‘‘కవిత్వం బతుకు సమరంలో నిలబెట్టే లంగరు’’
ABN, Publish Date - May 20 , 2024 | 03:26 AM
అనువాదం అంటే కేవలం ఒక భాషలోంచి మరో బాషలోకి మాటల్ని తర్జుమా చేయడం మాత్రమే కాదు. ఆయా భాషలు, వాటిని మాట్లాడే ప్రజలు, వారి సామాజిక నేపథ్యం అన్నీ అనువాద క్రమంలో పరిగణనలోకి వస్తాయి...
వారాల ఆనంద్ : పలకరింపు
గుల్జార్ ‘ఆకుపచ్చ కవితలు’ సంపుటి తర్వాత ఇప్పుడు 29 భాషల్లోంచి కవితలు ఆనువాదం చేసి ‘ఇరుగు పొరుగు’ సంకలనంగా తెచ్చారు. దీని నేపథ్యం చెప్పండి. మీరు అనువాద ప్రక్రియను ఎలా చూస్తారు?
అనువాదం అంటే కేవలం ఒక భాషలోంచి మరో బాషలోకి మాటల్ని తర్జుమా చేయడం మాత్రమే కాదు. ఆయా భాషలు, వాటిని మాట్లాడే ప్రజలు, వారి సామాజిక నేపథ్యం అన్నీ అనువాద క్రమంలో పరిగణనలోకి వస్తాయి. భిన్న భాషలు విభిన్న వ్యక్తులు వారి వ్యక్తీకరణలు అన్నీ అనువాదానికి భూమికలవుతాయి. ఆందుకే అనువాదం కనిపించినంత సులభమైంది కాదు. అందులో కవిత్వం మరింత క్లిష్టం. మూల రచనను అర్థం చేసుకుని ఆ కవిని, ఆయన చెప్పదలుచుకున్న విషయాన్నీ అవగతం చేసుకోవాలి. ప్రతిభాషకూ తమవైన జాతీయాలూ, పదబంధాలూ వుంటాయి, అవన్నీ పరిశీలించాల్సిన అంశాలే.
అయితే అనువాదం మూల భాషనుంచి కాకుండా ఇంగ్లీష్‌లోంచి చేసినప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి. నేనయితే ‘ఇరుగుపొరుగు’ కవితల్ని అనువదించే క్రమంలో అనుమానం వచ్చిన ప్రతిసారీ మూల రచయితల్ని మెయిల్‌లోనో ఫోన్‌లోనో సంప్రదించే ప్రయత్నం చేశాను. అలా సాధ్యమయింత మేర మూలంలోని భావం చెడకుండా చూశాను. ఉదాహరణకు ఆఘా షాహీద్ అలీని అనువదించినప్పుడు కశ్మీర్, అక్కడి స్థితి, వలసలు అన్నీ తెలుసు కనుక ఆయన హృదయాన్ని స్పృశించి తెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేశాను. ఈ క్రమంలో ఇండియన్ లిటరేచర్, సచ్చిదానందన్, గుల్జార్ లాంటి వాళ్ళు కూర్చిన సంకలనాలూ ఎంతగానో ఉపయోగపడ్డాయి.
గుల్జార్‌ని ‘ఆనంద్’, ‘పరిచయ్’, ‘కొశిష్’ లాంటి సినిమాల కాలం నుంచి, అంటే దాదాపుగా గత 50 ఏళ్లుగా, ఫాలో అవుతున్నాను. ఆ క్రమంలో ఆయన గ్రీన్ పొయెమ్స్, నెగ్లెక్టెడ్ పోయెమ్స్, సస్పెక్టెడ్ పోయెమ్స్... ఇట్లా అన్నీ చదివాను. పచ్చదనం నాకూ చాలా ఇష్టం కనుక ‘గ్రీన్ పోయెమ్స్’ హిందీ లోంచి తెలుగులోకి చేశాను. ఇక ‘ఇరుగు పొరుగు’ విషయానికి వస్తే ఆ కవితలు దాదాపుగా మూడేళ్ళ నుంచి చేస్తున్నాను. ఇవి ప్రధానంగా ఇంగ్లీష్ లోంచి చేశాను.
మీకు సాహిత్యం పట్ల మక్కువ ఎట్ల ఏర్పడింది?
మాది కరీంనగర్‌లో మిఠాయి వ్యాపారం చేసే కుటుంబం. సాహిత్యంతో సంబంధం వున్న కుటుంబం కాదు. కానీ మా నాన్నగారికి హిందీ పాటలు, ఉర్దూ నవలలు బాగా ఇష్టంగా వుండేది. ఆ క్రమంలో ఇంట్లో బినాకా గీత్ మాలా, పురానీ ఫిల్మోంకా గీత్ బాగా వినిపించేవి. మా ఇంటి దగ్గరే వున్న కృష్ణా బుక్ స్టాల్‌లో డిటెక్టివ్ నవలలతో నాకు చదవడం బాగా అలవాటయింది. తర్వాతి కాలంలో ‘శాంతినికేతన్’ లాంటి నవలలు చదివాను. ఉస్మానియా యూనివర్సిటీలో చేరిన తర్వాత సాహిత్యాసక్తి బాగా పెరిగింది. ఇక కాలేజీ లైబ్రెరియన్ ఉద్యోగం కనుక పుస్తకాలే లోకం అయిపోయింది. చదవడం రాయడం కొనసాగింది.
గ్లోబలైజేషన్ నేపథ్యంలో తెలుగు భాష పరిస్థితి ఏమిటి? అనువాద ప్రభావం ఏమేరకు వుంటుంది?
ప్రపంచీకరణ మొత్తంగా ప్రపంచంలోని దేశాల మధ్య, మనుషుల మధ్య హద్దుల్నీ సరిహద్దుల్నీ చెరిపేసింది. పెరుగుతున్న సాంకేతికత దూరాల్ని చెరిపేస్తున్నది. అనేక సంస్కృతులు వేలాది భాషలు వున్న ప్రపంచంలో సమాచార ప్రసారం ముఖ్యమయింది. ముఖ్యంగా ఇంటర్నెట్‌లో ఇంగ్లీష్ ప్రధాన పాత్ర పోషిస్తున్న తరుణంలో అనేక చిన్న భాషలు ప్రభావితమవుతున్నాయి. కొన్ని భాషలు అంతరించిపోయే స్థితి ఏర్పడుతున్నది. ఈ నేపథ్యంలో తెలుగు కూడా ఎంతోకొంత ప్రభావితం అవుతుంది, తప్పదు. ఇప్పటికే ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు కాలేజీల ప్రభావం తెలుగుపై కనిపిస్తూనే వున్నది. కంప్యూటర్ నేర్చుకోవడానికి, అమెరికా వెళ్లడానికి ఇంగ్లీష్ కావాలి కనుక రానున్న తరాల్లో తెలుగు ఉపయోగం తగ్గిపోయే అవకాశం వుంది. మాతృభాషా పరిరక్షణ ఉద్యమం రావాల్సిన అవసరం కూడా వుంది. ఇక ప్రపంచీకరణ నేపథ్యంలో అనువాదం ఒక పరిశ్రమగా అభివృద్ధి చెందే అవకాశం కనిపిస్తున్నది. సాహిత్య అనువాదం మాత్రమే కాకుండా విద్యా, శాస్త్ర సాంకేతిక రంగాలు, మీడియా, వ్యాపార రంగాల్లో అనువాద అవకాశాలు పెరిగే అవకాశం వుంది, పెరుగుతున్నాయి కూడా. సాహిత్యానువాదం అప్పుడూ ఇప్పుడూ అత్యంత ప్రధానమయింది అని నేననుకుంటాను.
‘మానేరు తీరం’, ‘మనిషి లోపల’ కవిత్వ సంపుటులతో సహా మీ మొత్తం కవిత్వంలో ప్రధానంగా మనిషి, ప్రకృతి సంబంధిత అంశాలు కనిపిస్తాయి. వీటి గురించి తెలపండి?
‘‘నాకు కవిత్వం కేవలం కవిత్వం కాదు/ సగం శబ్దం సగం నిశబ్దం/ శబ్దమేమో బతుకు ఏడుపులోంచి ఎగిసిపడుతున్న ఎక్కిళ్ళు/ నిశబ్దమేమో బతుకు చేతగానితనం లోంచి వ్యక్తమవుతున్న మౌనం’’. అంతే కాదు, ‘‘కవిత్వం సంక్షోభ కాల ప్రవాహంలో నన్ను ఒడ్డుకు చేర్చే తెరచాప/ బతుకు సమరంలో నిలబెట్టే లంగరు’’ అని కూడా రాసుకున్నాను. కవిత్వాన్ని ఎప్పుడూ నేను కెరీర్‌గా తీసుకోలేదు. అది నా ‘లైఫ్ లైన్’
మీరు కవిత్వం సినిమా రెండు కళ్ళుగా భావిస్తారు.. ఎట్లాగో వివరించండి?
సినిమా కవిత్వం రెండూ కళాత్మక వ్యక్తీకరణలే. కానీ కవిత్వం వ్యక్తిగత వ్యక్తీకరణ, సినిమా సమిష్టి కళల వ్యక్తీకరణ. అర్థవంతమయిన భావయుక్తమయిన ఆ రెంటినీ ఇష్టపడతాను. మనిషినీ సమాజాన్నీ పట్టించుకునే ఆ రెండూ నాకు వూపిరుల్లాంటివి.
ఇంటర్వ్యూ: : కె.ఎస్.అనంతాచార్య
Updated Date - May 20 , 2024 | 03:26 AM