ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కొండవీరుల చిందు

ABN, Publish Date - Sep 16 , 2024 | 04:45 AM

ఈ రోజు పొలంలో కొన్ని పక్షులు వాలాయి నల్లమల చివరి దాపులో ఉండే మా ఊళ్లలో ఏనాడూ అవి కనిపించింది లేదు వాటినే చూస్తున్న నన్ను పారతో కాలవ చెక్కుతున్న...

ఈ రోజు పొలంలో కొన్ని పక్షులు వాలాయి

నల్లమల చివరి దాపులో ఉండే మా ఊళ్లలో

ఏనాడూ అవి కనిపించింది లేదు

వాటినే చూస్తున్న నన్ను

పారతో కాలవ చెక్కుతున్న మా నాన్న

‘‘పెందలాడే పని అయిపుచ్చుకొని పోవా’’ అన్నాడు.

వాటి రెక్కల మీద మబ్బులు తేలుతూ ఉన్నాయి.

మా నాన్న మాటలు వినకుండా వాటివైపు వెళ్ళాను

‘‘ఎక్కణ్నుంచి వస్తున్నారని’’ ఆరా తీశాను.

ఎవరో తమ గూళ్ళలో కత్తులూ, తుపాకులూ ఉంచారని

అవి వాటిని వేటాడుతున్నాయని చెప్పాయి.

ఆ చోటుని వదిలి కొండలు వెతుకుతూ ఇక్కడికొచ్చామన్నాయి

కానీ కొద్దిమందే మిగాలాయంటా.

‘‘మీ గూళ్లలో ఎవరు వాటిని ఉంచారు?’’

‘‘మేం ఆ కొండలు పుట్టినప్పుడు పుట్టాం

ఆ కొండలు పెరుగుతుంటే వాటితోపాటూ

ఆటలాడుతూ పెరిగాం.

ఆ మధ్య తట్టున కొండల్లోనే మా నివాసం ఉండేది.

మా చోటుని ఎవరో ఆక్రమించుకుంటుంటే

కాపలాగా మా రెక్కలపై ఈ మబ్బులు వచ్చాయి.

ఈ మబ్బులను తొలగించాలని

ప్రభుత్వం అనేవాళ్ళు వెంటాడారు.

మా పూర్వీకమైన కొండలు

చెల్లాచెదురు దేహాలుగా విరిగిపోయాయి.

మేమంతా వాటికోసం ఏడ్చాం.

కొన్ని నెలలపాటు మేం అలుపులేకుండా

ఎగురుతూ ఏడుస్తూ ఉంటే

మాపై కత్తులూ, తుపాకులూ వచ్చి పడి

చాలా మందిమి చనిపోయాం.

అయినా మా కన్నీళ్లు కొండల్ని బతికిస్తాయని నమ్మాం.

మిగిలిన కొద్దిమందిమి వేరైపోయాం

ఎప్పటికైనా అవి బతికి చిగురేస్తే అక్కడికి వెళ్తాం.’’

అవి కన్నీళ్లు కారుస్తుంటే,

మా ఊరి చుట్టూ ఉన్న కొండలు రోదించాయి.

‘‘మేం మీతోపాటు ఆ అడవుల్లోకి వస్తాం’’ అన్నాయి.

కొండలన్నీ ఏకమైనట్టు చుట్టూ మబ్బులు కమ్ముకున్నాయి.

ఆ పక్షులు అందులో తడుస్తూ

‘‘కొండల్ని మింగేవాడి కోరపళ్ళు లాగుతాం

అడవుల్ని నలిపేవాడి చేతుల్ని పెరుకుతాం

మా పూర్వీకుల కొండలపై మళ్లీ మా గూళ్ళను కట్టుతాం

మా కన్నీళ్లు చిగురిస్తాయి

మా కన్నీళ్లు రాళ్లవుతాయి

మా కన్నీళ్లు అడివవుతుంది

తుపాకులనూ, కత్తులనూ మా కొండలు నుజ్జుచేస్తాయి

మేం అడివి లేత ఆకుల మీద వాలి

ఈ పాటలు వినిపిస్తాం

సెలయేరుల మీద ఎగిరి ఈ పాటలను వల్లిస్తాం

మా కన్నీళ్లు చిగురిస్తాయి

మా అడవులు కొండల్ని కంటాయి’’ అని పాడుతుంటే

మా కొండలన్నీ మెరుపుల్నీ ఉరుముల్నీ

బల్లెములుగా, ఈటెలుగా పట్టుకొని చిందాడాయి.

‘‘వాన పడుతుంది. పోదాం’’

అని మా నాన్న ఇంటికి తీసుకొచ్చాక కూడా

రాత్రంతా ఆ పాట వినిపిస్తూనే ఉంది

కొండలు చిందాడుతూనే ఉన్నాయి.

గూండ్ల వెంకట నారాయణ

70325 53063

Updated Date - Sep 16 , 2024 | 04:45 AM

Advertising
Advertising