ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఒక బైరాగి చింతన

ABN, Publish Date - Jun 03 , 2024 | 06:05 AM

‘కంఠం, ఒక కంఠం కావాలి నాకు పుంఖానుపుంఖ శంఖాల మంటల మంటలా పలుకగల ఒక కంఠం కంఠం, నాకొక కంఠం మానవగీత ఆలపించే ఒక కంఠం’...

‘కంఠం, ఒక కంఠం కావాలి నాకు

పుంఖానుపుంఖ శంఖాల మంటల మంటలా

పలుకగల ఒక కంఠం

కంఠం, నాకొక కంఠం

మానవగీత ఆలపించే ఒక కంఠం’

- ఈ అత్యంత మౌలిక కంఠస్వరం ఆలూరి బైరాగిది. అతని గొంతు అతనిదే. మరి దేనికీ అనుకరణ గానీ ప్రతిధ్వని గానీ కానిది. అతని వెతుకులాట బాట అతనిదే. ఇంకెవ్వరూ నడవనిది. సర్వతంత్ర స్వతంత్రత. స్వభావ సహజత్వం, నిసర్గ కవితాశక్తి, జీవితంపట్ల అపార ప్రేమ. నిలకడ లేమి. నిష్ఫలత్వం. నిట్టూర్పు. అన్నీ కలిస్తే అది బైరాగి సాహిత్యం.

‘క్విట్‌ ఇండియా’ ఉద్యమంలో పాల్గొన్న బైరాగి, అది అగిపోయినాక ఎమ్‌.ఎన్‌. రాయ్‌ ‘రాడికల్‌ హ్యూమనిజం’ ప్రభావానికి లోనయ్యాడు. (‘కామ్రేడ్‌ రాయ్‌ స్మృత్యర్థం’ కవిత కూడా రాశాడు.) స్వేచ్ఛామానవుల సామూహిక ప్రయత్నాలతో రాడికల్‌ ప్రజాస్వామ్యం ఏర్పడి సామాజిక పునరుజ్జీవనం కలుగుతుందనే అతని ఆశ అడియాసే అయ్యింది. స్వరాజ్యం ముందు అభాగ్యం. తర్వాత అనైతికం. ఫలితం కవిలో ఒక విషాద వాతావరణం.


బైరాగి అత్మచింతన మీద ఆనాటి ప్రాపంచిక వాతావరణం కూడా ప్రభావం చూపించి ఉంటుంది. రెండవ ప్రపంచ యుద్ధ బీభత్సం కనుమరుగు కాకుండానే ప్రచ్ఛన్న యుద్ధం మొదలైంది. మానవజీవితం దుర్భరం ఎందుకయ్యిందో అర్థం కాలేదు. అనేకానేక శోకాలు, ‘నిస్సహాయ మానవేయుడి నుదుటి వ్రాలు’ అతడిని భయకంపితం చేసి ఉండాలి. శోకం నిండిన లోకం నిస్సారంగా తోచి ఉండాలి. అదే సమయంలో ఝా పాల్‌ సార్‌్త్ర అస్తిత్వవాదం (్ఛ్ఠజీట్ట్ఛుఽ్టజ్చీజూజీటఝ) ప్రభావం కూడా అతనిపై పడి ఉంటుంది. ఆధునిక మానవుడి స్వేచ్ఛారాహిత్యం, ్టౌ ఛ్ఛ ౌట ుఽ్టౌ ్టౌ ఛ్ఛ అనే సందిగ్ధత, గమ్యం తెలియని ప్రయాణం, ద్వంద్వాల మధ్య అనిశ్చితి, భయం, నిరాశ- ఈ బాహ్యాంతర అస్తిత్వ సమస్యలన్నీ చుట్టుముట్టాయి. ‘ఎటు బోతే పూల తోట? ఎటు బోతే వల్లకాడు?’, ‘చీకటి నాడి దొరికితేనే తెలుస్తుంది త్రోవ’. కానీ అది దొరకదు. ‘నేతి, నేతి’ అంటూ ఎంత వెతికినా అతనికి సందేహ సాగరం ఆవలి ఒడ్డు కన్పించలేదు. బుద్ధుడు, జీసస్‌, శంకరుడు, భగవద్గీత, మార్క్స్‌, రాయ్‌- వీళ్లెవ్వరూ అతనికి తోడ్పడలేదు. ప్రాచ్య, పాశ్చాత్య సాహిత్యమూ దారి చూపించలేదు. ‘విశ్వ మహాకావ్యాలన్నీ/ వేదనతో విలపించే/ పసివాని అశ్రుబిందువు పాటి చేయవు’.

నిలకడ లేని బైరాగి అవివాహితుడుగా ఉంటూ క్రమంగా ఏకాంతజీవి అయ్యాడు. ప్రపంచంతో ఒకానొక పరాయితనం ఏర్పడింది. మానసిక వైరాగ్యం ఆవరించింది. అంతటా అర్థరాహిత్యమే.


తెనాలిలో పుట్టిన ఈ కవి (1925-78) భావ, అభ్యుదయ, విప్లవ కవితావికాసాల్ని గమనిస్తున్నా అన్నిటికీ ఎడంగానే ఉండిపోయాడు. లోపలనుంచి తన్నుకొచ్చే ఉద్వేగాలతో తప్ప ఎక్కడా ఉపరితల ఉద్రేకాలతో విజృంభించలేదు. తొలి కవితాసంపుటి ‘చీకటి నీడలు’ ఊహకీ వాస్తవానికీ, ఆలోచనకీ ఆచరణకీ మధ్య కదిలే సందేహపు నీడల్ని చూపుతుంది. సమస్యల సాలెగూళ్ళలో చిక్కుకున్నాడు ఆధునిక మానవుడు. యుద్ధాగ్నిలో ఐరోపా మరుభూమిగా మారినప్పుడు టిఎస్‌ ఎలియట్‌కి ‘ఊషర క్షేత్రం’ (గ్చిట్ట్ఛ ఔ్చుఽఛీ) కన్పించింది. (ఎలియట్‌ ప్రభావంతో వేస్ట్‌లాండ్‌ చివరి భాగం, అతనివే మరికొన్ని కవితలు అనువాదం చేశాడు.) సమకాలిక సామాజిక దుస్థితి చూసినప్పుడు బైరాగికి ‘నూతిలో గొంతుకలు’ వినపడ్డాయి. 1950లో ‘తెలుగు స్వతంత్ర’లో ఆ కవితలు ధారావాహికంగా ప్రచురించబడ్డాయి. అదే అతని ‘మానవగీత’. ‘నూతిలో గొంతుకలు’ అనే రూపకమే నిత్యనూతనం, విశేషార్థస్ఫోరకం.

‘భూకంపాలు, తుపానులు, కరువులు, వరదలు, యుద్ధాలు/ పండిన పంటలపై మహాసైన్యపు మిడతల దండు/ దౌర్జన్యం, దురాగతం, పిరికితనం, వెకిలిదనం/ మానభంగం, వురికంబం, ఇన్‌క్విజిషన్‌, గెస్టాపో, జీ.పీ.యూ’ - ఇవన్నీ మంటలుగా తోచి, ‘మంటల్లో మంటల్లో పయనిస్తోంది మానవాత్మ’ (నూతిలో గొంతుకలు) అన్నాడు బైరాగి. ఈ ఆధిభౌతిక, ఆధిదైవిక, ఆధ్యాత్మిక వ్యధలన్నీ అతడిని గాయపరిచాయి. ఆ మంటల నుంచి బయటపడే మార్గం కన్పించలేదు. ‘త్రోవ ఎక్కడ సోనియా!’ అనే వెతుకులాట ‘క్రైమ్‌ అండ్‌ పనిష్‌మెంట్‌’లో రాస్కల్నికోవ్‌దే కాదు, ఆలూరి బైరాగిది కూడా. ‘జీవితమిట నిరావరణ నిరాభరణ నగ్నచ్ఛవి’.

‘ప్రతి మనిషీ ఒక గదిలో

చెదపురుగులు ప్రతి మదిలో

ప్రతి మనిషీ ఒక నదిలో

సుడిగుండం ప్రతి ఎదలో’

టిఎస్‌ ఇలియట్‌ ‘వేస్ట్‌లాండ్‌’లోని ్ఛ్ఠజ్చిఠట్ట్ఛఛీ ఠ్ఛీజూజూట అనే మాట ‘నూతిలో గొంతుకలు’ పేరుకు ప్రేరణ అయ్యిందేమో. ‘నూతిలో గొంతుకలు’ సంశయ కావ్యం. దీనిలో మానవుడు ఏది త్రోవ అనే అడుగుతున్నాడు. ‘నాన్యః పంధా విద్యతేయనాయ’ అని చెప్పగలిగే స్థితిలో లేడు. చీకటిలో ప్రారంభమైన ఈ కావ్యం ‘ఆవేదనల అనంతంలో అంతమైన జీవితాలకు చర్చిస్తున్నది. దీనిలోని నాయకులు హేమ్లెట్‌, అర్జునుడు, రాస్కల్నికోవ్‌ సందిగ్ధావస్థలో ఒక క్రమబద్ధమైన పరిణామాన్ని సూచిస్తున్నారు. హేమ్లెట్‌ వేదన కర్మ పూర్వం, అర్జునుడి వేదన కర్మక్షేత్రంలో తక్షణికం. రాస్కల్నికోవ్‌ బాధ కర్మ తరువాత. కాని ముగ్గురి బాధ ఒకే స్థాయిని అందుకొంటుంది. అది మానవుని సహజవేదన’ అన్నాడు కవి ముందుమాటలో.


‘శుద్ధ కర్మ జ్ఞానాగ్నిని ప్రజ్వరిల్లజేయగలదు/ జ్ఞాన వహ్ని కర్మలనూ తేజరిల్లజేయగలదు/ కర్మకు జ్ఞానానికి శ్రుతి కుదిరి నపుడు/ ఎగిరే విహంగాల కుండదా వేదన/ సంశయాన్ని చూసి స్వేచ్ఛ బెదర దపుడు/ మానవున కుండదు తనతో వాదన’ (హామ్లెట్‌ స్వగతం). అజ్ఞానజనితమైన సామాజిక, వైయక్తిక కర్మ, శుద్ధకర్మ కాకపోవటమే బైరాగిని బాధించింది. జ్ఞానియైునవాడి కర్మే శుద్ధకర్మ కాగలదు. కానప్పుడు కర్మకు, జ్ఞానానికి శ్రుతి కుదరదు. లోతుగా చూసినప్పుడు, వ్యక్తులనుంచి నాయకులదాకా చేస్తున్న పనులు కుత్సితం కావటం, మేధావులు జ్ఞానవంతులు కాకపోవటం ఇవాళ మన కళ్లముందు దృశ్యమే.

నీతిబాహ్యమైన సమాజంలో మనసు విరిగి, బ్రతుకుపై రోసి, తనను తాను నిరుపయోగిగా, నిష్ఫలుడుగా భావించాడు బైరాగి. జీవిత విశ్వాసం కోల్పోయాడు. ‘నాక్కొంచెం నమ్మకమివ్వు/ కొండల్ని పిండి కొట్టేస్తాను’ అని బదులు అడిగాడు. ‘తమస్సుకు స్వాగతమిస్తున్నాను/ వేల వన్నెల చాయలు చెరిపివేస్తున్నాను/ కలతనిదుర కాకుండా కలలు పగులగొడు తున్నాను’. ఈ అంతర్లోకపు కల్లోలంలోనే ‘ఆగమగీతి’ సంపుటి కవితలు వెలువడ్దాయి. ‘చందమామ’లో పని చేసేటప్పుడు బాలగేయాలెన్నో రచించాడు. ‘పలాయన్‌’ హిందీ కవితాసంపుటి. ‘దివ్యభవనం’ కథాసంపుటి. నా ప్రధాన సంపాదకత్వంలో ‘చినుకు’ బులెటిన్‌లో ప్రచురించిన ‘దరబాను’ మూలాలకు దూరమైన ఒక నేపాలీ కుర్రవాడి పరాయితనాన్ని చిత్రిస్తుంది. ‘విస్మృత కథ’ సంకలనంలో మేం చేర్చిన ‘ఒక గంట జీవితం’ అధివాస్తవిక ధోరణిలో సాగుతుంది. ఇలాంటి కథల్ని మర్చిపోవటం కష్టం. ఇంకా ‘పాప పోయింది’ (నవల), ‘కాంచనమృగం’ (రూపకం) మొదలైన రచనలు కూడా.

ప్రాధాన్యాన్ని బట్టి భావకవిత్వానిది భావలోక విహారం. అభ్యుదయ, విప్లవ కవిత్వాలది బాహ్యలోక విచారం. ఆ విషయం అర్థం చేసుకోవటానికి మార్క్సిజం పనికొస్తుంది. బైరాగి వేదన అంతర్లోకానికి సంబంధించింది. ఇది బాహ్యం వల్ల గాయపడిన అంతఃకరణ వేదన. ఇది వ్యక్తికి సంబంధించింది. ఈ ధోరణి కవిత్వాన్ని అవగతం చేసుకోవటానికి అస్తిత్వవాదం ఉపయోగపడుతుంది. ద్వంద్వాల మధ్య ఊగిసలాట, సంశయం, బాధ, భయం, నిరాశ మొదలైన వైయక్తిక మానసికాంశాలను పరిశీలించటానికి సార్‌్త్ర సాయపడినంతగా మార్క్స్‌ సాయపడలేడు.

కవితావస్తువుల్లో రెండు విధానాలుంటాయి. ఒకటి తత్కాలత (్టజ్ఛి ్టౌఞజీఛ్చిజూ). ఒకానొక సాంస్కృతిక సందర్భంలో నిర్దిష్ట స్థలానికి, కాలానికి సంబంధించిన సామాజిక, రాజకీయాంశాలు, సమస్యలు ఇక్కడ చర్చించబడతాయి. రెండవది సర్వకాలత (్టజ్ఛి ్ఛ్ట్ఛటుఽ్చజూ). ఇది స్థల కాలాతీతం. భిన్న చారిత్రక, సాంస్కృతిక సందర్భాల్లోనూ దీనికి సంబద్ధత ఉంటుంది. మానవ అస్తిత్వానికి సంబంధించిన మౌలికాంశాలు, ప్రేమ-ద్వేషం, మంచి-చెడు, జీవితం-మృత్యువు, వ్యక్తి-సమాజం మొదలైనవి ఇక్కడ అన్వేషించబడతాయి. సూతాశ్రమం, శ్రీరంగం నారాయణబాబు, హుసేన్‌ సాగర్‌, రాజఘాట్‌, వియత్‌నామ్‌ లాంటి కవితలు మినహాయిస్తే, బైరాగి కవిత్వం స్థూలంగా ఈ రెండో కోవకి చెందుతుందని వేరే చెప్పనక్కర్లేదు. కనుకనే తరాలు గడిచినా, మనిషి జీవితంలో సంశయం ఉన్నంతవరకు ‘నూతిలో గొంతుకలు’ తమ సంబద్ధత లేదా ప్రాసంగికతని కోల్పోవు. ఇంటా బయటా చీకటి ఉన్నంతవరకు ‘చీకటి నీడల’ చిందులాటా తప్పదు.

బైరాగి కవిత్వంలో అడుగడుగునా కనిపించే నిరాశా నిస్పృహలు కొందరన్నట్టు పలాయనవాదమేనా? కాదనిపిస్తుంది. జీవితం పట్ల అపారమైన ప్రేమని వ్యక్తం చేసే కవితలెన్నో కూర్చాడు బైరాగి. మనిషి అంతరిక్షానికి ఎగసినప్పుడు, ‘మానవమేధా విజయ పరంపరలకంతం లేదు’ అని మెచ్చుకొన్నాడు. ‘ఈ వంధ్యాధూళినుంచి, వికృత భస్మపాళి నుంచి/ ఉదయిస్తా డనలసంభవు డాత్మధవుడు, నవమానవుడు’ అని ‘ఆగమగీతి’ ఆలపించాడు. నార్ల అన్నట్టు, ‘జీవితరంగం నుండి హుటాహుటిగా’ వెళ్లిపోయిన ‘బైరాగి చేసింది పలాయనం కాదు, మహాభినిష్క్రమణ.’

‘చావునుంచి పారిపోవటమే బ్రతుకు

బ్రతుకునుంచి పారిపోవట మెక్కడికీ?

తలపునుంచి పారిపోవటమే మరుపు

మరుపునుంచి పారిపోవట మెక్కడికీ?’

(పలాయనం)

క్షయరోగంతో మృత్యువు తలుపు తట్టే చప్పుడులో కూడా జంకలేదు బైరాగి. ‘భయద మరణ గహ్వర తటాగ్రమున ఊయలలూగే వారెవరూ?/ తెగిన తలను తన చేత బట్టుకొని ముందుకు సాగే వారెవరూ?’ అతడు నిశ్చయంగా బైరాగే. ‘పువ్వుల్లో పురుగు లాగు మృత్యువుంది.’ అయినా ‘దూరపు వలపు పిలుపు వంటిది మరణం.’ ‘విలయ ఝంఝా విక్షుభిత మహాసింధుతీరాన/ ఆడుకొనే పసిపాపల కేరింతలు, చప్పట్లు వినిపించినంత వరకు నాకు చావు లేదు’ అన్నాడు. ‘గీత యుగళి’లో ఇటు జీవితాన్నీ అటు మృత్యువునీ సమానంగా ప్రేమించిన స్ఫురణ కలుగుతుంది.


‘శబ్దాల అసమర్థత ప్రతి కవికీ ఏదో ఒక సందర్శంలో తట్టే ఉంటుంది, కవితాకామిని చేలాంచలాల కొస విసురులు ఎప్పుడూ ఒక బారెడు దూరానే మాయమైనట్లు అగుపిస్తాయి’ అన్న బైరాగి వాక్యాలు ఆలోచనాత్మకాలు. ‘పరాభూత కవి కరంలో విరిగిన విల్లులాంటి భాష’ మాత్రమే ఉంటుంది. అతనికి ఉన్న శబ్దాలే ఎక్కువ. ఎందరో ఎప్పటినుంచో వాడి వాడి అరగదీసిన ముక్కల్నే అపురూపంగా వాడుకొంటాడు. అటువంటి వాళ్ల సరసన చేరటం గిట్టకనే, ‘సుషమా విషమ వారిధిలోన దీవి వెదకే నావికుడను/ తెల్లని కాగితాలకు మసి పూసే గారడి ఇక చేయలేను/ నేను మీ కవిని కాను’ అన్నాడు.

‘మొక్కవోయిన అమ్ములీ శబ్దాలు,

తిరిగి తిరిగి, విసిగి విరిగి, కరగి చెరగి, మురిగి సురిగి,

గురుతు లేని గులకరాళ్ళై వంకర మేకుల్లా పిన్నుల్లా,

గుర్రపు నాడాల్లా వీధుల్లో, త్రోవలంట ధ్వనుల నీడల్లో నక్కుతూ,

మసూచికపు మొగంలా, చిల్లి పడిన పాత్రలా అర్థం కారిపోతూ,

ఖాళీ డబ్బాల్లో మ్రోగుతూ అసంఖ్యాక స్పర్శలతో జిగటబారే శబ్దాలు’

(కవి సమస్య)

- కవిత్వంలో అరిగిపోయిన పదజాలం గురించి ఇంతకన్న శక్తిమంతంగా చెప్పగలమా? మరి సరికొత్త నుడి ఎలా ఉండాలి?

‘కన్నీరై కురిసిన అనందంలా, పెటిలిన గంధంలా

కొడిగట్టిన కడ వెన్నెల నవ్వులా

తలగడపై నలిగిన సిగపువ్వులా

చెక్కుల చెంగావి పోయి, చిగురు మోవి కావి పోయి

ఊర్పు వగరు తావి పోయి

ఎందుకు బాసిపోతుందో అందం?’

(ఎందుకు మాసిపోతుందో ప్రేను)

అద్భుతమైన మూర్త, అమూర్త ఉపమానాలతో సాగే ఈ కవిత వచనకవితా సౌందర్యానికి మేలిమి ప్రతీక.

రెండు ప్రత్యేకాంశాలు బైరాగి కవిత్వంలో కానవస్తాయి. ఒకటి, అతని పద-సమాస-వాక్య నిర్మాణ శైలి. రెండు, ఆశ్చర్యకరమైన కల్పనాశక్తి. భాషలోని శబ్దాలు తన వ్యక్తీకరణకి చాలనప్పుడు ప్రతి గొప్ప కవీ తన భాషాసంపద (ఛీజీఛ్టిజీౌుఽ) తాను సృష్టించుకుంటాడు. అందుకు బైరాగి కవితే ఉదాహరణ. విలక్షణమైన పదబంధాలు, అపూర్వ సమాస నిర్మాణం మనల్ని ఆ తావున నిలబెట్టి, తమ అంతరార్థం లోతుగా చూడమంటాయి. ‘చితికిన టొమేటో లాంటి సూర్యుడో, ఆరిన అప్పడం లాంటి చంద్రుడో’ అదాటుగా కనపడి, అప్పటిదాకా మన కళ్లముందు తేజోరూపాలుగా కదలాడినవి పాలిపోయి జాలి గొలుపుతాయి. ఏమి పోలికలవి! ‘పరమశివుని శూలాగ్రాన తలక్రిందులుగా నిలబడటం, కాలునితో కలబడటం’ ఊహించగలమా? ‘నమ్మకం లోపించిన జీవితాన్ని ఖాళీ సిగిరెట్టు టిన్నుగా, పుల్లలు లేని అగ్గిపెట్టెగా, కాలిన సిగిరెట్టు బూదిగా’ రూపించటం అతని ఊహకే సాధ్యమైంది.

కవిత్వంలో ‘నిశ్చల నిశ్చితాల’తోపాటు సంధ్యాజీవులూ సందేహభావులైన కవుల కనుచీకటి వెతుకులాటలూ ముఖ్యమే అని నా కవిత్వానుభవం చెపుతుంది. ఎందుకంటే నిశ్చల నిశ్చితాల్లో ‘ఇది ఇది’ అని కవి చేసే పూర్వ నిర్ధారణలూ నిర్దేశిత లక్ష్యాలూ ఉంటాయి. వడ్డించిన విస్తరిలా అంతా స్పష్టమే. అక్కడ నేనుగా వెతికి, తెలుసుకోవాల్సింది పెద్దగా ఉండదు. మరి ఒక్కోసారి విస్తరిలో జిలేబి కన్న జామచెట్టెక్కి కోసుకున్న దోరగాయ రుచిగా ఉంటుంది. ఇక్కడ నా కదలిక, ప్రయత్నం ఉన్నాయి గనుక. తెరిపిలేని అన్వేషణాయాత్రికుడైన కవి నాకు అట్టి కదలికనిస్తాడు. కలవరం కలిగిస్తాడు. అందుకే ఏకతార మీటుకుంటూ వెళ్లిపోయే బైరాగి అనబడే బైరాగి నాకిష్టం.

పాపినేని శివశంకర్‌

85008 84400

Updated Date - Jun 03 , 2024 | 06:05 AM

Advertising
Advertising