ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వివక్షలు లేని వ్యాపార భారతం లక్ష్యం

ABN, Publish Date - Nov 06 , 2024 | 01:54 AM

ఈస్టిండియా కంపెనీ భారత్‌ను అణచివేసింది. తన వ్యాపార శక్తి సామర్థ్యాలతో కాకుండా, భారతీయ సంపద సృష్టికర్తలను తన కుటిల వ్యాపార పద్ధతులతో జీవన్మరణ దుస్థితిలోకి నెట్టివేయడం ద్వారా ఆ కంపెనీ మన దేశంపై...

ఈస్టిండియా కంపెనీ భారత్‌ను అణచివేసింది. తన వ్యాపార శక్తి సామర్థ్యాలతో కాకుండా, భారతీయ సంపద సృష్టికర్తలను తన కుటిల వ్యాపార పద్ధతులతో జీవన్మరణ దుస్థితిలోకి నెట్టివేయడం ద్వారా ఆ కంపెనీ మన దేశంపై పెత్తనం చేసింది. మన మహారాజులు, నవాబులతో భాగస్వామ్యం నెరపి, ముడుపులు, లేదంటే బెదిరింపులతో వారిని వశంచేసుకుని మన మాతృభూమి జీవన చైతన్యాన్ని స్తంభింపజేసింది. సుదూర పరాయి దేశం నుంచి వచ్చిన ఆ కంపెనీ మన సంప్రదాయ బ్యాంకింగ్‌ వ్యవస్థలను నియంత్రించింది; పాలనా యంత్రాంగాలపై అజమాయిషీ చేసింది; సమాచార వాహికలను తన ప్రభావ ప్రాబల్యాలలోకి తీసుకున్నది. మనం మన స్వాతంత్ర్యాన్ని మరో దేశానికి కోల్పోలేదు. ఒక గుత్తాధిపత్య వాణిజ్య సంస్థకు చేజార్చుకున్నాము. ఇదొక కఠోర వాస్తవం. ఈ విషాద చరిత్రను మరువ వద్దు, సదా జ్ఞాపకముంచుకోవాలి.


మనతో వాణిజ్యానికి వచ్చిన ఈస్టిండియా కంపెనీ మనకు వ్యాపార నిబంధనలను నిర్దేశించింది. పోటీని నిర్మూలించింది. ఎవరు ఎవరికి ఏది అమ్మాలో, అమ్మకూడదో ఆజ్ఞాపించింది. మన సంప్రదాయ వస్త్ర ఉత్పత్తి రంగాన్ని సర్వనాశనం చేసింది. సరుకుల తయారీ వ్యవస్థలను ఆనవాలు లేకుండా చేసింది. వినూత్న ఉత్పత్తులు వేటినైనా ఆ కంపెనీ ప్రవేశపెట్టిందా? విపణి అవకాశాలను విస్తరింపచేసిందా? నాకు తెలియదు. చరిత్ర చెప్పితే కదా. నాకు తెలిసిందల్లా మన దేశంలో అభిని (నల్ల మందు మొక్క) సాగుపై సంపూర్ణ నియంత్రణ సమకూర్చుకుని మరో దేశం (చైనా)లో నల్లమందు వ్యసనపరులకు ఆ సరుకును సరఫరా చేయడంపై ప్రత్యేక, సురక్షిత గుత్త వ్యాపార హక్కులను సాధించుకున్నది. ఆ కంపెనీ మన సిరిసంపదలను దోపిడీ చేసింది. పాలనాధికారాలూ పొంది మన ప్రజలను అధిక పన్నులతో పీడించింది. అయినప్పటికీ బ్రిటన్‌లో ఆదర్శ వాణిజ్య సంస్థ (నవీన పరిభాషలో మోడల్‌ కార్పొరేట్‌ సిటిజన్‌)గా ప్రస్తుతుల నందుకున్నది. ఆ కంపెనీ విదేశీ వాటాదారులు ఆ సంస్థ పేరు ప్రఖ్యాతులకు పొంగిపోయేవారు!


1857లో ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామంతో ఈస్టిండియా కంపెనీ ప్రాబల్యం అన్ని విధాల అంతరించింది. దాన్ని మన తీరానికి పంపిన ఆ పరసీమ సామ్రాజ్యవాదులే మన దేశానికి ప్రత్యక్ష పాలకులు అయ్యారు. ఆనాడు ఆ కంపెనీ వ్యాపార, పాలనా కార్యకలాపాలతో నెలకొన్న భీతి ఇప్పుడు మళ్లీ మన దేశ ప్రజలను ఆవహిస్తోంది. ఆ కంపెనీ లక్షణాలను పుణికి పుచ్చుకున్న కొత్త గుత్త వ్యాపారులు మన వ్యాపార, వాణిజ్య రంగాలలో చెలరేగిపోతున్నారు. అపార ధనరాశులను కూడగట్టుకున్నారు. వారి ఆర్థిక అభిజాత్యానికి హద్దులు లేకుండా పోయాయి. కోటానుకోట్ల భారతీయులు కృశించిపోతుండగా ఆ ఆధునిక కుబేరులు ఉజ్వలంగా వెలిగిపోతున్నారు. మన సంస్థలు, వ్యవస్థలు ఇంకెంత మాత్రం మన ప్రజలకు చెందినవిగా లేవు. వాటి కార్యకలాపాలు మన ప్రజల నిర్ణయాలకు లోబడి జరగడం లేదు. అతి కొద్దిమంది గుత్త వ్యాపారుల ఆదేశాల మేరకు అవి పనిచేస్తున్నాయి. వారి పురోగతే వాటి లక్ష్యమై పోయింది. పర్యవసానంగా లక్షలాది చిన్న పరిశ్రమలు చితికిపోయాయి. మన దేశం ఇప్పుడు యువ భారతీయులకు సరైన ఉపాధి అవకాశాలను కల్పించలేని దుస్థితిలోకి జారిపోయింది. వందే మాతరం. భారత భూమి ఈ గడ్డపై పుట్టిన వారందరికీ మాతృమూర్తి. అయితే ఆమె ప్రసాదించిన అపార సహజ వనరులు అన్నీ ఇప్పుడు గుత్తాధిపత్యంలో ఉన్నాయి. అనేక మంది హక్కులను త్రోసిపుచ్చి ఎంపిక చేసుకున్న అతి కొద్ది మందికి ఆ అనంత సిరులపై స్వామ్యం కల్పించడమేమిటి? భారతమాత పరితాపం చెందుతోంది.


దేశ ఆర్థిక రంగంపై గుత్తాధిపత్యం పెంచుకుంటున్న వారి మూలంగా భీతి చెందుతున్న వ్యవస్థాపనాదక్షులు, దేశభక్తి ప్రపూర్ణులు అయిన భారతీయ వ్యాపారులు ఎంతో మంది ఉన్నారని నాకు తెలుసు. మీరూ వారిలో ఒకరుగా ఉన్నారా? ఫోన్‌లో మాట్లాడడానికి సైతం భయపడుతున్నారా? గుత్తాధిపత్యవాదులు రాజ్య వ్యవస్థతో లాలూచీపడి మీ వ్యాపార రంగంలోకి ప్రవేశించి, మీ సొంత సంస్థను స్వాయత్తం చేసుకోవడానికి పూనుకుంటారేమోననే భయం కలుగుతుందా? మీ వ్యాపార సంస్థలను ఆ గుత్తాధిపత్య కంపెనీలకు విక్రయించేలా చేసేందుకు ఐటీ, సీబీఐ, ఈడీ దాడులు జరగవచ్చని ఆందోళన చెందుతున్నారా? వ్యాపార పురోగతికి అవసరమైన పెట్టుబడి సకాలంలో మీకు లభించకుండా చేస్తారేమోనని కలవరపడుతున్నారా? మీ వ్యాపార మనుగడను దెబ్బతీసేందుకు హఠాత్తుగా నియమ నిబంధనలు మార్చివేస్తారేమోనని స్థిమితం కోల్పోతున్నారా? ఇంతకూ ఉత్పత్తుల ఉత్కృష్టతగానీ, వినియోగదారుల బాహుళ్యం కానీ, భావాల వినూత్నత్వంగానీ ఆ బడా గుత్త వ్యాపారుల ప్రధాన యోగ్యత కానే కాదు; అది, భారతదేశ పాలనా సంస్థలు, విధాన నిర్ణేతలను తమకు అనుకూలంగా ప్రభావితం చేయగల సామర్థ్యం మాత్రమే. మీ వలే కాకుండా, ఆ బడా గుత్తాధిపత్య కంపెనీలు భారతీయులు ఏ పుస్తకాలు, పత్రికలు చదవాలో, ఎలాంటి సినిమాలు, ఏ టీవీ కార్యక్రమాలు చూడాలో నిర్ణయిస్తున్నాయి. భారతీయులు ఎలా ఆలోచించాలో, ఏ విధంగా మాట్లాడాలో ప్రభావితం చేస్తున్నాయి. ఇప్పుడు ఒక వ్యాపారవేత్త విజయం, ఒక వ్యాపార సంస్థ సాఫల్యం లేదా పురోగతిని నిర్ణయిస్తుంది మార్కెట్‌ శక్తులు కావు, అధికార సంబంధాలు మాత్రమే! వ్యాపార జయాపజయాలను ఇవే నిర్ణయిస్తున్నాయి.


మీ హృదయాలలో ఒక భయవిహ్వలత గూడుకట్టుకుని ఉంది. అయితే దానితో పాటు ఆశాభావం కూడా ఉన్నది. ఒక రాజకీయవేత్తగా నా లక్ష్యం, కాదు కర్తవ్యం చారిత్రకంగా అణగారిపోయినవాళ్లు, గొంతుక లేనివాళ్ల పక్షాన నిలబడడమే. సమాజంలో అట్టడుగున ఉన్న చిట్టచివరి బడుగుజీవిని ఉద్ధరించడమే మన ధ్యేయం కావాలన్న గాంధీజీ మాటలే నాకు స్ఫూర్తి. ఆ స్ఫూర్తే నా రాజకీయ కార్యాచరణను సదా ప్రభావితం చేస్తోంది. ఆ ప్రభావమే గ్రామీణ ఉపాధి హామీ పథకానికి, ఆహార హక్కుకు, భూ స్వాధీన బిల్లుకు మద్దతునిచ్చేలా నన్ను పురిగొల్పింది. నియామగిరి ఘర్షణల్లో ఆదివాసీల తరఫున నేను నిలబడ్డాను. మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమించినప్పుడు వారి పక్షాన నా గొంతు విప్పాను. మణిపూర్‌ ప్రజల వద్దకు స్వయంగా వెళ్లి వారి బాధలు చూశాను, వారి వ్యధలు విన్నాను.

మీకు ఇదిరాస్తున్న సందర్భంగా గాంధీజీ స్ఫూర్తిదాయకమాటల గాంభీర్యాన్ని, పరమార్థాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయానన్న సత్యాన్ని గ్రహించాను. మన సమాజంలో అనేక సామాజిక శ్రేణులు ఉన్నాయి. మీ వ్యాపార వర్గం వాటిలో ఒకటి. మీరు అనేక ప్రతికూలతల నెదుర్కొంటున్నారు. పీడనలకు గురవుతున్నారు మీకు ఏవైతే నిరాకరించబడ్డాయో అంటే ఒకటి రెండు సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తూ న్యాయమైన రీతుల్లో పోటీపడే పరిస్థితులు లేకుండా చేశారో అటువంటి పరిస్థితులు, అవకాశాలను కల్పించడమే నా రాజకీయాల లక్ష్యం. ప్రభుత్వం కేవలం ఒకరి ప్రయోజనాలకు మాత్రమే కాపుకాస్తూ మిగతా వారిని ఉపేక్షించడాన్ని ఎట్టి పరిస్థితుల్లోను అనుమతించకూడదు. అవినీతికర రహస్య వ్యాపారపద్ధతులను ప్రోత్సహించకూడదు. ప్రభుత్వ ఏజెన్సీలు అనేవి ఆయుధాలు కాదు. వ్యాపార సంస్థలను బెదిరించడానికి వాటిని దుర్వినియోగం చేయకూడదు. ఇదలా ఉంచితే మీలో నెలకొని వున్న భయం మీ నుంచి ఆ బడా గుత్తాధిపత్య వ్యాపారులకు బదిలీ కాకూడదు. అలా కావడాన్ని నేను ఎటువంటి పరిస్థితులలోను సమర్థించను. వారు చెడ్డ వ్యక్తులేమీ కాదు. మన సామాజిక, రాజకీయ పరిస్థితుల నుంచి ఉత్పన్నమైనవారే. వారికీ వ్యాపారాల నిర్వహణకు అవకాశాలు కల్పించాలి. అలాగే మీకు కూడా.


ఈ దేశం మనందరి కోసం ఉన్నది. ప్రభుత్వాధినేతలతో మంచి సంబంధాలతో బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయల రుణం తీసుకుని తిరిగి చెల్లించడాన్ని ఎగవేసిన 100 మంది బడా వ్యాపారస్తుల పట్ల ఇంకెంత మాత్రం ఆదరభావం చూపవద్దు. నిబంధనల ప్రకారం వ్యవహరించే వ్యాపార సంస్థలకు మాత్రమే రుణాలు మంజూరుచేసి లాభాలు ఆర్జించాలి. ఇది అందరికీ శ్రేయస్కరం. చివరిగా రాజకీయ ప్రవర్తనా రీతులను ప్రభావితం చేసి వాటిని తీర్చిదిద్దడంలో సామాజిక ఒత్తిళ్లు, ప్రతిఘటనల శక్తిని తక్కువ అంచనా వేయకూడదు. అవతార పురుషులు, మహాశక్తిశీలులయిన అతివలు అవసరం లేదు. మీరు మార్పును సాధించగల శక్తులు. సంపదను సృష్టించండి, అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించండి.

ప్రగతిశీల భారతీయ వ్యాపార సంస్థలకు చేయూత నివ్వాలి. వాటిని ప్రత్యేకంగా ప్రోత్సహించాలి. అందుకు శాసనపరమైన, పాలనాపరమైన చర్యలు చేపట్టాలి. ఇది వ్యాపార భారత్‌కు ఒక కొత్త ఒప్పందం. ఇదొక నూతన భావన. దీనిని అమలుపరచాల్సిన సమయమాసన్నమయిందని నేను నిండుగా విశ్వసిస్తున్నాను.

రాహుల్‌ గాంధీ

కాంగ్రెస్‌ ఎంపీ

Updated Date - Nov 06 , 2024 | 01:54 AM