ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

స్వాతంత్ర్య శతాబ్దికి మన భాగ్య చక్రం

ABN, Publish Date - Oct 05 , 2024 | 04:24 AM

నేను ఒక బ్రేకింగ్‌ న్యూస్‌ ఇవ్వదలిచాను అయితే ఇది చాలా భిన్నమైనది. చట్టాన్ని ఉల్లంఘించడానికి సంబంధించినది కాదది. తలలు పగుల గొట్టడం లేదా గృహాలను ధ్వంసం చేయడం గురించిన న్యూస్‌ కాదది. గతంలో అనేక పర్యాయాలు వీక్షకులను ఉత్కంఠభరితులను చేసిన బ్రేకింగ్‌ న్యూస్‌ కాదది.

  • ‘పళని’ పలుకు

నేను ఒక బ్రేకింగ్‌ న్యూస్‌ ఇవ్వదలిచాను అయితే ఇది చాలా భిన్నమైనది. చట్టాన్ని ఉల్లంఘించడానికి సంబంధించినది కాదది. తలలు పగుల గొట్టడం లేదా గృహాలను ధ్వంసం చేయడం గురించిన న్యూస్‌ కాదది. గతంలో అనేక పర్యాయాలు వీక్షకులను ఉత్కంఠభరితులను చేసిన బ్రేకింగ్‌ న్యూస్‌ కాదది.

హింసాత్మక నేరాల పెరుగుదలను జాతీయ నేరాల నమోదు బ్యూరో నమోదు చేసినప్పుడు అది చట్టాల ఉల్లంఘనకు సంబంధించిన న్యూస్‌ అవుతుంది. నిఘా బృందాలు ఒక యువ జంటను చావబాదినప్పుడో లేదా ఒక వ్యక్తిని చిత్రవధతో చంపివేసినప్పుడో అది తలలు పగులగొట్టడం, ఎముకలను విరిచివేయడానికి సంబంధించిన న్యూస్‌ అవుతుంది. కబ్జా చేసిన ప్రదేశాలలో నిర్మించిన గృహాలను కూల్చివేసేందుకు అధికారులు బుల్డోజర్లను వినియోగించినప్పుడు అది ఇళ్ల కూల్చివేత న్యూస్‌ అవుతుంది. గౌరవనీయ ప్రధానమంత్రి ప్రతిపక్షాన్ని ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీని తుక్డే తుక్డే గ్యాంగ్‌ అనో లేదా అర్బన్‌ నక్సల్స్‌ అనో నిందించినప్పుడు ఆ బ్రేకింగ్‌ న్యూస్‌ ఒక పెద్ద ఆవలింతకు కారణమవుతుంది.

నేను మీతో పంచుకోదల్చిన అత్యంత ముఖ్యమైన బ్రేకింగ్‌ న్యూస్‌ మీ నమ్మకాలను వమ్ము చేస్తుంది, మీ ఆశలను కూల్చివేస్తుంది. మీ హృదయాలను పగులగొడుతుంది. కె.వి. కామత్‌ ఒక ప్రముఖ బ్యాంకర్‌. భారతదేశ అగ్రగామి ప్రైవేట్‌ బ్యాంక్‌గా ఐసిఐసిఐను అభివృద్ధిపరిచింది ఆయనే. న్యూ డెవలెప్‌మెంట్‌ బ్యాంక్‌ (బ్రిక్స్‌ దేశాల బ్యాంక్‌) ప్రథమ చైర్మన్‌ కూడా ఆయనే. కె.వి. కామత్‌ ఇప్పుడు నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ పైనాన్సింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌కు చైర్మన్‌గా ఉన్నారు.


ఇటీవల ఒక ప్రముఖ దినపత్రికలో ఒక పుస్తకాన్ని సమీక్షించారు. స్వాతంత్ర్య శతాబ్ది (2047) నాటికి మన దేశం ‘వికసిత్‌ భారత్‌’ హోదా పొందేందుకు అనుసరించాల్సిన బాట గురించి ఆయన పేర్కొన్నారు. ఇంతకూ కామత్‌ సమీక్షించిన పుస్తక రచయిత ఎవరో చెప్పలేదు కదూ? ప్రముఖ ఆర్థికవేత్త కృష్ణమూర్తి సుబ్రమణియన్‌. 2018 నుంచి 2021 దాకా భారత ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారుగా ఉన్నారు. స్థూల దేశీయోత్పత్తి 12.5 శాతం సగటు వార్షిక పెరుగుదలతో ప్రతి ఆరు సంవత్సరాలకు రెట్టింపు అవుతుందని, తద్వారా 2023లో 3.28 ట్రిలియన్‌ డాలర్ల నుంచి 2047లో 55 ట్రిలియన్‌ డాలర్లకు అంటే 16 రెట్లు పెరుగుతుందన్న కృష్ణమూర్తి అభిప్రాయంతో కామత్‌ ఏకీభవించారు. నేనూ హృదయపూర్వకంగా అంగీకరిస్తున్నాను. అటువంటి సుస్థిరాభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకోవాలని నేనూ వాదించాను.

కామత్‌ సమీక్షలో చివరి పేరాలు అసంతృప్తి కలిగించాయి. ఆయన పేర్కొన్న అంశాలు సంతోషదాయకమైనవి కావు. స్వాతంత్ర్య శతాబ్ది నాటికి భారత్‌ను సమగ్ర అభివృద్ధి చెందిన దేశంగా రూపొందించేందుకు దోహదం చేసే నాలుగు సుస్థిర ప్రాతిపదికలను పేర్కొన్నారు. అవి: స్థూల ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యం; సమ్మిళిత సామాజిక, ఆర్థిక పురోగతి; ప్రైవేట్‌ రంగంలో నైతిక పద్ధతులతో సంపద సృష్టి; ప్రైవేట్‌ పెట్టుబడులకు ప్రాధాన్యం. ప్రస్తుత ప్రభుత్వ పాలనలో ఈ అంశాల స్థితిగతులు ఎలా ఉన్నాయో చూద్దాం.

ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణం, వడ్డీరేటు, కరెంట్‌ ఖాతా లోటు, రుణాల/ జీడీపీ నిష్పత్తి మొదలైనవి స్థూల ఆర్థికాభివృద్ధి గురించిన స్థూల చిత్రాన్ని అందిస్తాయి. ద్రవ్యలోటు జీడీపీలో 3 శాతంగా ఉండాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. అది ఇప్పుడు 5.6 శాతంగా ఉన్నది. ద్రవ్యలోటును 3 శాతానికి పరిమితం చేసేందుకు మనం ఇంకా చాలా దూరం పయనించవలసి ఉన్నది. ద్రవ్యోల్బణం ఇప్పటికీ 4 శాతానికి పైగా ఉన్నది. రిజర్వ్ బ్యాంక్‌ రెపో రేటు మే 2022 నుంచి 6.5 శాతంగా ఉన్నది. కరెంట్‌ ఖాతా లోటు 2023–24 ఆర్థిక సంవత్సరాంతానికి 23.2 బిలియన్‌ డాలర్లుగా ఉన్నది. అయితే ప్రవాస భారతీయులు పంపిస్తున్న నిధులు మనలను ఆదుకుంటున్నాయి. రుణాలు/ జీడీపీ నిష్పత్తి రేటు 18.7 శాతంగా ఉన్నది. ఇది భరించదగినదే.


సమ్మిళిత సామాజిక ఆర్థిక పురోగతి ఎలా సాధ్యమవుతుంది? అసమానతలను తగ్గించేందుకు మోదీ ప్రభుత్వం విఫల ప్రయత్నం మాత్రమే చేసింది. దీనివల్ల భారీ నష్టం సంభవించింది. ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం, పెట్టుబడి సాంద్ర పరిశ్రమల్లో ప్రభుత్వ మదుపులు, కార్పొరేట్‌ పన్నుల తగ్గింపు, వినియోగ వస్తువులపై పన్నులు, ఇంధన ధరల పెరుగుదల, చాలీచాలని కనీస వేతనాలు, కౌలు రైతులను నిర్లక్ష్యం చేయడం, తదితర విధానాలు ఎగువన ఉన్న ఒక శాతం మందికి, దిగువన ఉన్న 20 శాతం మందికి మధ్య ఆర్థిక అసమానతలను విపరీతంగా పెంచాయి. విద్వేష ప్రచారాలు, మతోన్మాద ఘర్షణలు సమ్మిళిత సామాజిక అభివృద్ధికి అవరోధమవుతున్నాయి. ప్రైవేట్‌ రంగ సంస్థలచే నైతిక పద్ధతుల్లో సంపద సృష్టి విషయాన్ని చూద్దాం. బ్యాంకుల్లో మోసాలు, కార్పొరేట్‌ కంపెనీల పతనాలు గత పదేళ్లలో గణనీయంగా పెరిగాయి.

అనుచిత నిబంధనలు, నియంత్రణల ఎరుగుదల, పన్నుల పాలనా వ్యవస్థ మరింత కఠినంగా ఉండడం మొదలైనవి నైతిక విలువలను పాటించే వ్యాపారవేత్తలను తీవ్రంగా నిరుత్సాహపరుస్తున్నాయి. వారి వ్యాపార నిర్వహణలో క్రమశిక్షణకు భంగం కలిగిస్తున్నాయి. ఎంతో మంది యువ వ్యాపారవేత్తలు విదేశాలకు వలస వెళ్లేందుకు ఆరాటపడుతున్నారు. 4300 మంది భారతీయ మిలియనీర్లు భారత్‌ నుంచి నిష్క్రమించారు. కాంపిటీషన్‌ కమిషన్‌ వాస్తవానికి గుత్తాధిపత్యాలను మాత్రమే ప్రోత్సహిస్తోంది.

పౌర విమానయానం, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, టెలికమ్యూనికేషన్స్‌, చమురు శుద్ధి, సౌరశక్తి మొదలైన పరిశ్రమలలో పోటీ చాల స్వల్పస్థాయిలో మాత్రమే ఉంది. గుత్తాధిపత్యాలు పెరగడమే అందుకు కారణం. సిమెంట్‌, ఉక్కు, విద్యుత్‌, రిటైల్‌ మొదలైన పారిశ్రామిక, వ్యాపార రంగాలలో పోటీ పెరుగుతుందా లేక తగ్గిపోతుందా అనేది ఒక చర్చించదగిన అంశం. ఈ ధోరణులు పోటీ విపణి ఆర్థిక వ్యవస్థ పురోగతికి దోహదం చేసేవి కావు. కాల పరీక్షకు తట్టుకుని నిలిచిన పోటీ విపణి ఆర్థిక వ్యవస్థలో మాత్రమే ప్రైవేట్‌ రంగ సంస్థలు నైతిక పద్ధతులలో సంపదను సృష్టించగలుగుతాయి.


ప్రైవేట్‌ పెట్టుబడుల విషయాన్ని చూద్దాం. అవును, ప్రైవేట్‌ పెట్టుబడులతో మాత్రమే భాగ్యచక్రం తిరుగుతుంది. దురదృష్టవశాత్తు ప్రభుత్వ మదుపుల కంటే ప్రైవేట్‌ మదుపులు బాగా వెనకబడి ఉన్నాయి. ప్రభుత్వం ఎంతగా ప్రోత్సహిస్తున్నా, రాయితీలు ప్రకటిస్తున్నా నయాన భయాన చెబుతున్నా ప్రైవేట్‌ పెట్టుబడులు పెరగడం లేదు వ్యాపారవేత్తలను ప్రభుత్వం విశ్వసించడం లేదు. ప్రభుత్వ సమర్థత, ఉదారతలో వ్యాపారవేత్తలకు నమ్మకం కుదరడం లేదు. పలు వ్యాపార సంస్థలను సంశయాస్పద పద్ధతులలో స్వాధీనం చేసుకుంటున్న తీరుతెన్నులు కూడా వ్యాపార వాతావరణాన్ని సానుకూలంగా ఉంచడం లేదు. 2000 సంవత్సరం నుంచి ఇంతవరకు 8000 భారతీయ కంపెనీలు సింగపూర్‌లో నమోదు అయ్యాయి. దర్యాప్తు సంస్థలు ప్రతి విషయాన్నీ తరచి తరచి చూస్తున్న తీరు వ్యాపారవేత్తలలో భయాందోళనలకు బాగా ఆస్కారమిస్తోంది. భారత ఆర్థిక వ్యవస్థలో మదుపు చేయకుండా భారతీయ వ్యాపార సంస్థలను నిలువరిస్తున్నదేమిటి? సెప్టెంబర్‌ 2022లో గౌరవనీయ ఆర్థిక మంత్రి అడిగిన ప్రశ్న అది. ప్రస్తావిత అంశాలు అన్నిటిపైనా సాధికారంగా మాట్లాడేందుకు ఉత్కృష్ట అర్హతలు ఉన్న వ్యక్తి కామత్‌ మాత్రమే.

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - Oct 05 , 2024 | 04:31 AM