మోదీజీ, హిమాలయాల ఘోష వినరా?
ABN, Publish Date - Oct 18 , 2024 | 02:53 AM
హిమాలయ ప్రాంతాల, ప్రజల అభివృద్ధి విషయమై మనకు ఒక సమగ్ర విధానం ఉన్నదా? స్వాతంత్ర్య తొలి దశాబ్దంలోనే సమగ్ర ‘హిమాలయన్ విధానం’ భారత్‌కు అవసరం అని డాక్టర్ రామ్‌మనోహర్ లోహియా....
హిమాలయ ప్రాంతాల, ప్రజల అభివృద్ధి విషయమై మనకు ఒక సమగ్ర విధానం ఉన్నదా? స్వాతంత్ర్య తొలి దశాబ్దంలోనే సమగ్ర ‘హిమాలయన్ విధానం’ భారత్‌కు అవసరం అని డాక్టర్ రామ్‌మనోహర్ లోహియా నొక్కి చెప్పారు ఇంజినీర్, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ నేతృత్వంలో లేహ్ నుంచి న్యూఢిల్లీకి లద్దాఖ్ వాసుల చరిత్రాత్మక పాదయాత్ర ప్రస్తుత పాలకులకు లోహియా డిమాండ్‌ను గుర్తుచేసేందుకు తోడ్పడవచ్చు. భారత్, చైనా సరిహద్దుల్లోని భారత పౌరులు నెల రోజుల పాటు 1000 కిలోమీటర్లు నడిచి తమ జాతీయ రాజధానికి చేరుకున్నప్పుడు వారు చెప్పదలుచుకున్నది వినడం దేశ పాలకుల కనీస ధర్మం కాదూ? అయితే జరిగిందేమిటి? ఢిల్లీలో హఠాత్తుగా సెక్షన్ 144 విధించి, వందల మైళ్ల దూరం నడిచి వచ్చిన లద్దాఖ్ ప్రజలను చట్టబద్ధమైన కారణం లేకుండానే నిర్బంధించారు. గాంధేయ పద్ధతుల్లో నిరసన దీక్ష నిర్వహించేందుకు అనుమతి నిరాకరించారు. లద్దాఖ్ భవన్‌లో నిర్బంధితులు అయిన సోనమ్ వాంగ్ చుక్ అక్కడే నిరసన దీక్ష ప్రారంభించి కొనసాగిస్తున్నారు. తమకు సంఘీభావంగా దీక్షలో పాల్గొనాలని ఇతరులను వాంగ్ చుక్ ఆహ్వానిస్తే పోలీసులు ఆయన మద్దతుదారులపై విరుచుకుపడి పలువురిని నిర్బంధించారు. లద్దాఖ్ పౌర సమాజ సమూహాలు అయిన లేహ్ అపెక్స్ బాడీ (ఎల్‌పిబి), కార్గిల్ డెమొక్రాటిక్ అలయెన్స్ (కెడిఏ) ఆధ్వర్యంలో లద్దాఖీలు ఎన్నో నెలలుగా ఆందోళన చేస్తున్నారు. అయినా వారి సమస్యలు, డిమాండ్లను విశాల భారతావని పట్టించు కోవడమే లేదు.
ఇటీవలి కాలంలో హిమాలయన్ ప్రాంతాలలో సంభవించిన వివిధ ఘటనలపై మనం సుసంగతమైన అవగాహన పెంపొందించుకోవల్సిన అవసరమున్నది. లద్దాఖ్‌లో పెల్లుబికిన ప్రజల నిరసన వాటిలో ఒకటి మాత్రమే. ఇతర ఘటనలు: అధికరణ 370 రద్దు అనంతరం కశ్మీర్‌లో సంభవిస్తున్న పరిణామాలు, ఉత్తరాఖండ్‌లో భారీ భూపాతాలు, నేపాల్‌లో ప్రభుత్వం మార్పు, సిక్కింలో వెల్లువెత్తిన ఆకస్మిక వరదలు, చైనాకు భూటాన్ సన్నిహిత మవడం, అసోంలో ఎన్‌పిఆర్ కల్లోలం, మణిపూర్‌లో అంతర్యుద్ధం మొదలైనవి. ఈ ఉపద్రవాలు అన్నిటినీ మనం సమగ్ర, నిష్పాక్షిక దృక్పథంతో అర్థం చేసుకోవాలి. మరి మనం వాటిని భౌమ రాజకీయ, అంతర్గత భద్రత, ప్రాకృతిక విపత్తు, జాతుల వైరంకు సంబంధించిన ఘటనలుగా భావిస్తున్నాం. అయితే హిమాలయ ప్రాంతాలు, రాజ్యాల మధ్య పరస్పర సంబంధాలు, అవి ఎదుర్కొంటున్న సమస్యలపై ఒక సమగ్ర దృక్పథాన్ని పెంపొందించుకోవాలని ఏడు దశాబ్దాల క్రితమే డాక్టర్ రామ్‌మనోహర్ లోహియా విజ్ఞప్తి చేశారు. పశ్చిమాన ఉన్న పఖ్తూనిస్తాన్ నుంచి తూర్పున ఉన్న బర్మా దాకా విశాల హిమాలయ పర్వత సీమలలోని వివిధ ప్రాంతాల, ప్రజల సమస్యల పరిష్కారానికి ఒక పరిపూర్ణ ప్రజాస్వామిక దృక్పథాన్ని అనుసరించాల్సిన అవసరమున్నదని లోహియా స్పష్టం చేశారు.
స్వతంత్ర భారతదేశానికి తొలినాళ్లలోనే చైనా విస్తరణ వాదం నుంచి ముప్పు వాటిల్లిన నేపథ్యంలో హిమాలయన్ విధాన రాజకీయ కోణాలకు లోహియా ప్రాధాన్యమిచ్చారు. భారత్‌కు ఎదురవుతున్న బాహ్య, అంతర్గత సవాళ్లు ఎలా ముడివడి ఉన్నదీ ఆయన విశ్లేషించారు. భారత్ లోపల, బయట హిమాలయన్ ప్రజల ప్రజాస్వామిక హక్కుల కోసం ఆయన నిలబడ్డారు. టిబెట్, నేపాల్ పాలకులకు వ్యతిరేకంగా ఆయా దేశాల ప్రజలు చేస్తున్న పోరాటాలకు భారత్ మద్దతునివ్వాలని ఆయన ప్రతిపాదించారు. కశ్మీర్, నాగాలాండ్ తిరుగుబాటుదారులతో ప్రజాస్వామిక చర్చలు జరపాలని ఆయన వాదించారు. ఈశాన్య భారత రాష్ట్రాలలో ఆదివాసీలు, ఆదివాసీయేతరులను సామాజికంగా, భౌతికంగా వేర్వేరుగా ఉంచాలన్న వెర్రియర్ ఎల్విన్ ప్రతిపాదిత గిరిజన విధానాన్ని లోహియా తీవ్రంగా వ్యతిరేకించారు.
హిమాలయన్ విధానంపై లోహియా దార్శనికత ఆ ప్రాంత ప్రజల మధ్య బహుళ సమైక్యతలను ఆకాంక్షించింది. అవి: హిమాలయన్ ప్రాంతంలోని వివిధ దేశాలలో నివసిస్తున్న ప్రజల మధ్య ఐకమత్యం, భారతదేశ పౌరులతో ఇరుగు పొరుగు దేశాల ప్రజల ఏకత్వం; హిమాలయ ప్రాంతాల సంస్కృతులు, సమాజాలు, విశాల భారతావనిలోని వివిధ సమాజాల, సంస్కృతుల మధ్య సమైక్యతను ఆయన ప్రగాఢంగా ఆకాంక్షించారు. హిమాలయ ప్రాంతం పట్ల లోహియా వలే శ్రద్ధాసక్తులు, సహానుభూతిని చూపిన విజ్ఞులు ఇద్దరు మాత్రమే ఉన్నారు. వారిలో ఒకరు మహా పండితుడు, మహోన్నత రచయిత, నిత్య సంచారజీవి అయిన రాహుల్ సాంకృత్యాయన్ కాగా రెండవ వ్యక్తి తాత్త్విక యాత్రికుడు కృష్ణనాథ్.
హిమాలయ ప్రాంతాల పట్ల మరింత శ్రద్ధాసక్తులు చూపవలసిన అవసరం ఉన్నదనే వాస్తవాన్ని సోనమ్ వాంగ్ చుక్, ఆయన సహచరులు మనకు గుర్తుచేశారు. అంతేకాకుండా మన కాలంలో హిమాలయన్ విధానం ఎలా ఉండాలి, దాని ఉపయుక్తత ఏమిటి అనే విషయమై మన అవగాహనను విశేషంగా మెరుగుపరిచారు. ఢిల్లీ లేదా పుదుచ్చేరిలో వలే ప్రజలు ఎన్నుకున్న శాసనసభతో లద్దాఖ్‌ను కూడా ఒక పూర్తి స్థాయి రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసి లద్దాఖ్ ప్రజలకు ప్రజాస్వామిక పాలన సమకూర్చాలని వాంగ్ చుక్ డిమాండ్ చేశారు. జమ్మూ–కశ్మీర్‌లో తమ ఉనికి దశాబ్దాల పాటు పూర్తిగా ఉపేక్షింపబడినందున తాము ఎన్నుకున్న, తమకు జవాబుదారీగా ఉండే ప్రభుత్వ పాలనను లద్దాఖ్ ప్రజలు కోరుకుంటున్నారు. ఇది పూర్తిగా సహేతుకమైన, సానుభూతి చూపవలసిన డిమాండ్ అనడంలో సందేహం లేదు. లద్దాఖ్ జనాభా ఇంచుమించు మూడు లక్షలు మాత్రమే. అయోధ్య, హిసార్ లాంటి చిన్న పట్టణాల జనాభా కంటే ఇది ఏ మాత్రం ఎక్కువ కాదు. అయితే లద్దాఖ్ విస్తీర్ణం 59,000 చదరపు కిలోమీటర్లు. జమ్మూ కశ్మీర్ కంటే చాలా పెద్ద ప్రాంతం. మణిపూర్, మిజోరం, నాగాలాండ్‌ల మొత్తం విస్తీర్ణం కంటే లద్దాఖ్ విస్తీర్ణమే ఎక్కువ. అరుణాచల్ ప్రదేశ్‌కు ఉన్నట్లుగానే ఈ సువిశాల లద్దాఖ్‌కు కూడా లోక్‌సభలో ఇద్దరు ప్రతినిధులు, రాజ్యసభలో ఒక ప్రతినిధి ఎందుకు ఉండకూడదు? ఈ విషయంలో లద్దాఖ్ ప్రజల న్యాయబద్ధమైన ఆరాటాన్ని న్యూఢిల్లీ అర్థం చేసుకోవాలి.
వికేంద్రీకృత ప్రజాస్వామ్యాన్ని లద్దాఖ్ ప్రజలు కోరుకుంటున్నారు. ఆదివాసీ ప్రజల పరిపాలనకు సంబంధించిన రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ హోదా లద్దాఖ్‌కు కూడా కల్పించాలన్నదే లేహ్ నుంచి డిల్లీ పాదయాత్ర తక్షణ, ప్రధాన డిమాండ్. 6వ షెడ్యూల్‌లో చేర్చడం లేహ్, కార్గిల్‌తో సహా లద్దాఖ్‌లోని ఎమిమిది జిల్లాల్లోనూ నివసిస్తున్న విభిన్న గిరిజన తెగలు తమ సొంత అటానమస్ జిల్లా కౌన్సిల్‌ను కలిగి ఉండే సౌలభ్యం లభిస్తుంది. ఆయా గిరిజన తెగల అంతర్గత పాలనా వ్యవహారాలకు అటానమస్ జిల్లా కౌన్సిల్ బాధ్యత వహిస్తుంది. దీనివల్ల ప్రతి గిరిజన సముదాయానికీ తమ సొంత సంస్కృతి, అస్తిత్వాన్ని సంరక్షించుకునే సాధికారత సమకూరుతుంది. భారతీయ జనతా పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఈ విషయమై లద్దాఖ్ వాసులకు హామీ ఇవ్వడం గమనార్హం.
సోనమ్ వాంగ్ చుక్ నేతృత్వంలో నడుస్తున్న ఉద్యమం కేవల రాజకీయ డిమాండ్లకే పరిమితమైనది కాదు. స్థానిక ప్రజలకు భూములు, ఉద్యోగాలు, సాంస్కృతిక హక్కులు కల్పిస్తూ పర్యావరణ ప్రజాస్వామ్యంగా అభివర్ణించదగిన వ్యవస్థ నొకదాన్ని నిర్మించాలని వారు కోరుతున్నారు. విచక్షణారహితంగా జల విద్యుదుత్పాదన ప్రాజెక్టుల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారు. అయితే ‘అభివృద్ధి’ని వారు వ్యతిరేకించడం లేదు. వాంగ్ చుక్ వృత్తిరీత్యా ఒక ఇంజనీర్, నవకల్పన నిపుణుడు. బోధనా పద్ధతులు స్థానిక సామాజిక, సాంస్కృతిక పరిస్థితుల్లో వేళ్లూనుకుని ఉండే ఒక కొత్త విద్యా ఉద్యమానికి ఆయన ఆద్యుడు. ఈ విద్యా కృషి ఫలితంగానే ఆయనకు 2018లో రామన్ మెగాసెసే అవార్డు లభించింది. వాంగ్ చుక్, ఆయన సహచరులు అభివృద్ధిలో తమకు వాటా మాత్రమే కోరడం లేదు, ఒక కొత్త అభివృద్ధి నమూనాను వారు డిమాండ్ చేస్తున్నారు.
కొత్త అభివృద్ధి నమూనాకు పట్టుదలే సోనమ్ వాంగ్ చుక్ నిరసన దీక్షకు, ఇతర నిరసనలు, ఆందోళనలు, ఉద్యమాలకు భిన్నంగా ఒక ప్రత్యేకతను సమకూరుస్తుంది. అయితే మన ప్రజాస్వామ్య సమాజంలో ఆ ఉద్యమాలన్నీ విలువైనవే, సందేహం లేదు. భారత రాజ్య వ్యవస్థతో ఒక నైతిక సమానతను ప్రారంభించారు. ఇది మనకు బ్రిటిష్ సామ్రాజ్యంతో గాంధీజీ ఎలా తలపడేవారో గుర్తుకు తెస్తుంది. వాంగ్ చుక్ తన ప్రజల తరపున న్యాయబద్ధమైన రాజకీయ డిమాండ్లు చేస్తున్నారు. అయితే ఆ డిమాండ్లను నెరవేర్చాలని న్యూఢిల్లీ పాలకులను వేడుకొనేందుకు ఆయన తిరస్కరిస్తున్నారు. బతిమలాడడమనేది ఆయన స్వభావం కానేకాదు. ఆయన దృఢసంకల్పుడు. కయ్యానికి కాలు దువ్వడం ఆయన నైజం కాదు. గాంధేయ పద్ధతుల్లో ఆయన పోరాడుతున్నారు.
లోహియా రోజుల్లో హిమాలయన్ విధానం అనేది ఒక కొత్త వినూత్న విషయం. ఇప్పుడది ఒక వ్యవస్థాపిత వివేకం. హిమాలయాలు (విదేశీ దాడుల నుంచి) మన సంరక్షకులు అన్న కవితాత్మక భావన స్థానంలో, అపరిమిత రహదారులు, వంతెనలు, భవనాలకు ఆ యువ, దుర్భల పర్వత శ్రేణులు ఇంకెంత మాత్రం ఆధారభూతం కాలేవన్న అవగాహన పెరుగుతోంది. సైనిక దళాల, భౌమ రాజకీయ కేంద్రిత జాతీయ భద్రతా దృక్పథం స్థానంలో హిమాలయాలలో నివసించే ప్రజల ఆకాంక్షలు, అవసరాలకు ప్రాధాన్యమిచ్చే మానవ శ్రేయోభావన మొగ్గ తొడుగుతోంది ప్రాకృతిక అందాలకు అసాధారణ నెలవులు అన్న పర్యాటక వాద దృక్పథం స్థానంలో జలవనరులు, ఔషధ తరువులు, జీవ వైవిధ్యం, సుస్థిర జీవనాధార ఆచరణలకు హిమాలయాలే ప్రాతిపదికలు అన్న వివేకం వృద్ధి పొందుతోంది. హిమాలయాలు అంటే ప్రదేశాలు మాత్రమే కాదు, ప్రజలు కూడా అన్న సత్యాన్ని భారత రాజ్య వ్యవస్థ ఇంకా పూర్తిగా గుర్తించలేదు.
న్యూఢిల్లీలో సోనమ్ వాంగ్ చుక్ నిరసన దీక్ష కొనసాగుతోంది. లద్దాఖ్ ప్రజల విజ్ఞప్తులను నివేదించేందుకు రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర హోం మంత్రితో సమావేశమయ్యేందుకు అవకాశమివ్వాలని మాత్రమే ఆయన కోరుకుంటున్నారు. హిమాలయాల వివేకాన్ని ఆయన న్యూఢిల్లీకి తీసుకువచ్చారు. మరి మన రాజకీయ నాయకత్వం హిమాలయాల సమస్యలు, ఆకాంక్షలను వింటుందా? లేక హిమాలయన్ ఆగ్రహం ఢిల్లీపై విరుచుకుపడేదాకా వేచి ఉంటుందా?
యోగేంద్ర యాదవ్
(వ్యాసకర్త ‘స్వరాజ్ ఇండియా’ అధ్యక్షుడు)
Updated Date - Oct 18 , 2024 | 02:53 AM