యువ పారిశ్రామికులకు తెరుచుకున్న ద్వారాలు!
ABN, Publish Date - Oct 17 , 2024 | 02:24 AM
తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) వెన్నెముక. ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహించేందుకు, పెట్టుబడులను ఆకర్షించేందుకు పరిశ్రమ 4.0 పేరిట...
తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) వెన్నెముక. ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహించేందుకు, పెట్టుబడులను ఆకర్షించేందుకు పరిశ్రమ 4.0 పేరిట నూతన పాలసీని ఇటీవలనే సీఎం రేవంత్‌రెడ్డి, పరిశ్రమల శాఖా మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు ప్రకటించారు. సమ్మిళిత అభివృద్ధి, సమగ్ర ఉపాధి, మెరుగైన ఉత్పాదకత సాధించడానికి ఈ కొత్త విధానం దోహదపడనుంది.
భూమిని తక్కువ ధరకు ఇవ్వడం దగ్గరి నుంచి రుణాలు సులభంగా అందేలా చూడటం వరకు పారిశ్రామికవేత్తలను ఆకట్టుకునేలా పలు విధానాలు ఎంఎస్‌ఎంఈ నూతన విధానంలో ఉన్నాయి. గత దశాబ్ద కాలం నుంచి రాష్ట్రంలో చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2014 నుంచి టీఎస్ ఐపాస్ ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల నమోదు 11 నుంచి 15శాతం పెరుగుతూ వచ్చింది. సగటు పెట్టుబడి 2018లో కోటి రూపాయలు ఉండగా 2022కు రూ.2.15కోట్లకు పెరిగింది. రాష్ట్రంలో భౌగోళికంగా, ఇతర అంశాలపరంగా ఎన్నో సానుకూలమైన అంశాలున్నప్పటికీ ఆశించిన స్థాయిలో పెట్టుబడులు రావడం లేదని గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం తదనుగుణంగా నిర్ణయాలు తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన టీఎస్ ఐపాస్ ద్వారా బహుళజాతి కంపెనీలకు మాత్రమే ప్రయోజనం చేకూరేలా విధానాలున్నాయని గుర్తించిన పరిశ్రమల శాఖ చిన్నతరహా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇస్తూ నూతన పాలసీని రూపొందించింది. కొత్త ఎంఎస్ఎంఈ పాలసీతో ఈ రంగానికి ఏకంగా రూ.4వేల కోట్లు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో కొత్తగా 25,000కు పైగా ఎంఎస్‌ఎంఈలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దేశవ్యాప్తంగా పరిశ్రమలపరంగా తెలంగాణ ఆరో స్థానంలో ఉంది. అదే విధంగా పరిశ్రమల నుంచి సమకూరే స్థూల విలువ ఆధారిత అంశాల పరంగా 8వ స్థానంలో ఉంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పారిశ్రామికవాడల్లో ఎంఎస్‌ఎంఈలకు స్థలాలను కేటాయించే విధానం ఇప్పటి వరకు ఉంది. దీంతో ఆయా స్థలాలను గవర్నమెంట్ నుంచి కొనాల్సి ఉండటంతో పెట్టుబడి పెరిగేది. పెట్టుబడి రెట్టింపు కంటే అధికమై, పరిశ్రమల నిర్వహణ కూడా కష్టంగా మారేది. ఈ విధానానికి చెక్ పెడుతూ ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానంలో లీజు పద్ధతిని ప్రవేశపెట్టింది. పరిశ్రమలు స్థాపించాలనుకున్న వారు 33ఏళ్ల వరకు లీజుకు తీసుకోవచ్చు. దీంతో పారిశ్రామికవేత్తలపై ఆర్థిక భారం తగ్గుతుంది.
చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుకు అవరోధంగా ఉన్న ఇతర అంశాలనూ పరిష్కరించేలా నూతన విధానంలో ఏర్పాట్లు చేశారు. ఇందులో ప్రధానంగా ఆరు విషయాలను పరిగణనలోకి తీసుకున్నారు. భూమి, రుణసాయం, ముడి సరుకులు, వ్యాపారపరమైన మెళకువలు, నూతన సాంకేతికత, మార్కెట్ సదుపాయం కల్పించడం వంటి వాటిపైనే ప్రధానంగా దృష్టి సారించారు. సంస్థల ఏర్పాటు దగ్గర నుంచి అమ్మకాల వరకు ప్రతి అంశంలోనూ ప్రభుత్వం చేదోడువాదోడుగా నిలవనుంది. దీనికోసం ప్రత్యేకంగా ఉన్నతస్థాయి పర్యవేక్షణ కమిటీని సైతం ఏర్పాటు చేసింది. పరిశ్రమల మంత్రి, ముఖ్యకార్యదర్శి, పరిశ్రమల కమిషనర్, డైరెక్టర్, పారిశ్రామికవేత్తల నుంచి కొంత మంది ప్రతినిధులు ఈ కమిటీలో ఉంటారు. పారిశ్రామికవేత్తల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, క్షేత్రస్థాయిలో ఏ విధంగా అమలుపర్చాలనే నివేదికను రూపొందించి వాటిని అమలు చేసేలా ఉన్నతస్థాయి పర్యవేక్షణ కమిటీ చూడనుంది. ఎంఎస్‌ఎంఈల రిజిస్ట్రేషన్ ఖర్చుతో కూడుకున్న పని అని పలువురు వెనకడుగు వేస్తున్నారు. భూమి, భవన నిర్మాణాల కోసమే 40 నుంచి 50 శాతం ఖర్చు చేయాల్సి వస్తోంది. తగిన వనరుల లేమి, భూమి ధర, శ్రామిక ఖర్చు ఎక్కువగా ఉండడం వల్ల చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. నిర్వహణ ఖర్చులు తగ్గించి, మార్కెటింగ్ సౌకర్యంతో పాటు సాంకేతిక తోడ్పాటు అందించే విధంగా ఉన్నతస్థాయి పర్యవేక్షణ కమిటీ పనిచేయనుంది.
రాష్ట్రంలో ప్రస్తుతం దాదాపు 35 లక్షల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉండగా, వీటిలో 26 లక్షలకు పైగా సూక్ష్మ పరిశ్రమలే ఉన్నాయి. ఇందులో సుమారు 30 లక్షల మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. ఇవి కూడా తయారీ, సేవలు, రిటైల్, హోల్‌సేల్ విభాగాల్లో పని చేస్తున్నాయి. మధ్యతరహా పరిశ్రమలైతే వెయ్యి వరకే ఉన్నాయి. వీటి ద్వారా లక్షమందికి పైగా ఉపాధి లభిస్తోంది. ఆ తర్వాత ఆహార తయారీ, ఖనిజ, చెక్క ఆధారిత, ఇంజనీరింగ్, ఎఫ్‌ఎంసీజీ, టెక్స్‌టైల్స్, ఆటో విడిభాగాల రంగాలు పని కల్పిస్తున్నాయి.
మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ఉంది. ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఒక మహిళా పారిశ్రామికవాడను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ఎంఎస్‌ఎంఈలను స్థాపించడానికి వచ్చే మహిళలకు మహిళా శక్తి స్కీం ద్వారా మరింత ప్రోత్సహిస్తారు. రాష్ట్రంలో కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయనున్నట్టుగా ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి పలుమార్లు చెప్తూ వస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో మహిళల జనాభా 1.88 కోట్లు. వీరిలో కేవలం 58వేల మంది మాత్రమే మహిళా పారిశ్రామికవేత్తలు ఉన్నారు. ఇది జనాభాతో పోలిస్తే 3.1 శాతమే. నూతన విధానంలో ఎస్సీ, ఎస్టీలతో పాటు మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే విధంగా రాయితీలు కల్పించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈలు నిర్వహిస్తున్న వారిలో ఎస్సీలు 15శాతం, ఎస్టీలు 9శాతం, బీసీలు 28శాతంగా ఉన్నారు. సూక్ష్మ పరిశ్రమలతో పాటు చిన్న, మధ్య తరహా పరిశ్రమలు భారీగా ఏర్పాటయ్యేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. వీటి ద్వారా లక్షల సంఖ్యలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుంది.
ప్రపంచంలో మారుతున్న మార్కెట్ అవసరాలకు అనుగుణంగా యువతను నిపుణులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఆలోచన చేశారు. స్కిల్ యూనివర్సిటీలో వివిధ విభాగాల్లో ట్రైనింగ్ ఇచ్చేందుకు దేశంలోని ప్రముఖ కార్పొరేట్ సంస్థలైన ఎస్‌బీఐ, న్యాక్, డాక్టర్ రెడ్డీస్, టీవీఏజీఏ, అదానీ, సీఐఐ లాంటి సంస్థలు భాగస్వాములు. ఇదే కాకుండా స్కిల్ యూనివర్సిటీలో దాదాపు 140 కంపెనీలు భాగస్వామ్యం కావడానికి ఆసక్తి చూపుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ కేంద్రాలను ఆధునిక నైపుణ్య కేంద్రాలుగా మార్చేందుకు వీలుగా మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు. రాష్ట్రంలోని ఐటీఐ, ఏటీసీలు, పాలిటెక్నిక్ కళాశాలలు సైతం స్కిల్ వర్సిటీ కిందకే రానున్నాయి. రాష్ట్రంలోని 100 నియోజకవర్గాలలో ఐటీఐ లేదా ఏటీసీలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. వర్సిటీతో పాటు ఐటీఐ, ఏటీసీలలో అన్ని రంగాలపై అనుభవంతో కూడిన నైపుణ్యాన్ని సాధించిన యువతకు ఎంఎస్ఎంఈలు వరంలాగా మారే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఉద్యోగాల కోసం ఎదురు చూసే యువత ఎంఎస్ఎంఈల వైపు ఆసక్తి చూపనున్నారు. వారు ఉపాధి పొందుతూనే ఎంతో మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలను కల్పించనున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం అసాధ్యం. అందుకే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సరికొత్త పాలసీతో పరిశ్రమల ఏర్పాటు ద్వారా 20శాతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. ఇదే కాకుండా ప్రత్యేకంగా 30శాతం ఎస్సీ, ఎస్టీలతో పాటు మహిళలకే మెరుగైన అవకాశాలు లభించనున్నాయి.
డా. ఎన్. యాదగిరిరావు
అదనపు కమిషనర్, జీహెచ్ఎంసీ
Updated Date - Oct 17 , 2024 | 02:24 AM