వింత కోరికల జగన్.. వితండవాదాల వైసీపీ
ABN, Publish Date - Aug 02 , 2024 | 02:05 AM
ఎడ్డెం అంటే తెడ్డెం, తెడ్డెం అంటే ఎడ్డెం అనే సామెత ఒకటి ఉంది. దీని అర్థం ప్రతి మాటకు అడ్డదిడ్డంగా వాదన చేయటం. వాడుక భాషలో మొండి వాదన, కుతర్కం అనీ అంటారు. మాజీ ముఖ్యమంత్రి...
ఎడ్డెం అంటే తెడ్డెం, తెడ్డెం అంటే ఎడ్డెం అనే సామెత ఒకటి ఉంది. దీని అర్థం ప్రతి మాటకు అడ్డదిడ్డంగా వాదన చేయటం. వాడుక భాషలో మొండి వాదన, కుతర్కం అనీ అంటారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిది సరిగ్గా ఇలాంటి వాదనే.
ఒకసారి ఆయన ఐదేళ్ళ పరిపాలన కాలాన్ని సమీక్షిస్తే, ఇలాంటి హేతుబద్ధత లేని, శాస్త్రీయత లేని అంశాలే ఎక్కువగా కనిపిస్తాయి. వాటిలో కొన్ని... 1. ఆయన తొలి సమావేశం పెట్టి ప్రజావేదికను కూల్చేశారు. ఇందుకు చెప్పిన కారణం. ప్రజావేదిక అక్రమ కట్టడం అని. ప్రభుత్వ స్థలంలో, ప్రభుత్వ సొమ్ముతో నిర్మించిన ‘ప్రజా ప్రయోజనాల భవనం’ ఎలా అక్రమమో బుర్ర బద్దలుకొట్టుకున్నా, ఎవ్వరికీ అర్థం కాదు, ఆయనకు తప్ప. అలాంటప్పుడు అసెంబ్లీ, శాసనమండలి, హైకోర్టు కూడా అక్రమ కట్టడాలే కదా? ఆయా జిల్లాల్లో ఉన్న కలెక్టర్ భవనాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆయన నిర్మించిన సచివాలయాలు ఆ కోవలోకే వస్తాయి కదా? ఇలాంటి ప్రశ్నలు ఎవ్వరూ వేయకూడదు. ఆయన అక్రమం అంటే అక్రమం. సక్రమం అంటే సక్రమం. అందరూ అదే అనాలి.
2. శాసనమండలిని ‘దద్దమ్మల సభ’తో పోల్చారు. శాసనసభలోనే ఎందరో డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు ఉంటారని, ఇక దద్దమ్మలు దేనికి? అని ప్రకటించారు. కానీ, చాలామంది ‘దద్దమ్మ’లకు ఎమ్మెల్సీలు ఇచ్చారు.
3. మూడు రాజధానుల మూర్ఖపు సిద్ధాంతం. ఇది దేశంలోని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి రాని, ఎక్కడా కనిపించని విచిత్ర ఆలోచన. ఈ సంగతి జగన్‌కూ తెలుసు. ఇదే ప్రశ్న ఎవరైనా వేస్తారని ఆయన చాలా సుదీర్ఘ ఆలోచనా ప్రయాణం చేసి దక్షిణాఫ్రికా నుంచి మూడు ముక్కల సిద్ధాంతాన్ని దిగుమతి చేశారు. దీనిని మూడు ప్రాంతాల్లో ప్రమోట్ చేసే పని చేపట్టారు. ఆఖరికి మూడు రాజధానుల మద్దతు కోసం ఆంధ్రప్రదేశ్ భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పాటు కాక ముందటి ప్రైవేటు హౌస్‌లో ముగ్గురో, నలుగురో కూర్చుని రాసుకున్న చట్టబద్ధత లేని శ్రీబాగ్ ఒప్పందాన్ని ఆకాశానికి ఎత్తేశారు. ఇప్పటికీ ఆ కుంపటిని నెత్తి మీద నుంచి దింపలేదు.
అమరావతి ఏకైక రాజధానిగా అసెంబ్లీ చేసిన తీర్మానం, రైతులతో ప్రభుత్వం చేసుకున్న ఫాం 9.14 ఒప్పందం, సీఆర్‌డీఏ చట్టం ఇవేవీ చెల్లవని వాదించారు. వాటిని రద్దు చేశారు. హైకోర్టు చెప్పినా తన కుందేటికి మూడే కాళ్ళు ఉన్నాయని నిరూపించేందుకు సుప్రీంకోర్టు తలుపులు తట్టారు. మూడు రాజధానుల పేరుతో మూడు ప్రాంతాల్లో విభజన కార్చిచ్చు మండించే ప్రయత్నం చేశారు. మూడు రాజధానుల శిబిరం ఒకటి పెట్టి పోషించారు. 4. అమరావతికి ‘కమ్మరావతి’, భ్రమరావతి వంటి పేర్లు పెట్టారు. భూములు ఇచ్చిన వారంతా చంద్రబాబు బినామీలని ముద్ర వేశారు. భూ కుంభకోణాలు జరిగాయని అబద్ధాలు ప్రచారం చేశారు. ఆఖరికి ఆ ప్రాంతాన్ని ఎడారిలా, శ్మశానదిబ్బతో పోల్చి అమరావతిపై పెద్ద ఎత్తున వ్యతిరేకత పెంచే ప్రయత్నం చేశారు. అసలు అమరావతిలో సోషల్ బాలెన్స్ లేదని పెద్ద బండరాయి విసిరేశారు. అక్కడి భూములను ఇ–వేలం ద్వారా అమ్మే ప్రయత్నం చేశారు. రాజధాని కోసం ఇచ్చిన పొలాలను సెంటు పట్టాలుగా మార్చి, నిరుపేదలకు ఆశలు కల్పించారు. రాజధాని రైతుల పైకి బడుగులను ఉసిగొలిపే కుట్రలు చేశారు. అమరావతికి భూములు ఇచ్చిన గ్రామాలు తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గం అన్నా, అది ఎస్సీ రిజర్వ్‌డ్ అన్నా వినలేదు.
రాజధాని భూముల్లో ఎస్సీ, ఎస్టీ కులాల భూములే అధికంగా 34 శాతం ఉన్నాయి అన్నా ఖాతరు చేయలేదు. దళిత బహుజనులు రాజధాని ఉద్యమంలో కీలకపాత్ర పోషిస్తున్నారని, వారిని భయపెట్టేందుకు ఎస్సీలపై వారి చేతనే ఎట్రాసిటీ కేసు పెట్టించి తొమ్మిది మంది ఎస్సీలను జైలుకు పంపారు. 5. దశాబ్దాలుగా ఉన్న కింది కులాల అన్ని సామాజిక వర్గాల పథకాలను నిలిపేశారు. ఎందుకు నిలిపేశారు? అంటే బటన్ నొక్కుడును చూపారు. 6. విపక్షాలపై దాడులను ప్రశ్నిస్తే, కార్యకర్తలకు బీపీ ఉంటుందని థియరీ చెప్పారు.
ఇలా శిశుపాలుడు చేసిన తప్పులు నూరైతే, జగన్మోహన్‌రెడ్డి చేసిన తప్పిదాలు వెయ్యిన్నొక్కటి. తాజాగా అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోసం అలిగారు. బుంగమూతి పెట్టారు. హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి ససేమిరా రాను అనే మరో వింతవాదానికి, చిన్నపిల్లల చాక్లెట్ తరహా తగాదాకు తెర లేపారు. 57 శాతం ఓట్లతో, 93శాతం సీట్లతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వాన్ని దింపి, నెల రోజుల్లోనే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని ఢిల్లీ వెళ్ళి గోల చేసిన నాయకుడు కూడా జగన్ ఒక్కరే. ఆయన ప్రభుత్వానికి 11 సీట్లు వచ్చిందే ఏపీలో ఊపిరి ఆడని అరాచక పాలన వల్ల అన్న సంగతిని ససేమిరా అంగీకరించరు. అసెంబ్లీలో సీట్ల సంఖ్యను బట్టి అధికార పక్షమా? ప్రతిపక్షమా? అన్నవి అసెంబ్లీ నిబంధనలు, రాజ్యాంగ వ్యవస్థలు నిర్ణయిస్తాయి అన్న విషయం మాత్రమే ఇప్పటి వరకు అందరికీ తెలిసిన అంశం. కానీ, అడుక్కుంటేనో, గింజుకుంటేనో, కోర్టులను ఆశ్రయిస్తేనో, గోల చేస్తేనో కూడా వస్తుందని, లేదా ప్రజల్ని నమ్మించవచ్చని జగన్‌కు మాత్రమే తెలుసు. 23 సీట్లతో ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి ఏడుగురు ఎమ్మెల్యేలను లాగేస్తాను. ప్రతిపక్ష హోదా కూడా ఊడిపోతోంది అని అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబును బెదిరించారు.
అంటే, ప్రతిపక్ష హోదా ఉండాలంటే పది శాతం సీట్లు అంటే 18 మంది ఎమ్మెల్యేలు ఉండాలి అన్నది జగన్‌కు తెలుసు అనే కదా అర్థం? ఆయన ఐదేళ్ళ పాటు వైనాట్ 175 అనే జపాన్ని పఠించారు. అంటే ప్రతిపక్ష హోదా కాదు, ప్రతిపక్షమే రాష్ట్రంలో ఉండకూడదు అనే కదా అర్థం. సింహం సింగిల్‌గా వస్తోందని, ఏం పీక్కుంటారో పీక్కోండి వంటి మాటలకు పరమార్థం ఏమిటో గుర్తు చేయకూడదు సుమా! ఇవన్నీ రెండు నెలలకే మరిచిపోతే ఎలా?
1994లో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీకి కేవలం 26 సీట్లు వచ్చినా, పార్టీ పరంగా ఫ్లోర్ లీడర్ పాత్రను ఆనాటి పీజేఆర్ పోషించారు. రాష్ట్రంలో పిఆర్పీ, లోక్‌సత్తా, సీపీఐ, సీపీఎం వంటి పార్టీలు కూడా ప్రజలు ఇచ్చిన అసెంబ్లీ సీట్లను గౌరవించి సగర్వంగా అసెంబ్లీలో వారి పాత్రను పోషించాయి. 2019లో తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు వచ్చినా, జనసేన, బీజేపీలకు ఏ ఒక్క సీటు లేకున్నా, వారు ప్రజాక్షేత్రంలో ప్రజలు ఇచ్చిన ‘ప్రతిపక్ష హోదా’ను సమర్థవంతంగా నిర్వహించారు. జగన్మోహన్‌రెడ్డిలా వింత కోరికలు, వింత వాదాలు చేయలేదు. ఇలాంటి పలు వితండ వాదనలతో జగన్ రాజకీయం చేయటాన్ని ప్రమాదమైన ధోరణిగానే భావించాలి. చట్టాలను, న్యాయస్థానాలను గౌరవించనంత కాలం, తప్పుడు విధానాలను సమీక్షించుకోనంత కాలం వైసీపీకి మనుగడ కష్టం. అలాంటి పార్టీ ఉనికిలో ఉంటే, తిరిగి అధికారంలోకి వస్తే రాష్ట్రానికి తీరని నష్టం.
పోతుల బాలకోటయ్య
అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు
Updated Date - Aug 02 , 2024 | 02:05 AM