ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Weekend comment By RK ; మేలుకో ఆంధ్రుడా!

ABN, Publish Date - May 12 , 2024 | 02:45 AM

హమ్మయ్య! ఎన్నికల ప్రచారం ముగిసింది. తెలుగునాట అధికార, ప్రతిపక్ష నాయకులు, జాతీయ స్థాయి నాయకులు కూడా అర్ధసత్యాలు, అసత్యాలతో ప్రజలను ఊదరగొట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడం ఈ ఎన్నికల్లో విశేషం...

హమ్మయ్య! ఎన్నికల ప్రచారం ముగిసింది. తెలుగునాట అధికార, ప్రతిపక్ష నాయకులు, జాతీయ స్థాయి నాయకులు కూడా అర్ధసత్యాలు, అసత్యాలతో ప్రజలను ఊదరగొట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడం ఈ ఎన్నికల్లో విశేషం. గత ఎన్నికల్లో తెలంగాణలో అనూహ్యంగా నాలుగు సీట్లు గెలుచుకున్న బీజేపీ ఇప్పుడు మెజారిటీ స్థానాలు కైవశం చేసుకోవడానికి ఉవ్విళ్లూరుతుండగా.. అధికార కాంగ్రెస్‌ పార్టీ ఆధిపత్యం నిలుపుకొనే ప్రయత్నం చేస్తోంది. ఐదు నెలల క్రితం అధికారం కోల్పోయిన కేసీఆర్‌ ఒకటి రెండు స్థానాలైనా గెలుచుకొని పార్టీని కాపాడుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో నాయకులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. లోక్‌సభ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్‌ రాజకీయ ముఖచిత్రంపై ప్రభావం చూపనున్నందున మూడు ప్రధాన పార్టీలకూ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. సోమవారం జరగనున్న పోలింగ్‌లో తెలంగాణ ప్రజలు ఎవరిని ఆదరించబోతున్నారో, ఎవరిని తిరస్కరించబోతున్నారో తీర్పు ఇవ్వనున్నారు. శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయి ఐదు నెలలైనా వాస్తవంలోకి రాకుండా తెలంగాణను పాలించే సమర్థత తనకు మాత్రమే ఉందన్న భ్రమల్లో ఉన్న కేసీఆర్‌ బహిరంగ సభల్లో కూడా అదే విధంగా మాట్లాడారు. కేవలం ఐదు నెలల వ్యవధిలో తెలంగాణ రాష్ట్రం సర్వనాశనం అయిందని ప్రచారం చేయడం ఆయన అతి విశ్వాసానికి నిదర్శనం. ఇటీవల ఆయన చేస్తున్న వ్యాఖ్యలను బట్టి కేసీఆర్‌లో అహంభావం తొలగిపోలేదని అనిపిస్తోంది. తెలంగాణలో ఈ ఎన్నికలు రాజకీయ పార్టీలకు కీలకం కాగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పరిస్థితి వేరు.

అక్కడ శాసనసభకు కూడా ఎన్నికలు జరుగుతున్నందున ఈ ఎన్నికలు ఆ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి. తమ పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలో, తాత్కాలిక తాయిలాలతో సంతృప్తిపడిపోవడమో అన్నది తేల్చుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ పౌరులపై ఉంది. ఐదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోయి జగన్మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చారు. అప్పటి నుంచి రాష్ట్ర రాజకీయాలకు నిర్వచనం మారిపోయింది. రాజ్యం వీర భోజ్యం అన్నట్టుగా జగన్‌ పాలన సాగింది. రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే కాదు– ప్రభుత్వ చర్యలను తప్పుబట్టిన వారు కూడా వేధింపులకు, నిర్బంధాలకు గురయ్యారు. కనీవినీ ఎరుగని స్థాయిలో పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేశారు. ప్రజలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వెల్లడించలేని భయానక వాతావరణాన్ని కల్పించారు. పగ, ప్రతీకారాలతో సాగిన జగన్‌రెడ్డి ఐదేళ్ల పాలనతో ఉక్కిరిబిక్కిరైన ప్రధాన ప్రతిపక్షాలు తెలుగుదేశం, జనసేన ఒక్కటయ్యాయి. చివరకు భారతీయ జనతా పార్టీ కూడా ఈ రెండు పార్టీలతో జట్టు కట్టింది.


గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమను కూడా వేధించడం ద్వారా టాప్‌ హీరోలను సైతం తన వద్దకు రప్పించుకొని తన అహాన్ని జగన్‌ సంతృప్తిపరచుకున్నారు. తనకు నచ్చని హీరోల సినిమాలు విడుదలైనప్పుడు థియేటర్లపై రెవెన్యూ అధికారులతో దాడులు చేయించారు. ఈ క్రమంలో జనసేనాని, పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ప్రధాన బాధితుడిగా మిగిలారు. మెగాస్టార్‌గా, చిత్రపరిశ్రమలో అందరివాడుగా పిలవబడుతున్న చిరంజీవి స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిని కలిసి చేతులు జోడించి మరీ చిత్ర పరిశ్రమను ఆదుకోవలసిందిగా అర్థించాల్సిన పరిస్థితి కల్పించారు. తెలుగు చిత్రపరిశ్రమలో సూపర్‌ స్టార్లుగా వెలుగొందుతున్న ప్రభాస్‌, మహేశ్‌, ఉద్దండ దర్శకుడు రాజమౌళి వంటి వారు తమ కార్లను గేటు బయటే నిలిపి కాలి నడకన తాడేపల్లి ప్యాలెస్‌లోకి చేరుకోవాల్సిన పరిస్థితిని చూశాం. నాటి అవమాన భారం నుంచి చిత్ర ప్రముఖులు ఇంకా కోలుకోలేదు. జగన్మోహన్‌ రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్ర భవిష్యత్‌ సంగతి దేవుడెరుగు, తన సినీ కెరీర్‌ కూడా మసకబారుతుందన్న అభద్రతకు పవన్‌ కల్యాణ్‌ గురయ్యారు. దీంతో ఆవేశపరుడైన పవన్‌ కల్యాణ్‌ సీట్ల సర్దుబాటు సందర్భంగా పరిణతి ప్రదర్శించి ఒక అడుగు వెనక్కు తగ్గారు. గత ఎన్నికల సందర్భంగా చంద్రబాబు కాంగ్రెస్‌ పార్టీతో జట్టు కట్టడమే కాకుండా తనను వ్యక్తిగతంగా దూషించడంతో కినుక వహించి ఉన్న ప్రధాని మోదీ చివరికి ఒక మెట్టు దిగి తెలుగుదేశం పార్టీతో పొత్తుకు అంగీకరించారు. దీంతో రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ఎన్నికల బరిలోకి దిగింది. నరేంద్ర మోదీ, చంద్రబాబు మళ్లీ చేతులు కలపాల్సిన పరిస్థితి వచ్చిందంటే అందుకు జగన్మోహన్‌ రెడ్డి మాత్రమే ప్రధాన కారణం. బలాబలాలతో నిమిత్తం లేకుండా బీజేపీ అడిగిన సీట్లు ఇచ్చి పొత్తు కుదుర్చుకోవడానికి చంద్రబాబు ముందుకు రావడానికి కూడా జగనే కారణం. చంద్రబాబుపై అనేక కేసులు పెట్టిన జగన్‌ ప్రభుత్వం చివరకు స్కిల్‌ కేసు పేరిట 52 రోజుల పాటు జైల్లో నిర్బంధించింది. ఈ ఘటనతో తెలుగుదేశం, జనసేన మైత్రీ బంధం పటిష్ఠమైంది. ప్రభుత్వ బాధితులైన చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ శషభిషలు లేకుండా చేతులు కలిపారు. జైలు నుంచి విడుదలైన చంద్రబాబు, ఈ ఎన్నికల్లో జగన్‌రెడ్డిని ఓడించకపోతే తన రాజకీయ జీవితం ఫెయిల్యూర్‌గా ముగుస్తుందని గుర్తించి మానసికంగా రాజీపడి భారతీయ జనతా పార్టీతో కూడా జతకట్టారు. దీంతో రాష్ట్రంలో ప్రధాన పోరు ఎన్డీయే కూటమికీ, వైసీపీకి మధ్య కేంద్రీకృతమైంది. ప్రజలు కూడా జగన్‌ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా చీలిపోయారు. ఫలితంగా ఎన్నికల మేనిఫెస్టోలు అప్రధానమయ్యాయి. జగన్‌ను ఇంటికి పంపాలనుకొనేవారు మిగతా విషయాలు పట్టించుకోకుండా కూటమి వైపు మోహరించగా, జగన్‌ మళ్లీ రావాలనుకొనేవారు ప్రభుత్వ పనితీరు, అభివృద్ధితో పనిలేకుండా ఆయనకు మద్దతుగా నిలబడ్డారు. ఐదేళ్ల జగన్‌ పాలనలో మరో కీలక పరిణామం కూడా చోటుచేసుకుంది. 2019 ఎన్నికల వరకు జగన్‌కు అండగా ఉంటూ ఆయన కోసం పాదయాత్ర చేయడమే కాకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించిన చెల్లెలు షర్మిల.. జగన్‌ కుటుంబానికి దూరమయ్యారు. వైఎస్‌ రాజశేఖర రెడ్డి కుటుంబం రెండుగా చీలిపోయింది.


వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి తల్లి విజయమ్మను తప్పించిన జగన్‌రెడ్డి ఆమెకు పార్టీతో సంబంధం లేకుండా చేశారు. ఇద్దరు బిడ్డలూ చెరోదారి అయిన నేపథ్యంలో ఎటూ చెప్పలేక ఆమె అమెరికాకు వెళ్లిపోయారు. కాకపోతే ఎన్నికల ప్రచారం చివరి రోజున ఓ వీడియో సందేశం విడుదల చేశారు. కడప బరిలో అవినాశ్‌రెడ్డిపై పోటీ పడుతున్న షర్మిలకు మద్దతు ప్రకటించారు. తద్్వారా జగన్‌ అన్యాయం వైపు నిలిచారని ఆమె చెప్పకనే చెప్పారు. గత ఎన్నికలకు ముందు దారుణ హత్యకు గురైన వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్‌ సునీత కూడా నిందితులకు జగన్‌ రక్షణ కల్పిస్తున్నారని మండిపడుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర బాధ్యతలు చేపట్టి కడప ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్న షర్మిలకు మద్దతుగా సునీత నిలిచారు. ఏ ఎన్నికల్లో అయినా పోటీలో ఉన్న తండ్రి లేదా భర్త, లేదా సోదరుల తరఫున కుటుంబంలోని మహిళలు ప్రచారం చేయడం సహజం. ఇప్పుడు ఏపీలో జరుగుతున్న ఎన్నికల్లో మాత్రం జగన్మోహన్‌ రెడ్డి రక్తం పంచుకుపుట్టిన షర్మిలతో పాటు సునీత కూడా అన్నను ఓడించాలని ప్రజలకు పిలుపివ్వడం ఈ ఎన్నికల ప్రత్యేకత. నేరస్తులు, హంతకులకు ఓటు వేయవద్దని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ పరిస్థితి తలెత్తుతుందని ఐదేళ్ల క్రితం ఎవరూ ఊహించి ఉండరు. బంధుప్రీతి ఆరోపణలు రాకూడదనే షర్మిలను పదవులకు దూరంగా ఉంచానని జగన్‌ చెప్పడాన్ని షర్మిల తీవ్రంగా తప్పుబట్టారు. పదవులో, పనులో కావాలని తాను అడిగినట్టుగా జగన్‌ రెడ్డి బైబిల్‌ మీద ప్రమాణం చేసి చెప్పగలరా? అని షర్మిల సవాల్‌ చేశారు. ఈ సందర్భంగా ఆమె కంటతడి పెట్టారు. మరోవైపు డాక్టర్‌ సునీత ఇంకో అడుగు ముందుకేసి తనకూ, షర్మిలకూ ప్రాణహాని ఉందని, షర్మిలనూ, తననూ నరికి చంపించే ఆలోచనను జగన్‌ భార్య భారతీరెడ్డి చేయవచ్చునని ఆరోపించారు. తనను నరికి చంపవచ్చునన్న ప్రమాదాన్ని ఊహించి ముందుగానే తన పిల్లలకు వీలునామా రాసిచ్చి మరీ కడపలో షర్మిల తరఫున ప్రచారానికి వచ్చానని కూడా సునీత చెబుతున్నారు. న్యాయం కోసం రోడ్డెక్కిన ఇద్దరు ఆడపడుచులపై జగన్‌ అండ్‌ కో యథాప్రకారం దాడిని ముమ్మరం చేశారు. భారతీరెడ్డి ప్రధాన విలన్‌గా ఈ ఇద్దరు ఆడపడుచులూ బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి కుటుంబం ఇలా బజారున పడటం విషాదం. కడప నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అవినాశ్‌ రెడ్డి కోసం జగన్మోహన్‌ రెడ్డి తన సొంత చెల్లెలు షర్మిలను కూడా దూరం చేసుకోవడం ఆశ్చర్యం కలిగించక మానదు. ఒక ముఖ్యమంత్రిగా న్యాయం వైపు నిలబడాల్సిన జగన్మోహన్‌ రెడ్డి మాత్రం వివేకా కేసులో నిందితుల తరఫున నిలబడుతున్నారు. వివేకా హత్య జరిగినప్పుడు చంద్రబాబును నిందించిన జగన్మోహన్‌ రెడ్డి.. ఇప్పుడు ఆ ఊసు ఎత్తకపోగా ఆస్తుల కోసం వివేకాను సొంత అల్లుడే చంపించాడని తన మనుషులతో చెప్పిస్తున్నారు. ఈ మార్పును ప్రజలు కూడా గుర్తించారు.


హవ్వ.. పరిశ్రమలు ఎందుకంట!

ఆడపడుచుల రోదనలను పక్కనపెడితే జగన్‌ ఐదేళ్ల పాలనలోని మంచి చెడులను పరిశీలిద్దాం. ముఖ్యమంత్రిగా ఎవరున్నా తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తారు. అభివృద్ధి–సంక్షేమం మధ్య సమతుల్యం ఉండేలా చూసుకుంటారు. నవరత్నాలు పేరిట ప్రజలకు డబ్బు పంచడమే ముఖ్యమంత్రి చేయాల్సిన గొప్ప పని అని జగన్‌ భావించారు. అందుకే ప్రతి కుటుంబానికి డబ్బు పంచిన తనకే మళ్లీ అధికారం అప్పగించాలని ఆయన కోరుతున్నారు. తనకు ఓటు వేయకపోతే అమలులో ఉన్న పథకాలను ఎత్తేస్తారని ఆయన ప్రచారం చేస్తున్నారు. నిజానికి సంక్షేమ పథకాలను అవి ఎవరు ప్రవేశపెట్టినా వాటిని ఎత్తేయడం ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాల వల్ల కాదు. అమలులోకి వచ్చిన పథకాలను తమ హక్కుగా ప్రజలు భావిస్తారు. వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జనాభాను మించి అన్నట్టుగా తెల్ల రేషన్‌ కార్డులను మంజూరు చేశారు. ఆ తర్వాత రాష్ట్రం విడిపోయింది. తెలంగాణలో వైసీపీ కూడా లేదు. అయినా తొమ్మిదిన్నరేళ్లు తెలంగాణను పాలించిన కేసీఆర్‌ గానీ, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్‌ రెడ్డి గానీ బోగస్‌ కార్డుల ఏరివేత ఆలోచన కూడా చేయలేకపోయారు. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే పరిస్థితి. కిరణ్‌ కుమార్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కిలో బియ్యం ధరను రెండు రూపాయల నుంచి రూపాయికి తగ్గించారు. ఈ ధరలో కూడా మార్పు చేయడానికి ఎవరూ ఇష్టపడలేదు. ఒకప్పటి సంక్షేమం వేరు, ఇప్పటి సంక్షేమం వేరు.

అధికారంలోకి రావాలనుకొనేవారు చేతికి ఎముక లేదన్నట్టుగా వరాలు ప్రకటిస్తున్నారు. ఫలితంగా అన్ని రాజకీయ పార్టీలూ పులి మీద స్వారీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. జగన్‌ పాలనలో అభివృద్ధి కుంటుపడి రాష్ట్రం అప్పులపాలవడానికి అమలులో ఉన్న పథకాలు కారణం కాదా? అయినా ఎన్డీయే కూటమికి నేతృత్వం వహిస్తున్న చంద్రబాబు ఇంతకంటే ఎక్కువే ఇస్తానని చెప్పుకోవాల్సి వచ్చింది. బటన్‌ నొక్కితే చాలు అన్నట్టుగా జగన్‌ పాలన సాగింది. ఈ క్రమంలో మౌలిక సదుపాయాలు కుంటుపడ్డాయి. రహదారుల పరిస్థితి దారుణంగా మారింది. యువతకు ఉపాధి మృగ్యమైంది. ఉపాధి అవకాశాలు కల్పించడం అంటే, పెట్టుబడులను ఆకర్షించి పరిశ్రమలు నెలకొల్పడం కాదని జగన్‌రెడ్డి ఈ మధ్య ఒక జాతీయ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఒక పెద్ద పరిశ్రమ వస్తే ఎంత మందికి ఉపాధి లభిస్తుంది? అని ఆయన ఎదురు ప్రశ్న వేశారు. చిరు వ్యాపారాలను, అంటే చేపల కొట్లు, కూరగాయల షాపులు, సెలూన్ల వంటి వాటిని ప్రోత్సహిస్తే ఎక్కువ మందికి ఉపాధి లభిస్తుందని ఆయన నిర్వచించారు. ఈ ధోరణి జగన్మోహన్‌ రెడ్డి మనోవికారాలకు నిదర్శనం కాదా? హైదరాబాద్‌లో బీహెచ్‌ఈఎల్‌ను ఏర్పాటు చేసిన తర్వాత అనేక అనుబంధ యూనిట్లు ఏర్పాటై పఠాన్‌చెరువు అనే ప్రాంతం ఎంతలా అభివృద్ధి చెందిందో చూశాం. ఈసీఐఎల్‌ ఏర్పాటు వల్ల అదే పేరుతో మరో ప్రాంతం అభివృద్ధి చెందింది. జిరాక్స్‌ సెంటర్లు, మాంసం కొట్లు ఏర్పాటు చేసినంత మాత్రాన పట్టణాలు, నగరాలు విస్తరించకుండా వ్యాపారం ఎలా జరుగుతుంది? సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమ అభివృద్ధి చెందడం వల్లే కదా హైదరాబాద్‌కు లక్షల మంది యువత తరలివచ్చారు. ఆ కారణంగానే జగన్‌ చెబుతున్న చిరు వ్యాపారులకు కూడా గిరాకీ ఉంటోంది. ఈ చిన్న లాజిక్‌ కూడా మిస్‌ అవుతున్న జగన్‌ మళ్లీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి ఏమిటో? అన్న ఆందోళన కలగకమానదు.


మళ్లీ వస్తే.. ఇక అంతే!

ప్రతి ఇంటికీ మేలు జరిగిందని జగన్‌ చెప్పుకొంటున్నది నిజమైతే ఆంధ్రప్రదేశ్‌ నుంచి హైదరాబాద్‌కు వలసలు ఎందుకు పెరిగాయి? సోమవారం పోలింగ్‌ జరగనున్నందున హైదరాబాద్‌లో పనిచేసి కడుపు నింపుకొంటున్న లక్షల మంది స్వగ్రామాలకు తరలివెళ్లడాన్ని చూస్తున్నాం. వలంటీర్‌ వ్యవస్థను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం వల్ల దాని ఏర్పాటు లక్ష్యం కూడా దెబ్బతింది. రాష్ట్ర సంపద పెంచే ఆలోచన చేయని వ్యక్తి గొప్ప ముఖ్యమంత్రి ఎలా అవుతారు? చిరుద్యోగులు, చిరువ్యాపారులు మాత్రమే ఉండాలనుకొనే జగన్‌ పాలనలో ఆర్థికాభివృద్ధి ఆశించడం అత్యాశే అవుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు కూడా ఉండాలనుకోవడం పెత్తందారుల పోకడ అని ప్రచారం చేయడం దుర్మార్గం. తెలుగు భాష చనిపోతే తెలుగుజాతి ఎక్కడుంటుంది? అప్పుడు మనల్ని ఏమని పిలుచుకుంటాం? పది కోట్ల మందికి పైగా జనాభా మాట్లాడే తెలుగు భాషకు ఈ దుస్థితి కల్పిస్తున్న జగన్మోహన్‌ రెడ్డి మాతృభాషకు ద్రోహం చేస్తున్నవారే అవుతారు. ధర్మో రక్షతి రక్షితః అని అంటాం. అలాగే వ్యవస్థలను మనం కాపాడుకుంటే అవి మనల్ని కాపాడతాయి. జగన్‌ ప్రభుత్వంలో అన్ని ప్రభుత్వ శాఖలు కుప్పకూలిపోయాయి. న్యాయ పాలన చేయాలన్న స్పృహను అన్ని స్థాయిల్లో మరచిపోయారు. పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు అన్ని విలువలనూ వదిలేశారు. ప్రజలు, రాష్ట్రం ఏమైపోయినా ఫర్వాలేదు, నేను బాగుంటే చాలు అనుకుంటున్నారు. ఈ బాపతుగాళ్లు ఎవరూ పదవీ విరమణ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఉండరు. అందరూ హైదరాబాద్‌ వచ్చి వాలిపోతారు. అక్కడ ఉండబోయేది ఏ ఆదరణా లేని, ఎక్కడకూ వెళ్లలేని నిస్సహాయులు మాత్రమే. మన పిల్లలు ఉద్యోగాల కోసం హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు వెళ్లాల్సిన ఖర్మ ఏమిటి? అని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ప్రశ్నించుకోవాలి. అభివృద్ధి చెందిన ప్రాంతానికే జనం వలస వెళతారు.


అమెరికాకు మన వాళ్లు ఎందుకు వెళుతున్నారు? మాంసం కొట్లు, కూరగాయల కొట్లు పెట్టుకోవడానికి కాదు గదా? మెరుగైన జీవితం కోసం వెళతాం. పొరుగు రాష్ర్టాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వలసలు ఉంటున్నాయా? ఎందుకు లేవు? అంటే ఇక్కడ ఏమీ లేదు! తిన్నామా.. పడుకున్నామా.. తెల్లారిందా? అని మాత్రమే ఆలోచించే సమాజం ఉన్న చోట అభివృద్ధి జరగదని ప్రజలు గ్రహించాలి. రాష్ట్రం విడిపోయి పదేళ్లవుతోంది. ఇప్పటికీ రాజధాని అంటే ఇదీ అని చెప్పుకోలేని దుస్థితి కల్పించిన జగన్‌ను నెత్తిన పెట్టుకోవాలా? లేదా? అన్నది ఆంధ్రులు ఆలోచించుకోవాలి. జగన్మోహన్‌ రెడ్డి అధికారంలోకి వస్తే రాజధాని నిర్మాణం ఆగిపోతుంది, పోలవరం ప్రాజెక్టు మూలనపడుతుంది, అభివృద్ధి అడుగంటిపోతుంది, అరాచకం ప్రబలుతుంది అని 2019 ఎన్నికల సందర్భంగా బాధ్యతగల మీడియాగా మేం చెప్పాం. ఇప్పుడు అదే జరిగింది. సంక్షేమం పేరిట జనానికి ముష్టి వేస్తూ సహజ వనరులను చెరపట్టి అపర కుబేరులుగా అధికారంలో ఉన్న వారు అవతరిస్తున్నారని ప్రజలు గుర్తించాలి. మాది ఫలానా రాష్ట్రం, మా రాజధాని ఫలానా అని గర్వంగా చెప్పే విధంగా జగన్‌ ఏదైనా అభివృద్ధి చేశారా? అంటే సున్నా అని చెప్పాలి. దేశంలో ఎక్కడా లేని విధంగా దిక్కుమాలిన మద్యాన్ని విక్రయిస్తూ ప్రజల ప్రాణాలు తీస్తున్న ప్రభుత్వం మళ్లీ రావాలా? మద్యంపై వచ్చే ఆదాయాన్నీ, ప్రభుత్వ ఆస్తులనూ కుదవపెట్టి అప్పులు చేసిన జగన్‌ ప్రభుత్వానికి మళ్లీ అవకాశం ఇస్తే జరిగేదేమిటో ప్రజలకు తెలియదా? అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుగా అభివృద్ధికి అవసరమైన అన్ని వనరులూ, అవకాశాలూ ఉన్నప్పటికీ పొరుగు రాష్ర్టాల ముందు తల దించుకోవాల్సిన పరిస్థితి కల్పించిన జగన్‌ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి సిద్ధం కావాలా? వద్దా? అని ప్రజలు ఆలోచించుకోవాలి. ఈ ఎన్నికలు ప్రజల తలరాతను మార్చబోతున్నందున ప్రజలు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని ఓటు వేయాలి. కులమతాలకు అతీతంగా రాష్ట్రం హితవు కోరే వారు సంఘటితం కావాలి. తెలంగాణలో అహంకారంతో వ్యవహరించిన కేసీఆర్‌ను అక్కడి ప్రజలు ఇంటికి పంపారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఆ మాత్రం విజ్ఞత ఉండదా? పతనం అంచున ఉన్న రాష్ర్టాన్ని నిలబెట్టుకోవడమా? లేదా? అన్నది ప్రజల చేతుల్లోనే ఉంది. చూద్దాం.. సోమవారంనాడు ప్రజలు ఎలా స్పందిస్తారో!

ఆర్కే

Updated Date - May 12 , 2024 | 05:17 AM

Advertising
Advertising