ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రజాపాలనలో రేవంత్ విప్లవం

ABN, Publish Date - Oct 22 , 2024 | 12:18 AM

మార్పు కావాలంటే కాంగ్రెస్ రావాలి అని టీపీసీసీ అధ్యక్షులుగా పిలుపునిచ్చిన రేవంత్‌రెడ్డి మాటను విశ్వసించి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి నీరాజనం పలికారు. డిసెంబర్ 7న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన...

మార్పు కావాలంటే కాంగ్రెస్ రావాలి అని టీపీసీసీ అధ్యక్షులుగా పిలుపునిచ్చిన రేవంత్‌రెడ్డి మాటను విశ్వసించి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి నీరాజనం పలికారు. డిసెంబర్ 7న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన, గత 300 రోజులుగా పాలనపై తనదైన ముద్ర వేస్తూ, విరామమెరుగక పరిశ్రమిస్తూ, తన లక్ష్యాలకు అనుగుణంగా పాలనలో మార్పులు తెస్తూ... ప్రజాపాలనలో ఒక విప్లవకారుడిలా దూసుకుపోతున్నారు.

ఒకటి కాదు రెండు కాదు రోజుకొక కొత్త ఆలోచన.. రోజుకొక కొత్త పథకం.. తెలంగాణలో అత్యంత ప్రాధాన్యం గల నిరుద్యోగ సమస్య ఎలా పరిష్కరించాలి, నాణ్యమైన విద్యను ఎలా అందించాలి, మెరుగైన వైద్యాన్ని ప్రజలకు ఎలా అందుబాటులోకి తేవాలి, ప్రజా సంక్షేమం–రాష్ట్ర అభివృద్ధికి ఎలాంటి ప్రణాళికలు చేయాలి, రాష్ట్రాన్ని ఆర్థికంగా ఎలా పరిపుష్ఠి చెయ్యాలి... ఇలా అన్ని రంగాల అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని రేవంత్‌రెడ్డి ఒక విప్లవకారుడిలా దూసుకుపోతున్నారు. తెలంగాణాను మూడు ప్రాంతాలుగా విభజించి ఔటర్ రింగ్ రోడ్డు లోపల అర్బన్ తెలంగాణగా, రీజనల్ రింగ్ రోడ్డు లోపల సబ్ అర్బన్ తెలంగాణగా, రీజనల్ రింగ్ రోడ్ అవతల రూరల్ తెలంగాణగా అభివృద్ధి చేయాలని ప్రణాళికలు చేస్తున్నారు.


విప్లవం అంటే లక్ష్యసాధన వైపు వేగంగా వచ్చే మార్పు. అలాంటి మార్పు కోసం రేవంత్‌రెడ్డి చేస్తున్న ప్రయోగాలు, వేస్తున్న ప్రణాళికలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేసరికి ఖజానా ఖాళీ.. పార్టీ ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి. రేవంత్‌రెడ్డి స్వతహాగా ఒక గొప్ప వ్యూహకర్త. తనకంటూ కొన్ని ఆలోచనలున్నాయి. ఒక పెద్ద మార్పు తేవాలి.. అందుకు తన ప్రయత్నాల్లో ఎక్కడా ఆలస్యం ఉండొద్దు.. ఒక్క పొరపాటు ఉండొద్దు.. ఫైనల్‌గా రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి కావాలి, ప్రజలకు అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందాలి. అదే ధ్యాస, అదే శ్వాసగా రేవంత్‌రెడ్డి పనిచేస్తున్నారు.

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూనే ప్రగతి భవన్ ఇనుప కంచెలను కూల్చేశారు. నియంత కోటగోడలను బద్దలుకొట్టి ప్రగతి భవన్‌ను ప్రజా భవన్‌గా మార్చేశారు. ప్రజాపాలన అనే నామకరణంతో తొలి రోజునే ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమం పెట్టి, అధికారులను కేటాయించి, ప్రజల ముంగిటకు పాలన తెచ్చి... తన లక్ష్యం దిశగా అడుగులు వేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలోనే ఒక వికలాంగురాలికి తాను ఎప్పుడో ఇచ్చిన హామీని గుర్తుపెట్టుకొని ఉద్యోగం ఇచ్చారు. అలా మొదలైన ప్రజాపాలన గత 300 రోజుల నుంచి నిరంతరం ఆ లక్ష్యం దిశగా అడుగులు వేస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్ష నేత, ముఖ్యమంత్రిగా అనుభవమున్న కేసీఆర్ సభకు రావాలని విజ్ఞప్తి చేసారు. భేషజాలు లేవు కలిసికట్టుగా పని చేద్దామని ప్రకటించారు.


ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కేవలం ఓట్ల కోసం కాదని, అవి ప్రజలకు ఇచ్చిన హామీలు కాదు నమ్మకాలు అని రేవంత్‌రెడ్డి ప్రబలంగా నమ్ముతూ ఎవ్వరు అడగక ముందే హామీల అమలుకు శ్రీకారం చుట్టారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని వెంటనే అమలులోకి తెచ్చారు. 5 లక్షల వరకు ఉన్న ఆరోగ్యశ్రీ వైద్య సౌకర్యాన్ని 10 లక్షల రూపాయలకు పెంచారు. 200 యూనిట్ల వరకు ఉన్న ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని వెంటనే అమలు చేశారు. 500 రూపాయలకే దేశంలో ఎక్కడా లేని విధంగా వంటగ్యాస్ సౌకర్యం కలిగించారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తుంటే నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేసి మోడల్ హౌస్‌లను కూడా ఆవిష్కరించారు. ఇందిరమ్మ కమిటీలకు గైడ్‌లైన్స్ ఇచ్చారు.

ఫ్యూచర్ సిటీ పేరుతో హైదరాబాద్‌లో మరో అభివృద్ధి కేంద్రం ఏర్పాటు కోసం ఇటీవల విదేశీ పర్యటనలో భారీగా పెట్టుబడులు ఆకర్షించి వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ మెట్రో విస్తరణకు పూనుకున్నారు. ఇటు హయత్‌నగర్, అటు పటాన్‌చెరు, అలాగే పాతబస్తీ మీదుగా శంషాబాద్ వరకు మెట్రో విస్తరణతో హైదరాబాద్‌ను మరింత ప్రతిష్ఠాత్మకంగా మార్చే ప్రణాళికలు సిద్ధం చేశారు.

అన్నింటినీ మించి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఫ్యామిలీ డిజిటల్ కార్డ్స్, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ పాలసీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, హ్యాండ్లూమ్ టెక్నాలజీ యూనివర్సిటీ లాంటి కార్యక్రమాలు గొప్ప ఆలోచనలు. పట్టుదల, మంచి చేయాలన్న తలంపు ఉంటే ఏదైనా చేయొచ్చు అని రేవంత్‌రెడ్డి నిరూపించారు. కేసీఆర్ సీఎంగా 3,500 రోజులలో చేయలేని అనేక పనులను కేవలం 300 రోజులలో రేవంత్‌రెడ్డి చేసి చూపిస్తున్నారు. రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేసి, 18 వేల కోట్ల రూపాయలు రైతులకు బ్యాంకుల్లో వేయడంతో పాటు, మళ్ళీ రైతులకు రెండు లక్షల రూపాయలు వ్యవసాయ ఋణంగా ఇప్పించి, దేశంలోనే ఆదర్శంగా నిలిచారు.


ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు విద్యారంగంలో ఒక అద్భుతమైన కార్యక్రమం, ఒక విద్యారంగ విప్లవం. అలాగే నిరుద్యోగ సమస్యల పరిష్కారానికి ఒక్క ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే కాకుండా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం ద్వారా వారిని ఉపాధి రంగం వైపు, ప్రైవేట్ ఉద్యోగాల కల్పన అవకాశాలు కల్పించే ప్రక్రియ ఏర్పాటు చేశారు. ఫ్యూచర్ సిటీ ఏర్పాటులో భాగంగా ప్రధానంగా నగరం ఒక వైపే కాకుండా అన్ని వైపులా విస్తరించాలి, ట్రాఫిక్ సమస్య, నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలనే వ్యూహంతో ముందుకు పోతున్నారు. అందుకోసం విదేశాలలో పెట్టుబడుల సభలకు వెళ్లి బడా పారిశ్రామికవేత్తలను ఆహ్వానించి, ఇప్పటికే దాదాపు 86 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేలా పరిశ్రమలతో ఒప్పందాలు చేసుకున్నారు.

చెరువులు, కాలువలు పరిరక్షించాలని, ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలన్న బాధ్యతతో హైడ్రా ఏర్పాటు చేశారు. భారీ వరదలు వచ్చినపుడు హైదరాబాద్ నగరం అల్లాడిపోకుండా భవిష్యత్ తరాలు భద్రతతో ఉండే విధంగా గొప్ప కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. మూసి నదీ ప్రక్షాళన కార్యక్రమం ఒక గొప్ప ముందడుగు. అక్కడ నిర్వాసితులకు డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ఇస్తూ, వారిని తరలించి మూసీ పరివాహక ప్రాంతాలను అభివృద్ధి చేయడం ద్వారా హైదరాబాద్‌ను ఒక సురక్షిత, సుందర నగరంగా చేయవచ్చునని ప్రణాళిక చేశారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం తెచ్చిన ‘ధరణి’తో లక్షలాది ఎకరాల భూమి అనేక సమస్యలతో గందరగోళ పరిస్థితుల్లో పడిపోయింది. అనేక అవకతవకలు జరిగాయి. దీంతో ధరణి సమస్యల పరిష్కారానికి ఒక మంత్రివర్గ కమిటీ, అధికారుల కమిటీ వేసి గ్రామసభల ద్వారా వెంటనే భూమి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టారు.


నిరుద్యోగ సమస్య పరిష్కారం దిశగా 30 వేల ప్రభుత్వ ఉద్యోగాల నియామక పత్రాలు ఇవ్వడంతో పాటు డిఎస్సీ పరీక్షలు నిర్వహించి 11 వేలకు పైగా మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారు. ఈ పది నెలల కాలంలో దాదాపు 40 వేల మంది నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగస్తులయ్యారు అంటే రేవంత్‌రెడ్డి నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఎంతగా కృషి చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

ఇక ఎంతో కాలంగా పెండింగ్ ఉన్న ఎస్సీ a b c d వర్గీకరణ విషయంలో ఒక పెద్ద ముందడుగు వేశారు. ముందుగా మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ వేశారు. అనంతరం కమిటీ సిఫారసుతో ఏకసభ్య కమిటీ వేయడం, బీసీ కుల గణనకు కమిషన్ ఏర్పాటు చేసి కాలపరిమితి పెట్టి ఒక తీవ్రమైన సమస్యకు పరిష్కారం వెతికారు. ఇలా కేవలం 300 రోజులలోనే అద్భుతాలు చేస్తున్నారు. అటు అభివృద్ధి, ఇటు సంక్షేమం, సంస్కరణలు, భారీ మార్పులు, ఉద్యోగాల కల్పన, ఎన్నికల ముందు పార్టీ ఇచ్చిన హామీల అమలు, ప్రతిపక్షాల రాజకీయ అవాంతరాలను అధిగమించి, తాను అనుకున్న లక్ష్య సాధన దిశగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దూసుకుపోతున్నారు.

కప్పర హరిప్రసాద్‌రావు

సీపీఆర్‌ఓ, టీపీసీసీ

Updated Date - Oct 22 , 2024 | 12:18 AM