రాయకుండా సలపరిస్తున్నదే ఎక్కువ!
ABN, Publish Date - Nov 11 , 2024 | 01:49 AM
ఎండిన మానేరు లోంచి ఓ కథల ‘ఊటబాయి’ పుట్టింది. నెర్రెలు బారిన మానేరు నేల లోంచి ఓ ‘సంచారి’ తీతువు పిట్టయి ‘ఊరికి ఉప్పులం’ పుట్టిందని సైరన్ మోగించాడు. దశాబ్దాల ఆధిపత్యపు ‘దాడి’ని నిరసిస్తూ...
నవలా శిల్పం
ఎండిన మానేరు లోంచి ఓ కథల ‘ఊటబాయి’ పుట్టింది. నెర్రెలు బారిన మానేరు నేల లోంచి ఓ ‘సంచారి’ తీతువు పిట్టయి ‘ఊరికి ఉప్పులం’ పుట్టిందని సైరన్ మోగించాడు. దశాబ్దాల ఆధిపత్యపు ‘దాడి’ని నిరసిస్తూ ఒక ‘లాంగ్ మార్చ్’ మొదలైంది. ఉపాధ్యాయ ఉద్యమాలతో సాహిత్యంతో ‘జిగిరి’ దోస్తయి నడిచిన ఒక వర్తమాన సాహిత్య వాగ్దానం పెద్దింటి అశోక్ కుమార్. ప్రపంచీకరణ మార్పు లను కథావస్తువులుగా తీసుకుని, రైతుకూలీల జీవితాలకంటే మరింత దిగువకు చూపును తెచ్చి అట్టడగు జీవితాలను సాహిత్యీ కరించిన అక్షరం ఆయనది. పల్లె జీవనాడిని పట్టుకుని, ప్రజల బాషను, పొక్కగాని పాముల్లా తొక్కులాడుతున్న పాత్రలను ఒక బాధ్యతగా నవలలుగా చెక్కుతున్న శిల్పకారుడాయన.
ఇంటర్వ్యూ మీసాల ఉదయ్ కుమార్
94928 44817
ఒక రచన ముందు కథలా మొదలై తర్వాత నవలగా మారిన సందర్భాలేమైనా ఉన్నాయా?
‘ఎడారి మంటలు’ నవలను ముందుగా కథగా రాయాల నుకున్నాను. మా ఊరి నుంచి వలస వెళ్లి గల్ఫ్ ఎడారిలో గొర్రెల కాపరిగా చిక్కుకున్న యువకుడి కథ అది. కథ మొదలుపెట్టాక విస్తారమైన ఆ జీవితాన్ని కథలో చెప్పలే ననిపించి నవలగా రాశాను. కథ అంటే జీవితంలో ఒక చిన్న సంఘటన. కానీ నవల అంటే విస్తారమైన జీవితం.
పదకొండు భాషల్లోకి అనువాదమైన ‘జిగిరి’ నవలకి ప్రేరణ ఏమిటి? ప్రపంచీకరణతో మారుతున్న జీవితా లను చూపెట్టడానికి గుడ్డేలుగు (ఎలుగుబంటి)ని ఆడించే పాత్రను ఎందుకు ఎన్నుకోవాలనిపించింది?
తరానికి తరానికి మధ్య ఆలోచనలు, మానవత్వపు లక్షణాలు ఎలా మారుతున్నాయి అన్న ఆలోచనే ‘జిగిరి’ నవలకు ప్రేరణ. క్రూరమృగాలు మనుషులతో స్నేహం చేసి మానవత్వాన్ని నేర్చు కుంటాయి. కానీ మానవత్వంతో బతకాల్సిన మనిషి అవకాశాలకు అనుగుణంగా మృగంలా మారిపోతాడు. మనిషిలా మారిన మృగానికీ మృగంలా మారిన మనిషికీ మధ్య ఘర్షణను చెప్పాలనుకుని గుడ్డేలుగులను ఆడించే వాళ్ళ జీవితాన్ని ఎన్నుకున్నాను.
నవలకు ప్లాట్ ముందే అనుకుంటారా? మొదలుపెట్టాక నవలను అంతిమ రూపానికి తెచ్చే పని ఎలా ఉంటుంది?
నవలకైనా కథకైనా ప్లాట్‌ను ముందే అనుకుంటాను. మనసును మెలిపెట్టే అంశాలనే వస్తువుగా ఎన్నుకుంటాను. గుండెలో మసిలి మసిలిన తర్వాతనే కొంత పరిశోధన చేసి నోట్స్ రాసుకుని నవల రాస్తాను. నవలని రెండు మూడు డ్రాప్టుల్లో పూర్తి చేస్తాను. ఈ క్రమంలో పరిశోధనలో కొత్త అంశాలు తెలిసినా, లేక పాత్రల స్వభావం మారినా దాని ముగింపు మారుతుంది. అప్పుడు మరొక డ్రాఫ్ట్ రాయాల్సి వస్తుంది. ముఖ్యంగా నవల రాయడం మొదలుపెట్టాక కొన్ని పాత్రలు నా చేతుల్లో ఉండవు.
గంగిరెద్దుల వారి జీవితాల మీద రాసిన ‘సంచారి’ నవలకు ఎలాంటి పరిశోధన అవసరమైంది? పరిశోధనా క్రమంలో మీకు గుర్తుండిపోయిన జ్ఞాపకం ఏదైనా...?
కులవివక్ష ఇప్పటికి సమాజంలో బలంగా ఉంది. గంగిరెద్దుల కులానికి చెందిన ఒక వ్యక్తి సంచార జీవితాన్ని కాకుండా భద్రమైన జీవితాన్ని కోరుకుని ఒక ఊరిలో ఓ ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే అతను ఎదుర్కొన్న సమస్యలు ఏమిటన్నది ఈ నవల సారాంశం. మా సిరిసిల్ల దగ్గర గంగెద్దుల కొండాపురం అనే ఒక ఊరు ఉంటుంది. అక్కడ ఎక్కువగా వాళ్ళే ఉంటారు. వారం పది రోజులు వాళ్ళ వెంట తిరిగి, వాళ్ళ ఆచార వ్యవహారాలను, ఆహారపు అలవాట్లను పరిశీలించి రాసిన నవల ఇది. నేను అక్కడకు వెళ్ళిన ఒక రోజున– ఒక ఇంట్లో గంగిరెద్దు చనిపోతే మనిషి పోయినంతగా తల్లడిల్లిపోతూ దానికి అంత్యక్రియలు చేశారు. ఇది గుర్తుండి పోయిన జ్ఞాపకం.
తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో రాసిన ‘లాంగ్ మార్చ్’ నవలను ఒక విద్యార్థి దృక్కోణం నుంచో, ఉద్యోగి దృక్కోణం నుంచో గాక, ఒక రైతు దృక్కోణం లోంచే చెప్పాలని ఎందుకు అనిపించింది?
‘లాంగ్ మార్చ్’ నవల 2011 మార్చ్‌లో టాంక్‌బండ్ మీద జరిగిన ‘మిలియన్ మార్చ్’ నేపథ్యంగా తెలంగాణ ఉద్యమ రూపాన్ని చెప్తుంది. నవలలో అన్నీ వాస్తవంగా జరిగిన సంఘటనలే. కొంత నాటకీయత జోడించాను. దీన్ని ముందుగా ఒక విద్యార్థి కోణం లోంచి చెప్పాలనుకున్నాను. కానీ అప్పటికే ఉద్యమంలో విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు వివిధ వృత్తుల వారు జేఏసీలుగా ఏర్పడి ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. గ్రామాల్లో రైతులు కూడా తెలంగాణ రావాలని ఎంతో ఆరాట పడుతున్నారు. ఆ విషయమే చెప్పాలనుకుని ఒక రైతు కోణంలోంచి రాసాను.
గల్ఫ్ ఎడారిలో ఒంటరిగా చిక్కుకున్న గొర్లకాపరి జీవితాన్ని ‘ఎడారి మంటలు’ నవలగా 2000లోనే రాశారు. ఈ నవలకై ఆ కాలంలో ఎలాంటి పరిశోధన చేయాల్సి వచ్చింది?
‘ఎడారి మంటలు’ నవల రాయకముందే ఎడారి వలస జీవితాల మీద 12 కథలు రాశాను. అవి ‘వలస బతుకులు’ పేరుతో సంకలనంగా వచ్చాయి. ‘ఆజాద్’ వీసా మీద వెళ్లి ఎడారిలో చిక్కుకొని గొర్ల కాపరిగా మారిన మా ఊరి వ్యక్తి జీవితాన్ని సజీవంగా చిత్రించాను. అప్పటికి మా ఊర్లో ఇంటింటికీ ఒక వ్యక్తి గల్ఫ్ దేశాల్లో ఉన్నాడు. రోజూ ఎవరో ఒకరు వచ్చేవారు పోయేవారు. వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడి విషయాలు, ఫొటోలు సేకరించాను. అప్పటికి ఈ వీడియోలు, సెల్ ఫోన్లు లేవు కాబట్టి ఫోటోలూ, క్యాసెట్ల ఆధారంగా ఈ నవలను రాసాను.
గ్రామీణ పర్యావరణం మీద నవల రాయాలన్న ఆలోచన మీకెందుకు వచ్చింది. ‘దాడి’ నవలలో మూడు తరాల జీవన చిత్రాన్ని అభివృద్ధి కోణం లోంచి చూడాలా, విధ్వంసం కోణం లోంచి చూడాలా?
విధ్వంసమే! మనిషి కూటికోసం నీటికోసం గూటికోసం అడవి మీద చేసిన దాడి ఈ నవల. సబ్ మెర్సిబుల్ పంపులతో వేల ఫీట్ల లోతుల్లోంచి నీటిని తోడే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుని దానిని అభివృద్ధి అనుకున్నాం. కానీ దోసెడు మట్టి తీస్తే దోసెడు నీళ్ళూరే నేలలు వట్టిపోతాయని, తాగునీటి కొరత వస్తుందని గ్రహించలేకపోయాం. పెద్ద పెద్ద గుట్టలను ఎక్కే జేసీబీలను, చెట్లు నరికే పరికరాలను కనుగొని అడవులన్నింటినీ నరికి వ్యవసాయ భూములను చేసి అదే అభివృద్ధి అనుకున్నాం. కానీ పిట్టవాలే చెట్టు లేకుండా చేసి పర్యావరణ విధ్వంసం చేస్తున్నామనుకోలేదు. ఒకప్పుడు ఊరు చిన్నది అడవి పెద్దది. కానీ నేడు అడవి కనుమరుగైపోయి ఊర్లో పశువులు లేకుండాపోయి మొత్తం వ్యవసాయ క్షేత్రంగా మారిపోయింది. ఇదీ ఒక విధ్వంసమే. ఇదంతా అభివృద్ధి చాటున జరుగుతున్న విద్వంసం. ఇంకో యాభై ఏండ్ల తర్వాత నీడ లేక, నీరు లేక పరిస్థితి ఏమిటి అన్న ప్రశ్నే ‘దాడి’ నవల. రేపు ప్రపంచ యుద్ధాలంటూ జరిగితే అవి నీళ్ళ కోసమే అన్న చేదు నిజాన్ని చెప్పిన గ్రామీణ పర్యావరణ నవల.
ఉప్పులం అంటే ముప్పు కదా. ప్రజాకర్షక పథకాలు ఎందుకు అభివృద్ధిలో భాగం కాలేకపోతున్నాయి. ‘ఊరికి ఉప్పులం’ నవల ముగింపు మరో నవలకు ప్రారంభమా?
అవును. ప్రజాకర్షక పథకాలు మోచేతికి బెల్లంలాంటివి. అప్పటికప్పుడు తాత్కాలిక ఉపశమనం కలిగించినా అవి ఉత్పత్తి కారకాలు కావు. వాటితో లాభం కంటే నష్టమే ఎక్కువ. వాటి వల్ల గ్రామంలో వచ్చిన మార్పులను, అధికార పార్టీలు రాజకీయ నిరుద్యోగుల కోసం పుట్టించిన గ్రామ స్థాయి పదవులు ప్రజల్లో ఎలాంటి విరోధాలను పుట్టించాయి అన్న అంశాన్ని, 2000 సంవత్సరం తరువాత మారిన పల్లె జీవితాలను ఈ నవలలో రాసాను. దీని ముగింపు వద్దే మరో నవల పుడుతుంది. ఆ మెటీరియల్ కూడా ఉంది. ఇలా రాసిన సాహిత్యం కంటే ఇంకా రాయకుండా గుండెలో మసలుతూ, సలపరిస్తున్న సాహిత్యమే ఎక్కువ.
పెద్దింటి అశోక్ కుమార్
Updated Date - Nov 11 , 2024 | 01:49 AM