దేశాతీత హృదయ స్పందనలు కలిపి కుట్టిన ‘క్విల్ట్’!
ABN, Publish Date - Sep 30 , 2024 | 12:39 AM
అమెరికాలో స్థిరపడి తెలుగు సాహిత్యాభివృద్ధికి తోడ్పడుతున్న వాళ్ళల్లో గొర్తి సాయి బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన ‘అంతర్జలనం’, ‘నేహల’ లాంటి నవలల్ని, ‘కోనసీమ కథలు’, ‘క్విల్ట్’ లాంటి కథా సంపుటాల్ని...
అమెరికాలో స్థిరపడి తెలుగు సాహిత్యాభివృద్ధికి తోడ్పడుతున్న వాళ్ళల్లో గొర్తి సాయి బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన ‘అంతర్జలనం’, ‘నేహల’ లాంటి నవలల్ని, ‘కోనసీమ కథలు’, ‘క్విల్ట్’ లాంటి కథా సంపుటాల్ని వెలువరించారు. అమెరికాలో నివసిస్తున్న తెలుగువాళ్ళను గూర్చి మాత్రమే కాకుండా అక్కడ నివసిస్తున్న అమెరికన్లను గూర్చి ఈ రచయిత ‘క్విల్ట్’ కథా సంపుటిలో కథలు రాయటం విశేషం.
అమెరికా ప్రజల జీవిత విధానం ఎలా ఉంటుంది, అక్కడ మానవ సంబంధాలెలా ఉంటాయి, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ అభిరుచులు, సంప్రదాయాలు, వాళ్ళ వివాహ వ్యవస్థ, స్నేహితుల మధ్య సంబంధాలు... ఇలాంటి ఇతివృత్తాలతో సాయి బ్రహ్మానందం ఈ కథల్ని రచించిన విధానం చాలా వినూత్నంగా ఉంది. పాత్రల్ని మన ముందు పెట్టటం తప్ప ఆ పాత్రల్ని గురించి తానేమీ చెప్పడు. జీవితాన్ని గురించి ఏవో వ్యాఖ్యానాలు చేసి తన తెలివిని, జ్ఞానాన్ని ప్రదర్శించుకోవాలని ప్రయత్నించడు. అనవసరమైన వర్ణనలు, పదాడంబరం ఆయన కథల్లో కనిపించవు. కథల ద్వారా మనకేదో సందేశం ఇవ్వాలని ప్రయత్నించడు.
ఈ సంపుటిలోని కొన్ని కథల్ని సాయి బ్రహ్మానందం ‘నేను’ అంటూ ఉత్తమ పురుషలో చెప్పాడు. కొన్ని కథల్ని ఉత్తరాల రూపంలో చెప్పాడు. మరికొన్నింటిని సినిమాల్లో వాడే ‘ఫేడ్ ఇన్’, ‘డిస్సాల్వ్ టు’, ‘కట్ టు’ లాంటి టెక్నిక్‌తో రాశాడు. మరికొన్ని కథల్ని పూర్తిగా థర్డ్ పర్సన్‌లో (అంటే ఒకర్ని గూర్చి మరొకరు చెబుతున్నట్టుగా) రాశాడు. ఇలా ఈ కథల్లో ఎప్పుడూ చాలామంది కథకులు వాడే రచయిత దృష్టికోణం నుండే రాయటం కాకుండా చాలా వైవిధ్య భరితంగా రాశాడు.
‘క్విల్ట్’ అనే కథలో ఒంటరిగా, దూరంగా నివసిస్తున్న అమ్మమ్మకు దగ్గరకు వెళ్ళిన మనుమరాలు ఆ అమ్మమ్మ కోరుకున్న ‘క్విల్ట్’ను ప్రెజెంట్ చేస్తుంది. క్విల్ట్ అంటే చలికాలంలో కప్పుకునే దుప్పటి లాంటిది. చాలా దళసరి గుడ్డల్ని ఒకదానితో మరొకదాన్ని జతచేసి వాటిని సూదితో గుచ్చి క్విల్ట్‌ని తయారు చేస్తారు (మన భాషలో ‘బొంత’ అని చెప్పొచ్చు). తనకెంతో అవసరమైన క్విల్ట్‌ను ప్రెజెంట్ చేసినందుకు అమ్మమ్మకు చాలా సంతోషిస్తుంది. తను చనిపోయినప్పుడు శవం పక్కనే ఆమెకెంతో ఇష్టమైన మరికొన్నింటితో పాటు ఈ ‘క్విల్ట్’ను కూడా పెట్టాలని అమ్మమ్మ కోరుకోవటం మనల్ని కదిలిస్తుంది. మానవ హృదయ స్పందనలు ఇండియాలోనైనా అమెకిరా లోనైనా ఒకే విధంగా ఉంటాయి కదా అనిపిస్తుంది. ఈ సార్వజనీనతే సాహిత్యం తనలో ఇముడ్చుకున్న ఔన్నత్యం.
‘ఆ ఇంట్లో ఒకరోజు’ అనే కథ తల్లిదండ్రులకు వారి సంతానానికి మధ్య ఉండే సంబంధాన్ని చెబుతుంది. తమకు దూరంగా ఉంటున్న కొడుకు తమతో ఉంటే తామెంతో సంతోషించేవాళ్ళమని ఆ తల్లిదండ్రులు అనుకుం టారు. అమెరికాలో తల్లిదండ్రులను చాలా చిన్న వయసులో వదిలేసి ఎక్కడో ఉండే కొడుకులను గూర్చి మనకు తెలుసు. ఇప్పుడు మన దేశంలో కూడా అదే పరిస్థితి నెలకొంటున్నది. కొడుకులు దూరమైనప్పుడు అమెరికన్ తల్లిదండ్రులు కూడా ఎలా బాధపడ్తారో ఈ కథ చిత్రిస్తుంది.
ఈ సంపుటిలోని చాలా మంచి కథల్లో ‘అతను’ అనేదొకటి. ఒక విమానంలో అమెరికా నుండి ఇండియాకి వస్తున్న ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ రూపంలో ఈ కథ సాగుతుంది. ఈ ఇద్దరిలో ఒకరు స్త్రీ, ఒకరు పురుషుడు. ఆ ఇద్దరికీ ఇదివరకు ఒకరికొకరు పరిచయం లేదు. అతనికి ఆమె పక్కనే సీటు దొరుకుతుంది. ఆమె పేరు ఉత్పల. ఆమెకు అతనితో మాట్లాడాలని లేకపోయినా అతడే అతిగా కల్గజేసుకొని ఆమెకు సంబంధించిన వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటాడు. అతన్ని భరించక తప్పదని నిర్ణయించుకున్న ఉత్పల క్లుప్తంగానైనా అతడు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతుంటుంది. తను అమెరికాలో డాక్టర్‌గా పని చెయ్యటానికి అర్హత సంపాదించానని, కాని తను డాక్టర్‌గా పని చెయ్యటానికి భర్త ఒప్పుకోవటం లేదని ఆమె చెబుతుంది. తను అమెరికా నుండి ఇండియాకొచ్చేస్తున్నానని మళ్ళీ తనకు అమెరికాకు వెళ్ళే ఉద్దేశ్యం లేదని చెబుతుంది. తనకో కూతురు కూడా ఉందని, ఆ కూతురిని భర్తకే అప్పజెప్పి ఇండియాకి వచ్చేస్తున్నానని కన్నీళ్ళతో చెబుతుంది. ఎందుకిలా చేస్తున్నది అంటే: అమెరికాలో ఉన్నంత కాలం ఆమె భర్త ఆమెను డాక్టర్‌గా ప్రాక్టీసు చెయ్యనివ్వడు. ఇండియాకి వచ్చి డాక్టర్‌గా ప్రాక్టీసు చేస్తూ పేదవాళ్ళకు సహాయం చెయ్యాలనే ఆమె ఉద్దేశ్యం అతడు అర్థం చేసుకుంటాడు.
ఈ కథలోని చాలా విషయాల్ని వాళ్ళ మధ్య జరిగిన సంభాషణల ద్వారా మనమే అర్థం చేసుకోవాలి తప్ప రచయిత యేమీ చెప్పడు. భర్త అన్ని విధాలా మంచివాడే అయినా అతని లోని ‘మేల్ ఈగో’ ఎలా పనిచేస్తున్నదో మనం తెలుసుకుంటాం. చక్కని శిల్పంతో మలచబడిన ఈ కథ ఈ సంపుటిలోని ఉత్తమ కథల్లో ఒకటి.
అమెరికన్ సంస్కృతికి మన తెలుగువాళ్ళ సంస్కృతికి ఎంత వ్యత్యాసం ఉందో ఈ కథలు చాలా సంయమనంతో, అవగాహనతో చెబుతాయి. ఈ కథల్లో ఉన్న మరో గొప్ప గుణమేమిటంటే కథను మొదలెట్టామంటే పూర్తి చెయ్యకుండా ఉండలేం.
అంపశయ్య నవీన్
Updated Date - Sep 30 , 2024 | 12:39 AM