అనుభవజ్ఞుడికి అగ్నిపరీక్ష!
ABN, Publish Date - Oct 12 , 2024 | 02:43 AM
విచిత్ర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. గతంలో ఆయనకు పాలనా అనుభవం లేదా... అంటే తన రాజకీయ జీవితంలో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 15 ఏళ్లు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన అనుభవం ఆయన సొంతం. ఈ రికార్డును ఎవరూ...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచిత్ర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. గతంలో ఆయనకు పాలనా అనుభవం లేదా... అంటే తన రాజకీయ జీవితంలో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 15 ఏళ్లు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన అనుభవం ఆయన సొంతం. ఈ రికార్డును ఎవరూ చెరిపివేయలేరు. ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా, పదేళ్లు ప్రతిపక్ష నాయకుడిగా పని చేసిన ఖ్యాతి ఆయనకు మాత్రమే దక్కింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోని కూటమికి గతంలో ఎన్నడూ లభించనన్ని సీట్లు లభించాయి. ఆడుతూ పాడుతూ ప్రభుత్వాన్ని నడపవలసిన తరుణంలో కూడా మునుపు ఎన్నడూ ఎదురుకాని సవాళ్లు చంద్రబాబుకు ఎందుకు ఎదురవుతున్నాయి? ఇందుకు ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఇందులో మొదటిది జగన్ రెడ్డి కాగా, రెండోది తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు! ఐదేళ్ల పాటు రాష్ర్టాన్ని పాలించిన జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన మోడల్ కారణంగా చంద్రబాబు సరికొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోంది. గత ఐదేళ్లలో జగన్ హయాంలో అష్టకష్టాలు పడిన తెలుగుదేశం అభిమానులు కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై అతిగా స్పందిస్తున్నారు. దీంతో చిన్నాచితకా విషయాలలో కూడా చంద్రబాబు ఆచితూచి వ్యవహరించాల్సి వస్తోంది. ఫలితంగా పాలనలో తప్పటడుగులు పడటంతోపాటు వేగం మందగించింది. జగన్ రెడ్డి అనుసరించిన మోడల్ నుంచి ప్రభుత్వ యంత్రాంగాన్ని బయటకు తీసుకురావడానికి తిప్పలు పడాల్సి వస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియా వేదికగా తెలుగుదేశం అభిమానులు ప్రతిపక్షాన్ని మించి విమర్శలు చేస్తూ ప్రభుత్వాన్ని కలవరపెడుతున్నారు. తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడానికి ఎవరికి వారు తామే కారణమని, తాము కష్టనష్టాలకు ఓర్చి నిలబడటం వల్లనే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారని చెప్పుకుంటూ, వైసీపీ హయాంలో తమను ఇబ్బందుల పాలు చేసిన వారిపై చర్యలు తీసుకోవడానికి ఇప్పుడు ఆయన జంకడం ఏమిటని సోషల్ మీడియాలో ఎడా పెడా పోస్టులు పెడుతున్నారు. ప్రభుత్వంలో ఒక చిన్న బదిలీ జరిగినా ఫలానా వాడిని ఫలానా పోస్టులో ఎలా నియమిస్తారంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. చంద్రబాబు, ఆయన కుమారుడికి పదవులు లభిస్తే చాలా? మా ఆకాంక్షల సంగతేమిటి? అని నిలదీస్తున్నారు. తెలుగు తమ్ముళ్ల ఆవేదనలో హేతుబద్ధత ఉంటే ఉండవచ్చునుగానీ వారి ఆవేశం మాత్రం హద్దులు దాటుతోంది. మరోవైపు, జగన్ రెడ్డి హయాంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు రాష్ట్రం మీద పడి దోచుకోవడం ప్రస్తుతం కూటమి ఎమ్మెల్యేలకు ఆదర్శంగా మారడం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుకు తలనొప్పులు తెస్తున్నది.
ఆదాయం.. అరాచకం...
జగన్ రెడ్డి అనుసరించిన విధానం వెరీ సింపుల్! ఇసుక, మద్యం, గనులు వంటి వాటిని తన సొంత ఆదాయ వనరులుగా మార్చుకున్నారు. తనకు ప్రతి నెలా ఆదాయం తెస్తున్న రంగాలలో ఎమ్మెల్యేలు కాదు కదా, మరెవరినీ ఆయన వేలు పెట్టనిచ్చే వారు కాదు. దీంతో వాటివైపు చూడ్డానికి కూడా ఎమ్మెల్యేలు సాహసించేవారు కాదు. అలా అని జగన్ హయాంలో ఎమ్మెల్యేలు సంపాదించుకోలేదా? అంటే సంపాదించుకున్నారు. తాను ఎంపిక చేసుకున్న ఇసుక, మద్యం, గనులు వంటివి మినహాయించి మిగతా వ్యవహారాల్లో ఎమ్మెల్యేలు ఎంత దోచుకున్నా, ఎంత విచ్చలవిడిగా వ్యవహరించినా జగన్ రెడ్డి పట్టించుకోలేదు. ‘నేను హ్యాపీగా ఉంటాను. మీరూ హ్యాపీగా ఉండండి. ప్రభుత్వ సంపద అంటే మన సంపదే’ అన్న ఫార్ములాను ఆయన అమలు చేశారు. మరోవైపు ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసేందుకు గ్రామ స్థాయి కార్యకర్త నుంచి పార్టీ అధినేత చంద్రబాబు వరకు అందరినీ టార్గెట్ చేసుకొని పోలీసులను ప్రయోగించి వేధించారు. ప్రజలలో అశాంతి తలెత్తకుండా ఉండేందుకు సంక్షేమం పేరిట బటన్లు నొక్కే కార్యక్రమాన్ని ఆరంభించారు. తన ఆలోచనలను, వ్యూహాలను అమలు చేసేందుకు ఎంపిక చేసుకున్న అధికారులను కీలక స్థానాల్లో నియమించుకున్నారు. దీంతో జగన్ మాటే శాసనంగా పాలన సాగింది. కంటి చూపుతో చేయాల్సినవి చేశారు, చేయించుకున్నారు. జగన్ రెడ్డికి వ్యక్తిగత ఆదాయం తెచ్చి పెట్టడానికి ఉపయోగపడిన గనుల శాఖ డైరెక్టర్‌గా వెంకటరెడ్డిని, ఎక్సైజ్ శాఖలో వాసుదేవ రెడ్డిని నియమించుకున్నారు. ప్రత్యర్థులను వేధించడంకోసం పీఎస్‌ఆర్ ఆంజనేయులు, సునీల్ కుమార్, సంజయ్ వంటి ఐపీఎస్ అధికారులను నియమించుకున్నారు. బటన్ నొక్కుడు కార్యక్రమం సాఫీగా జరగడంకోసం డిప్యూటేషన్‌పై రాష్ర్టానికి వచ్చిన సత్యనారాయణకు సర్వాధికారాలు కట్టబెట్టారు. జగన్ రెడ్డి పాలనలో అధికారులు ‘ఎస్ బాస్’లుగా ఎలా వ్యవహరించారు? రూల్ ఆఫ్ లా గురించి ఎందుకు పట్టించుకోలేదు? అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని ప్రశ్నించగా, ‘మా పాత్ర ఏముంది? జగన్ ప్రభుత్వంలో ఏడెనిమిది మంది అధికారులే కీలకంగా ఉండేవారు. మిగతా వాళ్లకు ఏమీ పని ఉండేది కాదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సైతం ఉత్సవ విగ్రహంగా మార్చివేశారు’ అని ఆయన బదులిచ్చారు. నిజమే! ఎంపిక చేసుకున్న శాఖలు మినహా మిగతా శాఖల గురించి జగన్ రెడ్డి ఒక్క రోజు కూడా పట్టించుకోలేదు. సమీక్షలు నిర్వహించలేదు. ఓట్లు, నోట్లు తెచ్చిపెట్టే శాఖలపైనే ఆయన దృష్టి ఉండేది.
పద్ధతి తప్పని చంద్రబాబు..
జగన్ రెడ్డి మోడల్ కారణంగా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం గాడి తప్పింది. భయం గుప్పిట్లోకి వెళ్లిపోయింది. పోలీసు శాఖలో కూడా ఇదే పరిస్థితి. బటన్లు నొక్కడానికి మాత్రమే అయితే ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎందుకు? అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమయ్యాయి. విచిత్రం ఏమిటంటే ఇప్పుడు కూటమికి చెందిన ఎమ్మెల్యేలు, కార్యకర్తలు జగన్ రెడ్డి పాలనే ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడే కాదు గతంలో ఎన్నడూ పద్ధతీ పాడూ లేకుండా వ్యవహరించలేదు. ‘నన్ను చాలా మంది పిరికివాడు అని అనుకుంటారుగానీ నేను పిరికివాడిని కాదు. ఒక నిర్ణయం తీసుకోబోయే ముందు అన్ని కోణాల్లో ఆలోచిస్తాను. జాగ్రత్తగా అడుగులు వేస్తాను. ఎవరైనా ఏమన్నా అంటారన్న వెరపు కూడా నాలో ఉంటుంది. అంత మాత్రాన పిరికివాడు అంటే ఎలా?’ అని ఒక సందర్భంలో చంద్రబాబు నాతో అన్నారు. ఈ మాటల్లో నిజం లేకపోలేదు. జగన్ రెడ్డిలా చంద్రబాబు విచ్చలవిడిగా వ్యవహరించలేరు. అధికారులతో కూడా కటువుగా ఉండలేరు. పార్టీ సహచరుల వద్ద కూడా ఆయనకు మొహమాటం ఉంటుంది. అయితే, ఇప్పుడు సొంత పార్టీ అభిమానుల నుంచే ఆయన ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారు. ‘ఇలా అయితే ఎలా? మీకు చేత కాదా? మీరు ఇంతేనా?’ వంటి ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు.
ప్రజల మేలు కోసం...
ఇసుక, మద్యం, గనులు వంటి వాటిని సొంత ఆదాయ వనరులుగా మార్చుకోకూడదని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఇది కూడా ఆయనకు సమస్యలు తెచ్చిపెడుతోంది. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఇసుకను ఉచితంగా సరఫరా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఆచరణలో ఎదురయ్యే ఇబ్బందులను ఆయన పరిగణనలోకి తీసుకోలేదు. ఇసుక రీచ్‌ల నిర్వహణతో పాటు రవాణా ఖర్చులవంటివి ఉంటాయి. వాటి గురించి ఆలోచించకుండా ‘ఉచితం’ అనే పదం వాడటం విమర్శలకు తావిచ్చింది. అన్నింటికీ మించి ఎమ్మెల్యేల జోక్యం గురించి విస్మరించారు. 2019కి ముందు కూడా ఎమ్మెల్యేల జోక్యం కారణంగా ఉచిత ఇసుక పాలసీ అభాసుపాలైంది. ఇసుక నుంచి ప్రతి నెలా తనకు క్రమం తప్పకుండా ఆదాయం వస్తున్నందున ఇసుక రీచ్‌లలో ఎమ్మెల్యేలు వేలు పెట్టకుండా జగన్ రెడ్డి కట్టడి చేశారు. చంద్రబాబు అంతే కటువుగా ఎమ్మెల్యేలను కట్టడి చేయలేకపోతున్నారు. ఈ కారణంగా ఇసుక రీచ్‌లలో ఎమ్మెల్యేల ప్రమేయం పెరిగిపోయి ఉచిత ఇసుక విధానంపై విమర్శలు మొదలయ్యాయి. గత ప్రభుత్వంలో కంటే ఇసుక ధర అధికంగా ఉంటోందని సోషల్ మీడియా వేదికగా తెలుగుదేశం అభిమానులే విమర్శలు చేస్తున్నారు. ఇసుక ధర ఆకాశాన్నంటినా జగన్ రెడ్డి నిర్ణయాలను ఆయన అభిమానులుగానీ, సోషల్ మీడియా కార్యకర్తలుగానీ విమర్శించే వారు కాదు. ఈ నేపథ్యంలో ఉచిత ఇసుక విధానాన్ని సమీక్షించాల్సిన అవసరం ఏర్పడుతోంది. తెలుగుదేశం కార్యకర్తల ఆలోచనలు ఒక రకంగా ఉంటే ఎమ్మెల్యేల పోకడలు అందుకు భిన్నంగా ఉంటున్నాయి. ఈ కారణంగానే ప్రభుత్వంలో చిన్న తప్పిదం జరిగినా కార్యకర్తలు సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. పార్టీ కోసం అష్టకష్టాలు అనుభవించిన తమ ఆకాంక్షలను పట్టించుకోకపోతే ఎలా? అని వారు నిలదీస్తున్నారు. 2014–19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన వారు జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే కలుగుల్లోకి పారిపోయారని, పార్టీ జెండా మోసింది తామేనని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వేదనలో హేతుబద్ధత ఉంది. ఇప్పుడు కూటమి తరఫున, ముఖ్యంగా తెలుగుదేశం తరఫున ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు ఆదాయ మార్గాల అన్వేషణలో తలమునకలై ఉన్నారు. ఈ క్రమంలో వైసీపీకి చెందిన వారితో చేతులు కలపడానికి కూడా కొంతమంది వెనుకాడటం లేదు.
నాడూ, నేడూ.. అధికారుల తీరు!
గతంలో ఇసుక విక్రయాల్లో ఎన్నో రకాల అవకతవకలు జరిగినా అధికారులు పట్టించుకోలేదు. గ్రీన్ ట్రైబ్యునల్, సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ఖాతరు చేసే వారు కాదు. అలాంటిది, ఇప్పుడు ఇసుక రీచ్‌లను గనుల శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించడానికి కూడా కొంత మంది జిల్లా కలెక్టర్లు ఫైల్‌పై సంతకం చేయడంలేదు. జగన్ రెడ్డి హయాంలో విచ్చలవిడిగా వ్యవహరించిన అధికారులు ఇప్పుడు ఇబ్బందిపడుతున్నందున... తమకు అలాంటి పరిస్థితి ఎదురుకాకూడదని సేఫ్ గేమ్ ప్లే చేస్తున్నారు. ప్రభుత్వాలు మారినప్పుడు గత ప్రభుత్వ నిర్ణయాలపై విచారణలకు ఆదేశించడం వల్ల ఇటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. అందుకే పాత నిర్ణయాలకు సమీక్షించే విషయంలో చంద్రబాబు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. పాలనలో ఎదురయ్యే ఇబ్బందుల గురించి తెలియని తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వానికి, చంద్రబాబు ప్రభుత్వానికి మధ్య మౌలికమైన తేడాలు అనేకం ఉన్నాయి. ఉదాహరణకు ఫలానా తేదీ నాటికి ఫలానా పథకానికి బటన్ నొక్కడానికి నిధులు కావాలని జగన్ అనగానే ఆర్థిక శాఖ అధికారులు ముందూ వెనుకా ఆలోచించకుండా ప్రభుత్వ ఆస్తులను కుదువ పెట్టి మరీ సొమ్ము సమకూర్చేవారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో ఈ పరిస్థితి లేదు. అడ్డగోలు అప్పులకు ప్రస్తుత ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పియూష్ కుమార్ అభ్యంతరం చెబుతున్నారు. తల్లికి వందనం, రైతు భరోసా వంటి పథకాలకు నిధులు సమకూర్చవలసి ఉంది. ఇందుకోసం రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఆదాయం చూపించి పదివేల కోట్ల రూపాయల వరకు రుణం తెచ్చుకొనే వెసులుబాటు ఉంది. అయితే, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఇందుకు అభ్యంతరం చెబుతున్నట్టు తెలిసింది. పెండింగ్‌లో ఉన్న బిల్లులు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. బిల్ డిస్కౌంట్ విధానంలో పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని చంద్రబాబు ప్రభుత్వం భావించింది. బ్యాంకులు కూడా ముందుకు వచ్చాయి. అయితే అధికారులు సహకరించడంలేదు. జగన్ రెడ్డి హయాంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడానికి వెనుకాడని అధికారులు ఇప్పుడు ఎందుకు అడ్డం తిరుగుతున్నారంటే, చంద్రబాబు ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరించడంలేదు కనుక! అప్పటిలాగే వ్యవహరించి జగన్ రెడ్డికి పట్టిన గతే భవిష్యత్తులో తమకు పట్టకూడదని చంద్రబాబు జాగ్రత్తపడడాన్ని తప్పుపట్టలేం కదా! అయితే ప్రజలకు, కార్యకర్తలకు ఇవన్నీ పట్టవు. తమ ఆకాంక్షలు తీరాలని మాత్రమే వారు కోరుకుంటారు. మద్యం విషయమే తీసుకుందాం! జగన్ రెడ్డి పాలనలో మద్యం వ్యవహారంలో ఎమ్మెల్యేలను వేలు పెట్టనిచ్చేవారు కాదు. మద్యం నుంచి తనకు ప్రతి నెలా ఆదాయం వస్తున్నందున ఇతరుల జోక్యాన్ని ఆయన అనుమతించలేదు. ఇప్పుడు మద్యం సొమ్ము ఆశించకూడదని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. జగన్ అమలు చేసిన మద్యం పాలసీని మార్చి పాత మద్యం విధానం ప్రకారం ప్రైవేటు వ్యక్తులకు షాపులు కేటాయించాలని నిర్ణయించుకున్నారు. దీంతో కూటమి ఎమ్మెల్యేలు రంగప్రవేశం చేసి సిండికేట్లు ఏర్పాటయ్యేలా మంత్రాంగం నడిపారు. కొన్నిచోట్ల మద్యం షాపులకు ఎవరు దరఖాస్తు చెయ్యాలో కూడా నిర్ణయించారు. దీనిపై మీడియాలో విస్తృతంగా వార్తలు రావడంతో చంద్రబాబు అలర్ట్ అయ్యారు. ఎమ్మెల్యేల జోక్యానికి అడ్డుకట్ట వేశారు. హద్దుమీరిన వారిని మందలించారు. ఫలితంగా రెండురోజుల్లో మద్యం షాపులకోసం ఇబ్బడిముబ్బడిగా దరఖాస్తులు వచ్చాయి. ఒక దరఖాస్తుకు రెండు లక్షల వంతున 1౮00 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలే అయినప్పటికీ ఎన్నో అనుభవాలు, సవాళ్లు ఎదురయ్యాయి. గతంలో జగన్ రెడ్డి ఇలా అనుకుంటున్నారని ధనుంజయ రెడ్డి వంటి వారు చెప్పగానే, క్షణాల్లో జీవోలు జారీ చేసిన అధికారులే ఇప్పుడు స్వల్ప విషయాలకు సైతం ఫైళ్లను మంత్రులకు, ముఖ్యమంత్రికి పంపుతున్నారు. జగన్ రెడ్డి దుష్పరిపాలన కారణంగా సుదీర్ఘ అనుభవం ఉండి కూడా చంద్రబాబు ఇప్పుడు కొన్ని సందర్భాల్లో తడబాటుకు గురికావలసిన పరిస్థితి. గత అయిదేళ్లలో ప్రభుత్వ యంత్రాంగం సైతం పూర్తిగా కుళ్లిపోయింది. దీంతో ఎవరు చెబుతున్నది నిజమో తేల్చుకోవడమే ప్రస్తుతం ప్రధాన సమస్యగా ఉంది. బదిలీల విషయంలో కూడా ఇదే జరుగుతోంది. జగన్ పాలనలో ప్రభుత్వ నిర్ణయాలను ఏ స్థాయిలో కూడా తప్పు పట్టేవారు కారు. పైగా పొగడ్తలతో ముంచెత్తేవారు. ఎమ్మెల్యేలు, మంత్రులను కార్యకర్తలు, నాయకులు విమర్శించేవారు కాదు. ఇప్పుడు అలా కాదు! శాసన సభ్యులను, మంత్రులను బాహాటంగా విమర్శిస్తున్నారు.
దీన్ని స్వేచ్ఛ అనాలో, విచ్చలవిడితనం అనాలో తెలియని పరిస్థితి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు తెలుగుదేశం పార్టీలో అపరిమిత స్వేచ్ఛను ఇప్పుడే చూస్తున్నాం. ఈ నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించుకోవడానికి తగు సమయాన్ని చంద్రబాబు కేటాయించుకోవాలి. కట్టుతప్పుతున్న శాసనసభ్యులు, కార్యకర్తలను మందలించాలి. ప్రభుత్వ యంత్రాంగంలో పరిస్థితులు మారాయి కనుక ప్రభుత్వ ప్రాధాన్యతలను ముందుగా నిర్ణయించుకుని అధికారులకు దిశానిర్దేశం చెయ్యాలి. జగన్ రెడ్డి పాలన అరాచకంగా సాగింది కనుక ఈ ప్రభుత్వం ఏ చిన్న తప్పుచేసినా ప్రజల్లో ప్రతిస్పందన ఎక్కువగానే కనిపిస్తుంది. ప్రజలకంటే కార్యకర్తలు, నాయకులు అతిగా స్పందించడం మాత్రం ఇప్పుడే చూస్తున్నాం. గతంతో పోల్చితే ఇప్పుడు స్వేచ్ఛను అనుభవిస్తున్నారు. జగన్ రెడ్డి హయాంలో నోరు విప్పడానికి కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలు, అధికారులు, చివరకు ప్రజలు కూడా సాహసించేవారు కాదు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కనుకే స్వల్ప విషయాలు కూడా రచ్చ అవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ తరఫున పనిచేస్తున్న సోషల్ మీడియా కార్యకర్తలు కూడా బాధ్యత లేకుండా పోస్టులు పెడుతున్నారు. అనేక సందర్భాలలో ప్రతిపక్షం కంటే ముందుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నారు. ఇదే ధోరణి కొనసాగితే సోషల్ మీడియా సైన్యం అని రాజకీయ పార్టీలు ముద్దుగా పిలుచుకొనే వాళ్లు భస్మాసుర హస్తాలుగా మారుతారు. యుద్ధం జరుగుతున్నప్పుడు సైనికులతో పాటు అనేక విభాగాలకు చెందిన వారు కూడా పాల్గొంటారు. యుద్ధంలో విజయం సాధించిన తర్వాత రాజు తమ మాటే వినాలని ప్రతి ఒక్కరూ కోరుకోవడం ఎంత అసంబద్ధమో ఇప్పుడు జగన్ రెడ్డి పాలనకు వ్యతిరేకంగా క్రియాశీలకంగా వ్యవహరించిన ప్రతి ఒక్కరూ చంద్రబాబు తాము చెప్పినట్టు నడుచుకోవాలనడమూ అంతే అసంబద్ధమవుతుంది. కూటమి తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేలు కూడా కార్యకర్తల రెక్కల కష్టాన్ని విస్మరించకూడదు. వారి మనోభావాలను గుర్తించి అందుకు తగినట్టుగా వ్యవహరించాలి.
కక్ష సాధింపులెక్కడ?
నిజానికి చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగలేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో అసంతృప్తి, అసహనం ఏర్పడటానికి ఇదే ప్రధాన కారణం. అయినా జగన్ రెడ్డి మాత్రం రాష్ట్రంలో కక్ష సాధింపులు పరాకాష్ఠకు చేరాయని, రెడ్ బుక్ పాలన సాగుతోందని విమర్శిస్తున్నారు. వాళ్లది రెడ్ బుక్ అయితే, తాము గుడ్ బుక్ ఓపెన్ చేస్తున్నామని తాజాగా ప్రకటించారు. కక్ష సాధింపులు, వేధింపులపై జగన్ రెడ్డికి మాత్రమే పేటెంట్ ఉంది. ఈ విషయంలో ఆయనతో ఎవరూ పోటీ పడలేరు. మరీ ముఖ్యంగా... చంద్రబాబు నాయుడు ఎన్ని జన్మలు ఎత్తినా జగన్‌తో ఈ విషయంలో పోటీ పడలేరు. ఇప్పుడు జగన్ మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఏమిటో తెలిసిపోతుంది. మూడు కేసులు, ఆరు అరెస్టులు అన్నట్టుగా జగన్ పాలన సాగింది. కనుకే ఆయనను ప్రజలు అసహ్యించుకున్నారు. కేవలం 11 సీట్లకే పరిమితం చేశారు. 2019లో ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేసిన చంద్రబాబును హేళన చేసిన జగన్ రెడ్డి... ఇప్పుడు తాను ఓడిపోగానే ఈవీఎంలను తప్పుపడుతున్నారు. బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు జరగాలని కోరుతున్నారు. తనంత మంచివాడు, అమాయక చక్రవర్తి ప్రపంచంలోనే మరొకరు ఉండరు అన్నట్టుగా జగన్ రెడ్డి చెప్పుకొంటారు. అందుకు తగ్గట్టుగా ప్రజల సమక్షంలో నటిస్తారు. జగన్‌తో పోల్చితే చంద్రబాబు గంగిగోవు లాంటి వారని చెప్పవచ్చు. అందుకే సొంత పార్టీ కార్యకర్తల నుంచి, సోషల్ మీడియా సైన్యం నుంచి ఆయన విమర్శలు ఎదుర్కొంటున్నారు. రాష్ర్టాన్ని గాడిలో పెట్టడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. పనిలో పనిగా ఎమ్మెల్యేలను కూడా గాడిలో పెట్టడానికి చర్యలు తీసుకోవాలి.
అదే సమయంలో కార్యకర్తల ఆకాంక్షలను అర్థం చేసుకొని వారిలోని అశాంతి, అసహనాన్ని పోగొట్టే ప్రయత్నం చేయాలి. విశాఖపట్నంలో తమ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి టీసీఎస్ అంగీకరించినట్టు మంత్రి లోకేశ్ ప్రకటించారు. ఇది కార్యరూపం దాల్చితే లోకేశ్‌ను అభినందించాల్సిందే. నిన్నటి వరకు రాష్ట్రం వైపు చూడటానికి కూడా పెట్టుబడిదారులు ఇష్టపడలేదు. జగన్ బలహీనతలను ఒడిసిపట్టుకున్న అదానీ వంటి వారు మాత్రమే కనిపించే వారు. సాఫ్ట్‌వేర్ దిగ్గజమైన టీసీఎస్‌తో పాటు ఇతర సంస్థలను కూడా ఆకర్షించగలిగితే రాష్ట్రం... ముఖ్యంగా విశాఖ దశ మారుతుంది. తమది నిజంగానే మంచి ప్రభుత్వం అని ప్రజలు విశ్వసించాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు మరింత ప్రణాళికాబద్ధంగా పనిచేయాలి. తన ముందున్న ప్రాధాన్యతలను గుర్తించి అందుకు తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలి.
ఆర్కే
Updated Date - Oct 12 , 2024 | 07:46 AM