ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘‘కవులు మర్యాదస్తులైపోయారు’’

ABN, Publish Date - Jul 29 , 2024 | 02:29 AM

జీవితాన్నీ, సాహిత్యాన్నీ వేరు వేరుగా దర్శించని కవి జూకంటి. నడి చౌరస్తాలో నిటారుగా సామాన్యుడి వైపు నిలబడి నిరంతరం ప్రశ్నిస్తారు, కవిత్వం ద్వారా నిఖార్సైన ధిక్కారస్వరం వినిపిస్తారు. ప్రపంచీకరణ, పెట్టుబడి మనిషిని...

జీవితాన్నీ, సాహిత్యాన్నీ వేరు వేరుగా దర్శించని కవి జూకంటి. నడి చౌరస్తాలో నిటారుగా సామాన్యుడి వైపు నిలబడి నిరంతరం ప్రశ్నిస్తారు, కవిత్వం ద్వారా నిఖార్సైన ధిక్కారస్వరం వినిపిస్తారు. ప్రపంచీకరణ, పెట్టుబడి మనిషిని నలువైపుల నుండి దాడిచేస్తూ తల్లడం మల్లడం చేస్తున్న సందర్భాన్ని తన సాహిత్యం ద్వారా బట్టబయలు చేస్తున్నారు. ఈ ఏడాదికి దాశరథి కృష్ణమాచార్య పురస్కారం అందుకున్న సందర్భంగా ఆయనతో ఇంటర్వ్యూ...

మీ జీవిత నేపథ్యం సాహిత్య ప్రస్థానం?

నేను హైస్కూల్‌ మాత్రమే చదివాను. మా ఊరు తంగళ్ళ పల్లికి సమీపంలో ఉన్న సిరిసిల్ల పట్టణ గ్రంథాలయం లోని పుస్తకాలను జిజ్ఞాసతో దాదాపుగా చదివాను. అలాగే సినారె అంతేవాసి కనపర్తిగారి సొంత గ్రంథాలయంలో అభ్యుదయ సాహిత్యాన్ని చదివాను. నేను మిక్కిలి గౌరవించే నాటి సీనియర్‌ కవి జక్కని వెంకటరాజం, నిజాం వెంకటేశం గారల మార్గదర్శనం చేయూతతో సామాజిక రాజకీయ ఆర్థిక దృక్పథంతో నా చుట్టూ ఉన్న సమాజాన్ని వ్యక్తులను అధ్యయనం చేశాను. ముఖ్యంగా దేన్ని రాయాలి అనే దాని కన్నా ఏది రాయకూడదనే దాన్ని నేర్చుకున్నాను. దేశంలో అత్యవసర పరిస్థితి 1975-1977ల పిదప ఒక స్పష్టమైన ప్రజా సంస్కృతి దృక్పథంతో నిబద్ధతతో నా సాహిత్య జీవన గమనాన్ని కొనసాగిస్తూ వస్తున్నాను.


దేశంలో 90వ దశకంలో మొదలైన ప్రపంచీకరణ పరిణామాలను చూసిన మొట్టమొదటి కవి మీరు. ఆ పరిణామాలు మిమ్మల్ని ఎలా ప్రేరేపించాయి?

1991లో నాటి కేంద్ర ప్రభుత్వం దేశీయ మార్కెట్‌ను ప్రపంచ మార్కెట్‌తో అనుసంధానించింది. తద్వారా అప్పుడు ఇంటర్నేషనల్‌ మానిటరీ ఫండ్‌ (ఐఎంఎఫ్‌) గాట్‌, ప్రపంచ బ్యాంకు, ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్‌, ఎంఓయు లు, కన్సల్టెన్సీలు, క్విడ్‌ ప్రో కోలు... ఇలాంటి కొత్త పదాలు దేశ సామాజిక నిఘంటువులోకి వచ్చిచేరాయి. కవులు మర్యాదస్తు లైపోయారు, మేధావులు మెతక వైఖరి అనుసరించారు. మీడియా కార్పోరేటీకరణ జరిగి సమాజానికి పూడ్చలేని నష్టం జరిగింది. ఇటువంటి దశలో గ్రామీణ మూలాల నుంచి ఎదిగి వచ్చిన సృజన కారునిగా 1986 నుండి 1993 వరకు మనిషి అతలాకుతులమై కోల్పోతున్న పరాయికరించబడిన విలువలను వెతికి పట్టుకునేందుకు రాసిన కవిత్వాన్ని ‘పాతాళగరిగె’, ‘ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌’, ‘వాస్కోడిగామా డాట్‌ కామ్‌’లతో పాటు ఇప్పటివరకు 16 సంపుటా లను తీసుకువచ్చాను. నాటి నుంచి నేటి వరకు ప్రభుత్వాలు అనుసరిస్తున్న లిబరలైజేషన్‌, ప్రైవేటైజేషన్‌, గ్లోబలైజేషన్‌ (ఎల్‌.పి.జి.) వలన గ్రామీణ జీవన విధానం, సంస్కృతిలో ఊహించని అంతరాలు పెరిగాయి. గ్రామీణ ప్రాంత మూలాల నుంచి వచ్చిన కవిగా కరిగిపోయి కదిలిపోయి కన్నీళ్ల పర్యంతమై నన్ను నేను మట్టిని మర్లేసుకుని కాళ్లతో తొక్కి కుమ్మరి సారెపై సున్నితమైన భావన కళాకృతులను వినిర్మించాను. అది నేటికీ రెలవెంట్‌గా అనేక వాదాల పాయల రూపంలో ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతూనే ఉంది. చేవ ఉన్న కవికి ఇది సకాలం. యావ ఉన్న కవికి ఫ్రాంచీస్‌ అసందర్భ సమయం.


సామాజిక ఆర్థిక రాజకీయ సాంకేతిక రంగాలలో వేగంగా మారుతున్న వాతావరణం, సాహిత్యంలో దాని ప్రతిఫలనాలను మీరు ఏ విధంగా చూస్తారు?

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన శాస్త్రీయ సౌకర్యాలను వాడుకుంటూనే, అందిపుచ్చుకుంటూనే మనిషి మొద్దుబారి పోయి అశాస్త్రీయంగా గతంలో చింతిస్తూ బతుకుతున్నాడు. ఫక్తు వినియోగదారుడిగా అందమైన ప్యాక్‌ బార్‌కోడ్‌లో తన విలువను నిక్షిప్తం చేసుకుని సూపర్‌ బజార్లో లేబర్‌ అడ్డాలలో గోస గోసోలే కూలీగా నిలబడుతున్నాడు. ఇది అత్యంత విషాదకరం. సాహిత్యంలో వీటి బింబ ప్రతిబింబాలు భళ్ళున ముక్కలైన దర్పణంలో అనేక విధ్వంస దృశ్యాలుగా విభజించబడుతున్నాయి. అందుకే కవి రచయిత వెసులు బాటు గతంలోకి వెన్నుచూపి పారిపోతున్నాడు. ఒక ప్రాయో జకత్వం ఊడిగం చేస్తున్నాడు. అందుకే అన్ని వాదాలు మేన్‌స్ట్రీమ్‌ రణస్థలంలో ఐడెంటిటీ సంక్షోభంలో సంక్లిష్టంగా తెంపులు తెంపులుగా పెనుగులాడుతున్నాయి. కమ్యూనిస్టు మేనిఫెస్టోలో ఉటంకించిన విధంగా మేధావులు కవులు రచయితలు డాక్టర్లు ఇంజనీర్లు ప్రభుత్వ ఆస్థానంలో కొలువు తీరడం వైపు మొగ్గు చూపుతున్నారు. దేశాల మధ్యనే కాదు మనిషికి మనిషికి మధ్య ఒక ఉద్రిక్త ఆందోళనకర యుద్ధంగా విపరిణామం చెందుతుంది.

ఇటీవల కవిత్వం, ఇతర సాహిత్య ప్రక్రియలు నోస్టాల్జియా వైపు మొగ్గు చూపడంపై మీ దృక్కోణం?

వర్తమానం విసిరిన సవాళ్లను స్వీకరించలేని, నిలబడలేని, కలెబడలేని సృజనకారుడికి ఒక కన్వీనియంట్‌ స్థలం నోస్టాల్జియా. అన్ని సాహిత్య ప్రక్రియలు నిమాయిష్‌లో మనిషి కళ్ళల్లో దుమ్ము కొట్టి పురావస్తువుగా రూపెత్తు తున్నాయి. మళ్లీ దీనికి కారణాలు అకారణాలు కూడా ప్రపంచీకరణ చేనులో బెరికి మొక్కలుగా ఏపుగా పెరిగి మోస పుచ్చుతున్నాయి. సాహిత్యంలో దృక్కోణాన్ని ఆర్థిక సామాజిక రాజకీయ అధ్యయనంతో ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ పరిస్థితులను కవీ రచయిత అవగాహన ఆవాహన చేసుకుంటేనే నేటి సాహిత్యంలో మూలాలు దొరుకుతాయి. అందుకోసం నేడు తనను తను పోగొట్టుకొని వెతుక్కుంటున్నాడు.


అందుకోసం సమాజానికి రాజకీయాలకు అతీతం కాని కవిత్వం జవసత్వాలను కన్నీటి చెమ్మను కాకుండా ఒకే ఒక్క చెమక్కును కవిత్వంగా ఫేస్‌బుక్‌లో బ్లాగులలో వాట్సాప్‌ గ్రూపుల్లో జూమ్‌ మీటింగ్‌లో మూకు మ్మడిగా ఆత్మహననంలోకి యాంత్రికంగా యాత్రిస్తున్నాడు. చూస్తూ చూస్తుండగానే దీపం చేతిలో పట్టుకొని బాయిలో పడుతున్నాడు.

2024 డాక్టర్‌ దాశరధి కృష్ణమాచార్య పురస్కారం అందుకున్న సందర్భంగా మీ ప్రతిస్పందన?

దాశరథి అవార్డు నా బాధ్యతను సమాజం పట్ల నిబద్ధతను మరింత పెంచిందనుకుంటున్నాను. కొంచెం ప్రజాస్వామ్య స్వేచ్ఛ ప్రాణవాయువు ఊపిరి ఆడుతున్న సందర్భంలో ఈ అవార్డు గ్రహించడం నాకు అత్యంత సంబురాన్ని కలిగించింది.

ఇంటర్వ్యూ : మద్దికుంట లక్ష్మణ్‌

94416 77373

జూకంటి జగన్నాథం

Updated Date - Jul 29 , 2024 | 02:29 AM

Advertising
Advertising
<