జగన్ అండతో కేసీఆర్ స్కెచ్!
ABN, Publish Date - Apr 28 , 2024 | 12:45 AM
అధికారంలో ఉన్నప్పుడు నియంతలుగా ప్రవర్తిస్తూ కనుసైగతో రాజకీయాలను శాసించగలం అని విర్రవీగిన రాజకీయ నాయకులకు ఎన్నికల్లో ఓడిపోగానే ప్రజాస్వామ్య విలువలు, హక్కులు గుర్తుకొస్తాయి...
అధికారంలో ఉన్నప్పుడు నియంతలుగా ప్రవర్తిస్తూ కనుసైగతో రాజకీయాలను శాసించగలం అని విర్రవీగిన రాజకీయ నాయకులకు ఎన్నికల్లో ఓడిపోగానే ప్రజాస్వామ్య విలువలు, హక్కులు గుర్తుకొస్తాయి. ఆత్మవిశ్వాసం వేరు, అహంకారం వేరు అని అధికారంలో ఉన్నప్పుడు గుర్తించరు. తమకు ఎదురే ఉండదని భావించడం అహంకారం అవుతుంది. సవాళ్లు ఎదురైనా వాటిని అధిగమించగలనని భావించడం ఆత్మవిశ్వాసం అవుతుంది. తనకు సవాళ్లే ఎదురుకావని అనుకోవడం అహంకారం అవుతుంది. ఇందుకు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చక్కటి ఉదాహరణ. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎలా ప్రవర్తించారో మనం చూశాం. ఇప్పుడు అధికారం కోల్పోయాక కొంచెం కొంచెంగా తత్వం బోధపడుతోంది. మీడియా అవసరాన్ని కూడా గుర్తించారు. ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం మీడియా ప్రతినిధులు ప్రశ్నలు వేయాలనుకుంటే కసురుకునేవారు. తెలంగాణ వ్యతిరేకులుగా ముద్ర వేసేవారు. ప్రభుత్వ వ్యతిరేక వార్తలను ప్రచురించిన పత్రికలలో పనిచేసే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వబోనని ప్రకటించే వరకు వెళ్లారు. ఇది గతం. ఇప్పుడు కేసీఆర్ పనిగట్టుకొని టీవీ చానళ్లలో కూర్చొని గంటల తరబడి మాట్లాడాల్సిన పరిస్థితి. అంతమాత్రాన కేసీఆర్‌లో మార్పు వచ్చిందని, ఆయనలో అహంకారం పోయిందని భావించడానికి లేదు. అధికారంలో ఉన్నప్పుడు మీడియాను అణగదొక్కే ప్రయత్నం చేసిన కేసీఆర్‌కు, ఇప్పుడు కూడా తత్వం బోధపడలేదు. ప్రభుత్వ చర్యలను విమర్శించడం, ప్రశ్నించడమే తెలంగాణ ద్రోహం అన్నట్టుగా విరుచుకుపడిన ఆ పెద్ద మనిషి ఇప్పుడు కాకా మీడియా, బాకా మీడియా అంటూ మీడియాను నిందించే దుస్సాహసానికి పాల్పడ్డారు. ఎన్నికల్లో తాను ఎందుకు ఓడిపోయానో గుర్తించడానికి కేసీఆర్ నిరాకరిస్తున్నట్టుగా ఉంది. ఓటమికి తానే బాధ్యుడినని తెలుసుకోకపోవడం అహంభావమే అవుతుంది. తాను అధికారం నుంచి తప్పుకొన్న ఈ ఐదు నెలల్లోనే తెలంగాణ గోస పడుతోందని, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, తన పాలన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని కేసీఆర్ భ్రమిస్తున్నారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన పార్టీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయలేకపోతే ప్రజలు మళ్లీ కేసీఆర్‌నే ఆదరించవచ్చు. అయితే అందుకు ఎన్నికలు జరిగే వరకు వేచిచూడాలి. కానీ కేసీఆర్‌కు అంత ఓపిక ఉన్నట్టు లేదు.
తెలంగాణ రాష్ర్టాన్ని తాను మాత్రమే ముఖ్యమంత్రిగా పాలించగలనని, మిగతావాళ్లు ముఖ్యమంత్రులుగా పనికిరారని కేసీఆర్ ఇప్పటికీ భావించడం విడ్డూరంగా ఉంది. ఎత్తులు, కుయుక్తులతో త్వరలోనే తాను మళ్లీ అధికారంలోకి వస్తానని కేసీఆర్ భావిస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి తనకు అండగా ఉంటూ వచ్చిన సీమాంధ్ర ఓటర్లలో అత్యధికులను గత ఎన్నికల్లో నోటి దురుసుతనంతో కేసీఆర్ అండ్ కో దూరం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పరిస్థితుల గురించి తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు మళ్లీ చర్చనీయాంశం అయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తారని తమకు సమాచారం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణలో తాను ఓడిపోతున్న విషయమే తెలుసుకోలేకపోయిన కేసీఆర్.. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారని చెప్పడాన్ని సీరియస్‌గా తీసుకోవలసిన అవసరం లేదు. కాకపోతే ఈ వ్యాఖ్యల వల్ల లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ నష్టం జరుగుతుందని భారత రాష్ట్ర సమితి నాయకులు ఆందోళన చెందుతున్నారు.
అంత జరిగినా.. మళ్లీ జగన్‌తో!
గత ఎన్నికల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా కేసీఆర్ మళ్లీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ఎందుకు అంటకాగుతున్నారన్న సందేహం ఈ సందర్భంగా వస్తోంది. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారని కేసీఆర్ ఆషామాషీగా అనలేదని తెలుస్తోంది. అలా అని ఆంధ్రప్రదేశ్ పరిస్థితులపై కేసీఆర్‌కు సమాచారం ఉందని కూడా భావించలేం. మరి ఇంకెందుకు నోరు జారడం? అన్న ప్రశ్న వస్తోంది. ఇప్పుడు అధికారం కోల్పోయి ఉండవచ్చును గానీ, కేసీఆర్ అమాయకుడేమీ కాదు. తెర వెనుక ఏమి జరుగుతున్నదో ఆయనకు ఒక అంచనా ఉంది. వచ్చే ఎన్నికల వరకు వేచి చూడకుండా మధ్యలోనే తాను మళ్లీ అధికారంలోకి రావాలంటే జగన్మోహన్ రెడ్డి సహకారం అవసరమని ఆయన గుర్తించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చాలంటే జగన్ మద్దతు అవసరమని భావిస్తున్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్‌లో జగన్ మళ్లీ అధికారంలోకి రావాలని కేసీఆర్ గట్టిగా కోరుకుంటున్నారు. ఏపీలో జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయితే తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు కూలిపోతుంది అంటారా? కేసీఆర్ లెక్కల ప్రకారం కూలిపోతుంది అంతే! రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కీలక శాఖలు నిర్వహిస్తున్న ఒక మంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌కు అత్యంత సన్నిహితుడు అని అందరికీ తెలిసిందే. జగన్‌రెడ్డి సహకారంతో ఆ మంత్రి ద్వారా కాంగ్రెస్ పార్టీలో చీలిక తీసుకువచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టి మళ్లీ తాను అధికారంలోకి రావాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ స్కెచ్ అమలవుతుందా? అంటే చెప్పలేం. జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తారో? రారో? ముందుగా తేలాలి. జగన్ ఓడిపోతే కేసీఆర్ కలలు కల్లలవుతాయి. ఒకవేళ జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చినా ఆయనకు సన్నిహితుడైన తెలంగాణ మంత్రి కాంగ్రెస్ పార్టీని చీల్చుతారో లేదో తెలియదు. ప్రభుత్వాన్ని పడగొట్టగలిగిన శక్తి ఆయనకు ఉందో లేదో కూడా తెలియదు.
అంత బలం ఉందనుకున్నా ఎన్నికల ముందు తనను అవమానించిన కేసీఆర్ పంచన చేరడం వల్ల సదరు మంత్రికి కలిగే అదనపు ప్రయోజనం ఏమిటి? అనే సందేహం ఉండనే ఉంది. కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడం కోసం ఆ మంత్రి రిస్కు తీసుకుంటారా? అన్నది కీలక ప్రశ్న. జగన్ మీద అభిమానంతో తన రాజకీయ భవిష్యత్తును ఆయన ప్రమాదంలోకి నెట్టుకుంటారని కూడా భావించలేం. కేసీఆర్ ఆలోచనల గురించి తెలిసిన తర్వాత నేను సేకరించిన సమాచారం ప్రకారం.. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టి కేసీఆర్‌ను మళ్లీ సీఎంను చేయాలన్న ఆలోచన ఆ మంత్రికి లేదు. కాంగ్రెస్ పార్టీలోనే తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని సదరు ప్రముఖుడు భావిస్తున్నారట. అయితే కేసీఆర్ మాత్రం గాలిలో మేడలు కడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని ఇటీవలి కాలంలో కేసీఆర్ తరచూ చెప్పుకోవడం ఈ స్కెచ్‌లో భాగమే. నిజానికి భారత రాష్ట్ర సమితికి చెందిన ఎమ్మెల్యేలే కాంగ్రెస్‌లో చేరడానికి క్యూ కడుతున్నారు. కొంతమంది లోక్‌సభ ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాలనుకుంటున్నారు. కేసీఆర్, జగన్ కలసి తెర వెనుక చేస్తున్న ఆలోచనల గురించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియక కాదు. తెలుసు కనుకే తన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్ర జరుగుతోందని ఆయన తాజాగా ఆరోపిస్తున్నారు. నిన్నటి వరకు ప్రభుత్వాన్ని టచ్ చేయగలరా? అని సవాలు విసురుతూ వచ్చిన రేవంత్ రెడ్డి.. ఇటీవల మాత్రం తన ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి కుట్ర జరుగుతోందని చెప్పడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారని కేసీఆర్ చెప్పడంలోని మర్మం తెలుసుకోలేనంత అమాయకుడేమీ కాదు రేవంత్ రెడ్డి. తెలంగాణ రాజకీయాలలో ఏమి జరుగుతుందో ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే ఉంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలను బట్టి తెలంగాణ రాజకీయాలలో స్పష్టత ఏర్పడుతుందా? లేదా? అన్నది తేలిపోతుంది. జాతీయ రాజకీయాలలో ప్రస్తుతానికి బలహీనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని మింగేయడానికి కేసీఆర్‌తో పాటు భారతీయ జనతా పార్టీ కూడా సహజంగానే ప్రయత్నిస్తుంది. కేంద్రంలో నరేంద్ర మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే ముందుగా హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాలను ఖతం చేస్తారు. తర్వాత తెలంగాణలో కూడా ప్రభుత్వాన్ని పడగొడతారని కేసీఆర్ చెబుతున్నారు.
అటు కేసీఆర్.. ఇటు బీజేపీ!
కేంద్రంలో మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏడాది తర్వాత పడగొడతామని తెలంగాణలో బీజేపీ ముఖ్యుడొకరు ఆంతరంగిక సంభాషణల్లో చెబుతున్నారు. మొత్తంగా చూస్తే రేవంత్ రెడ్డి పతనం కోసం ఇటు కేసీఆర్, అటు బీజేపీ నేతలు ఎదురుచూస్తున్నారు. తన మిత్రుడైన జగన్మోహన్ రెడ్డి సహకారంతో తానే మళ్లీ అధికారంలోకి రావాలని కేసీఆర్ లెక్కలు వేసుకుంటుండగా, ముందుగా భారత రాష్ట్ర సమితిని మింగేసి ఆ తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని బీజేపీ తలపోస్తోంది. ఈ నేపథ్యంలో మెజారిటీ లోక్‌సభ స్థానాలను గెలుచుకొని తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి ఏర్పడింది. ఈ కారణంగానే ఆయన సుడిగాలిని తలపించే విధంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. అంతా తానై ఎన్నికల ప్రచార భారాన్ని మోస్తున్నారు. తెలంగాణలో మెజారిటీ లోక్‌సభ స్థానాలను గెలుచుకోలేని పక్షంలో రేవంత్ రెడ్డి ఇబ్బందుల్లో పడతారు. సొంత పార్టీలో ముఖ్యమంత్రి పదవిపై పలువురు కన్నేసి ఉన్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలం పుంజుకోలేక పోయినా, భారతీయ జనతా పార్టీ బలం తగ్గకపోయినా కాంగ్రెస్ అధిష్ఠానానికి రాష్ట్ర పార్టీపై పట్టు సన్నగిల్లుతుంది. అదే జరిగితే కాంగ్రెస్‌లో కుమ్ములాటలు మొదలవుతాయి. ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు లభించని పక్షంలో ఎదురయ్యే పరిణామాల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా స్పష్టత ఉంది.
లోక్‌సభ ఎన్నికల్లో కనీసం రెండు మూడు స్థానాలను గెలుచుకోగలిగినా భారత రాష్ట్ర సమితి సురక్షితంగా ఉంటుంది. భారతీయ జనతా పార్టీకి మెజారిటీ స్థానాలు లభిస్తే మాత్రం తెలంగాణ రాజకీయాల్లో పెనుమార్పులు వచ్చే అవకాశం ఉంది. భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు భారతీయ జనతా పార్టీ వైపు చూసే అవకాశం ఉంది. కేసీఆర్ బదులు బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే తన వంతు సహాయ సహకారాలు అందించడానికి జగన్‌రెడ్డికి అభ్యంతరం ఉండదు. రాష్ట్రం విడిపోయినా రాజకీయాలు మాత్రం రెండు రాష్ర్టాల మధ్య ముడిపడి ఉన్నాయి. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉనికిలో లేకపోయినా ఆ పార్టీకి ఓట్లు మాత్రం ఉన్నాయి. 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోయాక రిటన్ గిఫ్ట్ ఇచ్చానని కేసీఆర్ ఎగతాళి చేశారు. అప్పటి నుంచి తెలుగుదేశం ఓటర్లు కేసీఆర్‌పై గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో గత ఏడాది చివరిలో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బరిలో దిగకుండా దూరంగా ఉండటం వల్ల కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా లాభించింది. ఒకరకంగా ఇది కేసీఆర్‌కు చంద్రబాబు ఇచ్చిన రిటన్ గిఫ్ట్. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవు అన్నట్టుగా రాజకీయాలే ప్రధాన వ్యాపకంగా ఉండే చంద్రబాబుకు, కేసీఆర్‌కు సహజంగానే పొసగదు. జగన్మోహన్ రెడ్డి ధోరణి వేరు. ఆయనకు తాను అధికారంలో ఉండటం అవసరం. ఆ క్రమంలో రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు. అందుకే అటు కేంద్రంతో గానీ, ఇటు తెలంగాణతో గానీ ఆయన పేచీ పెట్టుకోరు. కేసీఆర్ వంటి వారికి కావాల్సింది కూడా ఇదే. తెలంగాణలో తెలుగుదేశం అభిమానులు ప్రస్తుతానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మద్దతుగా ఉన్నారు. అందుకే కేసీఆర్‌కు చంద్రబాబుపైన, రేవంత్ రెడ్డిపైన కోపం. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు అధికారంలోకి వస్తే తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పరోక్ష మద్దతు లభిస్తుంది. ఇలా జరగడం సహజంగానే కేసీఆర్‌కు నచ్చదు. అందుకే జగన్‌రెడ్డి మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకోవడంతో పాటు ఆయన సహకారంతో రేవంత్ ప్రభుత్వాన్ని పడగొట్టి తాను మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కేసీఆర్ తలపోస్తున్నారు. ఇందుకోసం కుట్రలు, కుయుక్తులకు తెర తీస్తున్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలనూ చీల్చి చెండాడిన కేసీఆర్ ఇప్పుడు తన పార్టీకి చెందిన ఇద్దరు ముగ్గురు శాసనసభ్యులను కాంగ్రెస్ పార్టీ చేర్చుకోవడంతో పెడబొబ్బలు పెడుతున్నారు. అన్యాయం, అక్రమం అని ఆక్రోశిస్తున్నారు. ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి రావడం కేసీఆర్‌కు కష్టంగా ఉన్నట్టుంది. అందుకే ఎలాగైనా, వీలైనంత తొందరగా మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. అయితే తన పతనం కోసం అన్ని వైపుల నుంచి సవాళ్లు కాచుకొని ఉన్న తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయో వేచి చూడాలి. లోక్‌సభ ఎన్నికల్లో గెలవడమే ప్రస్తుతానికి ఆయనకు శ్రీరామరక్ష. భారతీయ జనతా పార్టీపై పైచేయి సాధించగలిగితే ఎన్నికల ఫలితాల తర్వాత రేవంత్ రెడ్డి మరింత బలపడతారు. అదే జరిగితే ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌రెడ్డి మళ్లీ అధికారంలోకి వచ్చినా కేసీఆర్‌కు ఉపయోగపడలేరు. కాంగ్రెస్ పార్టీని చీల్చే విషయం అటుంచితే భారత రాష్ట్ర సమితిని ఖాళీ చేయడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నించకుండా ఉంటారా? ఆ పరిస్థితి ఏర్పడితే ముఖ్యమంత్రి అవడం అటుంచితే ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా కేసీఆర్‌కు పోతుంది. తాడిని తన్నేవాడు ఒకడుంటే వాడి తలను తన్నేవాడు ఉంటాడు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అత్యంత శక్తిమంతులు. అధికారంలో ఉన్నప్పుడు కొంత మంది తమకు తిరుగుండదని విర్రవీగుతారు. అలాంటి వారికి ప్రజలే వారి స్థానాన్ని గుర్తుచేస్తుంటారు. కేసీఆర్‌ను కూడా నెత్తిన పెట్టుకున్నదీ, విసిరి కొట్టిందీ ప్రజలే. తన ప్రస్తుత దుస్థితికి ఆత్మపరిశీలన చేసుకోకుండా ప్రజలు అత్యాశకు పోయారని నిందించడం ద్వారా కేసీఆర్ ఆత్మవంచనకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే అడ్డదారిలో మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు ప్రవచనాలు చెప్పే ప్రయత్నం చేసే బదులు కోల్పోయిన ప్రజా విశ్వాసాన్ని తిరిగి పొందడానికి కేసీఆర్ ప్రయత్నిస్తే ఆయనకే మంచిది. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి వంటి వారిని నమ్ముకొని గాలిలో మేడలు కట్టడం అవివేకం అవుతుంది. మబ్బులు చూసి ముంతలోని నీళ్లు వొలబోసుకున్నట్టుగా జగన్‌రెడ్డిని చూసి కేసీఆర్ ఇప్పటికే కొన్ని వర్గాలను దూరం చేసుకున్నారు. ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు తీసుకోని పక్షంలో తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ అధ్యాయం చరిత్ర పుటలకే పరిమితమవుతుంది.
అంతఃపుర రహస్యాలు!
ఇప్పుడు ఇడుపులపాయ అంతఃపుర రహస్యాల గురించి మాట్లాడుకుందాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి– పీసీసీ అధ్యక్షురాలు షర్మిల రాజకీయ రణక్షేత్రంలో ఎదురెదురుగా మోహరించడంతో ఇడుపులపాయ అంతఃపుర రహస్యాలు వెలుగులోకి వస్తున్నాయి. అగ్నికి ఆజ్యం పోసినట్టుగా దారుణ హత్యకు గురైన వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీత కూడా షర్మిలకు తోడయ్యారు. దీంతో జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం ప్రజలకు వివరంగా తెలుస్తోంది. నామినేషన్ దాఖలు సందర్భంగా జగన్‌రెడ్డి మాట్లాడుతూ తన రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబుతో తన చెల్లెమ్మలు చేతులు కలిపారని, అలాంటి వారు రాజశేఖర రెడ్డి వారసులు ఎలా అవుతారని విమర్శించారు. ఇందుకు షర్మిల, సునీత కూడా దీటుగా స్పందించారు. తన కుమారుడి వివాహానికి ఆహ్వానించడం కోసం చంద్రబాబు వద్దకు పసుపు చీర కట్టుకొని షర్మిల వెళ్లిందని జగన్ నిందించగా, సొంత చెల్లి దుస్తులపై విమర్శలు చేయడానికి సిగ్గు లేదా అని షర్మిల బదులిచ్చారు. పనిలో పనిగా అవినీతి కేసులలో వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును సీబీఐ చేర్చడానికి జగనే కారణమని షర్మిల మరో అంతఃపుర రహస్యాన్ని బయటపెట్టారు. అవినాశ్ రెడ్డి చిన్నపిల్లాడు అని జగన్మోహన్ రెడ్డి సంబోధించడాన్ని డాక్టర్ సునీత ప్రశ్నిస్తూ, చిన్న పిల్లాడైతే స్కూలుకు పంపాలి గానీ పార్లమెంటుకు పంపాలనుకోవడం ఏమిటి? అని ప్రశ్నించారు. పనిలో పనిగా తన సోదరుడైన జగన్‌కు ఒక డాక్టర్‌గా ఆమె ఒక సలహా ఇచ్చారు. గులకరాయి తగిలినందుకే రెండు వారాలుగా కంటి పైభాగాన బ్యాండేజ్ వేసుకోవడాన్ని డాక్టర్‌గా ఆమె తప్పుబట్టారు. బ్యాండేజ్ తీసెయ్యకపోతే గాయానికి చీము పడుతుందని, అది తీసేస్తే గాలి తగిలి గాయం త్వరగా మానిపోతుందని డాక్టర్ సునీత సలహా ఇచ్చారు. నిజానికి తనకు తగిలిన చిన్న గాయానికి జగన్‌రెడ్డి రెండు వారాలుగా బ్యాండేజ్ తీయకుండా వేసుకోవడం చూసే వారికి కూడా రోతగా ఉంది. జగన్‌రెడ్డిని గుడ్డిగా సమర్థించే పేటీఎం బ్యాచ్‌కు కూడా బ్యాండేజ్ వ్యవహారాన్ని సమర్థించడం ఇబ్బందిగా మారింది.
కోడి కత్తిలా గులకరాయి ఉపయోగపడకపోగా ప్రజలు కూడా జగన్‌ను ఎగతాళి చేస్తున్నారు. చిన్నాన్న వివేకానంద రెడ్డిని గొడ్డళ్లతో నరికి చంపితే గుండెపోటుతో చనిపోయారని ప్రచారం చేయించిన జగన్మోహన్ రెడ్డి.. తనకు చిన్న గాయమైతేనే హత్యాయత్నం చేశారని కేసు ఎలా కట్టించారో చెప్పాలని షర్మిల ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి జగన్‌రెడ్డి శనివారం బ్యాండేజ్ లేకుండా దర్శనమిచ్చారు. తనపై హత్యాయత్నం జరిగిందని ప్రచారం చేసుకొని లబ్ధిపొందాలని అనుకున్నారు గానీ.. శనివారంనాడు ఆయనను చూస్తే కుట్ల గురించి దేవుడెరుగు, గాయం తాలూకు ఆనవాళ్లు కూడా కనిపించలేదు. ఇంటి గుట్టు లంకకు చేటు అంటారు. రక్తం పంచుకు పుట్టిన వారి మధ్య మొదలైన పోరుతో ఇడుపులపాయ కోట బీటలు వారుతోంది. ప్రస్తుత రొచ్చు నుంచి తప్పించుకోవడానికి తల్లి విజయలక్ష్మి అమెరికా వెళ్లిపోయి విశ్రాంతి తీసుకుంటున్నారు. పోలింగ్‌కు ఇంకో పదిహేను రోజుల వ్యవధి ఉంది. ఈలోపు ఇంకెన్ని అంతఃపుర రహస్యాలు వెలుగులోకి వస్తాయో వేచి చూడాలి. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ముఖ్యంగా తనను సమర్థించే వాళ్లు వెర్రి వెంగళప్పలని జగన్మోహన్ రెడ్డి బలంగా నమ్ముతున్నారు. నీతి, నిజాయితీల గురించి పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారు. డజనుకు పైగా అవినీతి కేసులలో నిందితుడిగా ఉండి కూడా అవినీతికి ఆస్కారం లేని పాలన అందించానని చెప్పుకొనే దుస్సాహసానికి పాల్పడుతున్నారు. అన్నాచెల్లెళ్ల మధ్య సాగుతున్న మాటల యుద్ధంలో ప్రజలు ఎవరి మాటలను నమ్ముతారో తెలియాలంటే జూన్ 4వ తేదీ వరకు వేచి చూడవలసిందే. అడ్డదారిలో అధికారంలోకి రావాలనుకుంటున్న కేసీఆర్ ఆశలపై జగన్‌రెడ్డి అండ్ కో నీళ్లు చల్లుతారా? లేక ఆ ఆశలు చిగురింపజేస్తారా? న్యాయం కోసం పోరాడుతున్న డాక్టర్ సునీతకు ప్రజల నైతిక మద్దతు లభిస్తుందా? లేదా? వంటి ప్రశ్నలకు సమాధానం లభించాలంటే ఓట్ల లెక్కింపు వరకు వేచి ఉండక తప్పదు!
ఆర్కే
Updated Date - Apr 28 , 2024 | 12:45 AM