ట్రంప్ గెలుపు మేలుమలుపా?
ABN, Publish Date - Nov 07 , 2024 | 03:14 AM
వాస్తవం ఒక్కటే! వ్యాఖ్యానాలు ఎన్నో! అమెరికా 47వ అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ విజయంపై కూడా ఎన్నో వ్యాఖ్యానాలు చేయవచ్చు. ఏ విషయంపైనా అన్ని వ్యాఖ్యానాలు ఒకే స్థాయిలో ఉండవు. మౌలిక వ్యాఖ్యానం అంటూ...
వాస్తవం ఒక్కటే! వ్యాఖ్యానాలు ఎన్నో! అమెరికా 47వ అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ విజయంపై కూడా ఎన్నో వ్యాఖ్యానాలు చేయవచ్చు. ఏ విషయంపైనా అన్ని వ్యాఖ్యానాలు ఒకే స్థాయిలో ఉండవు. మౌలిక వ్యాఖ్యానం అంటూ ఒకటి ఉంటుంది. ట్రంప్ విజయంపై కూడా అటువంటి మౌలిక వ్యాఖ్యానం నిస్సందేహంగా చేయవచ్చు! దీని కోసం ట్రంప్‌కు వచ్చిన ఓట్లో, ఆయనకు పట్టం కట్టిన రాష్ట్రాల జాబితానో చూడనక్కర్లేదు. 2016 నుంచి ట్రంప్‌ది ఒకటే బాట. ఆ బాటను బట్టే ట్రంప్ విజయంపై మౌలిక వ్యాఖ్యానం చేయవచ్చు. ఆ బాట స్వభావంపై ఇప్పటికే చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవి సృష్టించే విపరిణామాల గురించి చాలా వ్యాఖ్యానాలూ వెలువడ్డాయి. ఆ బాటను అనుసరించి మున్ముందు మరింత ఉధృతంగా రాజకీయాలు నడిస్తే ప్రజాస్వామ్యానికి, ప్రపంచానికి మంచే జరుగుతుందని విశ్వసించలేం! అమెరికా ప్రయోజనాలనే అన్నింటా ముందు నిలబెడతామన్న ట్రంప్ నినాదాన్ని పైపైన చూస్తే అసహజంగా అనిపించదు. జాతీయవాద దృష్టితో ఆ నినాదం ఇచ్చారని సరిపెట్టుకునే పరిస్థితీ లేదు. లోతుగా చూస్తే పొంచి ఉండే ప్రమాదాలు కనపడతాయి.
ఏ నినాదం అందరికీ ఒకేలా అర్థాన్ని ఇవ్వదు. భిన్న వర్గాలు, దేశాల ప్రజలకు అది విభిన్నంగా అర్థం అవుతుంది. అసలు సిసలైన అమెరికన్లకు దేశంలో ఉద్యోగ అవకాశాలు దక్కకుండా పోతున్నాయనీ, అమెరికా ఉత్పత్తుల అమ్మకాలకు అన్నిచోట్ల అడ్డంకులు ఎదురవుతున్నాయన్నదే ట్రంప్ నినాదం సారాంశంగా భావించొచ్చు. ట్రంప్ పదేపదే చెబుతున్నట్లుగా.. అమెరికా ఎదుర్కొంటున్న ఈ సమస్యకు కారణం నాలుగు దశాబ్దాలుగా ఆ దేశ పాలకులు అనుసరించిన విధానాలేనని ఇటీవల చరిత్రను చూస్తే ఎవరికైనా స్పష్టమవుతుంది. అందులోనూ రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష పగ్గాలు చేపట్టిన రోనాల్డ్‌రీగన్ 1980ల్లో మొదలుపెట్టిన ఆ విధానాలలోనే అమెరికా ఇప్పుడు ఎదుర్కొంటున్న పరిస్థితికి మూలాలు ఉన్నాయి. అన్ని దేశాల ఆర్థిక విధానాలను నయానా భయాన సరళీకరించి విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరిచేలా చేసింది అమెరికా విధానకర్తలే. చౌక శ్రమ, చౌక ముడిసరుకులు పుష్కలంగా లభ్యమయ్యే ప్రాంతాలకూ దేశాలకూ అమెరికా పరిశ్రమలు తరలిపోవటానికి ప్రోత్సాహకాలు ఇచ్చింది వారే. ఆసియా దేశాల పారిశ్రామిక ఉత్పత్తులపై ఆధారపడే విధంగా అమెరికా మార్కెట్‌ను మలిచింది వారే. ఫలితంగా పారిశ్రామిక రంగంలో ఉద్యోగాలు పోయాయి. ఒకనాటి పారిశ్రామిక ప్రాంతాలు మ్యూజియంలు గానో, నిర్జన ప్రదేశాలుగానో మారిపోయాయి. పోయిన ఉద్యోగాలకు సమానంగా కొత్త ఉద్యోగాలు రాని మాటా నిజమే. 1990ల నుంచి బాగా ఊపందుకున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒక దశ దాటిన తర్వాత అవసరమైన స్థాయిలో అమెరికన్ యువతకు ఉద్యోగాలను సృష్టించలేదు. ఈ రంగంలో కూడా చౌకగా లభ్యమయ్యే ఆసియా నిపుణులే ఎక్కువగా లబ్ధి పొందారు. అలా లబ్ధి పొందేలా ఆ నిపుణులను రప్పించుకున్నదీ వారే! ఇటీవల వచ్చిన కృత్రిమ మేధో సాంకేతిక పరిజ్ఞానం వల్ల కూడా ఊడిపోయే ఉద్యోగాలతో పోల్చితే సృష్టి అయ్యే ఉద్యోగాల సంఖ్య తక్కువే. కోవిడ్ అనంతరం ఐటీ రంగంలో హేమాహేమీలు అనదగిన కంపెనీలు కూడా పోటీలు పడి ఉద్యోగులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఉన్నత ఉద్యోగాలను ప్రధానంగా ఆసియావాసులు, కిందిస్థాయి ఉద్యోగాలను హిస్పానిక్‌లు దక్కించుకోవటం అమెరికాలో సహజంగా జరిగిపోయింది. దీనికి ఎవరినైనా నిందించదలిస్తే మొదటగా వేలెత్తి చూపాల్సింది అమెరికా కార్పొరేట్ సంస్థలని, అక్కడి విధానకర్తలను తప్ప వేరే దేశాలని కాదు.
ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్ ప్రధానంగా మధ్యతరగతి శ్వేత జాతీయులను ఆకర్షించడమే లక్ష్యంగా చేసుకుని రాజకీయాలను మొదలుపెట్టారు. మొదటిదఫా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడేనాటికే ఆ దిశలో అడుగులు వేసి విజయం సాధించారు. శ్వేతజాతి మధ్యతరగతికి ఉద్యోగ అవకాశాలు దక్కకపోవటానికి విదేశాలే కారణమని దుమ్మెత్తిపోశారు. తన ఉత్పత్తులతో అమెరికా మార్కెట్‌ను ముంచెత్తిన చైనాతో మొదలుపెట్టిన రాజకీయయుద్ధంలో అవసరమనుకున్న చోట భారత్‌నీ లాగారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ విపరీతంగా దిగుమతి సుంకాలు విధిస్తోందని విరుచుకుపడ్డారు. తాజా ఎన్నికల్లో అయితే మంచి జీతాలుండే ఉద్యోగాలన్నిటినీ భారతీయులు కొట్టేస్తున్నారనీ ఆక్షేపించారు. వివిధ రంగాల్లో అమెరికా ఆధిపత్యం తగ్గటానికి, ఉద్యోగాల క్షీణతకు ఇతర దేశాల చర్యలే కారణమన్నట్లుగా ఆయన చేసిన ప్రచారానికి లక్ష్యం శ్వేత జాతీయులను ఆకర్షించడమే. అమెరికా జనాభాలో 60 శాతానికి కాస్త అటుఇటుగా ఉన్న శ్వేతజాతీయులను తనవైపు తిప్పుకోవటంలో మొదటిసారిలాగే రెండోసారి విజయం సాధించారు. ఆయన తాజా విజయానికి మహా వ్యాఖ్్యానంగా దీన్నే చెప్పుకోవాలి. అమెరికన్ అస్తిత్వానికి ముఖ్యంగా శ్వేతజాతీయుల ఆధిపత్యానికి ముప్పు ముంచుకొస్తుందనే ఒకరకమైన భయాన్ని, ఆందోళనను కలిగించటంలో ట్రంప్ సఫలీకృతమయ్యారు. అణగారిన వర్గాలే తమ అస్తిత్వాన్ని కాపాడుకోటానికి పోరాటాలు చేస్తాయన్న సూత్రీకరణ అన్ని సందర్భాల్లోనూ నిజం కాదు! ఆధిపత్య వర్గాలను ఆధారం చేసుకుని కూడా అస్తిత్వ రాజకీయాలను నడపొచ్చు అనటానికి పదేళ్ల నుంచి అమెరికాలో జరుగుతున్న పరిణామాలే నిదర్శనం. ఏదో విధంగా జనాకర్షణే ప్రధానం అనుకుని రాజకీయాలు చేసే వారికి నిరంతరం వైరివర్గాలు కావాలి. ఆ వైరివర్గాల వల్లే సకల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని చెప్పటం నిరంతరం జరగాలి. ఉద్యోగ భద్రతను, ఉద్యోగ కల్పనను తగినంత ఇవ్వలేని ఆర్థిక వ్యవస్థ అభద్రతా సమాజాన్ని సృష్టిస్తుంది. 1990ల తర్వాత మరీ ముఖ్యంగా 2007–2008 ఆర్థిక సంక్షోభం తర్వాత అభద్రతా భావం అమెరికా ప్రజల జీవితాల్లోకీ చొచ్చుకు వెళ్లింది. అభద్రతాభావనలో వేగిపోయే వారి ముందు శత్రువులుగా కొన్ని దేశాలనూ, కొన్ని వర్గాలను ప్రవేశపెట్టటంలోనే జనాకర్షణ నేతల విజయం దాగివుందని చెబుతూ ప్రముఖ ఆర్థికవేత్త ప్రణబ్‌బర్ధన్ అభద్రతా ప్రపంచం పేరుతో ఒక పుస్తకాన్నే రాశారు. అన్ని చోట్లా వ్యాపిస్తున్న అభద్రతా సమాజం ప్రజాస్వామ్యంలో ఉదాత్త సంప్రదాయాలను పలచనచేసి ఉన్మత్త, నిర్హేతుక నినాదప్రాయులైన నాయకులను ఎలా సృష్టిస్తోందో కూడా ప్రణబ్ బర్ధన్ విశ్లేషించారు.
అమెరికా రాజకీయాల్లో ట్రంప్ నిర్వహిస్తోన్న పాత్రను ప్రణబ్ బర్ధన్ కోణం నుంచి చూస్తే రానున్న కాలంలో ప్రపంచం చాలా సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాలం గడుస్తున్న కొద్దీ రాజకీయ నాయకుల్లో మార్పుని చూడటం సహజం. కానీ ట్రంప్‌ని నిశితంగా చూసిన వారెవరూ ఆయన ఆలోచనల్లో మార్పు వచ్చిందని భావించటం లేదు. నియంతలే కాకుండా, ప్రజాస్వామ్య ఎన్నికల ద్వారా అధికారం చేపట్టి నియంతృత్వ పోకడలను ప్రదర్శిస్తున్న నేతలు ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టటాన్ని తమకు సానుకూలంగా భావిస్తున్నారు. రష్యా అధినేత పుతిన్ కొంత ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంది. రష్యా పెట్టే షరతులకు ఉక్రెయిన్ అంగీకరించేలా చేసి యుద్ధాన్ని విరమింపచేస్తానని ట్రంప్ బహిరంగంగానే ప్రకటించారు. ఇజ్రాయెల్ నేత నెతన్యాహుకు కూడా ట్రంప్ పట్ల వ్యతిరేకత ఉందని చెప్పలేం. హమాస్ నిర్మూలన పేరుతో గాజాలో సాగుతున్న నరమేధాన్ని ఆపేలా ట్రంప్ తనపై ఒత్తిడి తెస్తారని ఇజ్రాయెల్ పాలకవర్గాలూ భావించటం లేదు. మానవహక్కుల గురించి డెమొక్రటిక్ పార్టీ సిద్ధాంతపరంగానైనా ఎంతో కొంత మాట్లాడుతుంది. రిపబ్లికన్ పార్టీకి ఈ విషయంపై డెమొక్రాట్లంతగా నోరు విప్పిన చరిత్ర లేదు. ఐరాస, ప్రపంచ ఆరోగ్య సంస్థ లాంటి అంతర్జాతీయ సంస్థలపై మొదటిదఫా అధ్యక్షుడైనప్పుడే ట్రంప్ చాలా విమర్శలను ఎక్కుపెట్టారు. ఈసారి అయినా వాటిపట్ల ట్రంప్ ధోరణి మారుతుందన్న నమ్మకం లేదు. వీటన్నిటికంటే ముఖ్యమైంది వాతావరణ మార్పులపై కార్యాచరణ. అసలు వాతావరణ మార్పులే ప్రమాదకరంగా లేవనీ ప్రమాదకరమని ప్రచారం చేసే వాళ్లవి డొల్ల వాదనేనని ట్రంప్ అనేకసార్లు ఈసడించారు. ప్యారిస్ వాతావరణ ఒప్పందం నుంచి అమెరికా వైదొలుగుతున్నట్లు తాను గతంలో అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ప్రకటించారు. పాత వైఖరికే కట్టుబడి ట్రంప్ వ్యవహరిస్తే ప్రపంచానికి వాతావరణపరంగా గడ్డుకాలం తప్పదనే అనుకోవాలి.
ఇతర దేశాల సంగతెలా ఉన్నా ట్రంప్ గెలుపుతో భారత్‌కు లాభిస్తుందనే వారి సంఖ్య తక్కువేమీ కాదు. ట్రంప్ అతి జాతీయవాదంతో ఏకీభావం ఉండొచ్చు. కానీ ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నకాలంలో భారతీయ విద్యార్థులు, ఉద్యోగులు అభద్రతతో వణికిపోయారు. చదివిన డిగ్రీకి అనుగుణంగా చేస్తున్న ఉద్యోగాల్లేవని వారిని స్వదేశానికి పంపించిన ఘటనలు చాలా ఉన్నాయి. వీసాలను, ఉద్యోగ నిబంధనలను కట్టుదిట్టంచేసి అవకాశాలను కుదించి వేస్తారన్న భయం భారతీయుల్లో ఇప్పటికీ ఉంది. ఇక చైనాను కట్టడి చేయటానికి ట్రంప్ ప్రయత్నిస్తారనీ దీంతో అక్కడ నుంచి కంపెనీలు తరలి వస్తాయనే ఆశ ఇక్కడి అధికారపార్టీకి ఉంది. యాపిల్ లాంటి దిగ్గజ కంపెనీయే భారత్‌లో ఐఫోన్ల ఉత్పత్తిని ఇబ్బడిముబ్బడిగా పెంచుతోంది. ట్రంప్ రాజకీయాలే యాపిల్ లాంటి కంపెనీల కార్యకలాపాల తరలింపునకు అసలు కారణమని చెప్పలేం. 1990ల నాటి పరిస్థితి చైనాలో లేదు. అక్కడ వేతనాలు పెరిగాయి. ముడిసరుకుల ధరలు హెచ్చాయి. కంపెనీల దృష్టి భారత్‌వైపు మళ్లటానికి ఇవి కీలకపాత్రను పోషించాయి.
ఈ పరిణామాల సంగతి ఎలా ఉన్నా... పరిపక్వత చెందిన ప్రజాస్వామ్య దేశమంటే ఒకనాడు వెంటనే గుర్తుకొచ్చేది అమెరికా. ఇటీవల కాలంలో అక్కడ కూడా జనాకర్షణ రాజకీయం విపరీతంగా పరిపక్వత పొందుతోంది! అభద్రతా భావన అక్కడి ప్రజల్లోనూ రాజ్యమేలుతోంది. నినాదప్రాయ రాజకీయాల్లో నిపుణులైన నేర్పరులే జనాభిమానాన్ని పొందుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఊహించని మలుపులు తిప్పుతున్నారు. అన్ని మలుపులూ మేలుమలుపులు కావన్నదొక్కటే ప్రస్తుతానికి నిజం!
రాహుల్ కుమార్
(ఆంధ్రజ్యోతి ఎడిటర్)
Updated Date - Nov 07 , 2024 | 03:14 AM