ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రచయిత తపన అర్థమైతేనే మంచి అనువాదం

ABN, Publish Date - Sep 30 , 2024 | 12:48 AM

తెలుగు, తమిళం రెండూ ఒకే నది నుండి చీలిన పాయలలాంటివి. రెండు సంస్కృతులకూ చాలా దగ్గరి పోలికలు, సూక్ష్ భేదాలు ఉన్నాయి. తమిళనాడులో పుట్టి పెరిగిన తెలుగువాణ్ణి. తెలుగు నా మాతృభాష...

పాఠకులు ఎంతో ఇష్టపడి చదివిన 75 అనువాద కథలు, 2 అనువాద సంపుటాలతో తెలుగు తమిళ పాఠకులను కథాసూత్రంతో బంధించిన రచయిత, తను నిమిత్తమాత్రుడై మూలరచనను, మూలరచయితను ఎత్తిపట్టి పాఠకులకి చేరువ చేయడానికి తపనపడే అరుదైన అనువాదకుడు అవినేని భాస్కర్‌తో ముఖాముఖి.

కె. ఎన్. మల్లీశ్వరి

తెలుగు, తమిళ భాషల మధ్య అనువాదం చేయగల సయోధ్య ఎలా సాధించారు?

తెలుగు, తమిళం రెండూ ఒకే నది నుండి చీలిన పాయలలాంటివి. రెండు సంస్కృతులకూ చాలా దగ్గరి పోలికలు, సూక్ష్ భేదాలు ఉన్నాయి. తమిళనాడులో పుట్టి పెరిగిన తెలుగువాణ్ణి. తెలుగు నా మాతృభాష. తమిళసాహిత్యం ఊహ తెలిసిననాటి నుండి చదువుతూనే ఉన్నాను. ఈ రెండు భాషల సాహిత్యంతో నాకున్న పరిచయం, ప్రవేశం వల్ల సయోధ్య సాధించడం సులభమైంది.


అనువాదాలు ఎలా మొదలుపెట్టారు?

తమిళనాడులో పుట్టి, పెరిగి, తమిళంలో విద్యాభ్యాసం చేసిన తెలుగువాడిని. తమిళ సాహిత్యం చదువుతూ పెరిగాను. మరోవైపు ఇంట్లో పెద్దలు ప్రాచీన తెలుగు సాహిత్యం చదివి వినిపిస్తూ ఉండటం వల్ల ఆ సాహిత్యానికీ చేరువగానే ఉండగలిగాను. ఇరవై ఏళ్ళొచ్చాక ఉద్యోగరీత్యా బెంగుళూరులో ఒక్కణ్ణే ఉంటున్నరోజుల్లో తెలుగు సాహిత్యం చదివి వినిపించే తోడెవ్వరూ లేరు. దాంతో తెలుగు స్వయంగా చదవడం నేర్చుకోవాలన్న కోరిక కలిగింది. పెద్దమ్మకొడుకు మోహన్ ప్రోత్సాహంతో తెలుగు చదవడం నేర్చుకున్నాను. పాటలరూపంలో విన్న అన్నమయ్య పదసాహిత్యంలోని కవిత్వం బాగా ఆకర్షించింది. అన్నమయ్య 29 సంపుటాలూ తెచ్చుకుని చదివాను. తర్వాత పోతన నుండి మొదలుపెట్టి అనేక ప్రాచీన తెలుగు కావ్యాలూ, ఆధునిక సాహిత్యంలోని కథలూ నవలలూ కవిత్వాలు చదువుకున్నాను. కొత్త భాషాసాహిత్యాలతో కొంత పరిచయం ఏర్పడితే ఏ భాషలో ఎలాంటి సాహిత్యం ఉందని పోల్చుకోవడం లోలోపల మొదలైపోతుంది. అలా తెలుగు సాహితీమిత్రులకు తమిళసాహిత్యం, తమిళమిత్రులకు తెలుగుసాహిత్యం పరిచయం చేస్తుంటే, వాటినెందుకు అనువాదం చెయ్యకూడదూ అనడిగారు. అలా నా అనువాద ప్రయత్నం కవిత్వంతో మొదలైంది.


అనువాదకులకు, మూలరచనలు, మూలరచయితలతో స్పర్ధ ఏర్పడే సందర్భాలు ఉంటాయా?

రచనాస్ఫూర్తి దెబ్బ తిందన్న అభిప్రాయం కానీ, పాఠకులకు సరిగా చేరలేదన్న అభిప్రాయం కానీ మూలరచయితకు కలిగితే, స్పర్ధ ఏర్పడే అవకాశం ఉంది. కానీ, మూలరచనలో బలం, అనువాదంలో నిజాయితీ నాణ్యతా ఉంటే పాఠకులు మూల రచయితను, రచనలోని ఆత్మను పొల్లుపోకుండా పట్టుకోగలుగుతారు. కొన్ని రచనలకు సందర్భం ఉంటుంది. స్థలకాలాల నుండి విడదీయలేని బంధం ఉంటుంది. అనువాదం చేసేటప్పుడు కొత్త పాఠకులకు ఇవి ఎంతవరకు అవసరమన్నది అనువాదకులు అర్థం చేసుకోవాలి. తదనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి. ఇలాంటి శ్రద్ధ, జాగ్రత్త అనువాదకులకి ఉంటే, స్పర్ధలు ఏర్పడే అవకాశం తగ్గవచ్చు. మనమున్న AI ప్రపంచానికి అనువాదం దానికదే సమస్య కాదు. గొప్ప విషయమూ కాదు. కానీ రచయిత హృదయ సంస్కారాన్ని, రచనలో అన్నిసార్లూ దొరకని రచయిత తపనను- అవి సంపూర్ణంగా అర్థమైన పాఠకులు అనువాదకులైతే, అనువాదంలో తీసుకురాగలిగిన శోభ వేరు. ఆ అనుభవాన్ని మరొక భాషలోని మిత్రులకు అందివ్వాలన్న తపన తప్ప వేరే ఉద్దేశ్యాలు లేనందుకేమో, నేనసలు స్పర్ధలకు కారణాలు కూడా ఊహించలేకపోతున్నాను. అనుమతులు హక్కులు రాయల్టీల దగ్గర చర్చ ఉండచ్చు. వాటికి సంబంధించి అంగీకారం తప్పకుండా కుదుర్చుకోవాల్సిందే.


అనువాదకుల పాత్రని మీరెలా నిర్వచిస్తున్నారు?

పాఠకుడిగా నన్ను కదిలించిన రచనే అనువాదయోగ్యమైనదని అనుకోను. అనువాదానికి తీసుకున్న రచనావస్తువు, చెప్పేతీరు, పాఠకులలో కలిగించబోయే ప్రేరణ, తాత్వికచింతన లక్ష్యభాషలో లేనిదిగా ఉండాలి. లక్ష్యభాషలో అలాంటి రచనలు అదివరకే ఉన్నట్టయితే పాఠకుల మీద అనువాదాల భారం మోపడమే అవుతుంది- లేదా పక్కభాషలో కూడా మనలాంటి రచనలే వస్తున్నాయి అని చెప్పడానికే పనికొస్తుంది. కాబట్టి, రచనను అనువాదానికి ఎంచుకునేటప్పుడు దానివల్ల ప్రయోజనం ఏమిటన్నది ప్రశ్నించుకోవాలి. అనువాదం రెండుసంస్కృతుల మధ్య వారధి నిర్మించే పెద్దబాధ్యత!

ఎ. ముత్తులింగం కథనం చేసిన శ్రీలంక తమిళుల జీవితాలను తెలుగులోకి అనువాదం చేయడానికి ప్రత్యేక కారణం ఉందా?

ఎ. ముత్తులింగం శ్రీలంకలో పుట్టిన తమిళుడు. ఐక్యరాజ్యసమితి ఉద్యోగి. వృత్తిరీత్యా ప్రపంచంలోని పలుదేశాల్లో నివసించారు. కాబట్టి ఆయనకథలకు విభిన్న సంస్కృతులనుండి, దేశాలనుండి, రకరకాల మనుషుల జీవితాలనుండి కథావస్తువులు లభించాయి. శ్రీలంక తమిళుల గురించే కాకుండా సమస్త మానవాళికి సంబంధించిన కథలు రాశారు. నిజానికి ఆయన కథలన్నీ తమిళ సాహిత్య ప్రపంచానికి కూడా కొత్తవే! ఆయన కథచెప్పే విధానం కూడా ఎంతో ప్రత్యేకమైనది. తెలుగువారికి కొత్తతరహా కథలను పరిచయం చేసినట్టు అవుతుందని ఆ కథలను అనువాదం చేశాను. ‘ఐదు కాళ్ళ మనిషి’ పేరిట వచ్చిన పదిహేను కథల పుస్తకం నా మొదటి అనువాద సంపుటి.


‘నెమ్మినీలం’లోని జయమోహన్ తాత్వికతని అనువాదంలోకి అలవోకగా తీసుకువచ్చారు, ఎటువంటి కృషి చేశారు?

జయమోహన్ కాల్పనిక సాహిత్యంతోబాటు ఆయన తత్వ, ఆధ్యాత్మిక రచనలు కూడా బహుకాలంగా చదువుతూ ఉన్నాను. అంచేత ఆయన రాసే కాల్పనిక సాహిత్యంలో అంతఃసూత్రమయిన తాత్వికత ఏమిటన్నది పాఠకుడిగా తెలుసు. అది నా లోనూ కొంత ఇంకిపోయింది. ఆయన రచనావిధానంలోనే ఆ తాత్వికత అంతర్లీనంగా ఇమిడిపోయి ఉంటుంది. ఆయన అదేమీ బిగ్గరగా చెప్పరు. కనుక ప్రత్యేకంగా దానిని అనువాదంలోకి తీసుకురావడమన్న శ్రమ లేదు. నిజానికి మీరిచ్చిన ప్రశంస రచయితగా జయమోహన్‌కి చెందాల్సింది అనుకుంటాను. ఆయన రాసిన అన్ని కథలూ ఒకెత్తయితే ‘నెమ్మి నీలం’ సంపుటంలోని కథలు మరో ఎత్తు-. ఈ కథలు రచయత స్వరూపాన్ని అన్నికోణాల్లో నుండీ ఆవిష్కరిస్తాయి. ధర్మమే అంతఃసూత్రంగా సాగే ఈ కథల్లో ఎన్నో పొరలున్నాయి.

ఇతరభాషల నుండి మనకి అనువాదరచనలు విస్తృతంగానే వస్తున్నాయి. మరి ఇక్కడ నుండి ఇతరభాషలలోకి మన రచనలు వెళ్తున్నాయా?

ఇతర భాషల గురించి ఎక్కువ తెలియదు గానీ, మన పక్క రాష్ట్రాల వాళ్ళకు మన రచనలు అందటం లేదు. ఏ దక్షిణాదిభాషకూ లేనంత వెసులుబాటు మన భాషకుంది. మనకు రెండురాష్ట్రాలున్నాయి, అనేక విశ్వవిద్యాలయాలున్నాయి. దక్షిణాదిలోనే సంఖ్యాపరంగా అతిపెద్దజాతి మనది. అయితే సాహిత్యం చదవడంలో మాత్రం అట్టడుగున ఉన్నదీ మనమే! కొన్ని దశాబ్దాల క్రితం వరకు తెలుగుసాహిత్యం చదివే పాఠకులు బాగానే ఉండేవారు. ఈ మధ్య కాలంలో చదివేవాళ్ళశాతం తగ్గిపోయింది. ఐఐటీలు, ఇంజినీరింగులు, విదేశీవలసలు, హీరోల పేరిట అభిమానసంఘాలు, కార్తీకమాస వనభోజనాలు, రాజకీయాలు మాత్రమే కాదు తెలుగు సంస్కృతంటే-! సాహిత్యం చదవడం, పుస్తకాలు పంచుకోవడం, దాని గురించి మాట్లాడటం కూడా సంస్కృతిలో భాగమేనని తెలుగువారు గుర్తుపెట్టుకోవాలి. ఉద్యమంలాగా సాహిత్యపఠనాన్ని తెలుగువాళ్ళు మళ్ళీ అందిపుచ్చుకోవాలి. అప్పుడు తెలుగులో సాహిత్యానికి ఆదరణ పెరుగుతుంది, చదువుతారు, చదివినదాన్ని ఇతరభాషల్లోకి తీసుకెళ్ళాలన్న తపన మొదలవుతుంది.


రాజకీయ నాయకులకీ, సినీతారలకీ ప్రజాదరణ, ఆకర్షణ దక్షిణాది రాష్ట్రాలలో ఎక్కువే. తమిళనాడు రాజకీయ నాయకుల్లో యాభైశాతానికి పైగా రచనారంగంతో సంబంధాలున్నవారే. తమిళ సినిమా రంగంలోనూ సాహిత్యాన్ని చదివేవారు ఎక్కువే. మన సినిమాతారలూ, రాజకీయనాయకులూ పుస్తకాలు చదువుతామని బయట చెప్పుకోవడానికి మొహమాటపడతారేమో! వాళ్ళు చెప్తే ఎక్కువమంది చదువుతారు. బిగ్‍బాస్ (తమిళం) షోలో కమల్‍హాసన్ ప్రతి ఎపిసోడ్‍లోనూ కొన్ని పుస్తకాలను,

రచయితలను ప్రేక్షకులకు పరిచయం చేశారు. అక్కడ దర్శకులు కూడా కాల్పనిక సాహిత్యాన్ని సినిమాలకు వస్తువులుగా ఎంచుకుంటారు, వీలున్నంతవరకు ఆ రచయితతోనే సంభాషణలు రాయించుకుంటారు. మనవాళ్ళూ ఇలాంటివిచేస్తే మన పుస్తకాలు కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో తెలుగుపాఠకులను సంపాదించుకుంటాయి. పాఠకులు పెరిగితే అనువాదకులూ పెరిగినట్టే.

(avineny@gmail.com)

అవినేని భాస్కర్

Updated Date - Sep 30 , 2024 | 12:48 AM