ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

RK kothapaluku : మాట తూలితే... మంటలే!

ABN, Publish Date - Oct 06 , 2024 | 12:24 AM

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో నిన్నటివరకు మనకు కనిపించిన జాడ్యం ఇప్పుడు తెలంగాణ రాజకీయాలకు విస్తరించింది. జగన్మోహన్‌రెడ్డి అధికారంలో ఉన్నంత వరకు ఆయన పార్టీకి చెందిన కొంతమంది కాలకేయుల వలె చెలరేగిపోతూ... వారూ వీరూ అన్న తేడా లేకుండా...

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో నిన్నటివరకు మనకు కనిపించిన జాడ్యం ఇప్పుడు తెలంగాణ రాజకీయాలకు విస్తరించింది. జగన్మోహన్‌రెడ్డి అధికారంలో ఉన్నంత వరకు ఆయన పార్టీకి చెందిన కొంతమంది కాలకేయుల వలె చెలరేగిపోతూ... వారూ వీరూ అన్న తేడా లేకుండా ఇళ్లలోని ఆడవాళ్లను కూడా వదలకుండా శీల హననానికి పాల్పడేవారు. ఇప్పుడు ఈ సంస్కృతి తెలంగాణకు వ్యాపించింది. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మురికి నోళ్లకు తాళం పడింది. ఇప్పుడు తెలంగాణ వంతు వచ్చింది. సినీ పరిశ్రమకు చెందిన అక్కినేని నాగార్జున కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. దీంతో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఒక్క తాటిపైకి వచ్చి మంత్రి సురేఖ వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. కారణమేమైనా సురేఖ అన్న మాటలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి. రాజకీయాల్లో అసహనం ఏర్పడి హద్దులు చెరిగిపోతున్నాయి. ఇందుకు సోషల్‌ మీడియా వేదిక అవుతోంది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గంలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి సురేఖ మెడలో బీజేపీ ఎంపీ రఘునందనరావు నూలు దండ వేశారు.


మామూలుగా మన సంప్రదాయం ప్రకారం పరాయి స్ర్తీల మెడలో పూల దండలు వేయరు. ఆ రోజు అనుకోకుండా రఘునందనరావు మంత్రి మెడలో నూలు దండ వేశారు. అప్పుడు మంత్రి సురేఖ కూడా దాన్ని మూమూలుగానే తీసుకున్నారు. ఆ తర్వాత సోషల్‌ మీడియాలో సురేఖను ఉద్దేశించి అసభ్యకరంగా ప్రచారం మొదలయింది. మంత్రి వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. దీంతో సురేఖ మనస్తాపం చెంది విలేకరుల సమావేశంలో విలపించారు. తనను బాధించేలా ట్రోలింగ్‌ జరగడం వెనుక మాజీ మంత్రి కేటీఆర్‌ ఉన్నారని సురేఖ ఆరోపించారు. ఈ వ్యవహారం అంతటితో ముగిసిందని అందరూ అనుకున్నారు. అయితే మనసుకు కష్టమనిపించిన సురేఖ అంతటితో ఆగకుండా కేటీఆర్‌పై దాడిని పెంచారు. కేవలం కేటీఆర్‌ను టార్గెట్‌ చేసుకొని ఉంటే వేరే విధంగా ఉండేది. ఆమె అలా చేయకుండా కేటీఆర్‌ తన స్వార్థంతో సినీ ప్రముఖుల జీవితాలతో ఆడుకున్నారని, ప్రముఖ హీరోయిన్‌ సమంత విడాకులు తీసుకోవలసి రావడానికి కేటీఆర్‌ కారణం అంటూ అక్కినేని నాగార్జున కుటుంబాన్ని కూడా వివాదంలోకి లాగారు. దీంతో సినిమా పరిశ్రమ మండిపడింది. మంత్రి సురేఖ కూడా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. కాలు జారినా వెనక్కు తీసుకోవచ్చు కానీ, నోరు జారితే తీసుకోలేము అంటారు. ఇక్కడ కూడా అదే జరిగింది. సురేఖ–కేటీఆర్‌కు మాత్రమే పరిమితం కావాల్సిన వివాదం... మంత్రి మాటలతో సినీ పరిశ్రమను ఏకం చేసింది. సోషల్‌ మీడియా ద్వారా కేటీఆర్‌ తన వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని చెప్పుకోవాల్సిన సురేఖ, అదుపు కోల్పోయి... కేటీఆర్‌ను టార్గెట్‌ చేసుకున్నానన్న భ్రమలో నాగార్జున కుటుంబాన్ని టార్గెట్‌ చేసుకున్నారు. దాంతో సురేఖకు రాజకీయంగా లాభం జరగకపోగా... ఆమెకూ, కాంగ్రెస్‌ పార్టీకీ నష్టం జరిగింది. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ చొరవ తీసుకొని ఈ వివాదానికి ఇంతటితో ముగింపు పలకాలని విజ్ఞప్తి చేసినా సినీ ప్రముఖులు శాంతించలేదు. ఫలితంగా వ్యవహారం కాంగ్రెస్‌ మెడకు చుట్టుకుంది. మాజీ మంత్రి కేటీఆర్‌కు కొంతమంది సినీ హీరోయిన్లతో అనైతిక సంబంధాలు ఉన్నాయని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ఆరోపించేవారు. అయితే, ఇప్పటిలా మాట్లాడకుండా జాగ్రత్తపడ్డారు. సినిమా పరిశ్రమకు చెందిన వారికి, ముఖ్యంగా హీరోయిన్లకు ఎంత గ్లామర్‌ ఉన్నా, వారిని చులకనగా చూసిన సందర్భాలు కూడా ఎన్నో. హీరోయిన్లపై చిన్నచూపు ఎప్పటి నుంచో ఉంది. మంత్రి సురేఖ అనవసరంగా హీరోయిన్‌ సమంత పేరు ప్రస్తావించడమే కాకుండా... తాను తన కళ్లతో చూసినట్టుగా, చెవులతో విన్నట్టుగా ఏదేదో మాట్లాడారు. కండరాల వ్యాధితో బాధపడిన సమంత పట్ల ప్రజల్లో సానుభూతి ఏర్పడింది. నాగ చైతన్యతో ఆమె విడాకులు తీసుకోవడాన్ని కూడా అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. నాగ చైతన్యకు ఈ మధ్యనే మరో హీరోయిన్‌ శోభిత ధూళిపాళ్లతో నిశ్చితార్థం అయింది. ఈ నేపథ్యంలో మంత్రి సురేఖ చేసిన విమర్శలు శృతిమించి గురితప్పాయి.


బాధితురాలే... బాధపెడతారా!?

వ్యక్తిగత గోప్యత అనేది ప్రాథమిక హక్కు. ఎవరి వ్యక్తిగత జీవితం వారిదే. మంచి చెడులకు కూడా వారే బాధ్యత వహించవలసి ఉంటుంది. ఇందులో ఇతరుల ప్రమేయానికి తావు ఉండదు. ఉండకూడదు. బీజేపీ ఎంపీ తన మెడలో నూలు దండ వేయడంపై జుగుప్సాకరంగా ట్రోలింగ్‌ చేయడాన్ని మంత్రి సురేఖ జీర్ణించుకోలేకపోవడంలో న్యాయం ఉంది. అయితే... ఒక మహిళ అయి ఉండి కూడా మరో మహిళను అనవసర వివాదంలోకి లాగి ఆమె తప్పు చేశారు. విలేకరుల సమావేశంలో తొలుత కన్నీరు పెట్టుకున్నప్పుడు ప్రజల్లో ఆమె పట్ల కూడా సానుభూతి ఏర్పడింది. తనను ట్రోలింగ్‌ చేసిన సోషల్‌ మీడియా వ్యక్తుల వెనుక కేటీఆర్‌ ఉన్నారన్నది ఆమె అభిప్రాయం. అందుకే తాను విలపించినా కేటీఆర్‌ పట్టించుకోలేదని, తన అనుచరులుగా ఉన్న సోషల్‌ మీడియా కార్యకర్తలను మరింతగా ప్రోత్సహించారన్నది సురేఖ వాదన. ఆమె ఇంతవరకే పరిమితమై ఉంటే ఏ గొడవా ఉండేది కాదు. అనవసర విషయాలు ప్రస్తావించడంతో కేటీఆర్‌ పక్కకు పోయారు. సురేఖ ప్రయత్నం బూమరాంగ్‌ అయింది. విమర్శలు, ఆరోపణలు గురితప్పడంతో కేటీఆర్‌ సేఫ్‌ అయ్యారు. సురేఖ ఆత్మరక్షణలో పడిపోయారు. ఆలోచన లేకుండా ఆవేశం మాత్రమే ఉంటే ఇలాంటి అనర్థాలే జరుగుతాయి. సురేఖను మంత్రివర్గం నుంచి తప్పిస్తారంటూ ప్రచారం కూడా జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ వ్యవహారంలో హుందాగా ఉంటున్నారు. వివాదంపై ఆయన స్పందించలేదు. జగన్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వైసీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. అప్పుడు సమాజం మొత్తం భయం గుప్పిట్లో ఉన్నందున బాహాటంగా ప్రతిస్పందన రాలేదు. కానీ, నాటి దుశ్చర్యను సమాజం అసహ్యించుకుందని తాజా ఎన్నికల ఫలితాలు వెల్లడించాయి. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్‌ హయాంలో వలె కాకుండా స్వేచ్ఛ లభిస్తోంది. అప్పట్లో నోరు విప్పడానికి సినీ పరిశ్రమకు చెందినవారు సాహసించలేదు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఆనాటి ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ముందర సినీ ప్రముఖులు సాగిలపడాల్సిన పరిస్థితి ఉండేది. నాటి చేదు అనుభవాలను సినీ ప్రముఖులుగానీ, మరొకరుగానీ ఎలా మరచిపోగలరు? ఇప్పుడు ఉభయ రాష్ర్టాలలోనూ ఆ పరిస్థితులు లేవు. అందుకే మంత్రి సురేఖ వ్యాఖ్యలపై సినీ పరిశ్రమకు చెందినవారు స్థాయితో సంబంధం లేకుండా స్పందించగలిగారు.


అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ను ఒక చెరువును ఆక్రమించి కట్టారని చెప్పి ప్రభుత్వం ఇటీవల కూలగొట్టింది. ఇప్పుడు సురేఖ వ్యాఖ్యలు కూడా ఆ కుటుంబాన్నే టార్గెట్‌ చేసుకున్నట్టుగా ఉన్నాయి. నాగార్జునకు ప్రస్తుతం టైం బాగోలేనట్టుగా ఉంది. ఆదాయాన్ని సమకూర్చి పెడుతున్న ఎన్‌ కన్వెన్షన్‌ నేలమట్టం కాగా ఇప్పుడు మానసిక వేదనకు గురికవాల్సిన పరిస్థితి. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు కలసి మెలసి ఉండేవారు. సినీ రంగానికి చెందిన వారితో, ముఖ్యంగా హీరోలతో గొడవలు పెట్టుకోవడానికి అధికారంలో ఉన్న పార్టీలు ఇష్టపడేవి కావు. జగన్‌రెడ్డి వచ్చి, సినిమా హీరోలు రియల్‌ హీరోలు కారని రుజువుచేశారు. తన అధికారానికి దాసోహం అనేలా చేసుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సినిమా వాళ్లతో ప్రత్యేకంగా గొడవ పడలేదు. అలా అని ఆయన వాళ్లతో పూసుకుని కూడా తిరగడం లేదు. కేసీఆర్‌ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్న కేటీఆర్‌ సినిమా పెద్దలతో చెట్టాపట్టాల్‌ వేసుకొని తిరగేవారు. పార్టీలకు, డిన్నర్లకు హాజరయ్యేవారు. దీంతో కేటీఆర్‌పై అప్పట్లో ఎన్నో రూమర్లు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో మంత్రి సురేఖ నోరు పారేసుకున్నారు. అయినా ఇతరుల వ్యక్తిగత జీవితాలలో తలదూర్చాలని ఎవరూ భావించకూడదు. మంత్రి పదవిలో ఉన్న సురేఖ హద్దు మీరకుండా ఉండాల్సింది. రాజకీయ నాయకులు పరస్పరం దూషించుకోవడం పరిపాటి అయింది. ప్రజలు కూడా అలవాటుపడిపోయారు. సినీ పరిశ్రమకు చెందిన వారికి, రాజకీయ నాయకులకు మధ్య ఇటీవలి కాలంలోనే లడాయి మొదలైంది. మంత్రి సురేఖ అన్న మాటలను నాగార్జున శత్రువులు కూడా సమర్థించలేరు. తాను చేసిన తప్పేమిటో సురేఖ ఆత్మపరిశీలన చేసుకున్నారో లేదో తెలియదు. తన నోటి నుంచి వెలువడిన జుగుప్సాకరమైన వ్యాఖ్యలకు ఆమె బేషరతుగా క్షమాపణలు చెప్పడం అవసరం. ఇంతకూ నోరు జారడం వల్ల సురేఖ ఏమి సాధించినట్టు? కేటీఆర్‌కు నష్టం చేయాలనుకొని లాభం చేశారు! తనను ట్రోల్‌ చేయడం వెనుక కేటీఆర్‌ ఉన్నారని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్లి ఉంటే ఆమెకూ కాంగ్రెస్‌ పార్టీకీ ఎంతో కొంత ప్రయోజనం చేకూరేది. ఇపుడు ఉభయ భ్రష్టత్వం అన్నట్టుగా పరిస్థితి మారింది. నాగార్జున ఇప్పుడు మంత్రి సురేఖపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలంటూ కోర్టును ఆశ్రయించారు.


మాట జారితే...

రాజకీయాల్లో ఉన్నవాళ్లు ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందన్న అభిప్రాయం ఉంది. అయితే ఇటీవలి కాలంలో పరువు నష్టం కేసుల్లో శిక్షలు పడుతున్నాయి. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీనే తన పార్లమెంటు సభ్యత్వం కోల్పోవలసి వచ్చింది. పరువు నష్టం కేసులు త్వరితగతిన పరిష్కారమై తీర్పులు వెలువడుతూ ఉంటే రాజకీయ నాయకులు తమ నోళ్లను అదుపులో పెట్టుకుంటారు. ఆడవాళ్లను అక్కా అని, మగవాళ్లను అన్నా అని సంబోధించే సంస్కృతి తెలంగాణది. అలాంటి తెలంగాణలో సోషల్‌ మీడియా పుణ్యమా అని బజారు భాష రాజ్యమేలుతోంది. సోషల్‌ మీడియా బాధితుల జాబితాలో సురేఖ కూడా ఒకరు. అయితే నోటిని అదుపులో పెట్టుకోకపోవడం వల్ల సానుభూతిని పొందాల్సిన ఆమె విమర్శలపాలయ్యారు. ఇప్పటికీ మించిపోయింది లేదు. ఇతరులను విపరీతంగా బాధించి అంతులేని మానసిక క్షోభకు కారణమైన మాటలకు మంత్రి సురేఖ బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఇందులో పంతాలు పట్టింపులకు పోవాల్సిన పని లేదు. తప్పు చేసినప్పుడు అంతరాత్మకు ఆ విషయం తెలుస్తుంది కనుక భేషజాలు పనికిరావు. ఏది నిజం? ఏది అబద్ధం? అన్నది అప్రస్తుతం. బేషరతు క్షమాపణలు చెప్పడానికి సురేఖ స్వచ్ఛందంగా ముందుకు రాని పక్షంలో కాంగ్రెస్‌ పెద్దలైనా తప్పు జరిగిందని ఆమె ప్రకటించేలా చొరవ తీసుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై కూడా ఈ బాధ్యత ఉంది.


‘లడ్డూ’ వివాదం...

తిరుపతి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి సుప్రీంకోర్టు శుక్రవారం నాడు ఒక స్వతంత్ర కమిటీని నియమించింది. దీంతో ఆరోపణలు, ప్రత్యారోపణలకు కొంత విరామం లభించింది. ఈ వివాదంపై సుప్రీంకోర్టు ధర్మాసనం గత వారం చేసిన వ్యాఖ్యలతో జగన్‌ అండ్‌ కో ఆనందపడిపోయారు. ఇంతలోనే ఈ వ్యవహారంపై దర్యాప్తునకు స్వతంత్ర కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ధర్మాసనం ప్రకటించడంతో వారి సంతోషం ఆవిరైంది. కల్తీనే జరగనప్పుడు సిట్‌ అవసరం లేదు– గిట్‌ అవసరం లేదని జగన్‌రెడ్డి వ్యాఖ్యానించడం ఆయన వైఖరికి అద్దంపడుతోంది. గతంలో జగన్మోహన్‌రెడ్డిపై నమోదైన అవినీతి కేసులను విచారించిన సీబీఐని ఇదే జగన్‌ అండ్‌ కో పంజరంలోని చిలుక అని నిందించారు. ఇప్పుడు అదే పార్టీకి చెందిన టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి నెయ్యి కల్తీ వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ కాకుండా సీబీఐతో విచారణ జరిపించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఆ పార్టీ ద్వంద్వ వైఖరికి నిదర్శనం. సీబీఐ విశ్వసనీయతపై ప్రజల్లో అనుమానాలు బలంగా ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై అటు సీబీఐ, ఇటు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులతో సంయుక్తంగా దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుత పరిస్థితులలో సుప్రీంకోర్టు నిర్ణయం ముదావహం. కమిటీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు ఉన్నందున తుది నివేదికను ఇటు అధికార కూటమి గానీ, అటు ప్రతిపక్షమైన వైసీపీగానీ తప్పుపట్టలేవు. సుప్రీంకోర్టు నిర్ణయం వెలువడిన రోజునే... తిరుమలకు నెయ్యి సరఫరా కాంట్రాక్టు పొందిన ఏఆర్‌ డెయిరీకి సంబంధించి దిగ్ర్భాంతి కలిగించే అంశాలు వెలువడ్డాయి. దేవదేవుడి ప్రసాదం తయారీకి అవసరమైనంత నెయ్యి సరఫరా చేయగల సామర్థ్యం లేని ఏఆర్‌ డెయిరీకి కాంట్రాక్టు ఎలా ఇచ్చారన్నది ప్రధాన ప్రశ్న. భోలే బాబా, శ్రీవైష్ణవి డెయిరీల నుంచి నెయ్యి కొనుగోలు చేసి తిరుమలకు సరఫరా చేసినట్టు తాజాగా బయటపడింది. కిలో ఒక్కింటికి 355 రూపాయలు చెల్లించి కొనుగోలు చేసిన నెయ్యిని తిరుమల తిరుపతి దేవస్థానానికి కిలో ఒక్కింటికి 318 రూపాయలకే ఎలా సరఫరా చేశారు? ఇది మరో కీలక ప్రశ్న. ఎక్కువ ధరకు కొనుగోలు చేసి... తక్కువ ధరకు ఎలా విక్రయిస్తారు? కాంట్రాక్ట్‌ ఇచ్చే ముందు ఏఆర్‌ డెయిరీ సామర్థ్యాన్ని పరిశీలించారా లేదా? అవసరమైనంత నెయ్యి ఉత్పత్తి చేయలేని కంపెనీకి కాంట్రాక్ట్‌ ఇవ్వడం వెనుక ఏం జరిగింది? కేవలం 318 రూపాయలకే కిలో నెయ్యి సరఫరా చేయడం సాధ్యమా? కాదా? అని ఎందుకు పరిశీలించలేదు? టీటీడీ పాలకవర్గంలోని కొంతమంది సభ్యులతో కొనుగోళ్లకు ప్రత్యేక కమిటీని నియమిస్తారు. ఈ కమిటీ నిర్ణయాన్ని టీటీడీ పాలకవర్గం ఆమోదిస్తుంది. ఇప్పటివరకు వెల్లడైన అంశాలను బట్టి కొనుగోళ్ల కమిటీలోని సభ్యులు కూడా బాధ్యత నుంచి తప్పించుకోలేరు. పాలక మండలిలోని మిగతా సభ్యులకు కూడా అంతో ఇంతో బాధ్యత ఉంటుంది. దీన్నిబట్టి ఆనాటి పాలకవర్గంలో సభ్యులుగా ఉన్న వారెవరినీ ఇకముందు పాలకమండలి సభ్యులుగా నియమించకూడదు. ఏఆర్‌ డెయిరీ తిరుమలకు అవసరమైన నెయ్యిని ఎలా సమకూర్చుకుంది? ఏ ధరకు ఎవరి నుంచి కొనుగోలు చేసింది? ఆ తర్వాత ఏం జరిగింది? వంటి అంశాలపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ దృష్టి పెట్టాలి. సుప్రీం తీర్పు తర్వాత వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ... లడ్డూ ప్రసాదాల నాణ్యతపై తాను చైర్మన్‌గా ఉన్నప్పుడు భక్తుల నుంచి ఫిర్యాదులు వచ్చాయని అంగీకరించారు. స్వామి వారి సేవకు అంకితం కావాల్సిన సుబ్బారెడ్డి గానీ, ధర్మారెడ్డి గానీ, మరొకరుగానీ లడ్డూ నాణ్యతను ఎందుకు గుర్తించలేకపోయారో తెలియదు. శ్రీవారి క్షేత్రాన్ని వేరే అవసరాలకు వాడుకోవడంపై చూపిన శ్రద్ధ లడ్డూ ప్రసాదాల నాణ్యతపై చూపలేదు. వాణిజ్య పన్నుల శాఖ చెక్‌ పోస్టుల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం నెయ్యి కల్తీ జరిగిందన్నది స్పష్టమవుతోంది. అయితే, కల్తీకి ఏమి వాడారన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది. స్వతంత్ర కమిటీ దర్యాప్తులో ఈ విషయం కూడా తేలిపోతుంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి లడ్డూ ప్రసాదాల నాణ్యత తగ్గిపోవడాన్ని తేలికగా తీసుకోకూడదు. లడ్డూ రుచితో తిరుమల వైభవం ఎంతో కొంత ముడిపడి ఉంది. తిరుమల లడ్డూ ప్రత్యేకత దెబ్బతింటే ఆ ప్రభావం ఆ దేవదేవుడిపై పడదా?


బాధ్యులెవరో తేల్చాలి...

తిరుమల నుంచి తిరిగి వచ్చినవారు లడ్డూ ప్రసాదం ఇస్తే దాన్ని అపురూపంగా భావించి తింటాం. దీనికి ఆ లడ్డూ రుచి కూడా ప్రధాన కారణం. ఇతర దేవాలయాలలో కూడా లడ్డూ ప్రసాదం ఇస్తారు. కానీ, తిరుమల లడ్డూ మాదిరి ఆ లడ్డూల కోసం పోటీ ఉండదు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం నెయ్యి కల్తీ జరిగిందనడంలో సందేహం లేనందున ఈ పాపానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎవరు కారకులో తేలాలి. తిరుమల ఔన్నత్యాన్ని, ప్రాశస్త్యాన్ని, పవిత్రతను మంటగలిపే కుట్ర ఏదైనా దీని వెనుక ఉందా అన్న కోణంలో కూడా దర్యాప్తు జరగాలి. కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం ఇది. కల్తీ గురించి తెలిసినప్పటి నుంచీ ఎంతో మంది భక్తులు మౌనంగా రోదిస్తున్నారు. మానసికంగా కుంగిపోయారు. అక్కడేమీ జరగలేదని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కొట్టి పారేయవచ్చు. కానీ, భక్తుల మనోభావాలు గాయపడ్డాయని గుర్తించలేకపోతున్నారు. దేవుడు అంటేనే ఒక నమ్మకం. ఆ నమ్మకంతో పరిహాసమాడే ప్రయత్నం ఎవరు చేసినా శిక్షపడాలి. స్వతంత్ర దర్యాప్తు సంస్థ తన నివేదిక ఇవ్వడానికి గడువు ఉన్నట్టుగా లేదు. ఈ కమిటీలో సభ్యులుగా నియమితులయ్యే వారికి కూడా స్వామి వారిపై నమ్మకం, భక్తి ఉంటుంది కనుక వారు ఈ దర్యాప్తును కేవలం ఉద్యోగ ధర్మంగా భావించకుండా పవిత్రమైన కార్యంగా పరిగణించాలి. సందేహాలకు అతీతంగా అసలు ఏం జరిగిందో కోట్లాది మంది భక్తులకు చెప్పాలి. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన కొద్ది రోజులకే లడ్డూ నాణ్యత ఎలా పెరిగింది? గతంలో ఉన్న లడ్డూ నాణ్యత, రుచి 2019–24 మధ్య ఎందుకు తగ్గింది? ఎవరు కారణం? అన్నది స్పష్టమైతేగానీ భక్తుల మనసులు కుదుటపడవు. నేరం జరిగి ఉంటే అందుకు కారకులైన వారిని దోషులుగా ప్రజల ముందు నిలబెట్టకపోతే ఆ దేవదేవుడి ఉనికే ప్రశ్నార్థకం కాదా? ఇది కేవలం హిందువులకు సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదు. పాప పుణ్యాలకు సంబంధించినది. ఇవాళ తిరుమలలో జరిగిన అపచారం రేపు మసీదులోనూ, చర్చిలోనూ జరగకుండా ఉంటుందా? ప్రజల విశ్వాసాలతో పరిహాసం ఆడేవారు క్షమార్హులు కారు. తాను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటేనే ప్రజలు సుఖంగా ఉండగలరని జగన్మోహన్‌రెడ్డి తాజాగా సెలవిచ్చారు. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోకుండా, సీఎం సర్‌ అని పిలిపించుకోకుండా జగన్‌రెడ్డి ఉండలేరని దీన్నిబట్టే అర్థమవుతోంది. తాను సంతోషంగా ఉండాలంటే సీఎం కుర్చీలో కూర్చోవలసిందేనని ఆయన భావం కావచ్చు! ఇది ఒక మానసిక సమస్య కావొచ్చు. దీనికి మందు ఒక్కటే.


అదే... సీఎం కుర్చీ! ప్రజలు తనను సీఎం కుర్చీ నుంచి గుంజి కింద పడేశారన్న వాస్తవంలోకి జగన్‌రెడ్డి రావొచ్చు రాకపోవచ్చు. ఆయన హయాంలోనే తిరుపతి లడ్డూ నాణ్యత కొండెక్కిన విషయం మరచిపోతే ఎలా? ఆ రోజుల్లో ప్రసాదం తిన్నవారు నాణ్యత దెబ్బతిందని గుర్తించారు. సీఎం కుర్చీ కోసం కలవరిస్తున్న జగన్‌ ఆ కుర్చీలో ఉన్నప్పుడు లడ్డూ తిన్నారో లేదో తెలియదు. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని కూడా ఆయన చెప్పుకొంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు కూడా కాలేదు. ఇంత స్వల్ప వ్యవధిలో ఏ ప్రభుత్వం మీద అయినా తీవ్ర వ్యతిరేకత ఏర్పడటం అసంభవం. అధికారానికి దూరమైన జగన్‌రెడ్డిలో ఓపిక నశించి ఉండవచ్చునుగానీ ప్రజలలో ఇంత త్వరగా ఓపిక అంతరించిపోదు. లడ్డూ వ్యవహారంలో జరగరాని ఘోరం, పాతకం జరిగిందని స్వతంత్ర కమిటీ దర్యాప్తులో వెల్లడైతే మాత్రం... సీఎం కుర్చీ అనేది జగన్‌రెడ్డికి ఒక పగటి కలగా, ఒక ఎండమావిగానే మిగులుతుంది.

ఆర్కే

Updated Date - Oct 06 , 2024 | 09:27 AM