పిల్లలకు స్థైర్యం నేర్పుదాం!
ABN, Publish Date - Nov 20 , 2024 | 02:07 AM
1959 నవంబర్ 20న బాలల హక్కుల ఒప్పందాన్ని ఆమోదించిన సందర్భంగా ఐక్యరాజ్యసమితి ఆ తేదీని ‘ప్రపంచ బాలల దినోత్సవం’గా గుర్తించింది. ఈ ఏటి బాలల దినోత్సవాన ‘భవిష్యత్తును వినండి’ అంటూ పెద్దలకు...
1959 నవంబర్ 20న బాలల హక్కుల ఒప్పందాన్ని ఆమోదించిన సందర్భంగా ఐక్యరాజ్యసమితి ఆ తేదీని ‘ప్రపంచ బాలల దినోత్సవం’గా గుర్తించింది. ఈ ఏటి బాలల దినోత్సవాన ‘భవిష్యత్తును వినండి’ అంటూ పెద్దలకు పిలుపునిచ్చారు. బాలల ఆలోచనలకు, ప్రాధాన్యతలకు అనుకూలంగా పెద్దల చర్యలు ఉండాలంటే మరి వారు పిల్లలు చెప్పేది వినాల్సిందే!
ఏ దేశానికైనా అత్యంత విలువైన ఆస్తి పిల్లలే. భారత జనాభాలో 40 శాతం మంది 18 ఏళ్ల లోపు బాలలే. అయితే, జాతీయ నేర రికార్డుల బ్యూరో లెక్కల ప్రకారం, 2022లో బాలలపై 1,62,449 నేరాలు నమోదయ్యాయి. అంటే ప్రతి నాలుగు నిమిషాలకు పిల్లలపై ఒక నేరం జరుగుతున్నది. 2021తో పోలిస్తే సాధారణ నేరాలు 4.5శాతం తగ్గాయి. కానీ బాలలపై నేరాలు మాత్రం 8.7శాతం పెరిగాయి. మరోవైపు విద్యార్థుల ఆత్మహత్యలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. 2022లో పది వేల మంది బాలలు ఆత్మహత్య చేసుకున్నారు!
ఇలాంటి పరిస్థితుల్లో మనం బాలలకు వ్యాకరణంలా, గణితంలా -స్థైర్యాన్ని కూడా బోధించక తప్పదు. చిన్నతనం నుండే అపారమైన సవాళ్లను అధిగమించిన వ్యక్తుల స్ఫూర్తిదాయక జీవిత చరిత్రలు బాలలను సాహసవంతులుగా మార్చగలవు. వారిని వారు రక్షించుకోవటమే కాదు, ఇతరులనూ కాపాడగలిగే స్థైర్యాన్ని నింపగలవు. ఇలాంటి స్థైర్యాన్ని ప్రదర్శించినవారిని ప్రభుత్వమూ విధిగా గుర్తించాలి. ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వాలు సాహస బాలలను గుర్తించి అవార్డులతో సత్కరించాలి. వారి సాహస గాథలను ప్రచారం చేయాలి. బాలకృష్ణుడి వలె ప్రమాదాల నుంచి క్షేమంగా తప్పుకొనే నైపుణ్యాన్ని బాలలకు నేర్పించాలి.
ఉదాహరణకు నేరాలు ఒంటరి బాలలపై జరుగుతాయి. కాబట్టి పిల్లలు స్నేహితులతో కలిసి తిరగడం కీలకం. ఒక్కరు తోడున్నా నేరం జరిగే అవకాశాలు బాగా తగ్గుతాయి. ‘వద్దు’ అని స్థిరంగా చెప్పగలగటం, ‘కాపాడండి’ అని గట్టిగా అరవడం, వేగంగా పరుగెత్తడం, చొరవతో సాయం కోరడం... వంటివి పిల్లలకు నేర్పాలి. బాలల వయసు బట్టి ఈ నైపుణ్యాల బోధన ఆధారపడి ఉండాలి. అలాగే 100, 1098 వంటి హెల్ప్ లైన్‌కు ఫోన్ చేయడం, సహాయక ఏప్‌లను వినియోగించడం సాధ్యమైనంత త్వరగా పిల్లలకు నేర్పాలి. జట్టుగా ఆడే ఆటల్లో పాల్గొనటం, సేవా కార్యక్రమాలలో భాగస్వాములవడం కూడా బాలల్లో స్థైర్యాన్ని నింపుతాయి. బాలల పత్రికలు, బాలల చలన చిత్రాల పాత్ర కూడా ఎంతో కీలకం.
ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు. కాబట్టి ఏ సమస్య వచ్చినా పిల్లలు తల్లిదండ్రులకు మాత్రమే చెప్పుకోగలరు. నిస్సంకోచంగా అలా చెప్పుకునే అవకాశం వారికి ఉండాలి. అందుకు తగ్గట్టుగా తల్లిదండ్రులు పిల్లలతో స్నేహంగా మెలగాలి. ‘‘భారతదేశం నా మాతృభూమి’’ అనీ ‘‘నా తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని, పెద్దలందర్నీ గౌరవిస్తాను’’ అనీ ప్రతి రోజూ మన స్కూళ్లలో పైడిమర్రి వెంకట సుబ్బారావు రచించిన ప్రతిజ్ఞను బాలలు పలుకుతారు. కానీ మరి తల్లిదండ్రుల మాటేమిటి? ఐస్‌లాండ్ వంటి కొన్ని దేశాలలో తల్లిదండ్రులకూ ప్రతిజ్ఞను తప్పనిసరి చేశారు. పిల్లలకు తగు సమయం కేటాయిస్తామని, వారు మంచి పనులు చేసినప్పుడు ప్రశంసిస్తామని, అవసరమైనప్పుడు ‘నో’ చెప్పినా స్వీకరిస్తామని, పిల్లలు తగిన ఆహారమూ నిద్రా వ్యాయామమూ లభించేట్టు చూస్తామని తల్లిదండ్రులు ప్రతిజ్ఞ చేస్తారు. ఇందువల్ల ఐస్‌లాండ్‌లో పదహారేళ్ళ లోపు యువతలో 1998 నుంచి 2016 మధ్యలో తాగుడు అలవాటు 42 శాతం నుంచి 5 శాతానికి, సిగరెట్ అలవాటు 23 శాతం నుంచి 3 శాతానికి, గంజాయి అలవాటు 17 శాతం నుంచి 7 శాతానికీ తగ్గిపోయింది.
లైంగిక నేరాల నుంచి బాలలను రక్షించేందుకు తెచ్చిన పోక్సో చట్టం 2012, నిబంధన 3(5) ప్రకారం సమగ్రమైన బాలల పరిరక్షక విధానాన్ని రూపొందించి, రాష్ట్రంలోని అన్ని సంస్థలలోనూ అది అమలయ్యేట్టు చూడాలి. పోక్సో చట్టం సెక్షన్ 19 ప్రకారం ఏదైనా సంస్థ పరిధిలో బాలలపై నేరం జరిగినా, జరిగే అవకాశం ఉన్నా ఆ సంస్థ యజమాని వెంటనే పోలీసు స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలి. తప్పనిసరిగా రిపోర్ట్ చేయాల్సిన బాధ్యతను నిర్వర్తించడంలో వారు విఫలమైతే వారికి ఏడాది జైలు శిక్ష విధించవచ్చు. పోక్సో చట్టం నిబంధన 3(4) ప్రకారం బాలలు సందర్శించే అన్ని సంస్థలు, పాఠశాలలు, క్రెష్‌లలో సిబ్బందికి, ఉపాధ్యాయులకు ఏమైనా నేర చరిత్ర ఉన్నదా అని పోలీసుశాఖ చేత క్రమబద్ధంగా తనిఖీ చేయాలి. పోక్సో చట్టం కింద పడే శిక్షల తీవ్రత గురించి అవగాహన పెంచితే నేరాలు తగ్గవచ్చు.
పోక్సో చట్టం ప్రకారం ఏర్పాటైన ప్రత్యేక న్యాయస్థానాలు దేశవ్యాప్తంగా విధిస్తున్న తీవ్రమైన కఠిన శిక్షల గూర్చి తెలిసిన వారెవరైనా పిల్లలను హింసించాలన్న ఆలోచనకే భయపడతారు. 18 ఏళ్ళ లోపు బాలలపై లైంగిక హింసకు పాల్పడితే ఇరవై ఏళ్ళ వరకు జైలు శిక్ష విధిస్తారు. ఈ నేరం చేసింది బంధువులు, ప్రభుత్వ ఉద్యోగులు, పాఠశాల సిబ్బంది, వసతి గృహ సిబ్బంది ఐతే మరణ శిక్షకు కూడా ఆస్కారం ఉంటుంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో ప్రత్యేక న్యాయస్థానాలు త్వరితంగా విచారణ పూర్తి చేసి నేరస్థులకు మరణశిక్షలు విధించాయి.
భారత ప్రభుత్వ లైంగిక నేరస్థుల జాతీయ డేటాబేస్‌లో 10.69 లక్షల మంది లైంగిక నేరస్థుల వివరాలు– పేర్లు, చిరునామాలు, ఫోటోలతో సహా పోలీస్ శాఖకు అందుబాటులో ఉన్నాయి. ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా వంటి కొద్ది దేశాలలో మాత్రమే ఈ అవకాశం ఉన్నది. అమెరికాలోనైతే ఈ నేరస్థుల సమాచారం సామాన్యులకు కూడా అందుబాటులో ఉన్నది. భారత్ కూడా ఈ దిశగా ముందడుగు వేయాలి. బాలల హక్కులను పరిరక్షించడం సమిష్టి బాధ్యత.
శ్రీనివాస్ మాధవ్
(నేడు ప్రపంచ బాలల దినోత్సవం)
Updated Date - Nov 20 , 2024 | 02:07 AM