RK Kotha Paluku : రణమా... రాజకీయమా?

ABN, Publish Date - Aug 04 , 2024 | 04:18 AM

తెలుగు రాష్ర్టాల రాజకీయాలు ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలకూడదన్న ధోరణిలో కొనసాగుతున్నాయి. రాష్ట్రం విడిపోక ముందు అధికార విపక్షాలు కలివిడిగా ఉండేవి. 1983లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన....

RK Kotha Paluku : రణమా... రాజకీయమా?

తెలుగు రాష్ర్టాల రాజకీయాలు ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలకూడదన్న ధోరణిలో కొనసాగుతున్నాయి. రాష్ట్రం విడిపోక ముందు అధికార విపక్షాలు కలివిడిగా ఉండేవి. 1983లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్‌ రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించినప్పుడు శాసనసభ లోపలా, వెలుపలా అప్పుడప్పుడూ ఉభయ పక్షాల మధ్యా ఉద్రిక్త పరిస్థితులు కనిపించేవి కానీ, ఇప్పటిలా ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు ముఖాముఖి కలుసుకోలేని పరిస్థితులు ఉండేవి కావు. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలో కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అధికార విపక్షాల మధ్య దూరం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో కీలక అంశాలపై ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాలను నిర్వహించి నిర్ణయాలు తీసుకొనేది. రాష్ట్రం విడిపోయాక అఖిలపక్ష సమావేశాలు జరగడాన్ని చూడలేదు. రానురానూ ఈ పరిస్థితి మరింత వికటించి శాసనసభ లోపలా వెలుపలా ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు కళ్లలో కళ్లు పెట్టి చూసుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కేసీఆర్‌ ప్రతిపక్షాలకు కనీసం అపాయింట్‌మెంట్‌ కూడా ఇచ్చేవారు కాదు. 2014–2018 మధ్య విపక్ష కాంగ్రెస్‌ నాయకుడిగా జానారెడ్డి ఉండేవారు. అప్పట్లో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన కేసీఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని బలహీనపరిచారు. గతంలో శాసనసభ సమావేశాల ప్రారంభం రోజు అధికార, విపక్షాల నాయకులు అల్పాహార విందులో పాల్గొనేవారు. సమావేశాల ముగింపు సందర్భంగా కూడా ఉమ్మడిగా విందులో పాల్గొనేవారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక ఈ సంప్రదాయం దాదాపు కనుమరుగైంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగా ప్రతిపక్ష నాయకుడి స్థానంలో జగన్మోహన్‌ రెడ్డి ఉండేవారు. ఆ రాష్ట్రంలో కూడా అఖిలపక్ష సమావేశాలు జరగనే లేదు. అధికారిక కార్యక్రమాల్లో ప్రతిపక్ష నాయకుడు పాల్గొన్న దాఖలాలు లేవు. రాజధానిగా అమరావతిని ఎంపిక చేసే ముందు కూడా అఖిలపక్ష సమావేశం జరగలేదు. శాసనసభలో అధికార, ప్రతిపక్షాల మధ్య నిత్యం యుద్ధం జరిగేది. అదే సమయంలో తెలంగాణ శాసనసభ సమావేశాలు కొంత సాఫీగా సాగేవి.


విపక్షంపై విరుచుకుపడుతూ...

2018 తర్వాత కేసీఆర్‌ తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టాక అధికార, ప్రతిపక్షాల మధ్య దూరం మరింత పెరిగింది. ఆపరేషన్‌ ఆకర్ష్‌ను ఉద్యమంగా చేపట్టిన కేసీఆర్‌... కాంగ్రెస్‌ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేశారు. రేవంత్‌ రెడ్డికి శాసనసభలో గతంలో నోరెత్తే అవకాశం లేకుండా చేశారు. ఎప్పటికప్పుడు సభ నుంచి సస్పెండ్‌ చేసి పారేసేవారు. సభలో రేవంత్‌ రెడ్డి ముఖం చూడ్డం కూడా ఇష్టం లేదన్నట్టుగా కేసీఆర్‌ వ్యవహరించేవారు. కాంగ్రెస్‌ సభ్యులను చీటికి మాటికీ సస్పెండ్‌ చేసేవారు. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పరిస్థితులు మరింత వికటించాయి. 2019 ఎన్నికల్లో ప్రజలు తనకు 23 సీట్లు మాత్రమే ఇచ్చినప్పటికీ చంద్రబాబు నాయుడు కుంగిపోకుండా, సభకు హాజరవడాన్ని నామోషీగా భావించకుండా శాసనసభ సమావేశాలలో పాల్గొన్నారు. అధికారంలో ఉన్న వైసీపీ అడుగడుగునా అవమానించినా భరించారు. చివరకు తన సతీమణిని నిండు సభలో అవమానించడంతో తట్టుకోలేక కౌరవసభగా మారిన శాసనసభలోకి తిరిగి ముఖ్యమంత్రిగానే అడుగుపెడతానని శపథం చేసి సభను బహిష్కరించారు. ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు అధికారం తలకెక్కి అహంకారపూరితంగా వ్యవహరించిన కేసీఆర్‌, జగన్‌ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. అయితే... నాడు అధికార దర్పం వెలగబెట్టిన ఈ ఇరువురూ కూడా ప్రతిపక్ష నాయకులుగా శాసనసభ సమావేశాలలో పాల్గొనడానికి ఇష్టపడటం లేదు. తెలంగాణలో ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్‌కు గుర్తింపు ఉంది. అందుకు తగిన సంఖ్యా బలం ప్రజలు ఆయనకు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్‌ రెడ్డికి ప్రతిపక్ష నాయకుడి హోదా పొందడానికి అవసరమైన సంఖ్యా బలాన్ని ప్రజలు ఇవ్వలేదు. తనకు ఏమాత్రం ఇష్టం లేని రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో ఉండటాన్ని జీర్ణించుకోలేని స్థితిలో ఉన్న కేసీఆర్‌ శాసనసభ సమావేశాలకు హాజరు కావడంలేదు.

అయితే, తాను సభకు హాజరు కాబోవడంలేదని మాత్రం ఆయన ఇంతవరకు ప్రకటించలేదు. జగన్మోహన్‌ రెడ్డి అలా కాకుండా... సంఖ్యా బలం లేకపోయినా తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకపోతే శాసనసభకు హాజరు కాబోనని ప్రకటించారు. నాకు చాక్లెట్‌ కొనివ్వకపోతే బడికి వెళ్లనని విద్యార్థి మారాం చేసినట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారు. 2019లో తెలుగుదేశం పార్టీ తరఫున 23 మంది శాసనసభ్యులు మాత్రమే ఎన్నికైనప్పటికీ వెరవకుండా చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషించిన విషయం తెలిసి కూడా కేసీఆర్‌, జగన్మోహన్‌ రెడ్డిలు శాసనసభకు హాజరు కాకపోవడం వింతగా ఉంది. చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ప్రతిపక్ష స్థానంలో కూర్చోవడాన్ని నామోషీగా భావించలేదు. కేసీఆర్‌ తొమ్మిదిన్నరేళ్లు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయినా ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతున్న ఆయన ఏకంగా శాసనసభ మీదే అలిగారని భావించాల్సి ఉంటుంది. ఇక జగన్మోహన్‌ రెడ్డి విషయానికి వస్తే... ఐదేళ్లపాటు రారాజుగా వ్యవహరించిన తాను ప్రతిపక్షంలో కూర్చోవడం ఏమిటి? నాన్సెన్స్‌! అని భావిస్తున్నట్టు ఉంది. 1994 ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి కూడా ప్రధాన ప్రతిపక్ష హోదా పొందడానికి అవసరమైన సంఖ్యా బలం లభించలేదు. అయినప్పటికీ ఆనాడు దివంగత పి. జనార్దన్‌ రెడ్డి శాసనసభలో కాంగ్రెస్‌ పక్ష నాయకుడిగా ప్రభుత్వంపై పోరాడారు. జగన్మోహన్‌ రెడ్డిలో ఈ స్ఫూర్తి కొరవడింది.


సభలో సెగలు...

తెలంగాణలో అధికార మార్పిడి జరిగి ఎనిమిది నెలలే అయింది. అయినప్పటికీ తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. శుక్రవారంతో ముగిసిన శాసనసభ సమావేశాలలో చోటుచేసుకున్న సంఘటనలే ఇందుకు నిదర్శనం. కేసీఆర్‌ హయాంతో పోల్చితే రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం శాసనసభలో ప్రజాస్వామ్య బద్ధంగానే వ్యవహరిస్తోంది. ప్రధాన ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితికి తగిన సమయం కేటాయిస్తోంది. కీలకమైన అంశాలపై కోరినంత సమయం ఇస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగా రాత్రులు పొద్దుపోయే వరకు సమావేశాలను నిర్వహించింది. మైక్‌ ఇవ్వాలంటూ ప్రతిపక్షాలు కొట్లాడే పరిస్థితిని అధికార కాంగ్రెస్‌ పార్టీ కల్పించడం లేదు. అయినప్పటికీ సభలో చివరి రెండు రోజుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓటుకు నోటు కేసులో తాము అరెస్టు చేసి జైల్లో పడేసిన రేవంత్‌ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండటాన్ని కేసీఆర్‌ మాత్రమే కాదు– బీఆర్‌ఎస్‌కు చెందిన ఇతర ముఖ్యులు కూడా సహించలేక పోతున్నట్టుగా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని సభలోనే ‘రేవంత్‌ రెడ్డీ’ అని కేటీఆర్‌ ఏకవచనంతో సంభోదించారు. అధికార కాంగ్రెస్‌ సభ్యులు దీనిపై ఆక్షేపించగా, ఒకప్పుడు తానూ రేవంత్‌ మంచి మిత్రులమని, గత పదేళ్లుగా తమ మధ్య చెడిందని, అందుకే గత చనువుతో పేరుతో సంబోధించానని కేటీఆర్‌ వివరణ ఇచ్చారు. అయితే ఈ వివరణ ఆకుకు అందకుండా పోకకు పొందకుండా ఉంది. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్న కేటీఆర్‌ ఆయనను సభలో ‘మా బాపు లేదా మా నాన్న’ అని ఎప్పుడూ సంబోధించలేదు. ‘గౌరవ ముఖ్యమంత్రి’ అని మాత్రమే అనేవారు. కేసీఆర్‌ కూడా తన కుమారుడిని ‘గౌరవ మంత్రి’ అని మాత్రమే సంబోధించేవారు. అంతేగానీ ఇంట్లో పిలుచుకున్నట్టు అరే తురే అని సంబోధించలేదు. సభాసంప్రదాయాలు అలాగే ఉంటాయి. ఉండాలి కూడా! రేవంత్‌ రెడ్డిని ముఖ్యమంత్రిగా గుర్తించడానికి మనసులో ఎక్కడో అయిష్టం ఉన్నందునే డిఫెన్స్‌ బదులు అఫెన్స్‌ పాత్ర పోషించాలని బీఆర్‌ఎస్‌ నేతలు భావిస్తున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సరదాగా, యథాలాపంగా చేసిన ఒక వ్యాఖ్యకు విపరీత అర్థాలు తీయడమే ఇందుకు నిదర్శనం.

ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతున్నప్పుడు రేవంత్‌ రెడ్డి కల్పించుకొని, ‘మీ వెనుక కూర్చున్న అక్కల మాట వింటే మీ పరిస్థితి జూబిలీ బస్టాండ్‌ అవుతుంది’ అని వ్యాఖ్యానించారు. సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిని ఉద్దేశించి ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు మహిళలను అవమానించడమేనని, ముఖ్యమంత్రికి మహిళలంటే గౌరవం లేదని బీఆర్‌ఎస్‌ సభ్యులు ఎదురుదాడి చేసే ప్రయత్నం చేశారు. సభ లోపలా వెలుపలా నిరసన వ్యక్తం చేశారు. తనను అవమానించారని సబితా ఇంద్రారెడ్డి కన్నీరు పెట్టుకోవడం కూడా జరిగింది. నిజానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలలో ఆక్షేపించాల్సింది ఏమీ లేదు. ఫలానా వాళ్ల మాటలు వింటే చెడిపోతావు అని మనం అనడం సహజం. రేవంత్‌ వ్యాఖ్యలను కూడా ఆ కోవలోనే చూడాలి. అంతేకాదు, రేవంత్‌ రెడ్డి ట్రాక్‌ రికార్డ్‌ పరిశీలిస్తే... ఆయన మహిళల పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించిన లేదా వారిని అవమానించిన సందర్భాలు లేవు. దీంతో బీఆర్‌ఎస్‌ ప్రయత్నం ఫలించలేదు. పనిలో పనిగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ‘ఏ ముఖం పెట్టుకొని ఇప్పుడు మాట్లాడుతున్నారు’ అని చేసిన వ్యాఖ్యను కూడా అనుకూలంగా మలచుకొనే ప్రయత్నాన్ని కేటీఆర్‌ అండ్‌ కో చేసింది. వాస్తవానికి సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మా రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నప్పుడు జరిగిన సంఘటనలను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి పూసగుచ్చినట్టు వివరించడంతో బీఆర్‌ఎస్సే ఆత్మరక్షణలో పడింది. మహిళలను అవమానించిన ముఖ్యమంత్రి రేవంత్‌ క్షమాపణలు చెప్పాలంటూ బీఆర్‌ఎస్‌ చేసిన ఆందోళనలను కూడా ప్రజలు పట్టించుకోలేదు. దీంతో బీఆర్‌ఎస్‌ అందుకున్న ఆయుధం పనిచేయలేదు. అయితే... సమావేశాల చివరి రోజు బీఆర్‌ఎస్‌ తరపున ఎన్నికై కాంగ్రెస్‌ పార్టీలో చేరిన దానం నాగేందర్‌ చేసిన వ్యాఖ్యలు మాత్రం అధికారపక్షాన్ని ఆత్మరక్షణలో పడేశాయి. దానం నాగేందర్‌ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి. వీధి పోరాటాల సందర్భంగా వాడే భాషను ఆయన వ్యాఖ్యలు తలపించాయి. మజ్లిస్‌ నాయకుడు అక్బరుద్దీన్‌ జోక్యంతో దానం తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. ఇలాంటి భాషను నిన్నటి వరకు ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో విన్నాం. ఇప్పుడు ఆ రాష్ట్ర శాసనసభ సమావేశాలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. జగన్మోహన్‌ రెడ్డి సభకు హాజరు కావడం లేదు కనుక సభలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడం లేదు. గత ఎన్నికల వరకు తెలంగాణ శాసనసభ సమావేశాలు కూడా ప్రశాంతంగానే సాగాయి. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి, కేసీఆర్‌ కుటుంబానికి మధ్య నెలకొన్న వైరం ఇందుకు కారణం కావచ్చు.


కేసీఆర్‌ సభకు వస్తే...

కేసీఆర్‌ సభకు హాజరైతే తెలంగాణ శాసనసభ సమావేశాలు కచ్చితంగా మరింత ఆకర్షణీయంగా, ఆసక్తికరంగా ఉండేవి. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి వ్యాఖ్యానించినట్టుగా మజా వచ్చేది. కేసీఆర్‌తో పాటు కేటీఆర్‌, హరీశ్‌రావ్‌ మంచి స్పీకర్లు. అధికార కాంగ్రెస్‌ పార్టీలో ఆ స్థాయి వాక్చాతుర్యం ఉన్నవాళ్లు అతికొద్ది మంది మాత్రమే ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఉన్నప్పటికీ ఆ స్థాయిలో వాక్చాతుర్యం ఉన్నవాళ్లుగానీ, సై అంటే సై అనగలిగే వాళ్లు గానీ కాంగ్రెస్‌లో తక్కువే. నిజం చెప్పాలంటే కేసీఆర్‌ సభకు వచ్చి కేటీఆర్‌, హరీశ్‌లను కుడి ఎడమల కూర్చోబెట్టుకొని అధికార పక్షంపై మాటల యుద్ధానికి దిగితే ప్రభుత్వం ఎంతో కొంత ఆత్మరక్షణలో పడుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబుకు వాక్చాతుర్యం లేకపోయినా, ఆ శక్తి ఉన్నవాళ్లను ప్రోత్సహిస్తూ ప్రతిపక్ష పాత్రను పోషించేవారు. జగన్మోహన్‌ రెడ్డి వ్యవహారం మొరటుగా ఉంటుంది. అంచేత ఆయన సభకు హాజరైనప్పటికీ చర్చలు రసవత్తరంగా సాగే అవకాశం లేదు. వైసీపీ తరపున గెలిచిన పదకొండు మందిలో మాటకారితనం ఉన్న వాళ్లు ఉన్నారో లేదో తెలియదు. బూతు భాషకు అలవాటు పడిన వారందరూ తాజా ఎన్నికల్లో ఓడిపోయారు కనుక ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో ఇప్పుడు బూతులు వినపడకపోవచ్చు. మహాభారతంలో దుర్యోధనుడు పాండవులపై పగ పెంచుకోవడానికి... మయసభలో అడుగిడిన సందర్భంగా జరిగిన అవమానం ఒక కారణం. అలాంటి అనుభవం ఎదురు కాకపోయినా శాసనసభకు హాజరు కాకూడదని జగన్మోహన్‌ రెడ్డి నిర్ణయించుకోవడం వింతగా ఉంది. రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిల కూడా తన సోదరుడి నిర్ణయాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. రాజకీయ పార్టీల మధ్య విభేదాలు ఉండటం సహజం. విద్వేషాలు ఏర్పడటం వాంఛనీయం కాదు. దురదృష్టవశాత్తు తెలుగు రాష్ర్టాలలో ఇదే పరిస్థితి ఉంది. అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య వ్యక్తిగత స్థాయిలో వైషమ్యాలు నెలకొన్నాయి.


మారకపోతే అంతే..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పర్యాయం మరింత పరిణతి ప్రదర్శిస్తున్నారు. పర్యటనల సందర్భంగా హంగూ ఆర్భాటాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తన సభలకు జన సమీకరణలు చేయకూడదని నిర్ణయించుకోవడం నిజంగా ముదావహం. ఆయన మడకశిర నియోజకవర్గంలో జనసమీకరణ లేకుండా సాదాసీదాగా కార్యక్రమాల్లో పాల్గొనడాన్ని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రఘువీరా రెడ్డి అభినందించడం గమనార్హం. అధికారం దక్కించుకున్న చంద్రబాబులోనే ఇంత మార్పు వచ్చినప్పుడు, అధికారం కోల్పోయిన జగన్‌ రెడ్డిలో ఏ మార్పూ కనిపించకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరదాల మాటున, పోలీసు రక్షణలో, పాఠశాలలకు సెలవులు ప్రకటింపజేసి, దుకాణాలను సైతం మూయించి, జనాలను బలవంతంగా తరలించి సభలు నిర్వహించినా ఎన్నికల్లో ఫలితం ఇవ్వలేదనే వాస్తవాన్ని జగన్‌ రెడ్డి గుర్తించడానికి నిరాకరించడం ఆయన మనస్తత్వానికి నిదర్శనం. ఎన్నికల్లో ఓడిపోయాక కూడా తనను కలవడానికి వచ్చిన కార్యకర్తలను కలుసుకోవడానికి నిరాకరిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు మరింత చేరువయ్యే ప్రయత్నం ఎవరైనా చేస్తారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అడపాదడపా అయినా తరలించి తీసుకువచ్చిన వారిని కలుసుకుంటున్నారు. జగన్మోహన్‌ రెడ్డి కనీసం ఆ పని కూడా చేయడం లేదు.

ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కూడా గతంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ తనను వేధించిన విషయాలను మరచిపోయి మరింత హుందాగా వ్యవహరించడం అవసరం. ప్రభుత్వంలో ఉన్నప్పుడు పనుల ఒత్తిడి ఉంటుంది. ఎల్లవేళలా అందరినీ సంతృప్తి పరచడం సాధ్యం కాదు. శాసనసభ లోపలా వెలుపలా ప్రతిపక్షాల పట్ల మరింత ఉదారంగా వ్యవహరిస్తే ప్రజలు హర్షిస్తారు. ప్రతిపక్షాలను పూచికపుల్లల కంటే హీనంగా చూసిన కేసీఆర్‌తో పోటీ పడాలనుకోకూడదు. ఓటుకు నోటు కేసును అడ్డుపెట్టుకొని కేసీఆర్‌ కర్కశంగా వ్యవహరించడం వల్లనే ప్రజల్లో రేవంత్‌ రెడ్డి పట్ల సానుభూతి ఏర్పడింది. అంతిమంగా అది ఆయన ముఖ్యమంత్రి కావడానికి దోహదపడింది. ఈ వాస్తవాన్ని రేవంత్‌ విస్మరించ కూడదు. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌ రావులను ఢీకొనగల సత్తా రేవంత్‌ రెడ్డిలో లేకపోలేదు. ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి తమను అవమానిస్తున్నారన్న భావన బీఆర్‌ఎస్‌కు చెందిన కొంత మంది ఎమ్మెల్యేలతో పాటు కార్యకర్తల్లో కూడా నెలకొన్నది. ఈ కారణంగానే లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బీఆర్‌ఎస్‌కు చెందిన వాళ్లు కొంతమంది భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చారు. ఫలితంగా కాంగ్రెస్‌తో సమానంగా బీజేపీ కూడా ఎనిమిది సీట్లు గెలుచుకుంది. తనలో రాజకీయంగా కసి రగలడానికి కారణం ఎవరు? ఏమిటి? అనేది గుర్తించి అవతలి వారిలో కూడా తనపై కసి ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకొనే విషయం రేవంత్‌ రెడ్డి ఆలోచించాలి.


కాంగ్రెస్‌ గ్రాఫ్‌ తగ్గుతోందా...

ఎనిమిది నెలల క్రితం ఎన్నికలు జరిగిన సమయంతో పోల్చితే కాంగ్రెస్‌ పార్టీ గ్రాఫ్‌ కొంత తగ్గినట్టుగా సమాచారం వస్తోంది. ఇందుకు రేవంత్‌ రెడ్డి మాత్రమే కారణం కాదు. కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం ప్రధాన బాధ్యత తీసుకోవాలి. ముఖ్యమంత్రికి తగిన స్వేచ్ఛ కూడా ఇవ్వడం లేదు. మంత్రులు, ముఖ్యంగా సీనియర్లు ఎవరికి వారే ముఖ్యమంత్రులుగా వ్యవహరిస్తున్నారు. మంత్రులకు స్వేచ్ఛ అవసరమేగానీ అది అపరిమితం కాకూడదు. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీకి రాష్ట్రంలోని పరిస్థితులపై అవగాహన ఉన్నట్టుగా లేదు. ఆమె హైదరాబాద్‌లోనే అధిక సమయం గడుపుతున్నప్పటికీ పార్టీలో ఏం జరుగుతున్నదో పట్టించుకోవడం లేదు. అధిష్ఠానం అతి జోక్యం కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణలో నష్టం చేస్తున్నది. ఆ ఛాయలు ఇప్పటికే కనబడుతున్నాయి. జాతీయ స్థాయిలో ఇప్పుడిప్పుడే ప్రజాభిమానం చూరగొంటున్న రాహుల్‌ గాంధీ అప్పుడప్పుడయినా తెలంగాణలో పరిస్థితులను స్వయంగా సమీక్షించడం అవసరం. శాసనసభలో పోరు ప్రస్తుతానికి కాంగ్రెస్‌–బీఆర్‌ఎస్‌ మధ్య కేంద్రీకృతం కావడంతో భారతీయ జనతా పార్టీ పరిస్థితి స్తబ్దుగా ఉంది. ఆ పార్టీ ఎప్పుడు ఎటువంటి ఎత్తుగడలు అనుసరిస్తుందో తెలియదు. బీజేపీ తేరుకొనేలోపే ప్రధాన ప్రతిపక్షంగా మరింత బలపడే ప్రయత్నాలను బీఆర్‌ఎస్‌ మొదలెట్టింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తన యంత్రాంగాన్ని, మంత్రాంగాన్ని మరింత పటిష్ఠం చేసుకోవాలి. రుణమాఫీ వంటి ప్రధాన హామీల విషయంలో మాట నిలబెట్టుకున్నప్పటికీ ప్రభుత్వంపై మొత్తంగా ప్రజల్లో సదభిప్రాయం నెలకొనేలా తగు చర్యలు తీసుకోని పక్షంలో కాంగ్రెస్‌ పార్టీ బలహీనపడే ప్రమాదం ఉంది. రేవంత్‌ రెడ్డి పాలనలో బీఆర్‌ఎస్‌ ముఖ్యులు ఉక్కపోతకు గురవుతుండవచ్చు గానీ ప్రజాస్వామ్య ప్రియులు స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నారు. అదే సమయంలో ప్రభుత్వ యంత్రాంగంలో జవాబుదారీతనాన్ని చొప్పించాల్సిన అవసరం ఉంది. లేనిపక్షంలో ప్రజల్లో ఫీల్‌గుడ్‌ భావన లోపిస్తుంది. రాజకీయ వైషమ్యాలే పాలకులకు, ప్రతిపక్షాలకు ప్రధాన ఎజెండా కాకూడదు. అదే జరిగితే భారతీయ జనతా పార్టీ ఉండనే ఉంది. తస్మాత్‌ జాగ్రత్త!

ఆర్కే

Updated Date - Aug 04 , 2024 | 05:18 AM

Advertising
Advertising
<