ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఇంటిగ్రేటెడ్‌ గురుకులాలు వద్దు

ABN, Publish Date - Oct 29 , 2024 | 12:36 AM

గురుకుల పాఠశాలలు ఈ రాష్ట్రానికి కొత్తకాదు. దేశానికి ప్రభుత్వ రంగంలో గురుకుల విద్యను పరిచయం చేసిందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం. 1972లో పి.వి. నరసింహారావు నేతృత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలో మూడు గురుకుల...

గురుకుల పాఠశాలలు ఈ రాష్ట్రానికి కొత్తకాదు. దేశానికి ప్రభుత్వ రంగంలో గురుకుల విద్యను పరిచయం చేసిందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం. 1972లో పి.వి. నరసింహారావు నేతృత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలో మూడు గురుకుల పాఠశాలలను ఏర్పాటుచేసి వాటిని క్రమంగా విస్తరించారు. 1983లో యన్‌.టి. రామారావు నేతృత్వంలో ఎస్‌.ఆర్‌. శంకరన్‌ స్వీయ పర్యవేక్షణలో సాంఘిక సంక్షేమ గురుకులాలు ప్రారంభమయ్యాయి. వీటి స్ఫూర్తితో రాష్ట్రంలో ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు కూడా ప్రారంభమయ్యాయి. గురుకుల పాఠశాలల ఏర్పాటుకు ప్రధాన కారణం– రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలకు, ఆయా సంక్షేమ శాఖల ద్వారా కొనసాగుతున్న ఎస్టీ, ఎస్సీ, బీసీ, వసతి గృహాలకు సమన్వయం లేకపోవడం. ప్రస్తుతమున్న గురుకుల వ్యవస్థ, అవస్థాపనా సౌకర్యాల కొరత, నిధుల మంజూరులో జాప్యం మినహాయిస్తే, సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయన్న విమర్శ గాని, ప్రభుత్వం వెచ్చిస్తున్న నిధులు బూడిద పాలవుతున్నాయనే ఆరోపణలు గాని లేవు. ఆయా గురుకుల సంస్థలు ఫలితాల పరంగా ప్రైవేటు రంగంకంటే చాలా ముందుంటున్నాయి.


ప్రభుత్వ రంగంలో నిర్వహించబడుతున్న అన్ని విద్యా సంస్థలకు ఈ గురుకులాలు పెట్టని కోటలుగా ఉన్నాయి. ఆయా వర్గాలకు నిర్దేశించిన పాఠశాలల్లో 75శాతం ఆ వర్గాల విద్యార్థులకే ప్రయోజనం చేకూర్చే విధంగా కేటాయించడంతో పాటు 25శాతం ఇతర వర్గాలను కూడా ఈ గురుకులాలు అక్కున చేర్చుకున్నాయి. కులాల వారి విద్యాసంస్థలు సమాజానికి మేలు చేయవని, సమీకృత గురుకుల విద్యాసంస్థలే, మెరుగైన సమాజాన్ని నిర్మిస్తాయని భావించిన మేధావులుగాని, ఆ సూచనలు పాటించిన ప్రభుత్వం గాని అసలు విషయాలను అర్థం చేసుకోలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ప్రభుత్వ వర్గాలు దాటవేస్తున్నాయి.


1. సాధారణ గురుకులాలుగా వీటిని పరిగణిస్తే 50శాతం లోపే ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాలకు దక్కుతాయి. దీంతో ఆయా వర్గాల విద్యార్థులు నష్టపోతారనే విషయం నిజం కాదా? 2. ప్రస్తుతమున్న జనరల్‌ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలను ఒకే ప్రాంగణంలో ఏర్పరచి అవస్థాపనా సౌకర్యాలను, 5000 పుస్తకాల గ్రంథాలయాన్ని, ఆటస్థలాలను మాత్రమే సమీకృతంగా ఉంచితే, ఆయా విద్యార్థుల మధ్య ఏర్పడే సామాజిక వైషమ్యాలకు ఈ మేధావులు బాధ్యత వహిస్తారా? 3. విద్యాశాఖ బడ్జెట్‌లో లోటు కారణంగా ఆయా సంక్షేమ శాఖలకు కేటాయించిన చట్టబద్ధమైన బడ్జెట్‌ను దారి మళ్ళించి, విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ ఇంటిగ్రేటెడ్‌ గురుకులాలను ఏర్పాటు చేసి సొమ్మొకరిది, సోకొకరిది అనే విధంగా ప్రభుత్వం ఆలోచిస్తుందనే విమర్శలొస్తున్నాయి.


అదే విధంగా రావణకాష్టంలా మండుతున్న బాసర లాంటి ఉదాహరణలను మన కళ్ళ ముందుంచుకొని, ఏకంగా వేలాదిమంది విద్యార్థులను ఒకేచోట సమూహపరిచి గురుకులాల్లో తరచుగా సంభవించే కలుషిత ఆహారం, అంటువ్యాధులు వంటి వాటికి ఎలా అడ్డుకట్ట వేస్తారు? వీటితోపాటు ప్రస్తుతం ఆయా సంస్థల ద్వారా స్వతంత్రంగా నడుపుతున్న వేయికి పైగా గురుకుల విద్యాసంస్థలను ఎవరి నియంత్రణ కింద కొనసాగిస్తారు?

ఈ సమీకృత పాఠశాలల పరిసర ప్రాంతాల్లో నడిచే ప్రభుత్వ పాఠశాలలను విద్యా సంస్థలను ప్రభుత్వం పట్టించుకోదని, వాటికి సహజ మరణం తప్ప, మార్గం ఉండదని ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రతిష్ఠకు పోకుండా, అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేసి విధివిధానాల పట్ల వివరణ ఇచ్చి, ఆయా గురుకులాల ఉపాధ్యాయులతో, కుల సంఘాలతో సమగ్రంగా చర్చించి ముందుకు వెళ్ళాలి. లేకపోతే జరగబోయే నష్టానికి ఈ నిర్ణయంతో భాగస్వామ్యం అయిన ప్రభుత్వంతో పాటు, సమాజం కూడా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది.

డా. పి. మధుసూదన్‌రెడ్డి

అధ్యక్షులు, ప్రభుత్వ జూనియర్‌ లెక్చరర్ల సంఘం

Updated Date - Oct 29 , 2024 | 12:36 AM