ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కొత్త భావాలతో పాత ఎజెండా

ABN, Publish Date - Jun 21 , 2024 | 02:46 AM

కొత్త ప్రభుత్వానికి సూచిస్తున్న ఎజెండా పాత ఎజెండానే, అయితే ఒక ప్రాథమిక తేడాతో. వాస్తవమేమిటంటే కార్యాచరణకు ప్రాధాన్యత నివ్వాల్సిన అంశాల జాబితా మునుపటిదే. అందులో మార్పులు ఏమీ లేవు. ఉండబోవు...

కొత్త ప్రభుత్వానికి సూచిస్తున్న ఎజెండా పాత ఎజెండానే, అయితే ఒక ప్రాథమిక తేడాతో. వాస్తవమేమిటంటే కార్యాచరణకు ప్రాధాన్యత నివ్వాల్సిన అంశాల జాబితా మునుపటిదే. అందులో మార్పులు ఏమీ లేవు. ఉండబోవు. ఇంధనం నుంచి నీటి సరఫరా వరకు, పారిశుద్ధ్యం నుంచి ఆహారం, పోషకాహారం దాకా మన కర్తవ్యాల నిర్వహణ, మనం చేయాల్సిన కృషి అసంపూర్ణంగా ఉన్నాయి. సరే, ఆరోగ్యం, విద్య గురించి చెప్పనే అవసరం లేదు. ప్రభుత్వం కొన్ని పథకాలను రూపొందించి అమలుపరుస్తుందని మనకు తెలుసు. ప్రస్తావిత రంగాలకు బడ్జెట్ కేటాయింపులు కూడా చేసింది. ప్రజలకు సంక్షేమం, శ్రేయస్సు సమకూర్చే కృషి కొనసాగుతోంది. ఇటీవలి సార్వత్రక ఎన్నికలలో పాత్రికేయులు దేశంలో నలు మూలలా పర్యటించారు. వివిధ సమస్యలపై ప్రజల అభిప్రాయాలను విన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే కదా ప్రజల అభిప్రాయాలు పరిగణన పొందేది! పెచ్చరిల్లుతోన్న నిరుద్యోగమే అసంఖ్యాక ప్రజలకు అమిత ఆందోళన కరంగా ఉన్నది. స్వచ్ఛమైన తాగు నీటి కొరత, పారిశుద్ధ్యం లోటు ప్రజలను బాగా కలత పెడుతున్న సమస్యలలో ప్రముఖంగా ఉన్నాయి. ఇంధన సంక్షోభం ఇప్పటికీ తీవ్రంగా ఉన్నది. ఎల్‌పిజి సిలెండర్ ధర భరించలేనిదిగా ఉన్నది, విద్యుత్ సరఫరాపై నిశ్చింతకు ఆస్కారం లేదు. రైతులు ఇప్పటికీ నానా దురవస్థల్లో కునారిల్లుతున్నారు. వ్యవసాయ రంగంలో పరిస్థితులను మెరుగుపరిచేందుకు ఇంకా ఎంతో పనిచేయాల్సి వున్నది.


అభివృద్ధికై సంకల్పించిన అనేకానేక పనులు అసంపూర్ణంగా ఉండిపోవడంపై ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. ఇండియా ఒక సువిశాల దేశం. పాలనలో ఎన్నో లొసుగులు, లోపాలు ఉన్నాయి. ఏ ప్రభుత్వ పథకమైనా సమాజంలో అట్టడుగు స్థానంలో ఉన్న సామాజిక వర్గం వారికి చేరాలి – ఏదో ఒక సారికాదు, ప్రతిసారీ, అను నిత్యమూ సుమా! ఇదే సమయంలో వాతావరణ మార్పు విషమ ప్రభావం మనకు స్పష్టంగా కనపడుతోంది. ప్రతి రోజూ దేశంలో ఏ దో ఒక ప్రాంతం కనీసం ఒక వాతావరణ వైపరీత్య ఘటనతో అల్లాడిపోతోంది. ఇది అభివృద్ధి కార్యక్రమాల పురోగతికి అవరోధమవుతోంది. అకాల వర్షాలు, తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థితులు మరిన్ని కరువుకాటకాలు, వరదలు, తీవ్ర దుర్భిక్షాలకు దారి తీస్తున్నాయి. జీవనాధారాలను తీవ్రంగా దెబ్బ కొడుతున్నాయి. ప్రభుత్వ వనరులపై అదనపు భారాన్ని మోపుతున్నాయి. ఈ పరిస్థితి సూచిస్తున్నదేమిటి? అభివృద్ధి సాధన మరింత సమర్థంగా జరగాలి. వృద్ధి ఫలాలు సత్వరమే మరింత అధిక స్థాయిలో ప్రజలకు చేరేలా చూడడమూ చాలా ముఖ్యం. ఈ దుర్భర పరిస్థితులు మారిపోయేందుకు, మరింత శుభస్కర పరిస్థితులు నెలకొనేందుకు తదుపరి ప్రభుత్వ కొత్త ఎజెండా– కొత్త ప్రభుత్వం వాస్తవానికి పాత సర్కారే అయినప్పటికీ– ఈ క్రింద సూచించిన విధంగా భిన్నంగా ఉండి తీరాలి.


తొట్ట తొలుత మరింత జవాబుదారీతనంతో వ్యవహరించేలా సంస్థలను పునర్నిర్మించడంపై కొత్త సర్కార్ ప్రథమ ప్రాధాన్యమివ్వాలి. భిన్న దృక్పథంతో ఆలోచించే వారిని, భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేసిన వారిని ప్రభుత్వ శత్రువుగా భావించకూడదు. ప్రత్యామ్నాయ సమాచారం అసమ్మతి కాదు, ప్రభుత్వంపై గురిపెట్టిన విమర్శా కాదు. ప్రత్యామ్నాయ వార్తలు, విశ్లేషణలను అభివృద్ధి సాధనకు జరిగే దోహదంలో భాగంగా చూడాలి. ఏది ప్రయోజనకరంగా పని చేస్తుంది, ఏది లక్ష్య పరిపూర్తికి తోడ్పడం లేదు అన్న విషయమై మనం ఎంత ఎక్కువగా తెలుసుకుంటామో పాలన అంతగా మెరుగుపడుతుంది. ప్రస్తుతం భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నవారిని బలవంతంగా మౌనం వహించేలా చేస్తున్నారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరగకపోవచ్చు కానీ పాలకులకు ఇష్టమైనవే ఆమోదయోగ్యమయ్యేట్టు చేస్తుంది. ప్రభుత్వ వంది మాగధులకే ప్రాధాన్యం లభించేట్టు చేస్తుంది. ఇదెంత మాత్రం క్షేమకరం, శ్రేయస్కరం కాదు. ఇటువంటి పాలనా ధోరణులు ఒక ప్రభుత్వాన్ని ప్రజల నిరాదరణకు గురి చేస్తాయి. ప్రజా వాణిని వినని, గౌరవించని పాలకులు ఆదరణ ఎలా పొందుతారు? కనుక నిష్పాక్షికంగా ఉండడమనేది ప్రభుత్వ ఎజెండా కావాలి. విశాల దృక్పథంతో ఉండాలి. ఎటువంటి దాపరికం లేనిదిగా, అందరూ పాల్గొనదగినదిగా ఉండాలి. దీనర్థం ప్రభుత్వ కమిటీలలో అందరికీ చోటు కల్పించడం కాదు. సమాచారాన్ని గుర్తించడం, భావాలు, అభిప్రాయాలను గౌరవించడం నమ్మకాన్ని పునరుద్ధరించుకోవడం చాలా కీలకం. పథకాలు సఫలమయ్యేందుకు మాత్రమేకాదు, సమాజాలు శీఘ్రగతిన పురోగమించేందుకు కూడా.


నవ భారతదేశ నిర్మాణానికి కొత్త ఆలోచనలు, కార్యాచరణలకు దోహదం చేసే సంస్థలు అవసరం. గత కొద్ది సంవత్సరాలుగా సంప్రదాయ సంస్థలను ఉద్దేశపూర్వకంగాను, నిరక్ష్యపరచడం ద్వారా క్షీణించి పోయేలా చేస్తున్నారు. కారణమేమిటి? ఈ సంస్థలు తమ విధులను సరిగ్గా నిర్వర్తించడం లేదని ప్రభుత్వం చెప్పుతున్నది. అవి కాలంలోకి జారిపోవల్సిన అవసరం ఉందని కూడా స్పష్టం చేస్తోంది నిజమేమింటంటే అవి నిర్వర్తిస్తున్న కీలక విధులను మరింత చురుగ్గా, మరింత మెరుగ్గా నిర్వర్తించేందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వం చేపట్టడం లేదు. కాలుష్య నియంత్రణకు ఏర్పాటు చేసిన ఏజెన్సీలనే తీసుకోండి అవి అర్థరహితంగా పరిణమించాయి. వాటిలో కొన్ని కాలుష్యంపై పోరుకు సంబంధించిన వాణిజ్యం నుంచి లబ్ధి పొందేందుకు ప్రయత్నించాయి. యథార్థమేమిటంటే కాలుష్యాన్ని నియంత్రించేందుకు జవాబుదారీతనంతో నిరోధాలను పటిష్ఠంగా అనువర్తింప చేసే సంస్థలు అవసరం. ఇబ్బందికరమైన, కఠోర నిర్ణయాలు తీసుకుని వాటిని కచ్చితంగా అమలుపరిచే సామర్థ్యమూ వాటికి ఉండాలి. మరి ఈ సామర్థ్యమే ఇప్పుడు పూర్తిగా కొరవడింది. కాలుష్యం పెరిగిపోతుందంటే ఆశ్చర్యమెందుకు? కాలుష్యం తగ్గిపోదు. మన నదులలోను, వాయుతలంలోను అది సర్వత్రా ఆవరించి ఉన్నది, ఉంటుంది.

ఈ పరిస్థితి లేకుండా పోవాలంటే మనకు రెండు కొత్త తరం సంస్కరణలు అవసరం. ఒకటి– స్థానిక ప్రజలు పాల్గొనే కింది స్థాయి సంస్థలను పటిష్ఠ పరచాలి. అభివృద్ధి కార్యక్రమాలు ప్రయోజనకరంగా అమలయ్యేందుకు ప్రజలు క్రియాశీలంగా పాల్గొనే ప్రజాస్వామ్యం మనకు ఎంతైనా అవసరం. స్థానిక స్వపరిపాలన సంస్థల సాధికారతకు ఉద్దేశించిన 74, 75 రాజ్యాంగ సంస్కరణలను ఆమోదించి 30 సంవత్సరాలు గడిచిపోయాయి మరి గ్రామీణ ప్రాంతాలలో పంచాయతీరాజ్, పట్టణ ప్రాంతాలలో మునిసిపల్ వ్యవస్థ మెరుగుపడ్డాయా? గ్రామ సభలను పటిష్ఠపరచడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని మరింత ప్రగాఢం చేసే ప్రయోగాలు చేశాము. అయితే ఈ కృషి అంతా అసంపూర్ణంగా మిగిలిపోయింది. సహజ వనరులపై గ్రామీణ, పట్టణ ప్రభుత్వాలకు మరింత నియంత్రణాధికారాలను కల్పించేందుకు చేయవలిసింది ఎంతో ఉన్నది. నిధులు సమకూర్చుకునేందుకు, పథకాల నిర్వహణకు సహజ వనరులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కొత్త ఉద్యోగాలను సృష్టించేందుకు, జీవనాధారాలను పెంపొందించుకునేందుకు సహజ వనరుల అభివృద్ధికి మరింతగా మదుపులు చేయవలసి ఉన్నది.


చివరగా మన అభివృద్ధి పథకాలను కొత్త భావాలతో రూపొందించలవలసిన అవసరమున్నది. చాలా కాలంగా ప్రభుత్వాలు సంక్షేమ దృక్పథం– దీనిని తరచు బిచ్చం వేయడంగా కొట్టివేస్తున్నారు– పెట్టబడిదారీ దృక్పథం మధ్య చిక్కుకున్నాయి. నా అభిప్రాయంలో వాతావరణ మార్పుతో కొట్టుమిట్టాడుతున్న ఈ కాలానికి ఒక కొత్త దృక్పథం అవసరం. ఆలోచనలు మారాలి. ఆచరణలు విధిగా ప్రయోజనకరం కావాలి. మనం ప్రతి రంగంలోనూ వినూత్న భావాలతో, నవ కార్యాచరణ ప్రణాళికలతో పనిచేయవలసి ఉంది. అభివృద్ధి సమ్మిళితంగాను, సాధించదగినదిగాను, నిలకడగా ఉండి తీరాలి. ఇందుకు పథకాల రూపకల్పనలోనే కాదు వాటి అమలు తీరుతెన్నులలో కూడా మార్పులు అవసరం. ధరిత్రిని కాపాడే కొత్త అభివృద్ధి నమూనా అవసరం ఎంతైనా ఉన్నది. ఆ నమూనా చిట్ట చివరి వ్యక్తికి సైతం సంక్షేమాన్ని సమకూర్చేదిగా ఉండాలి. అవును, ఈ అంశంపైనే కొత్త –పాత ప్రభుత్వం తన దృష్టిని కేంద్రీకరించాలి.

సునీతా నారాయణ్

(‘సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌’

డైరెక్టర్‌ జనరల్‌, ‘డౌన్‌ టు ఎర్త్‌’ సంపాదకురాలు)

Updated Date - Jun 21 , 2024 | 02:47 AM

Advertising
Advertising