నిత్యదీపావళి
ABN, Publish Date - Oct 31 , 2024 | 02:57 AM
శాంతికి నెలవౌచు సర్వంసహాస్థలి అలరారుచుండు గదా మతాబు ఉప్పరమంటెడు ఊహలకిరవౌచు తనియుచుండును గదా తారజువ్వ...
సీ. శాంతికి నెలవౌచు సర్వంసహాస్థలి
అలరారుచుండు గదా మతాబు
ఉప్పరమంటెడు ఊహలకిరవౌచు
తనియుచుండును గదా తారజువ్వ
అల్లరిపిల్లలకద్దంబు తానౌచు
తనరారుచుండు గదా సిసింద్రి
గమ్యము చేరని కాంక్షలకుద్దియై
చిందులాడును గదా చిచ్చుబుడ్డి
గీ. వెలయు కాకరపువ్వులు వెన్నముద్ద
ప్రిదిలి ప్రేలుటపాసులు ముదమొసంగు
నట్టి భూచక్రములు వీథులందునిండ్ల
యందు దీపావళిని కనువిందుచేయు
గీ. చెడునశించి ధర్మము విలసిల్లుకతన
వసుధ దీపావళినిలిచె పర్వముగను
జాగృతికిది మూలంబగు జాతికెపుడు
కాలమేదైన ధర్మంబు కాచు కడకు
గీ. హృదయమొకటి ప్రమిదకాగ ఎలమి ఆశ
యమ్ము వత్తికాగ ధృతి తైలమ్ము కాగ
లక్ష్యమాపైని దీపమై రమ్యకాంతి
తోడ రాజిల్లు జీవనోద్యోగమందు
గీ. అబల ఆ–సత్యభామయి అలరుచుండ
పురుషుడా కృష్టుడై పెనుపొందుచుండ
నరకులుందురే? ధరయెల్ల నాకమగును
సత్య నిత్యదీపావళి సందడించు
మంకుశ్రీను
Updated Date - Oct 31 , 2024 | 02:57 AM