ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కొందరలాగే వెళ్ళిపోతారు

ABN, Publish Date - May 20 , 2024 | 03:20 AM

కొందరలాగే వెళ్ళిపోతారు మనకిష్టమున్నా లేకున్నా మనకేం కానట్టే వెళ్ళిపోతారు మనలో రాత్రీపగళ్ళై పోతారు వెళుతూ మనల్నీ వెంటబెట్టుకెళతారు...

1

కొందరలాగే వెళ్ళిపోతారు

మనకిష్టమున్నా లేకున్నా

మనకేం కానట్టే వెళ్ళిపోతారు

మనలో రాత్రీపగళ్ళై పోతారు

వెళుతూ మనల్నీ వెంటబెట్టుకెళతారు

కన్నీటి ఎరుపు కమ్మిన లోగిళ్ళలోకి

గుప్పెడు మిణుగురుల్ని తోడిచ్చి

వెనక్కి పంపించేస్తారు

మిగుళ్లుమిగుళ్లుగా మనని చిందరచేసేస్తారు

2

కొందరలాగే వెళ్ళిపోతారు

ఉన్నక్షణానే లేకుండాపోయి

ఊపిరినీడను పరిచయం చేస్తారు

మళ్లెందుకో మనలోకి కాస్త కాస్తగా నడిచొస్తారు

గడ్డం కింద చేయాన్చి మనల్నే చూస్తుంటారు

కొన్ని వానల్ని, కొన్ని ఎండల్ని,

మధ్యమధ్యలో కొన్ని సంపెంగమొగ్గల్ని

వెంటేసుకుని మనతో తిరుగుతూనే ఉంటారు

కొన్ని ప్రశ్నలుగా, కొన్ని క్షమాపణలుగా,

కొన్ని పశ్చాత్తాపాలుగా

మనని మనముందే నిలేసిపోతారు


3

కొందరలాగే వెళ్ళిపోతారు

మనని మనకు కొంత అరువిచ్చిపోతారు

నలిగిపోయిన మెత్తనినవ్వులా ముడతలుపడి

నింగి నలుపునంతా దించిపోతారు

నడివేసపు మిట్టమధ్యాన్నం అడవి ఆవులింతలా

ఉడుకుడుకు నిశ్శబ్దమై పెనవేసుకుపోతారు

తిప్పేసిన పేజీల్లోంచి తిరగదోడుకున్న పాటలపంక్తులై

రాగాలు దొరకని స్వరాల్లా జాలిచూపులు చూస్తుంటారు

ఒక్కోసారి- ఇంద్రధనుస్సు కూడా ఎరుగని

సిత్రచిత్రవర్ణాల్ని పోగేసుకొచ్చి

మనం పట్టనంతటి ముఖచిత్రమైపోతుంటారు


4

కొందరలాగే వెళ్లిపోతారు

చివరికలను ఎవరు చేదేసుకున్నారో

చివరినిద్రనెవరు కప్పేశారో

పొదుగు కట్టిన పొత్తిళ్లలోంచి

ఆఖరి నిశ్వాసను గాలికెవరు రాసిచ్చేశారో

చెప్పేవారెవరూ ఉండరు

కానీ, ఏ దీపస్తంభాలకోనలో

ఏ చివరికుటీరం కౌగిళ్ళు విప్పకుంటుందో మరి

వాళ్లు ఒక్కో ఆకాశాన్ని గెలుచుకుంటూపోతుంటారు

ఆ గుప్పెడు చెలమల్ని దాటించే దొప్పల కోసం

మనం చెట్టూపుట్టాపట్టి, మెరుపులుడిగిన జ్ఞాపకాల్ని

జీవహరితం మీంచి ఒలుచుకుంటూ పోతుంటాం

5

కొందరలాగే వెళ్ళిపోతుంటారు

ఎంతకీ ఎత్తి అవతలకు పారబోయలేని

నదిలా మనలో నిండిపోతుంటారు

ఉండుండి పంటకాలువలై సన్నగా పారుతూ

మనకాలాలకిన్ని వరికంకుల్ని కట్టిపోతుంటారు

పోతూ పోతూ వెనక్కి చూసి-

ఎంతెంత కేరింతల్లో పండినా

మనమెంత పేదలమో

ఎన్ని యుద్ధాల్ని దాటుకుంటూ ప్రవహిస్తున్నా

ఎంతటి పరాజితులమో

చెప్పే ఓ నవ్వు రువ్విపోతారు

6

కొందరలాగే వెళ్ళిపోతారు

వాళ్ళు మనమేనాడు చేతుల్లోకి తీసుకోని పుస్తకాలైనా

కొత్త ఇతిహాసాల్లో ఇమడ్చడానికి

పంచభూతాలు పల్లకీ ఎక్కించుకెళుతుంటే

మహావాక్యాల్లా, మనం పోగొట్టుకున్న

మహానిర్వచనాల్లా రాజసాలు పోతుంటారు

ఉన్నట్టుండి తెగిపోయిన సముద్రాలకు

కెరటాలను కుట్టుకుంటూ మనం..

వాళ్ళకోసం చివరిసారి పట్టినట్టే

నిత్యప్రవాహల్ని కాచుకోవడానికి

భుజాలు పదును పెట్టుకుంటుంటాం


7

కొందరలాగే వెళ్ళిపోతారు

మన వెన్ను చుట్టూ వాడిపోయిన

మరువపుదండల్లా మిగిలిపోతారు

వాళ్ళూ జీవితాన్ని ఇష్టపడ్డవాళ్లే కనుక

తమ నీడలన్నిటినీ శుభ్రంగా చిమ్మేసి

మన వాకిళ్ళను మనకిచ్చేసిపోతారు

యార్లగడ్డ రాఘవేంద్ర రావు

77309 21820

Updated Date - May 20 , 2024 | 03:20 AM

Advertising
Advertising