ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘‘ప్రక్రియ కంటే కవిత్వగుణం ముఖ్యం!’’

ABN, Publish Date - Dec 02 , 2024 | 04:44 AM

కవిగా, రచయితగా, విమర్శకునిగా, పరిశోధక సేవకునిగా, రాజమండ్రి గౌతమీ గ్రంథాలయం గ్రంథభాండారిగా, ఆత్మీయ స్నేహపరిమళాల్ని పంచిన గంధహృదయునిగా వైవిధ్య పాత్రల సమ్మేళనంతో....

కవిగా, రచయితగా, విమర్శకునిగా, పరిశోధక సేవకునిగా, రాజమండ్రి గౌతమీ గ్రంథాలయం గ్రంథభాండారిగా, ఆత్మీయ స్నేహపరిమళాల్ని పంచిన గంధహృదయునిగా వైవిధ్య పాత్రల సమ్మేళనంతో సన్నిధానం నరసింహశర్మ గారి జీవనప్రస్థానం సాగుతోంది.

పశ్చిమ గోదావరి జిల్లా కుమారదేవంలో 1945 డిసెంబర్ 7న ఆయన జన్మించారు. గౌతమీ గ్రంథాలయంలో నాలుగు దశాబ్దాల పాటు వివిధ హోదాల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. లెక్కకుమిక్కిలి పరిశోధకులకు గ్రంథాలయ సేవలు అందించారు. ‘అతడె గౌతమి, గౌతమి అతడు’ అని అద్దేపల్లి రామ్మోహనరావు గారు ప్రస్తుతించేంతగా ఆయన ఆ లైబ్రరీతో మమేకమయ్యారు.

సన్నిధానం ‘ప్రాణహిత’, ‘బ్రౌను ఉదాహరణం’ కావ్యాల కర్త. ‘పాతూరి నాగభూషణం జీవిత చరిత్ర’, మధునాపంతుల సత్య నారాయణ శాస్త్రిపై ‘మధుస్మృతి’, కేంద్ర సాహిత్య అకాడమీ భార తీయ సాహిత్య నిర్మాతలు పరంపరలో ‘నేదునూరి గంగాధరం’ మోనోగ్రాఫ్‌ రాశారు. ‘ప్రమేయ ఝరి’ ఆయన సాహిత్య వ్యాస సంపుటి. ఆరుద్ర, చలసాని ప్రసాద్ తనకి రాసిన లేఖల్ని పుస్తకాలుగా ప్రచురించారు. తెలుగు భాషలో అచ్చు అయిన మొదటి గ్రంథం ‘నూరు జ్ఞానవచనాలు’ (1747) పునర్ముద్రిం చారు. ‘కాశ్మీర్ కీ లోక్ కథాయే’, ‘పంజాబ్ కీ లోక్ కథాయే’, ‘నల దమయంతి’ హిందీ గ్రంథాలను తెలుగులోకి అనువదించారు.


వాడ్రేవు చినవీరభద్రుడు గారు ఒకచోట రాసినట్టుగా ఆయన ‘ఎందరో మహాకవుల పద్యాలకు పల్లకిగా జీవిస్తున్న మనిషి.’ పండిత శ్రేణికి ఆధునిక కవులకి వారధి వంటి సన్నిధానం ఈ ఏడాది డిసెంబర్ ఏడున ఎనభయ్యో సంవత్సరంలో అడుగిడ నున్నారు. ఆ సందర్భంగా ఆయనతో సంభాషణ.

ఇంటర్వ్యూ : నామాడి శ్రీధర్, ఒమ్మి రమేష్ బాబు

సాహిత్యంతో మీకు ఏ వయస్సులో స్నేహం కుదిరింది? అది ఎలా వర్ధిల్లుతోంది?

నా 17వ ఏట అంటే 1962లో దేశభక్తి కవిత్వంగా కొన్ని కంద పద్యాల్ని రాశాను. కేవల పద్యనిర్మాణ సౌందర్యం నుండి నూతన భావభవనంలో ప్రవేశించడానికి కొంత కాలం పట్టింది. పద్యాలు కాక పద్య కవిత్వాలు రాయాలని తెలిసింది. క్రమంగా ఓ వైపు పత్రికల్లో వ్యాసాలు, మరో వైపు పుస్తక రచన సాగాయి. తొలి నాళ్ళలో శ్రీశ్రీ, సి.నా.రె ప్రభావం పడింది. నేదునూరి గంగాధరం, మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి, మల్లంపల్లి శరభయ్య ప్రోత్స హించారు. కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ, జయధీర్ తిరుమలరావు, సతీష్ చందర్ల స్నేహ పరిమళాలు ఆఘ్రాణించాను. పరిశోధక వ్యాసాలు రాయడంతోపాటు పరిశోధక సమాచార సేవలు చేయడం, గౌతమీ జ్ఞాన ప్రవాహవేగంలో నిత్యం పునీత మయ్యాను.


రాజమండ్రి సాహిత్య వాతావరణం ప్రత్యేకతలు ఏమిటి?

విభిన్న సాహిత్యాభిప్రాయాలు, భావవైవిధ్యాలూ ఉన్నప్పటికీ ఒక సహజీవన వాతావరణం కొనసాగడం గొప్ప స్థాయి గల అంశం. వైయక్తిక శత్రుత్వం లేకుండా భాషా సాహి త్యాల భావతీవ్రతలు, చర్చలూ ఉండడం రాజమండ్రి ప్రత్యేకత. సాహిత్య విషయాల గురించి సీరియస్‌గా పట్టించుకుని కోర్టులకి వెళ్ళడం మామూలు సంగతి కాదు. సాహిత్య ఆలోచనా వైవిధ్యాలు మానవ విరోధాలు కాకపోవడం ఎంతో ఆహ్వానించదగ్గ విషయం!

ప్రాచీన సాహిత్యం, ఆధునిక సాహిత్యం ఈ విభాగాలపై మీ ప్రాధాన్యాలు, అభిప్రాయాలు ఎటువంటివి?

ప్రాచీన సాహిత్యం అది ఉద్భవించిన నాటికి ఆధునిక సాహిత్యం; ఆధునిక సాహిత్యం అది వచ్చిన తర్వాత కాలానికి ప్రాచీన సాహిత్యం. ఇవి కాల సంబంధి తాలైనప్పుడు రెండిటికీ సమ ప్రాధాన్యం ఇవ్వాలి. కిటికీలు తెరచుకునే ఉండాలి. అన్నిటినీ అధ్యయనం చేసి మన సంపద ఇంతటిదా అని గర్వించగలగాలి.


పద్య కవిత్వం, వచన కవిత్వం – ఈ ప్రక్రియలపై మీకు నిర్దిష్టమైన అభిప్రా యాలు ఏమైనా ఉన్నాయా?

ఫలానా ప్రక్రియ నాదే అని కానీ మాదే అని కానీ అనుకోవడం సరైనది కాదు. ఒక్కొక్కళ్ళకీ ఒక్కొక్క ప్రక్రియా ప్రావీణ్యం ఉంటుంది. కాలాన్ని బట్టి, చదువుల్ని బట్టి కొన్ని ప్రక్రియలు సన్నిహితం అవుతాయి. అయితే నేడున్నది వచన కవితాయుగం అనడానికి సందేహం లేదు. సాహిత్య ప్రక్రియా స్వాతంత్ర్యం రచయితల జన్మహక్కుల్లాంటివి.

పండిత శ్రేణికి ఆధునిక కవులకి పొసగని కాలంలో మీరు ఇరుపక్షాలు మెచ్చే వారధి ఎలా అయ్యారు?

పద్యమంటే ఆధునిక కవులకి గిట్టదు. వచన కవిత్వమంటే పండిత శ్రేణికి పొసగదు. పద్యానికి వేయి ఏళ్ళ చరిత్ర ఉంది. వచన కవిత్వం కొన్ని ఏళ్ళ లోనే చరిత్ర సృష్టించుకుంది. ఆధునిక కవులు కాలానుగుణంగా, భావానుగుణంగా ప్రక్రియల్ని ఉప యోగించుకున్నారు. నిజానికి ప్రక్రియల మధ్య వైరం లేదు. పద్యం చచ్చిపోవాలని కోరుకోకూడదు. ఈ కాలానికి, ఈ చదువులకి, ఈ వర్తమాన భావజాలాలకూ పద్యం ప్రక్రియ సరిపోదని భావించేవారిని తప్పుపట్టకూడదు. ప్రక్రియను ఎన్నుకోవడం కవి స్వాతంత్ర్యానికి సంబంధించిన అంశం. అనుభూతి, నూతన భావన, వర్ణన, వ్యక్తీకరణలో కొత్తదనం తదితర కవిత్వగుణాల వల్ల కవిత్వాలు బతికి బట్టకడతాయి కాని ప్రక్రియల వల్లనే బతకవు. నా నవ్య భావావిష్కరణ ప్రయత్నాల వల్లనే ఇరుపక్షాలకీ వారధి అయ్యాను.


గౌతమీ గ్రంథాలయానికి వచ్చిన పరిశోధకుల్లో ప్రసిద్ధులు ఎవరు, వారి పరిశోధనా వైశిష్ట్యాల గురించి చెప్పండి?

సి.నా.రె మాకందాలు రాసే ముందు కొక్కొండ వారి బిల్వేశ్వరీయం జిరాక్స్ ప్రతిని నా ద్వారా తెప్పించుకుని చదివారు. కె.వి.ఆర్ పత్రికారంగంలో వివిధ కులాల పత్రికల్ని అధ్యయనం చేశారు. ఆరుద్ర గౌతమీ గ్రంథాలయంలోని పాత పత్రికల్లో మరెక్కడా లేనివేమిటో చెప్పారు. బంగోరె ప్రాచీన గ్రంథాల ముఖపత్రాల పరిణామాల్ని తెలిపారు. దుమ్ము పట్టిన ఇరుకు గదిలో ఫ్యాన్ లేక ఊపిరి సలపని వాతావరణంలో చలసాని ప్రసాద్ చొక్కా తీసి ఒక బీరువా కొక్కెంకి పెట్టి శరీరంపై చెమటలు కమ్మిన అసౌకర్యంలో నేలమీద కూర్చుని పాత పత్రికల్లో శ్రీశ్రీని, కొడవటిగంటిని శోధించుకునే దృశ్యం మరచిపోలేనిది. జయధీర్ తిరుమలరావు తెలుగులో నిషేధ సాహిత్యంపై గొప్ప పరిశోధన చేశారు. జర్మనీ కొలోన్ విశ్వవిద్యాలయం నుండి మరియా మీస్ అనే పరిశోధకురాలు వచ్చారు. భారతీయ గ్రామీణ మహిళల మీద, పాలకొల్లు లేసు పరిశ్రమ మీద ఆమె పరిశోధన చేశారు.


గ్రంథాలయోద్యమం అనేది నిరంతరం సాగే ఉద్యమం కదా! ఇప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయి?

ప్రభుత్వ గ్రంథాలయాలు; గ్రంథాలయ సంస్థల శాఖా గ్రంథాలయాలు; కళాశాల, విశ్వవిద్యాలయ గ్రంథాలయాలు; ప్రయివేటు గ్రంథాలయాలు ఉన్నాయి. అయితే వీటి మధ్య సమన్వయం, ఇచ్చిపుచ్చుకోవడాలు, ధన సహాయాలు, గ్రాంట్లు విషయంలో చురుకైన పాత్ర వహించవలసిన పౌర గ్రంథాలయాల శాఖ ఆర్థికంగా సంపన్నం కానిదే నిరాశా అంశాలు మిగులుతూనే ఉంటాయి.

జానపద సాహిత్య వికాసంలో నేదునూరి గంగాధరం కృషి ఎటువంటిది?

నేదునూరి జానపద సాహిత్య సేవలు అనుపమానాలు. నేను ఆయన శిష్యుణ్ణి. అయిదారు సంవత్సరాలు ఆయనతో గడిపే మహాభాగ్యం నాకు లభించింది. కేంద్ర సాహిత్య అకాడమీ కోసం ఆయన మోనోగ్రాఫ్ రాశాను. గంగాధరం కాలంలో అంతా పద్య వాతావరణం. జానపద గేయాలను లొల్లాయి పదాలుగా తక్కువ పరచిన వారి ధోరణులతో విభేదించకుండానే తన జానపద సాహిత్య ఉద్ధరణ కార్యక్రమం కొనసాగించారు. వందల జానపద గేయాలను బాణీలతో పాడేవారు. ప్రాచీన కవుల పద్యాలనేకం కంఠస్థం చేశారు. అరసంలో గంగాధరం సభ్యులన్నది చాలామందికి తెలియదు. ఆయన జానపదాలను తొలిసారిగా ప్రకటించినది తెలంగాణా వారే.


‘వెలుతురు పిట్టలు’ కవి కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ, మీరూ జంట కవుల్లా ఉండేవారు. ఆయన జ్ఞాపకాల్ని పంచుకోండి!

నిజానికి ఆయన పరిచయం నాకు ఏర్పడడం నా జీవితంలో కొత్త అధ్యాయమే. ఇద్దరం ‘వాగర్థ సమాఖ్య’ అనే సంస్థ పెట్టాం. సి.నా.రె, వేల్చేరు నారాయణరావు, బూదరాజు రాధాకృష్ణ ఇలా కొంతమంది ప్రముఖ కవి, పండిత, విమర్శకులతో సాహిత్య సభలు నిర్వహించాం. మైకులో సాహిత్య సభా ప్రచారం చేసేవాళ్ళం, వాల్ పోస్టర్లు వేసేవాళ్ళం కూడా. నేను నా ‘ప్రాణహిత’ కవితా సంపుటిని సత్యశ్రీమన్నారాయణకి అంకితం ఇచ్చాను. ఆయనతో నా అనుభవాలు రాస్తే ఓ పుస్తకమే అవుతుంది.

కొత్త తరం విద్యార్థులకి పూర్వ గ్రంథాల పట్ల మక్కువ కలిగించడానికి ఏదైనా ఉపాయం చెప్పండి!

పాఠ్య పుస్తకాల్లో పూర్వగ్రంథాల అవగాహనా పాఠాలు చేర్చాలి. ప్రాకృతిక వర్ణనలు, ప్రాచీన సంస్కృతిని వెల్లడించే పూర్వ కవిత్వాలు చిన్న చిన్న భాగాలుగా ఉండేటట్లు చూడాలి.

సన్నిధానం నరసింహశర్మ

Updated Date - Dec 02 , 2024 | 04:45 AM