ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఐదు శతాబ్దాల మేళత్తూరు భాగవత మేళ

ABN, Publish Date - May 19 , 2024 | 03:48 AM

శ్రీరంగంలోని రంగనాథాలయం జరుపుకునే ఉగాది మీకు తెలుసా? ఆ కావేరీ రంగనాథుడు తెలుగు ఉగాదే జరుపుకుంటాడు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు అనగానే భౌతికమైన ప్రాంతాలు అనే నిర్వచనాన్ని అలవోకగా...

శ్రీరంగంలోని రంగనాథాలయం జరుపుకునే ఉగాది మీకు తెలుసా? ఆ కావేరీ రంగనాథుడు తెలుగు ఉగాదే జరుపుకుంటాడు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు అనగానే భౌతికమైన ప్రాంతాలు అనే నిర్వచనాన్ని అలవోకగా తీసుకోవడం వల్ల కొన్ని కీలకమైన విషయాలు చేజారిపోయాయేమో అని అనిపిస్తుంది. ప్రతి ఏటా నరసింహ జయంతికి తంజావూరుకు సమీపంలో ఉండే మేళత్తూరు అనే గ్రామంలో తెలుగు భాగవతమేళ సాంప్రదాయం సుమారు ఐదు శతాబ్దాలుగా ఉందంటే తెలుగు పునాదులు ఏ స్థాయిలో ఉన్నాయో గమనించాలి. కావేరీ తీరంలో ఉండే ఈ మేళత్తూరు, తెలుగు భాషతో కర్ణాటక సంగీతానికి పీఠాన్ని, చట్టాన్ని సిద్ధం చేసిన త్యాగరాజస్వామి సమాధి ఉండే తిరువయ్యారుకు ఎంతో దూరంలో లేదు.


1550లో విజయనగర సామ్రాజ్య చక్రవర్తులు చెవ్వప్ప నాయకుని కుమారుడైన అచ్యుతరాయలను తంజావూరు పాలకుడిగా నియమించారు. కళాదృష్టితో భాగవతమేళ సంప్రదాయ నైపుణ్యంలో నిష్ణాతులైన 500 మంది బ్రాహ్మణులకు భూదానం సమృద్ధిగా చేసి ఆశ్రయం కల్పించారు. అదే అచ్యుతాపురం లేదా ఉన్నతాపురం. దీనినే తమిళంలో మేళత్తూర్ లేదా మేళట్టూర్ అని అంటారు. త్యాగరాజ స్వామికి సమకాలీనులైన మేళత్తూరు వెంకటరామశాస్త్రి రచించిన పది నాట్యనాటకాలను ఇప్పుడు ఈ మేళత్తూరు భాగవత మేళ కళారూపానికి ప్రామాణికంగా పరిగణిస్తున్నారు. వెంకట్రామశాస్త్రి తండ్రి గోపాలకృష్ణయ్య, కూచిపూడి సిద్దేంద్రయోగికి మిత్రులు, సమకాలీనులనీ; వీరిద్దరూ నారాయణ తీర్థుల శిష్యులని అంటారు. అంతకుమించి నారాయణ తీర్థులు కూడా కొంతకాలం ఈ మేళత్తూరులో ఉన్నారని కూడా నమ్ముతున్నారు.

కూచిపూడి, భరతనాట్యం వలే సంపద్వంతమైన శాస్త్రీయ కళ ‘మేళత్తూరు భాగవతమేళ’. అయితే ఇది నాట్య పద్ధతుల కన్నా విభిన్నమైనది. ఎందుకంటే ఈ కళారూపం నాట్యం, నాటకం మేళవింపు. అంతకుమించి నాట్యంలో అవకాశాలు లేని పురుషులకు అవకాశం కల్పించాలని ఈ ప్రయోగం జరిగింది కనుకనే, ఇందులో నటన, నాట్యం, గానం, సంగీతం ఈ మూడింటిని పురుషులే నిర్వహిస్తారు. అంతకుమించి స్త్రీ పాత్రలను కూడా (ఇప్పటికీ) పురుషులే ధరిస్తున్నారు. అందువల్లనే స్త్రీ పాత్రలకు సంభాషణలు చాలా చాలా తక్కువగా ఉంటాయి లేదా ఉండనే ఉండవు. భరతనాట్యం తమిళ ప్రాంతంలోనూ కూచిపూడి తెలుగు ప్రాంతంలోనూ వృద్ధి చెంది ప్రాచుర్యం గడించాయి. అయితే మేళత్తూరు భాగవతమేళ పూర్తి సాంప్రదాయ బద్ధంగా, కొన్ని కుటుంబాల మధ్యనే నిలిచిపోయింది. సరైన గుర్తింపు, వేదిక లేకపోవడంతో దీనిని జానపద కళారూపంగా కూడా పేర్కొనడం కూడా ఉంది. ఇది తెలుగు కళారూపం కానీ, నిలబడి సాగుతున్నది తమిళ ప్రాంతానికి కేంద్ర స్థానం వంటి తంజావూరు చెంత. కనుకనే రెండు, మూడు దశాబ్దాల క్రితం దాకా ఈ భాగవతమేళ గురించి ప్రధాన స్రవంతి సమాచారంగా కూడా మనకు తెలుగుప్రాంతంలో అందుబాటులో ఉండేది కాదు.


ఒకప్పుడు చాలా ప్రాంతాల్లో ఈ భాగవతమేళ నడిచేది. మొన్న మొన్నటిదాకా తంజావూరు ప్రాంతంలో శాలియమంగళం, శూలమంగళం, నల్లూరు, ఊతకాడు, పులిమేడు, గోవిందాపురం, తిరువిళ నెల్లూరు, తేపేరమానల్లూరు వంటి గ్రామాల్లో విరివిగా ప్రదర్శనలు జరిగేవి. ఇప్పటికీ చెదురుమదురుగా జరుగుతున్నాయి కూడా. అయితే వీటిలో ఊరు ఊరుకూ ప్రదర్శనల్లో కొంత తేడా కూడా కనబడుతుంది. కొన్ని చోట్ల నాట్యం ప్రధానంగా ఉండడం, కొన్నిచోట్ల నాటకంలాగా ఎక్కువ సంభాషణలు ప్రధానంగా ఉండడం కూడా గమనించవచ్చు. నిజానికి తెలుగు, తమిళ భాషల్లో మహారక్తి కట్టిన ‘భక్త ప్రహ్లాద’ సినిమాకు కూడా ఈ కళారూపమే మాతృక అని అన్నా ఆశ్చర్యం లేదు. ఏడెనిమిది సంవత్సరాల క్రితం మేళత్తూరు ప్రదర్శనకు వెళ్ళినప్పుడు, తెల్లవారుజామున మూడు, నాలుగు ఊర్లు కూడా వెళ్లి ఆయా ప్రదర్శనలను కొంత కొంత పరిశీలించిన అనుభవం భవదీయుడుకు ఉంది. అయితే కేంద్ర స్థానం మాత్రం మేళత్తూరు మాత్రమే. ఇప్పటికీ ప్రతి నరసింహ జయంతికి విద్యుత్ దీపాలు లేకుండా, అరటి బోదెల మీదుంచిన ఆముదం దీపాల వెలుగులో ఈ ప్రదర్శనను మహానిష్టగా చేస్తున్నారు.


వెంకట్రామశాస్త్రికి ముందే ఈ కళారూపం మొదలై స్థిరపడి ఉండాలి. అయితే శాస్త్రి పది నాట్యనాటకాలను రచించి చట్రాన్ని సిద్ధం చేశారు అందులో 9 తెలుగు కాగా ఒకటి తమిళం. ప్రహ్లాద చరిత్ర, రుక్మిణి కళ్యాణం, సీతా కళ్యాణం, ఉషా పరిణయం, కృష్ణ జనన లీల, మార్కండేయ చరిత్ర, పార్వతీ కళ్యాణం, ధ్రువ చరిత్ర, హరిహర లీలా విలాసం, హరిశ్చంద్ర. తంజావూరు ప్రాంతం తెలుగు నాయకులు, తర్వాత మరాఠీ ప్రభువుల చేతికి వెళ్ళింది. వారు కూడా ఈ కళా సంప్రదాయాన్ని ప్రోత్సహించారనడానికి ఆధారాలు ఉన్నాయి. 1696–1797 మధ్యకాలంలో జీవించిన మహారాజు రెండవ ఏకోజి ‘శాకుంతలం’ అనే మరాఠీ భాగవత మేళను రచించారు. ఈ కళాసంప్రదాయాలు తాళపత్ర గ్రంథాల కాలం నాటివి. అవి ఉచ్ఛ దశలో ఉన్నప్పుడు అచ్చు సదుపాయాలు అందుబాటులోకి రాలేదు. కనుక ప్రధానంగా మౌఖికంగానే వాటిని నేర్చుకొని, నైపుణ్యం సాధించారు. తర్వాతి కాలంలో ఈ కళారూపంలో ప్రవేశించిన వారు తమిళ లిపిలో రాసుకుని ప్రదర్శించడం మొదలైంది. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడటానికి ముందు, తర్వాత ఈ కళారూపం పట్ల పెద్దగా ఆసక్తి చూపినట్టు లేదు. అంతకుముందు కాలంలో రాజసంస్థానాల తోడ్పాటుతో పరిఢవిల్లాయి. గడచిన ఏడు దశాబ్దాలలో మేళత్తూరు గ్రామం తెలుగు ప్రాంతపు సరిహద్దుకు 500 కిలోమీటర్లు కావడంతో మనం చాలా సాంస్కృతిక మూలాలను మరిచిపోయినట్టే దీన్ని కూడా మరచిపోయామేమో!


1964లో భాగవతమేళా నాట్య విద్యా సంఘం ఏర్పడింది. అంతకు ముందు ఎటువంటి బ్యానర్ లేకుండా ఈ ప్రదర్శనలు జరిగేవి. అయితే భారతం నటేశమయ్యర్ ఎంతో కృషి చేశారు. అంటే 60 ఏళ్లుగా ప్రతి నరసింహ జయంతికి తప్పనిసరిగా ఈ మేళత్తూరు వెంకట్రామ శాస్త్రి రచించిన ‘ప్రహ్లాద చరిత్ర’ను ప్రదర్శింపబడుతూనే ఉంది. అలాగే మద్రాస్, కాంచీపురం, తిరవయ్యారు, తిరువనంతపురం ఇలా ఈ ప్రదర్శనలు ఆదరణ పాత్రమయ్యాయి. ‘హరిశ్చంద్ర’ నాట్య నాటకం తాళపత్ర ప్రతి ఈ విద్యా సంఘం దగ్గర జాగ్రత్తగా భద్రపరచబడింది. అలాగే నటేశమయ్యర్ చేసిన పరిశోధనలకు సంబంధించిన ఆధారాలు కూడా ఈ సంస్థ దగ్గరే ఉన్నాయి. 1995లో ‘మార్కండేయ’ ప్రతిని తొలిసారి వ్యాఖ్యానంతో ప్రచురించారు. 2013లో ‘ఏన్షియంట్ టెంపుల్ థియేటర్ ఫామ్స్ ఆఫ్ సౌత్ ఇండియా’ మోనోగ్రాఫ్‌ను కూడా ఈ విద్యా సంఘం ప్రచురించింది.

ఇప్పుడు రెండు బృందాలు ఈ మేళత్తూరు భాగవతమేళ కళారూపాన్ని పరిరక్షిస్తూ ప్రచారం చేస్తున్నాయి. ఒక బృందానికి సారథి అయిన నటరాజన్ కొన్ని సంవత్సరాల క్రితం కనుమూయగా వారి తమ్ముడు కుమార్ ఈ కృషి కొనసాగిస్తున్నారు. మరొక వ్యక్తి ఆర్.మహాలింగం అయ్యర్. మేళత్తూరులో కె.రామలింగ అయ్యర్, భాగ్యలక్ష్మి దంపతులకు 1954 సెప్టెంబర్ 13న జన్మించిన మహాలింగం ఎనిమిదేళ్ల వయసులో ఈ కళారూపంలోకి స్త్రీ పాత్రల ద్వారా ప్రవేశించారు. 1975లో ఎకనామిక్స్‌తో బీఏ పూర్తి చేసినా, ఈ కళారూపం మీద మక్కువతో ఏ ఉద్యోగంలో చేరకుండా అదే ఊరులోనే ఉండిపోయారు. పద్మశ్రీ బాలు భాగవతార్‌తో పాటు కలైమామణి పీకే సుబ్బయ్యర్, కలైమామణి టిజి పావు పిళ్ళై, కలైమామణి హేమాంబరనాథన్ వంటి వారు మహాలింగం గురువులు.


1989 నుంచి ఒక నిష్ఠగా, మహాలింగం ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా ఉత్సవంగా కొనసాగిస్తున్నారు. దాతల విరాళం ఉంటుంది, కానీ కొన్నిసార్లు అది సరిపోక ఇబ్బంది పడిన సందర్భాలు లేకపోలేదు. ఒకసారి అగ్ని ప్రమాదంలో ఎంతో నష్టం సంభవించింది కూడా. సినీనటుడు అరవిందస్వామి తండ్రి విడి.స్వామి మేళత్తూరు గ్రామానికి చెందినవారే. వీరు స్థాపించిన ‘మెలట్టూరు భాగవతమేళా నాట్య నాటక ట్రస్ట్’ నల్లి కుప్పస్వామి చైర్మన్‌గా ఈ కార్యక్రమాలు చేస్తోంది. ఆ గ్రామంలో ఉండే నరసింహ దేవాలయం ప్రాంగణంలోనే ఒక స్థిరమైన ఆడిటోరియం కూడా ఇప్పుడు నిర్మాణమైంది. వీటన్నిటికీ కేంద్ర బిందువుగా నిలిచింది మహాలింగం అయ్యర్.‌ మహాలింగం తన బృందంతో ప్రదర్శనలను మేళత్తూరులో ఏటా నిర్వహిస్తూనే; తిరుపతి, హైదరాబాదు, గుంటూరు, రాజమండ్రి వంటి తెలుగు ప్రాంతాలతో సహా ఇతర ప్రాంతాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. దీనికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం, తెలుగు విశ్వవిద్యాలయం వంటివి ఎంతో కొంత సాయం చేస్తున్నాయి. కానీ ఇంకా పెద్ద ఎత్తున దోహదపడాల్సిన అవసరం ఉంది. ఈ భాగవతమేళలో పాల్గొనే నటులు వేర్వేరు ఊళ్ళలో ఉద్యోగాలు చేస్తూ ప్రదర్శన ఉన్న సమయంలో మాత్రం తప్పనిసరిగా వచ్చి పాల్గొనడం రివాజు.


ప్రధాన మేళత్తూరు భాగతమేళా ప్రతులన్నీ తెలుగులోనే ఉన్నాయి, వీటిని తెలుగు తెలియని వారు కంఠస్థం చేసి ప్రదర్శన ఇస్తున్నారు. ఇలా జరిగినప్పుడు జరగబోయే, జరిగే ప్రమాదాలు గమనించి మహాలింగం అయ్యర్ 2016 నుంచి వీటిని పరిష్కరించి ప్రచురిస్తున్నారు. అది కూడా తెలుగులో ఒక పేజీ, దానికెదురు పేజీలో సంస్కృతంలో ఉంటుంది. ఇంతవరకు ప్రహ్లాద చరిత్ర, సీతా కళ్యాణం, మార్కండేయ చరిత్ర, ఉషా పరిణయం, కృష్ణ జననం ప్రచురించారు. ఈ సంవత్సరం మే 21వ తేదీ నరసింహ జయంతి రోజున మేళత్తూరులో ‘హరిశ్చంద్ర’ పుస్తక ఆవిష్కరణతో పాటు ‘ప్రహ్లాద చరిత్ర’ ప్రదర్శన కూడా ఉంటుంది.

డాక్టర్ నాగసూరి వేణుగోపాల్

(మే 21న నరసింహ జయంతి. మేళత్తూరులో

‘ప్రహ్లాద చరిత్ర’ ప్రదర్శన, ‘హరిశ్చంద్ర’ పుస్తకావిష్కరణ)

Updated Date - May 19 , 2024 | 03:48 AM

Advertising
Advertising