ బహిన్ లబ్ధిదారులు అయిన మహిళల బ్యాంకు ఖాతాల్లో దీపావళి బోనస్ (ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి రాకముందు చివరి నిమిషంలో ప్రకటించారు)తో సహా రూ.7500 జమ అవుతాయి. ఈ ఉదార ఆర్థిక సహాయం అందించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం నెలసరిన ఇంచుమించు రూ.3700 కోట్లు వెచ్చించనున్నది. వార్షికంగా రూ.46 వేల కోట్ల భారం ఆ రాష్ట్ర ప్రభుత్వంపై పడనున్నది. మరి మహారాష్ట్ర ప్రభుత్వ రుణ భారం ఇప్పటికే రూ.7.8 లక్షల కోట్లుగా ఉన్నదని అంచనా ఎన్నికల ముందు మహాయుతి ప్రభుత్వ ‘టిజోరి ఖోలో’ (ప్రభుత్వ ఖజానాను తెరువడం) రాజకీయాల మూలంగా ఆ రుణ భారం మరింతగా పెరగనున్నదని సీనియర్ బ్యూరాక్రాట్ ఒకరు అన్నారు.
లడ్కీ బహిన్ యోజనను మూడు విధాలుగా చూడవచ్చు. ఒకటి– ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అగాఢీని చిత్తుచేసేందుకు ఉద్దేశించిన తెలివైన రాజకీయం. 2024 లోక్‌సభ ఎన్నికలలో పాలక మహాయుతి కూటమి రాష్ట్రంలోని 48 సీట్లలో కేవలం 17ను మాత్రమే గెలుచుకోగలిగింది. ఈ కారణంగా కీలక ఓటర్ల బృందాలను ఆకట్టుకోవడానికై కొత్త మార్గాలను అనుసరించేందుకు ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వానికి అనివార్యమయింది. మహిళలు, యువత లక్ష్యిత ఓటు బ్యాంకులు కదా. మహిళలకు లడ్కీ బహిన్ పేరిట నేరుగా నగదు సహాయం అందించేందుకు, ఆర్థిక తోడ్పాటు అవసరమైన నిరుద్యోగ యువతకు ‘లడ్కా భావు’ పేరిట నగదు సహాయం చేసేందుకు షిండే సర్కార్ నిర్ణయించింది. లోక్‌సభ ఎన్నికలలో ప్రతిపక్ష ఇండియా కూటమి ‘సంవిధాన్ ఖత్రే మే హై’ (ప్రమాదంలో రాజ్యాంగం) అనే నినాదంతో గణనీయమైన విజయాలు సాధించగా ఇప్పుడు షిండే ప్రభుత్వం నగదు ఆధారిత పథకాలను శాసనసభ ఎన్నికల ప్రధాన ప్రచారాంశంగా చేయడంలో కనీసం తాత్కాలికంగా సఫలమయింది.
పై దృక్కోణానికి ప్రత్యామ్నాయంగా లడ్కీ బహిన్‌ను పూర్తిగా అనైతిక పద్ధతులలోనైనా సరే అధికారాన్ని కైవసం చేసుకోవడమే ధ్యేయమైన క్షుద్ర రాజకీయాలకు చిహ్నంగా చూసితీరాలి. ఇదే అందరినీ అమితంగా వ్యాకులపరుస్తున్న పరిణామం. గత ఐదేళ్లుగా మహారాష్ట్ర దేశంలోనే ఎక్కడా లేని రీతిలో రాజకీయ అస్థిరత్వంతో కుదేలైపోతోంది. ఈ ఐదేళ్లలో మూడు ప్రభుత్వాలు మారాయి. ఒక ముఖ్యమంత్రిని తెల్లవారుజామున గుట్టు చప్పుడు కాకుండా ప్రమాణ స్వీకారం చేయించారు. రెండు ప్రాంతీయ పార్టీలు చీలిపోయాయి. ధనరాశుల, మంత్రి పదవుల ప్రలోభంతో ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారు. భారత రాజకీయాల సంపూర్ణ నైతిక పతనానికి మహారాష్ట్ర అద్దం పట్టింది. ‘వాషింగ్ మెషీన్’, ‘ఖొఖె చి సర్కార్’ (ఒక ‘ఖోఖా’ ఒక కోటికి సమానం) అనేవి ఇప్పుడు మహారాష్ట్రీయుల రాజకీయ పరిభాషలో అంతర్భాగంగా ఉన్నాయి. ధన బలం, రహస్య బేరసారాలు, ఒప్పందాలు రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా భ్రష్టపరిచాయి. భావజాలం ఏదైతేనేమి రాష్ట్ర శాసనసభ్యులలో మూడోవంతు మంది గత 15 ఏళ్లలో ఒకటి కంటే ఎక్కువ పార్టీలలో ఉన్నవారే!
లడ్కీ బహిన్ లాంటి నగదు సహాయం పథకాలను స్పర్థాత్మక ‘రేవడి’ రాజకీయాలుగా చూడడం మూడో దృక్కోణం (ఇదే చాలా తార్కికమైనది). ఇవి, ఆర్థిక వ్యవస్థకు తీవ్ర హానికరమైనవి అనవచ్చు. అనడమేమిటి, అలా నిరూపితమయ్యాయి కూడా. 2022లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉచితాల సంస్కృతికి వ్యతిరేకంగా ఓటర్లను హెచ్చరించారు. రాజకీయ పార్టీలు వాగ్దానం చేస్తున్న ఉచితాలు దేశ ఆర్థిక వ్యవస్థకు చాలా ప్రమాదకరమైనవి అని ఆయన స్పష్టం చేశారు ‘రేవడి’ సంస్కృతిని పెంచుతున్నవారు ప్రజలకు ఉచిత కానుకలు పంపిణీ చేయడం ద్వారా వారిని తమ స్వప్రయోజనాలకు కొనుగోలు చేసుకోవచ్చని విశ్వసిస్తున్నారని మోదీ గర్హించారు. ‘మనమందరమూ సమైక్యంగా ఇటువంటి ఆలోచనలను అరికట్టాలి. దేశ రాజకీయాల నుంచి రేవడి సంస్కృతిని తొలగించాల్సిన అవసరం జరూరుగా ఉందని’ ప్రధాన మంత్రి ఘోషించారు.
అదే సందర్భంలో కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌లలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నగదు హామీలను, ఢిల్లీ, పంజాబ్ లలో ఉచిత విద్యుత్తు, నీరు సమకూరుస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చిన హామీలను ప్రధానమంత్రి తీవ్రంగా విమర్శించారు. రెండు సంవత్సరాలు గడిచేసరికి ఇప్పుడు మహారాష్ట్రలో పాలక కూటమిలో ఉన్న బీజేపీ లడ్కీ బహిన్ పథకానికి చొరవ తీసుకున్నది తామేనని గొప్పగా చాటుకుంటోంది. దాని ద్వారా అందే నగదు సహాయం మహారాష్ట్ర మహిళలకు ఆర్థిక సాధికారత సమకూరుస్తుందని బీజేపీ శ్రేణులు వాదిస్తున్నాయి. ఓటర్లకు లంచాలు ఇవ్వడం, వారికి సాధికారత కల్పించడం మధ్య ఉన్న విభజన రేఖ చాలా పలుచన. ముఖ్యంగా ఒకటి రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అటువంటి పథకాలను ప్రవేశ పెడుతున్న రాజకీయ పార్టీలకు ప్రజలకు ఆర్థిక సాధికారత కల్పించడంలో చిత్తశుద్ధి ఉన్నదని భావించగలమా?
నగదు ఆధారిత సంక్షేమ పథకాలకు ముఖ్యంగా మహిళా ఓటర్లు ఒక కీలక ఓటు బ్యాంకుగా ఉన్నారు. 2023లో మధ్యప్రదేశ్‌లో శివరాజ్ చౌహాన్ తన లడ్లీ బెహనా పథకంతో బీజేపీకి విజయం సాధించారు. ఇప్పుడు మహరాష్ట్రలోని మహాయుతి కూటమి ప్రభుత్వం కూడా అదే విధంగా నగదు ప్రయోజనాలను అందిస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో దేశ వ్యాప్తంగా ప్రతి పేద మహిళ బ్యాంకు ఖాతాలో ఏడాదికి రూ. ఒక లక్ష జమ చేస్తామని కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది. ‘మీరు దారిద్ర్య రేఖకు దిగువున ఉన్నవారైతే ప్రతి సంవత్సరమూ మీకు రూ. ఒక లక్ష ‘ఖటాకట్ ఖటాఖట్ ఆతా రహేగా’ అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అభయమిచ్చారు.
రాహుల్ గాంధీ ‘ఖటాఖట్’ హామీలు బాధ్యతారాహిత్యానికి పరాకాష్ఠ అని బీజేపీ దుయ్యబట్టింది. ఆయన హామీలు అవాస్తవికమైనవని అధిక్షేపించింది. మరి అదే బీజేపీ, ఇప్పుడు షిండే సర్కార్ ‘ఫటా ఫట్’ నగదు బదిలీని ఒక ‘రాజకీయ గేమ్ ఛేంజర్’గా అభినందిస్తోంది. ఎంత నయవంచన! ఉచితాల సంస్కృతి సామాజిక–ఆర్థిక పర్యవసానాలు ప్రశ్నించదగినవి. కార్పొరేట్ కంపెనీల వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను రద్దు చేస్తున్న ప్రభుత్వం అన్నదాతలు అయిన రైతుల పంట రుణాలను మాఫీ చేసేందుకు వెనుకాడడమేమిటి? కష్టకాలంలో పేద మహిళలకు ఆదాయ మద్దతు సమకూర్చడంలో తప్పేమిటి? అసలు సమస్యేమిటంటే ప్రభుత్వ ప్రాథమ్యాలు సరైన విధంగా లేకపోవడమే. నిజమేమిటంటే మహారాష్ట్రలో నగదు సహాయ పథకాన్ని సుపరిపాలన లోటుకు నష్టపరిహారంగా ఉద్దేశించారన్నది ఒక చేదు సత్యం. ఐదేళ్లుగా అధికారంలో ఉన్న ప్రభుత్వాలు విద్యా ప్రమాణాలు, ఆరోగ్యభద్రతా సదుపాయాలను మెరుగుపరిచేందుకు నిధులు సక్రమంగా వినియోగించకుండా ప్రజల వ్యతిరేకతను మూటగట్టుకున్న ప్రభుత్వాలు గెలవ కష్టసాధ్యమైన ఎన్నికలను ఎదుర్కొనేందుకు ప్రత్యక్ష నగదు ప్రయోజనాలను సమకూర్చేందుకు సిద్ధమవుతున్నాయి. నెరవేర్చని హామీలకు గాను ఇటువంటి లబ్ధిని కల్పించి ఎన్నికలలో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇదెలాంటి సుపరిపాలన?
ఓటర్లు సైతం పోటీ చేస్తున్న అభ్యర్థులతో, (వారి నుంచి మరింత ఆర్థిక లబ్ధి పొందేందుకు) బేరసారాలు చేయడంలో అంతకంతకూ ఆరితేరిపోతున్నారు. ఒక నిర్దిష్ట పార్టీ అభ్యర్థి గెలిచిన అనంతరం తన పార్టీకి విధేయంగా ఉంటాడనే నమ్మకం లేనప్పుడు ఓటర్లు ఆ నేతకు ఓటు వేయాల్సిన అగత్యమేమిటి? అంతకంటే ఎవరు ఎక్కువ డబ్బు ఇస్తే వారికే ఓటు వేయడం మేలు కదా అనే ఆలోచనలో ఓటర్లు ఉన్నారు. ముంబై మురికివాడ నివాసి (లడ్కీ బహిన్ లబ్ధిదారు) అయిన ఒక మహిళ నిర్మొహమాటంగా నాతో ఇలా అన్నారు: ‘నేను ఎవరికి ఓటు వేసినా, అధికారంలోకి ఎవరు వచ్చినా ఏ ప్రభుత్వమూ ఇప్పుడు లడ్కీ బహిన్ పథకాన్ని ఆపలేదు’. ఇటువంటి ఓటర్లు జిత్తులమారి స్వభావం గలవారని నేతలు అనుకోవచ్చుగాక! మరి ఓటర్లు ఒక ఆకు ఎక్కువే చదివినవారే కాదూ? అంతిమంగా నేతలను వారు తప్పక కంగుతినిపిస్తారు, సందేహం లేదు.
రాజ్‌దీప్ సర్దేశాయి
(వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్)
Updated Date - Oct 25 , 2024 | 03:02 AM