ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నా మొదటి పుస్తకం నన్ను లెఫ్టిస్ట్‌ని చేసింది

ABN, Publish Date - Jul 29 , 2024 | 02:16 AM

నా తొలి కవితా సంపుటి ‘రక్తం సూర్యుడు’ గురించి ఆంధ్రజ్యోతి మిత్రులు నాలుగు మాటలు రాయమంటే నా మనసు గతంలోకి వెళ్ళిపోయింది. ఒక సంక్షోభ దశలో, నక్సల్బరీలో మొదలైన సాయుధ పోరాట ఉద్యమం...

నా మొదటి పుస్తకం నన్ను లెఫ్టిస్ట్‌ని చేసింది

నా తొలి కవితా సంపుటి ‘రక్తం సూర్యుడు’ గురించి ఆంధ్రజ్యోతి మిత్రులు నాలుగు మాటలు రాయమంటే నా మనసు గతంలోకి వెళ్ళిపోయింది. ఒక సంక్షోభ దశలో, నక్సల్బరీలో మొదలైన సాయుధ పోరాట ఉద్యమం ఉత్తరాంధ్ర దాకా పాకి గోదావరి లోయలోకి ప్రవేశించిన తొలి రోజుల్లో, 1966లో నేను హైదరాబాద్‌ వచ్చాను. అప్పటికి దాకా పద్యాలు రాసుకునేవాడ్ని. రాజకీయాలతో అంతంతమాత్రం పరిచయం ఉన్న నేను హైదరాబాద్‌కి వచ్చీ రాగానే సరాసరి విద్యార్థి ఉద్యమంలోకి ప్రవేశించాను. పాత వాసనలు వదిలించుకున్న తర్వాత కొత్త రాజకీయాల సాయుధ పోరాట ఉద్యమం నా దృక్పథ, కవిత్వ రూపు రేఖల్ని మార్చివేసింది. 70లలో విరసం ప్రారంభమైంది. అది కూడా నాకు పూర్తి స్ఫూర్తి. విరసంతో పుట్టిపెరిగిన వాడ్ని అని చెబుతుండేవాడ్ని. అప్పటిదాకా రాసి పత్రికల్లో అచ్చయిన పద్యాల్నించి ఏరి వాటిని అన్ని రకాల మార్పుల తర్వాత ‘రక్తం సూర్యుడు’గా అచ్చేశాను.


ఈ పుస్తకం ముఖచిత్రం డిజైన్‌కు శీలా వీర్రాజుగారు పడ్డ శ్రమ మామూలైంది కాదు. ఖైరతాబాద్‌లోని మా ఇంటికి వచ్చి నన్ను దగ్గర్లో ఉన్న ఫొటో స్టూడియోకి తీసుకుపోయి రకరకాల భంగిమల్లో ఫొటోలు తీయించి దాంట్లో ఒకటి సెలెక్ట్‌ చేసి మెరుగులు దిద్ది ఆ కవర్‌ ఫొటో తయారు చేశారు. బ్రౌన్‌ పేపరు మీద 500 కాపీలు, ప్యూర్‌ వైట్‌ 90 జిఎస్‌ఎమ్‌ మీద మరో 500 కాపీలు అచ్చు వేశాం. ఆ కాయితం కోసం సికింద్రాబాద్‌ అంతా నన్ను తిప్పి విసిగించారు. అక్కడ్నించి పది రీముల పేపర్‌ని ఆటోలో వేసుకొచ్చి, ఖైరతాబాద్‌లో ఉన్న వరలక్ష్మి ప్రెస్‌లో వేశాం. వీర్రాజు గారు లేకపోతే ఆ పుస్తకం అలా వచ్చేది కాదు. 1973లో అచ్చయిన ఆ పుస్తకం 74లోనో 75లోనో ఫ్రీవర్స్‌ ఫ్రంట్‌ అవార్డు పొందింది. కుందుర్తి గారు పేపరుకి ఆ సమాచారాన్ని ఇస్తూ నాకు ‘రాడికల్‌ పొయెట్‌’ అని కితాబు ఇచ్చారు. నూట పదహారు రూపాయలు బహుమతి ఇచ్చారు. ఆంధ్రజ్యోతిలో ‘నిజం’, విశాలాంధ్రలో అంపశయ్య నవీన్‌ మంచి రివ్యూలు రాశారు.


ఈ స్పందనలన్నీ ఆనాటి పరిస్థితుల్లో నాకు గొప్ప ఊతమిచ్చాయి. అనుకున్నదానికంటే ఎక్కువ రెస్పాన్స్‌ వచ్చింది. వెనక్కి తిరిగి చూసుకుంటే, ఆ కవిత్వం నా ఐడియలాజికల్‌ స్టాన్స్‌ని మార్చింది. నన్ను లెఫ్టిస్ట్‌ని చేసింది. అది నా బీజప్రాయపు దశ. నా పునాది. అక్కడి నుంచి ఈనాటి శివారెడ్డి లేచాడు. నలుదిక్కులకీ విస్తరించాడు. అప్పటి చాలామంది మిత్రులు ఇప్పటికీ దాన్ని చాలామంది పుస్తకంగా గుర్తు పెట్టుకున్నారు. ఆ సమయం, ఆ సందర్భం, ఆ కాలం గొప్పతనమది. అప్పుడు అక్కడ ఉండటమే నేను చేసుకున్న అదృష్టం. నేను ఆ కాలపు స్ఫూర్తిని పూర్తిగా అందుకున్నాను అనుకుంటాను. అక్కడి నుంచి ఈనాటి శివారెడ్డి చాలా దూరం ప్రయాణం చేశాడు.

Updated Date - Jul 29 , 2024 | 02:16 AM

Advertising
Advertising
<