వికలాంగులకూ రాజకీయ రిజర్వేషన్లు
ABN, Publish Date - Dec 03 , 2024 | 06:07 AM
రాజకీయ రిజర్వేషన్లు లేకపోవడంతో వికలాంగులు మరింత వివక్షకు గురవుతున్నారు. తెలంగాణలో 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభాలో 2.1శాతం మంది అంగవైకల్యం ఉన్నవారు ఉన్నారు...
రాజకీయ రిజర్వేషన్లు లేకపోవడంతో వికలాంగులు మరింత వివక్షకు గురవుతున్నారు. తెలంగాణలో 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభాలో 2.1శాతం మంది అంగవైకల్యం ఉన్నవారు ఉన్నారు. 2014లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో 10,46,820 మంది వికలాంగులు ఉన్నారు. అయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, లండన్‌లోని స్కూల్ ఆఫ్ హైజిన్ అండ్ ట్రోపికల్ మెడిసిన్ సర్వే ప్రకారం 43.02 లక్షల మంది వికలాంగులు ఉన్నారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 77 ఏండ్లు, రాజ్యాంగం అమల్లోకి వచ్చి 73 సంవత్సరాలు పూర్తయ్యాయి. రాజ్యాంగంలో పేర్కొన్న స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం వంటివి వికలాంగులకు అందని ద్రాక్షగానే మిగులుతున్నాయి. ఆర్టికల్ 14 నుంచి 19 వరకు సమాజంలోని పౌరులందరు సమానమేనని ఎలాంటి వివక్ష ఉండరాదని పేర్కొంది. కానీ ఇవేవీ వికలాంగులకు దక్కడం లేదు. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం, 2017 ఇంటర్ హెల్త్‌కేర్, నేషనల్ ట్రస్ట్, అటిజం యాక్ట్ ఐక్యరాజ్యసమితి హక్కుల ఒప్పందం వంటి అనేక చట్టాలను అమలు చేయాలనే చిత్తశుద్ధి కనిపించడం లేదు.
వికలాంగుల సమస్యలను పరిష్కరించి వారికి ఆసరానిచ్చి, వారు గౌరవంగా జీవిస్తూ సాధారణ జనజీవనంలో భాగమై అన్ని హక్కులు పొందేలా చూడడం కోసం 1992లో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో వివకలాంగుల దినోత్సవం మొదలయింది. 1998 నుండి ప్రతి సంవత్సరం వికలాంగులకు సంబంధించిన ఒక అంశంతో అన్ని దేశాలు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. కానీ ఆచరణలో తూతుమంత్రంగా దినోత్సవం జరపడం, వికలాంగుల హక్కుల గురించి అందాల్సిన ఫలాల గురించి ఊకదంపుడు ఉపన్యాసం ఇవ్వడం, ఆ తర్వాత మర్చిపోవడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. ఇక రాజకీయ పార్టీలు వికలాంగుల విభాగం ఏర్పాటు చేసుకోవడం, అధికారంలోకి వచ్చిన పార్టీలో వికలాంగుల విభాగానికి చెందిన వారికి ఒక నామినేటెడ్ వికలాంగుల చైర్మన్ పోస్ట్ ఇవ్వడంతో చేతులు దులుపుకుంటున్నాయి.
వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్లు అందించడం ద్వారా వారి రాజకీయ ప్రాతినిధ్యంతో అవకాశాలని పెంచుకోవచ్చు. భారత రాజ్యాంగం వికలాంగులకు సమాన హక్కులు, అవకాశాలను కల్పించడానికి అనేక చట్టాలు విధానాలు రూపొందించింది. కానీ అవి అమలు కాకపోవడానికి కారణం వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్లు లేకపోవడమే అని చెప్పనవసరం లేదు. వికలాంగులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడం వల్ల వారి హక్కులు అవసరాలు, సమస్యలపై స్టానిక సంస్థలు నుంచి చట్ట సభల వరకు గళమెత్తి ప్రశ్నించడానికి పోరాడటానికి తోడ్పడుతుంది. విద్య, ఉపాధి సామాజిక ఆర్థిక ఆత్మగౌరవ అసమానతలపై ప్రశ్నించి వాటిని సాధించుకోవడానికి రాజకీయ రిజర్వేషన్లు అనేది ఎంతైనా అవసరం ఉంది.
ప్రహ్లాద్
(నేడు అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం)
Updated Date - Dec 03 , 2024 | 06:07 AM