మూసీ ప్రాజెక్టు పట్నంకే పరిమితమా?
ABN, Publish Date - Nov 13 , 2024 | 03:21 AM
కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టిన మూసీ సుందరీకరణ ప్రాజెక్టు గురించి అవునని, కాదని అన్ని రాజకీయ పార్టీలు, రకరకాల సంస్థలు, వ్యక్తులు గత రెండు నెలలుగా మాట్లాడుతూనే ఉన్నారు. ప్రభుత్వమేమో ఎట్టి పరిస్థితిలో అయినా...
కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టిన మూసీ సుందరీకరణ ప్రాజెక్టు గురించి అవునని, కాదని అన్ని రాజకీయ పార్టీలు, రకరకాల సంస్థలు, వ్యక్తులు గత రెండు నెలలుగా మాట్లాడుతూనే ఉన్నారు. ప్రభుత్వమేమో ఎట్టి పరిస్థితిలో అయినా మూసీ ప్రాజెక్టు విషయంలో వెనక్కిపోయేది లేదు, మేము ముందుకే వెళ్తాం అని ప్రకటిస్తూనే ఉంది. ఎప్పుడూ లేంది ఎందుకో రాజకీయ పార్టీలకు మూసీ బస్తీలలో ఎంతో కాలంగా ఉంటున్న ప్రజలపై అకస్మాత్తుగా ప్రేమ పుట్టుకొచ్చింది. ప్రజలను రెచ్చగొడుతున్నారు, వాళ్లను మురికి వాతావరణంలో ఉన్న బస్తీలలోనే ఉంచుతారా, మీరు వాళ్లుండే బస్తీల ప్రక్కన ఉంటారా అని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తే, ఉంటాము అని ప్రతిపక్ష పార్టీలు జవాబు చెప్పుతున్నాయి.
అసలు ఇంత కాలంగా నది పక్కన ఉన్న మురికిని శుభ్రం చేసుకొని చిన్న చిన్న గృహాలు నిర్మించుకొని ఉంటున్న ప్రజలు ఏమంటున్నారు అన్న విషయం రాజకీయ పార్టీల నాయకులు పట్టించుకోవడం లేదు. ఆ ప్రజలు గత నలభై సంవత్సరాలుగా మాకు మెరుగైన గృహాలు నిర్మించి ఇవ్వండి, మేముండే ప్రదేశాలను సమీక్షించి వీలైతే మేముండే స్థలాలకు చట్టపరంగా నివాస హక్కులు కల్పించండి అని అడుగుతున్నారు. ఇదే ప్రశ్న కొన్ని పౌర సంస్థలు ప్రజల తరపున ఎన్నికల సమయంలో, ప్రభుత్వంలో ఉన్న పార్టీ ముందు, అధికారంలోకి రావాలనుకున్న పార్టీ ముందు పెడుతూనే ఉన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా మూసీ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ వస్తున్నాయి. చంద్రబాబునాయుడు మూసీ మురికి కాలువ లాగా ఉంది. దాన్ని కుదించి, కుదించగా ఏర్పడే స్థలాన్ని వ్యాపార కేంద్రాలు, పార్కులు, తదితర వినోద కేంద్రాలుగా తయారుచేస్తానని ప్రయత్నించి భంగపడ్డాడు. 2000 సంవత్సరంలో భారీ వర్షాల వల్ల, మూసీకి వరదలొచ్చి ఆయన చేసిన ప్రయత్నాన్ని భంగపరిచాయి. 2004లో వైఎస్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే మూసీని సుందరీకరిస్తాం అని ప్రకటించి, మీరాలం చెరువు నుండి నాగోల్ వరకు గల 21 కిలోమీటర్ల మూసీ ప్రాంతాన్ని మూడు భాగాలుగా విభజించి వాటికి అందమైన పేర్లు పెట్టి, ఆ ప్రాజెక్టు కోసం కొంత డబ్బు ఖర్చు పెట్టింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రెండు సంవత్సరాలకు కేసీఆర్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన కోసం ఒక సంస్థను ఏర్పరచి కొంత బడ్జెట్ కేటాయించి, గతంలో కాంగ్రెస్ ప్రకటించిన పథకాన్నే దాదాపుగా ఖరారు చేసి, సర్వే నిర్వహించి మూసీలో అక్రమ నిర్మాణాలు అని ఒక జాబితా ప్రకటించింది. ఆ ప్రభుత్వంలోని నాయకులే ఇప్పడు మూసీనది చుట్టు ప్రక్కల ఉన్న బస్తీల లోంచి ప్రజలను తరలివెళ్లవద్దని ఉపన్యాసాలు ఇస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కొన్ని మురుగునీటి శుద్ధి ప్లాంట్లను నిర్మించింది, కొంతమేరకు రిటైనింగ్ గోడను నిర్మించింది. గత 28 సంవత్సరాలలో పాలనలో ఉన్న మూడు ప్రభుత్వాలు మూసీ అభివృద్ధి కోసం రూ.348 కోట్లు ఖర్చు చేయడం జరిగింది.
గత ఏడాది డిసెంబర్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది మాసాలకు ముఖ్యమంత్రి, తన క్యాబినెట్‌లో చర్చించి మూసీ ప్రక్షాళన పేరుతో భారీ నిధుల ఖర్చుతో చేపట్టే ప్రాజెక్టు గురించి ప్రకటన చేసారు. ఒకసారి మూసీ ప్రక్షాళన అని, నది పునరుద్ధరణ అని, నదిలో ప్రవహించే నీటిని శుద్ధి చేయడం అని రకరకాల ప్రకటనలు ప్రభుత్వ అధినేతలు చేస్తూ వస్తున్నారు. చాలా హడావిడిగా సర్వే చేసి నదిగర్భంలో ఉన్న కుటుంబాలను గుర్తించి, వాళ్లను ఇదివరకే నిర్మాణం అయి ఉన్న రెండు పడకల గృహాల్లో పునరావాసం కల్పిస్తామని, చట్టపరమైన పక్కా హక్కుల పత్రాలు అందజేస్తామని ప్రకటించి కొంతవరకు అమలు కూడా చేసింది. పౌర సంస్థలు, సంఘాలు నిర్వాసిత కుటుంబాలకు అండగా ఉండి వివిధ దశల్లో ప్రభుత్వాధికార్లతో చర్చలు జరుపుతున్నారు. చాలా బలంగా పౌర సంస్థలు తమ గొంతులు కలిపి నిర్వాసితుల పక్షాన ఉండటంతో ప్రభుత్వం, నదీగర్భంలో ఉన్న కుటుంబాలను బలవంతంగా తరలించమని, ఎట్టి పరిస్థితిలోనూ పోలీసులను, నిర్బంధ పద్ధతులను ప్రయోగించమని, హైడ్రా సంస్థను అసలే వాడమని హామీ ఇచ్చి, ఇప్పటికి ఆ హామీకి కట్టుబడి ఉంది. అయితే ఆ కుటుంబాలను దూరంగా తరలిస్తే జీవనోపాధి సమస్య తలెత్తుతుంది కాబట్టి, జీవనోపాధికి సంబంధించిన ప్రభుత్వ పథకాలను ప్రవేశపెట్టే విషయం, గృహాల స్వంతదార్లే కాకుండా అందులో కిరాయికి ఉండే కుటుంబాలకు ఇండ్లు కేటాయింపు లాంటి తదితర సమస్యలను ప్రభుత్వం పౌర సమాజ సంస్థలను చర్చలకు ఆహ్వానించి పరిష్కార దిశగా ఆలోచించే దిశలో ఉంది. ఇదివరకే ఉన్న మురుగునీటి శుద్ధి ప్లాంట్లు మాత్రమే కాక ఇంకా కొన్నింటిని నిర్మించి మురుగునీటిని సంపూర్ణంగా శుద్ధి చేస్తామని ప్రభుత్వం చెప్పుతుంది. కాని మామూలు నీటి కాలుష్యం కాకుండా అర్సెనిక్, సైనేడ్ లాంటి విషపదార్థాలు కూడా కలిసిపోయిన నదిలోని రసాయన నీరును శుభ్రపరిచే సమర్థత కలిగిన ప్రక్రియ గల ప్లాంటు నిర్మించగలదా, అంత సమర్థమైన సాంకేతిక పరిజ్ఞానం మనకు అందుబాటులో ఉందా అనే ప్రశ్నలు వస్తున్నాయి.
ప్రభుత్వం ముందుగా నదిలో కలిసే మురుగునీటి వ్యర్థాలను, ఫ్యాక్టరీల నుంచి వచ్చే రసాయనిక వ్యర్థాలను కట్టడి చేసే ప్రయత్నం, మురుగుశుద్ధి ప్లాంట్ల నిర్మాణాలు, ప్రాజెక్టుకు సంబంధించిన ఇతర కార్యక్రమాలు చేపట్టకుండా, ముందు ప్రజలను వాళ్లు నివసిస్తున్న గృహాల నుంచి తరలించే కార్యక్రమమే ప్రధానంగా చేపట్టిందన్న ప్రశ్నకు సంతృప్తికరమైన వివరణ ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఇదివరకే నదిలోకి వచ్చే చిన్న పెద్ద 36 నాలాలను గుర్తించి వాటిని ఇంటర్‌సెప్టివ్ పైప్‌లైన్లకు అనుసంధానం చేయడం జరిగింది. అయితే అది లోపాలతో ఉందని నిపుణులు చెపుతున్నారు. అంతే కాకుండా కొత్తగా నగరంలో ఇంకా కొన్ని ప్రదేశాల నుండి మురికి నీరు నదిలోకి వచ్చి కలుస్తుంది. ముందుగా ఈ వ్యవస్థను పటిష్ఠపరచాలని ఆ రంగంలో ఉన్న నిపుణులు అంటున్నారు.
మూసీ బఫర్ జోన్‌లో అయిదారు రకాల భూములున్నాయి. వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు ప్రజల దగ్గర ఉన్నాయి. నిజాం కాలం నుండి ప్రజలు అనుభవిస్తున్న దస్తగర్దాన్, ఇనాం భూములు, ఖాస్రా భూములు, చెస్సాల భూములు, లావాణీ పట్టాలు, ఏక్‌సాల్ పట్టా భూములు ఉన్నాయి. వీటి గురించి వివరాలు సేకరించి, ఆ భూముల్లో ఉన్న వారిని తొలగించదలచుకుంటే ఆ కుటుంబాల పునరావాసం, వారికి నష్టపరిహారం, ఇంకా వేరే ప్రదేశాల్లో భూములు ఇవ్వడం లాంటి అంశాల గురించి ప్రభుత్వం పని మొదలుపెట్టలేదు. నదిగర్భంలో ఉన్న ప్రజల గృహాలకు మాత్రమే గుర్తులు పెట్టి వారిని తరలించడమే ప్రాధాన్యత అంశంగా ప్రభుత్వం పెట్టుకుంది.
మూసీ నది ఉప్పల్ దాటిన తర్వాత దాదాపు 100 కిలోమీటర్లు సూర్యపేట ప్రాజెక్టు వరకు ప్రవహించి, అక్కడ నుంచి 74 కి.మీ ప్రవహించి నల్లగొండ జిల్లాలో కృష్ణానదిలో కలుస్తుంది. ఉప్పల్ నుండి సూర్యపేట వరకు ఉన్న దాదాపుగా 200 గ్రామాల ప్రజలు, ప్రభుత్వం మూసీ నదిని శుభ్రపరచడం లక్ష్యంగా పెట్టుకున్నందుకు చాలా సంతోషిస్తున్నారు. అయితే తమ గ్రామాలలో మూసీ కాలుష్యం వల్ల నెలకొన్న పరిస్థితుల గురించి, తమ జీవితాలు విధ్వంసం తీరుతెన్నుల గురించి మాట్లాడడం లేదని, అసంతృప్తితో ఆగ్రహంతో ఉన్నారు. మా హక్కుల బృందం ఆ గ్రామాలు పర్యటించినప్పుడు చాలా విషయాలు తెలిపారు. మూసీ ప్రాజెక్టు గురించి ప్రతి రోజు మాట్లాడుతున్న, ప్రశ్నిస్తున్న పౌర సంస్థల ప్రతినిధులు గాని, ప్రతిపక్ష పార్టీలు గాని, ప్రభుత్వ అధికారులు గాని ఇంతవరకు తమ గ్రామాలను సందర్శించలేదని తెలిపారు. వారు ప్రభుత్వం తలపెట్టిన మూసీ పునరుద్ధరణ ప్రాజెక్టులో మూసీ పరివాహక ప్రాంతాన్ని కూడా భాగం చేయాలని బలంగా కోరుతున్నారు. మూసీ సాగునీరు పారుదల కోసం ఒక బ్రహ్మాండమైన, (నిజాం నిర్మించిన) కత్వాల వ్యవస్థ ఉంది. ఉప్పల్ నుండి సూర్యపేట వరకు ఉనికిలో ఉన్న 24 కత్వాల సాగునీరు పారుదల వ్యవస్థ ద్వారా దాదాపు 200 గ్రామాలకు, ఆ గ్రామాల చెరువులకు నీరు పారుతుంది. అప్పుడు 25 వేల ఎకరాల సాగుకోసం ఏర్పరచిన ఈ సాగునీటి వ్యవస్థ వల్ల ఇప్పుడు 1,25,000 ఎకరాల భూమి సాగవుతోంది. అయితే ఆ కత్వాలు కొన్ని రాళ్లు ఊడిపోయి చిద్రం అయినాయి. వాటిని మరమ్మతులు చేసి ఆధునికీకరించాలి. కత్వాల నుండి నీటిని తీసుకెళ్లే ప్రధాన కాలువలు, వాటికి అనుసంధానంగా ఉండి గ్రామాలలోకి నీరు సరఫరా చేసే చిన్న కాలువలకు ఉన్న తూములు తుప్పు పట్టి పాడైపోయాయి. వాటిని బాగుచేయాలి. గత 20 సంవత్సరాలుగా గ్రామ చెరువులన్ని పూడికతో నిండిపోయాయి. మిషన్ కాకతీయ ప్రాజెక్టులో గత ప్రభుత్వం కొన్ని చెరువుల్లో పూడిక పనులు చేపట్టింది. అవి సరిగ్గా చేయలేదు. ఇప్పడు శుద్ధి చేసిన నీరు చెరువుల్లోకి వస్తే కాలుష్యంతో నిండిన పూడికవల్ల, మళ్లీ శుభ్రమైన నీరు కాలుష్యమవుతుంది. అందుకని చెరువులలో పూడిక తీయాలి. హయత్‌నగర్, పోచంపల్లి, ఆలేరు ప్రాంతాల్లోని గ్రామాలలో మూసీ నీటి సరఫరా కోసం కాలువలు తవ్వే పని మొదలయింది. కొన్ని గ్రామాల్లో గ్రామపంచాయితీల సహకారంతో ప్రజలే మూసీ నీటి కోసం కాలువలు తవ్వడం ప్రారంభించారు. అవి అసంపూర్తిగా ఉన్నాయి. ఇప్పడు శుభ్రపరచిన నీళ్లు వస్తాయని ఆ కాలువల నిర్మాణం పూర్తి కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.
గత పదేళ్లలో కింది పరివాహక ప్రాంతాల్లో రకరకాల పరిశ్రమలు వెలిసాయి. అవినీతిమయమైన కాలుష్య నియంత్రణ మండలి వాటికి అనుమతులిచ్చింది. ఆ పరిశ్రమలన్నీ కాలుష్య పదార్థాలను నేరుగా మూసీలోకి వదులుతున్నాయి. పిలాయిపల్లి, కప్పరాయిపల్లి, రెద్రెల్లి, బ్రాహ్మణపల్లి, హయత్‌నగర్ మండలాల్లోని గ్రామాల దగ్గర ఈ ఫ్యాక్టరీలు వెలిశాయి. ఇవన్నీ కూడా వ్యర్థపదార్థాలను మూసీలోకే వదులుతున్నాయి. పైన శుభ్రపరిస్తే కింది ప్రాంతంలో కలుషితమవుతున్న మూసీ నీటి సంగతి ఏం చేస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అందువల్ల మూసీ పరివాహక గ్రామాల ప్రజలు మూసీ ప్రాజెక్టులో తమ ప్రాంతాలను కూడా చేర్చాలని అంటున్నారు. ఆలోచనాపరులుగా మనం కూడా ఈ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఆ గ్రామాల ప్రజలకు సంఘీభావంగా ఉందామా?
ఎస్. జీవన్‌కుమార్
మానవ హక్కుల వేదిక
Updated Date - Nov 13 , 2024 | 03:21 AM