ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సనాతన ధర్మంలో మనుస్మృతి భాగమా?

ABN, Publish Date - Nov 10 , 2024 | 12:30 AM

సామాజిక మార్పులు, సమన్యాయం అనే కోణాల నుంచి సనాతనధర్మంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే అవి చాలావరకు హిందూ ధర్మ గ్రంథమైన మనుస్మృతిపై కేంద్రీకృతమవుతున్నాయి. హిందూ జీవన విధానంలో...

సామాజిక మార్పులు, సమన్యాయం అనే కోణాల నుంచి సనాతనధర్మంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే అవి చాలావరకు హిందూ ధర్మ గ్రంథమైన మనుస్మృతిపై కేంద్రీకృతమవుతున్నాయి. హిందూ జీవన విధానంలో మనుస్మృతికి విశేష చారిత్రక ప్రాముఖ్యత ఉన్నది. సమాజంలో అంతస్తులు, కులం, కుటుంబ జీవితంలో మగ–ఆడ పాత్రల గురించి మనుధర్మం చెప్పిన విషయాలు నిశితంగా ప్రశ్నింపబడుతున్నాయి. వర్తమాన కాలంలో వాటి నైతిక అవసరాన్ని విమర్శకులు ఒప్పుకోవడం లేదు. మనుస్మృతిపై ఈ విమర్శ తరచుగా సనాతనధర్మంపై పరోక్ష విమర్శే అవుతోంది. మనుస్మృతిని, సనాతన ధర్మాన్ని ఒకటిగా చేసి సనాతనధర్మాన్ని తప్పుగా అన్వయిస్తున్నారు. మనుస్మృతిలో ఉన్న అసమానతలు సనాతనధర్మంలో భాగమని పొరబడుతున్నారు. సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నారు. మనుస్మృతిని సనాతనధర్మంతో ఎలా ముడిపెట్టారో, మారుతున్న కాలంలో ఆ అనుసంధానాన్ని, ఈనాటి యోగ్యత, విలువ, నైతిక ప్రమాణాలను బట్టి ఎందుకు పునః పరిశీలించాలో, చాలామంది వాదనలోని పస ఏమిటో అర్థం చేసుకుందాం.

సనాతన ధర్మం హిందూ ఆధ్యాత్మికతకు పునాది. శాశ్వతమైన, అందరికీ వర్తించే సూత్రాలను అది ప్రవచిస్తుంది. అవి: సత్యం, ధర్మం, అహింస, ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నంపై కేంద్రీకృతమై ఉన్నాయి. వ్యక్తిగత విముక్తి (మోక్షం) మీద దృష్టిపెట్టిన సనాతనధర్మం, నీతిమంతమైన జీవనం, ప్రపంచ సామరస్యాన్ని నొక్కి చెబుతుంది. ఒక ప్రత్యేక చరిత్ర గ్రంథమైన మనుస్మృతితో పోలిస్తే, సనాతనధర్మం కాలానుగుణంగా మారే స్వభావం కలిగిన ఒక పెద్ద ఆధ్యాత్మిక వ్యవస్థ.


వేద కాలంలోనే సామాజిక విభజనలపై ప్రాథమిక సూచనలు ఉన్నాయి. వర్ణ అనే పదం ఋగ్వేద కాలంలోనే ముందుకు వచ్చింది. ఋగ్వేదంలోని పురుషసూక్తం మంత్రంలో ఈ విషయం ప్రస్తావించబడింది. ఇది ప్రధానంగా వృత్తి ఆధారంగా ఉండేది కాని వంశ పారంపర్యం కాదు. వృత్తినిబట్టి కుల గుర్తింపు ఎక్కువగా ఉండేది. ఉపనిషత్తుల కాలంలో తాత్విక చింతన, సత్యాన్వేషణ పెరిగాయి. అదే కాలంలో సామాజిక విభజనలూ స్థిరపడటం ప్రారంభమైంది. రామాయణ కాలంలో మన సమాజంలో నాలుగు ప్రధాన వర్ణాలు స్థిరపడ్డాయి : బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. బ్రాహ్మణులు విద్యాబోధన, వేదాధ్యయనం చేసేవారు. క్షత్రియులు రాజ్యపాలన, యుద్ధ విద్యలో నిష్ణాతులు. వైశ్యులు వాణిజ్యం, వ్యవసాయంతో జీవించేవారు. శూద్రులు ఇతర వర్ణాలకు సేవలు అందించేవారు. అయితే ఈ వ్యవస్థ సులభంగా మారే సౌలభ్యం ఉండేది. చోరుడు అయిన వాల్మీకి మహర్షిగా మారడం అందుకొక ఉదాహరణ. మహాభారత కాలంలో కూడా వర్ణ వ్యవస్థ కొనసాగినా, వ్యక్తి గుణగణాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. కర్ణుడు సూత పుత్రుడిగా పుట్టినా, అతని యోధ గుణాలను గుర్తించి, మహావీరుడిగా గౌరవించారు. ఆ కాలంలో జన్మకంటే కర్మకే ప్రాధాన్యత ఇచ్చిన సమాజం ఉండేది.


బౌద్ధ యుగంలో బుద్ధుడు కుల వ్యవస్థను తీవ్రంగా విమర్శించాడు. ఆయన దృష్టిలో మనిషి విలువ అతని జన్మతో కాదు, కర్మతో నిర్ణయించబడాలి. బౌద్ధ సంఘంలో అన్ని కులాల వారికి ప్రవేశం కల్పించారు. ఇది సమాజంలో సమానత్వ భావనను పెంపొందించింది.

సుమారు క్రీ.పూ. 200 నుంచి క్రీ.శ. 200 మధ్య కాలంలో విరచితమైన మనుస్మృతి ‘మనుధర్మశాస్త్రం’గా సుప్రసిద్ధమయింది. మనుస్మృతి నిర్దేశించిన కుల వ్యవస్థ కఠినమైంది. ప్రతి కులానికి నిర్దిష్ట వృత్తులు, ఆచారాల నిర్ణయాలు, జన్మాధారిత కుల నిర్ణయం, వివాహ నియమాలు, సామాజిక నియంత్రణలు, అంతర్ కుల వివాహాలపై ఆంక్షలు, సామాజిక హోదా పూర్తిగా జన్మ ఆధారితంగా మారింది. ఇది పురాతన హిందూ సమాజానికి వేర్వేరు సామాజిక వర్గాల విధులు, పాలన, మంచి నడవడిక గురించి క్రోడీకరించడానికి ప్రయత్నించింది. ఇది పురాతన హిందూ సమాజాన్ని చాలా ప్రభావితం చేసింది. ఆ కాలంలో సామాజిక క్రమాన్ని నిలబెట్టడానికి కుల వ్యవస్థ, లింగ భేదం ఎలా పనిచేసిందో చూపిస్తుంది. అయితే మనుధర్మ ఆదేశాలు ముఖ్యంగా అంతస్తులు, కులం, స్త్రీ–పురుష విషయాలలో ఈనాటి సమానత్వ విలువలతో పొసగవు. అందుకే సనాతనధర్మంలో మనుస్మృతి స్థానాన్ని పునర్–వ్యాఖ్యానించాలని లేదా పూర్తిగా తిరస్కరించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.


మనుస్మృతిపై విమర్శలు, ముఖ్యంగా కుల కోణం నుంచి వ్యక్తమవుతున్న ఆక్షేపణలు సనాతనధర్మం పట్ల అభిప్రాయాలను ఎందుకు ప్రభావితం చేస్తున్నాయి? కాల క్రమంలో కుల వ్యవస్థ మరింత సంక్లిష్టమైంది. ప్రాంతీయ వృత్తులు, జాతి ఆధారంగా ఉపకులాలు ఏర్పడ్డాయి. కుల ఆధారిత వృత్తులు తరతరాలుగా కొనసాగాయి. అస్పృశ్యత వంటి సామాజిక దురాచారాలు బలపడ్డాయి. ప్రాచీన హిందూ సామాజిక నిర్మాణంలో మనుస్మృతి పోషించిన పాత్రను సనాతనధర్మంతో ముడిపెట్టారు. చాలా హిందూ గ్రంథాలు ఆధ్యాత్మిక, నైతిక విలువలను నొక్కి చెప్పినప్పటికీ, మనుస్మృతి చూపించిన సామాజిక ప్రభావం వల్ల హిందుత్వాన్ని కులంతో ముడిపడి ఉన్నదిగా చూస్తున్నారు. ఇదే కుల వ్యవస్థ సనాతనధర్మంలో అంతర్భాగమని భావించేందుకు దారితీస్తోంది.

ఆదిశంకర, రామానుజ, బసవ, వివేకానంద, అంబేడ్కర్ వంటి సంస్కర్తలు మనుస్మృతిలోని వివక్షపూరిత అంశాలను బహిరంగంగా విమర్శించారు. అంబేడ్కర్ కుల వివక్షను నిరసిస్తూ మనుస్మృతి ప్రతులను బహిరంగంగా తగలబెట్టారు. సామాజిక న్యాయం, మానవ గౌరవంపై ఆధారపడిన ధర్మం కోసం వాదించారు. సనాతనధర్మం కాలానుగుణంగా అందరి మేలుకోసం, అందరినీ కలుపుకుపోయే సమ్మిళిత విలువలతో సరిపోతుందని, మనుస్మృతి నిర్దేశించిన సామాజిక కఠినత్వాలను అధిగమించుతుందని హిందూ మత సంస్కర్తలు వాదించారు. హిందుత్వంపై అవగాహన లోపంతో నవీన విమర్శకులు చాలామంది మనుస్మృతిలో ఉన్న కుల ఆధారిత నియమాలే మొత్తం సనాతనధర్మానికి కేంద్రమని తప్పుగా భావిస్తున్నారు. వాస్తవానికి, సనాతనధర్మం వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత వంటి వైవిధ్యపూరిత బోధనలను కలిగి ఉంది. ఇవి కుల వ్యవస్థ కంటే, నైతిక సూత్రాలు, వ్యక్తిగత విధులను (స్వధర్మం) గురించి ఎక్కువగా వివరించుతాయి.


హిందూ ధర్మ సంప్రదాయానికి ఒకే అధికారిక గ్రంథం లేదు. మనుస్మృతి చారిత్రకంగా సామాజిక నిర్మాణాలను ప్రభావితం చేసినప్పటికీ, భగవద్గీత, ఉపనిషత్తుల వంటి ఇతర గ్రంథాలు ఆధ్యాత్మిక సమానత్వం, వ్యక్తిగత ఎదుగుదల గురించి నొక్కి చెబుతాయి. ఈ గ్రంథాలు ఈనాటి విలువలతో సరిపోతాయి. సామాజికంగా కఠినమైన మనుస్మృతి నియమాల కంటే సనాతనధర్మ ప్రాథమిక విలువలను అవి నొక్కి చెబుతాయి.

మనుస్మృతి మొదట్లో హిందూ సమాజాన్ని రూపొందించినప్పటికీ, దాని సామాజిక సిద్ధాంతాలు, ముఖ్యంగా కులం, స్త్రీ–పురుష సంబంధిత విషయాలు ఆధునిక నైతిక విలువలతో సరిపోవని చాలా మంది నమ్ముతున్నారు. సనాతనధర్మంలోని ప్రధాన విలువలు– సత్యం, ధర్మం, అహింస, నీతిమంతమైన జీవన విధానం మనుస్మృతి నిర్దేశాలను అధిగమిస్తాయి. సామాజిక విలువలు మారుతున్న కొద్దీ హిందూ తత్త్వశాస్త్రం కూడా ప్రాశస్త్యం కలిగి ఉండేలా చేస్తుంది.

మనుస్మృతిని సనాతనధర్మం నుంచి వేరుచేయవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా అంతస్తులు, కుల, లింగ వివక్షలను సనాతనధర్మం ప్రబోధించలేదని, ప్రోత్సహించదని అర్థం చేసుకోవాలి. హిందూ ధర్మానికి ప్రాతిపదికలుగా వేదాలు, ఉపనిషత్తులను మాత్రమే గుర్తించి గౌరవించాలి.

నాగళ్ల శివప్రసాద్

విశ్రాంత ఆచార్యులు, ఐఐటీ మద్రాసు

Updated Date - Nov 10 , 2024 | 12:30 AM