ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రాజ్యాంగంపై ‘కుడి ఎడమల’ దాడి!

ABN, Publish Date - Jul 26 , 2024 | 03:23 AM

రాజ్యాంగ రచనా కాలం నుంచీ రాజ్యాంగంపై దాడి కొనసాగుతున్నదే. తాము కాంక్షించిన మతరాజ్యాన్ని అంగీకరించనందుకు ఈ రాజ్యాంగాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అని రైట్ వింగ్ ఆరెస్సెస్ సిద్ధాంతకర్తలు...

రాజ్యాంగ రచనా కాలం నుంచీ రాజ్యాంగంపై దాడి కొనసాగుతున్నదే. తాము కాంక్షించిన మతరాజ్యాన్ని అంగీకరించనందుకు ఈ రాజ్యాంగాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అని రైట్ వింగ్ ఆరెస్సెస్ సిద్ధాంతకర్తలు ఆనాడే ప్రకటించారు. అనంతర కాలంలో ‘ఈ రాజ్యాంగం పేదలను అణచిపెట్టేందుకు రాసినది’ అని ఆధిపత్య కుల నాయకత్వంలోని లెఫ్ట్ వింగ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ విప్లవ సంస్థలు ప్రకటించాయి. గతంలో పాలన సాగించిన కాంగ్రెస్ తదితర పార్టీలు రాజ్యాంగ లక్ష్యాలను పూర్తిస్థాయిలో నెరవేరనీయకుండా కాలయాపన చేస్తూ వచ్చాయి. ప్రస్తుతం బీజేపీ రాజ్యాంగబద్ధంగా ఎన్నికై రాజ్యాంగాన్ని మార్చేస్తామని ప్రకటించింది. విప్లవ రచయితల సంఘం 29వ రాష్ట్ర మహాసభలలో ‘రాజ్యాంగ వాదం’ పేరుతో రాజ్యాంగంపై దాడికి దిగింది. లెఫ్ట్ రైట్‌ల ఉమ్మడి కార్యాచరణగా కొనసాగుతున్న ఈ రాజ్యాంగ రద్దు లక్ష్యాన్ని పౌర సమాజం తమ ఓటు హక్కుతో కొంతమేర కట్టడి చేయగలిగింది. ఇటీవలి ఎన్నికల్లో మతతత్వ ఎజెండా పట్ల ప్రజా వ్యతిరేకత వ్యక్తం కావడంతో ‘రాజ్యాంగ రద్దు’ బాధ్యతను ఇప్పుడు ఎర్రజెండా స్వీకరించినట్లుగా స్పష్టమవుతుంది. ఈ క్రమంలోనిదే బి.ఆర్. బాపూజీ ‘అందరూ రాజ్యాంగ రక్షకులే కానీ...’ వ్యాసం (ఆంధ్రజ్యోతి –12.7.2024). రాజ్యాంగం ముంగిట స్మృతుల ఆచరణ కొనసాగిస్తున్న వ్యవస్థలు పరిఢవిల్లుతున్న దశలో శ్రామిక ప్రజల ప్రయోజనాల వంకన వాస్తవ స్పృహ లేకుండా సాగిన వ్యాసమిది.


ఈ రచయిత రాజ్యాంగ సభ్యుల ఎన్నికల నుంచి మొదలుపెట్టి రాజ్యాంగంలోని కొన్ని ఆర్టికల్స్‌ను ఉటంకిస్తూ రాజ్యాంగ రచయితను ప్రశ్నిస్తున్నారు. రాజ్యాంగ స్వభావాన్ని శ్రామిక వర్గ దృక్పథంతో అంచనా వేయాలని కోరుతున్నారు. అలాగే సంస్కరణతో సమయం వృథా చేయకూడదని తక్షణ రాజ్యాంగ రద్దుకు తొందరపడుతున్నారు. ఆ తీవ్రకాంక్ష ఆయన అక్షరాక్షరానా వ్యక్తం అయింది.

అంబేడ్కర్ అసలు రాజ్యాంగం అంతా ఆయన పాల్గొన్న రౌండ్ టేబుల్ సమావేశాల్లోను, ఆయన రాసిన ‘స్టేట్స్ అండ్ మైనారిటీస్’ పుస్తకంలోను రాజ్యాంగ రచనకు ముందే వ్యక్తమైంది. అది గమనంలో ఉంటే అంబేడ్కర్ రాజ్యాంగ స్ఫూర్తి ప్రస్ఫుటంగా ఎవరికైనా అర్థమవుతుంది. ప్రస్తుత రాజ్యాంగం అంతా రచయితగా అంబేడ్కర్ కాంక్షించినదేమీ కాదన్నది, ఆయన అభిప్రాయాలకు విరుద్ధమైనవి కూడా అందులో చోటుచేసుకున్నాయన్నదీ చారిత్రక వాస్తవం. దీనికి ఇప్పటికీ ‘కాన్‌స్టిట్యుయెంట్ అసెంబ్లీ డిబేట్స్ వాల్యూములు’ తిరుగులేని సాక్ష్యాలు. రాజ్యాంగ రూపకల్పనలో గల కీలకాంశాలను, అందులో వ్యక్తుల పాత్రను అవి పట్టి చూపుతున్నాయి. అంబేడ్కర్ కోరుకున్న రాజ్యాంగ రచనకు సహకరించనివారు ఎవరో, అందులోని ప్రగతికారకమైన అంశాలను తొలగించేందుకు ప్రయత్నించినవారు ఎవరో అవి ఆధారాలతో సహా పట్టిస్తున్నాయి. రాజ్యాంగ సభలో మెజారిటీ సభ్యుల అభిప్రాయం మేరకు మాత్రమే రాజ్యాంగంగా రూపొందిందనే వాస్తవం తెలిసినప్పటికీ వ్యాసకర్త బాపూజీ కేవలం రాజ్యాంగ రచయితపైనే దోషమంతా నెట్టే పనికి పూనుకున్నారు.


‘భూమిని ఇతర కీలక పరిశ్రమలని జాతీయం చేయాలని, భూమిని అభివృద్ధి చేసి ప్రభుత్వమే సమిష్టి వ్యవసాయ క్షేత్రాలుగా నిర్వహించాలని’ అంబేడ్కర్ కోరుకున్నారు. ‘ఏ ప్రభుత్వమైనా నిజాయితీగా రాజకీయంగా సామాజికంగా సమానత్వాన్ని సాధించాలనుకుంటే దాని ఆర్థిక విధానం సోషలిస్టు ఆర్థిక విధానం కాకపోతే ఎలా సాధ్యం’ అని పండిట్ నెహ్రూను సైతం ప్రశ్నించేందుకు అంబేడ్కర్ వెనుకాడలేదు. రాజ్యాంగంలో స్టేట్ సోషలిజం చోటు చేసుకోకుండా మెజారిటీ సభ్యులు అడ్డుకున్నారు. అంబేడ్కర్ తీవ్రంగా వ్యతిరేకించిన ఆస్తి హక్కు ఆర్టికల్ 31గా రాజ్యాంగంలో చేర్చి మొత్తం అంబేడ్కర్ రాజ్యాంగ రచనా స్ఫూర్తినే దెబ్బ తీశారు. ఈ విషయంలో తన ఆవేదనను అంబేడ్కర్ 1955 మార్చి 19న రాజ్యసభలో చేసిన ప్రసంగంలో వ్యక్తం చేసారు. ‘ఆర్టికల్ 31 పరమ వికృతమైన అంశం. దాని వంక చూడడమే నాకు పరమ అసహ్యం’ అని ఆయన పేర్కొన్నారు. కానీ రాజ్యాంగ రచనలో అంబేడ్కర్ పాత్రను, రాజ్యాంగ విశ్వసనీయతను ఏకకాలంలో దెబ్బతీయటం ద్వారా ఇప్పటికీ రాజ్యాంగ పరిరక్షణ కర్తవ్యాన్ని మోస్తున్న వర్గాలను ఆ కృషి నుంచి సడలిపోయేలా చేయడమే బాపూజీ ఏకైక లక్ష్యంగా కనిపిస్తున్నది.

అంబేడ్కర్ బ్రతికినంత కాలం తీవ్రంగా నిరసించిన ప్రైవేటు ఆస్తిహక్కును నిర్మూలించడం కోసం ఏ రకమైన కృషీ చేయని ఈ వామపక్ష వాదులకు భారత రాజ్యాంగంలో నాటి నుండి నేటికీ ఒక్కటంటే ఒక్క విషయం కూడా శ్రామిక ప్రజలకు పనికొచ్చే అంశం కనిపించకపోవటానికీ, రాజ్యాంగాన్ని ఏక మొత్తంగా తృణీకరించి దాని రద్దును ఇంతగా కాంక్షించటానికీ కారణాలు స్పష్టమే. లెఫ్ట్ రైట్‌లు రెండూ వేర్వేరు అంశాలుగా కనిపించే ఆధిపత్య కుల కవలలు కావటమే అసలు కారణం. నాలుగు కనులు – ఒకే ఒక దుస్వప్నం.


నాటి రాజ్యాంగ పరిషత్ సభ్యులు భారత ప్రజలంతా ఓట్లు వేసి ఎన్నుకున్నవాళ్లు కానప్పటికీ పరిమితంగానైనా ఈ దేశ ప్రజలకు ఈ రోజు అందుతున్న హక్కులకు నాటి సభ్యుల అంగీకారమే ఏదో మేర కారణం. ప్రజాప్రతినిధులు ఇన్ని సంవత్సరాలలో ఆ రాజ్యాంగాన్ని ఏ మేరకు అమలు చేయగలిగారో రచయిత పరిశీలించినట్లు కనిపించదు. ఎస్సీ ఎస్టీ కేసులలో నిందితులు శిక్షించబడకపోవడానికి ఈ రాజ్యాంగమే కారణమని, ఈ చట్టాలతో ఏ ప్రయోజనమూ లేదనే వింత వాదన చేసారు వ్యాసకర్త. పాలకులు ప్రభుత్వ యంత్రాంగాలు నిందితుల పక్షాన నిలిచిన కారణంగా జరిగే అన్యాయానికి కూడా రాజ్యాంగ రచయితలే కారణమని చెప్పబోవడం వాస్తవ విస్మరణ.

‘రాజ్యాంగం అంటే పెత్తనం చెలాయించే సాధనం కాదని అది కేవలం సమాజంలో అసమానతలను చట్టబద్ధంగా తొలగించి నవ జీవనాన్ని క్రమ పద్ధతులలో నడిపే ఒక మార్గదర్శిగా ఉండాలని’ అంబేడ్కర్ కోరుకోవడాన్ని గ్రహించాలి. రాజ్యాంగ రూపకర్తలకు అవకాశం దొరకక వదిలిన ఖాళీలను వర్తమాన తరాలు పూరించుకోవాలి. అలాగే ప్రతికూల అంశాలను తొలగించుకునేందుకు రాజ్యాంగమే ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఉన్న రాజ్యాంగ హక్కుల పరిరక్షణకే శతాబ్దాల కాలం సరిపోకపోతే మరింత మెరుగైన కృషికి ఆస్కారమెక్కడ. అటువంటి వాస్తవిక దృష్టి ఏమీ లేకుండా నిర్మాణాత్మక వైఖరిని విస్మరించి రాజ్యాంగ రద్దును ఆది నుండీ జపించే లెఫ్ట్ రైట్ దళాల రాజ్యాంగ ద్వేషం అంతిమ లక్ష్యం ఏమిటి?


వీరు నినదించిన మరో ప్రపంచం అగ్రజులను అగ్రనాయకులుగా మార్చి పీడిత కులాలకు రమణీయ మరణాన్ని మిగిల్చాక ఇప్పుడు మరలా శ్రామికుల పేరిట నూతన రాజ్యాంగాన్ని వాగ్దానం చేస్తున్నారు. ఈ కుట్రలను గ్రహించలేని దశను భారతీయ దళిత, పౌర సమాజం ఎప్పుడో దాటిపోయిందని వ్యాస రచయిత గ్రహించాలి!

బడుగు భాస్కర్ జోగేష్

న్యాయవాది

Updated Date - Jul 26 , 2024 | 03:23 AM

Advertising
Advertising
<