ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అభివృద్ధికి మార్గం, ఉపాధికి ఊతం

ABN, Publish Date - Oct 22 , 2024 | 12:16 AM

ప్రపంచంలో పలు దేశాల ఆర్థిక వ్యవస్థకు, ఉపాధి కల్పనకు ఎంఎస్ఎంఈ (మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్)లు పునాదిగా ఉన్నాయి. యూఎస్ఏలో 99.9 శాతం, జపాన్‌, ఈయు (యూరోపియన్ యూనియన్)లో 99 శాతం, చైనాలో 90 శాతం వ్యాపారం ఎంఎస్ఎంఈల...

ప్రపంచంలో పలు దేశాల ఆర్థిక వ్యవస్థకు, ఉపాధి కల్పనకు ఎంఎస్ఎంఈ (మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్)లు పునాదిగా ఉన్నాయి. యూఎస్ఏలో 99.9 శాతం, జపాన్‌, ఈయు (యూరోపియన్ యూనియన్)లో 99 శాతం, చైనాలో 90 శాతం వ్యాపారం ఎంఎస్ఎంఈల ద్వారానే జరుగుతోంది. ఆయా దేశాల జీడీపీలో ఈ రంగం వాటా చూస్తే... ఈయులో 85 శాతం, చైనాలో 69, జపాన్‌లో 55, జర్మనీ, యూఎస్ఏలలో 50 శాతంగా ఉంది. ఈయు, చైనా, జర్మనీ, జపాన్, అమెరికా దేశాల్లో వరుసగా 85, 80, 75, 70, 50 శాతం ఉపాధి అవకాశాలను ఎంఎస్ఎంఈలు కల్పిస్తున్నాయి. ప్రపంచంలో 90 శాతం వ్యాపారం, 70 శాతం వరకు ఉద్యోగాల కల్పన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ద్వారానే జరుగుతోంది. అందుచేతనే మౌలిక సదుపాయాల కల్పన, సాంకేతిక నవీకరణ, పెట్టుబడులు, మార్కెట్ విస్తరణలో సహాయం, పన్ను రాయితీలు, పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్‌డి) కోసం ఆర్థిక సాయం అందించడం ద్వారా అభివృద్ధి చెందిన దేశాలు ఎంఎస్ఎంఈల పురోభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నాయి.


భారతదేశంలో కూడా ఆర్థికాభివృద్ధి, ఉపాధి, పారిశ్రామికరంగ ఎదుగుదలలో ఎంఎస్ఎంఈలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు సృష్టించి ఉపాధి, ఆర్థికాభివృద్ధి సాధించడంతో పాటు ప్రాంతీయ అసమానతలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. మన దేశంలో ఈ ఏడాది అక్టోబర్ 3 వరకు 5.17 కోట్ల ఎంఎస్ఎంఈలు నమోదు కాగా, వాటిలో 98 శాతం సూక్ష్మ పరిశ్రమలు. వీటి ద్వారా సుమారు 22 కోట్ల మందికి ఉపాధి లభించడమే కాకుండా దేశ జీడీపీకి 30 శాతం ఈ రంగమే సమకూరుస్తోంది. భారత్ ఎగుమతుల్లో 50 శాతం వాటా ఎంఎస్ఎంఈ లదే. దేశం మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో 45 శాతం వరకు, ఎగుమతులలో సుమారు 40 శాతం వరకు ఈ రంగం అందిస్తూ, ప్రధాని మోదీ ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదాన్ని సాకారం చేస్తున్నది. పెద్ద పరిశ్రమలకు అవసరమైన అనేక ఉత్పత్తులను సరఫరా చేసి పారిశ్రామికాభివృద్ధికి తోడ్పడుతున్నది. సమీప భవిష్యత్తులో దేశంలో ఎంఎస్ఎంఈలు 7.5 కోట్ల యూనిట్లకు చేరుకునే అవకాశం ఉందని, తద్వారా మరో 10 కోట్ల మందికి ఉపాధి లభించే అవకాశం వస్తుందని భావిస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా ఉండి భారీ స్థాయిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఈ రంగానికి, అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే ప్రభుత్వపరంగా లభిస్తున్న ప్రోత్సాహం, సహకారం తక్కువే.


డిజిటల్ సాంకేతికాలు, బిగ్ డేటా, ఆటోమేషన్ల పారిశ్రామిక యుగం నడుస్తుండగానే రోబోలు, స్మార్ట్ యంత్రాలతో మరో పారిశ్రామిక విప్లవం అడుగిడుటానికి సిద్ధంగా ఉంది. డిజిటల్ సాంకేతికలతో పారిశ్రామిక రంగాన్ని రూపాంతరం చెందించడానికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు పెట్టుబడులు పెడుతున్నాయి. ఎంఎస్ఎంఈ రంగానికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తున్నా, ప్రస్తుత డిజిటల్ యుగంలో పోటీపడాలంటే కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా ఎనలిటిక్స్, ఈ–కామర్స్ వంటి ఆధునిక సాంకేతికతలను అందిపుచ్చుకోవాలి. వ్యాపార ఇంక్యుబేటర్ల సేవలు పొందడంతో పాటు, భారీ పరిశ్రమలతో భాగస్వామ్యం ఏర్పరుచుకుని నైపుణ్యాన్ని పెంచుకోవాలి. సాంప్రదాయ పంథా నుంచి డిజిటల్ మార్గానికి మరలాలి. భావి మార్కెట్ రీతులను అధ్యయనం చేసి తదనుగుణంగా ఉత్పత్తి, మార్కెటింగ్ చేపట్టడానికి ‘ప్రిడిక్టివ్ ఎనలిటిక్స్’, వినియోగదారుల అభిరుచి మేరకు అవసరమైన మేరకే ఉత్పత్తి చేసి సరఫరా చేయడానికి, సమర్ధవంతంగా వ్యాపారం నిర్వహించడానికి ‘డేటా ఎనలిటిక్స్’ను ఉపయోగించుకోవాలి. ఐవోటీ, బ్లాక్‌చైన్ సాంకేతికతలను ఉత్పత్తి ప్రక్రియలో వినియోగించుకోవాలి. పారిశ్రామిక రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా యంత్రాలను, నైపుణ్యాలను ఆధునీకరించకపోవడం, ప్రస్తుత మార్కెటింగ్ పద్ధతులను ఆకళింపు చేసుకోకపోవడం వల్ల చాలావరకు ఎంఎస్ఎంఈలు నష్టపోతున్నాయి.


ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో చిన్న పరిశ్రమల ప్రాముఖ్యతను, అవసరాన్ని రాష్ట్రంలో ఎన్‌డిఏ ప్రభుత్వం గుర్తించింది. ఇప్పటికి రాష్ట్రంలో 9.89 లక్షల ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. ఇటీవల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ముసాయిదా పాలసీపై సమీక్షించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చే ఐదేళ్ళలో ఈ రంగంలో రూ.50 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి, మరో 22 లక్షల కొత్త యూనిట్లను ఏర్పాటు చేయడం ద్వారా 2029 నాటికి కనీసం ఐదు లక్షలకు పైగా ఉపాధి అవకాశాలు కల్పించాలని.. ‘ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త’ అనే నినాదంతో చిన్న పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించాలని మార్గనిర్దేశనం చేశారు. ఇందుకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పిపిపి విధానంతో ప్రైవేటు వ్యక్తులను భాగస్వాములను చేయడం ద్వారా కొత్తగా వంద ఎంఎస్ఎంఈ పార్కులను అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మొదటగా దేశం నుంచి భారీగా ఎగుమతి అవకాశాలున్న పది రంగాలకు సంబంధించిన ఉత్పత్తులను తయారుచేసే కనీసం 500 ఎంఎస్ఎంఈలను గుర్తించి అవసరమైన శిక్షణ, మౌలిక సదుపాయాలను కల్పించి, అంతర్జాతీయ మార్కెట్లో ‘మేడిన్ ఆంధ్రా’ బ్రాండుతో పోటీపడేలా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. ఎంఎస్ఎంఈల ఏర్పాటు కోసం క్లస్టర్ల ఆధారంగా మౌలిక సదుపాయాలు కల్పించడం, కొత్తగా యూనిట్లు ఏర్పాటు చేసే వారికి మార్గదర్శకత్వం చేయడం, ఆర్థిక అవసరాలకు పరిష్కారాలు చూపడం, పోటీ తత్వాన్ని పెంచడం, ఉత్పత్తుల విక్రయాలకు సహాయపడటం, ఎగుమతులను ప్రోత్సహించడంతో పాటు వాటి అభివృద్ధికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై దృష్టి సారించడమనే కీలకాంశాల ఆధారంగా అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన.


కొత్తగా ఏర్పాటు చేసే పరిశ్రమలతో పాటు ఇప్పటికే ఉత్పత్తి చేస్తూ సాంకేతికతను మెరుగుపరచుకుంటున్న పరిశ్రమలకు రాయితీలు, ప్రోత్సాహకాలను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ‘మేడిన్ ఆంధ్రా’ బ్రాండ్ ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేందుకు ఉత్పత్తుల విక్రయాల ప్రదర్శనలు.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈ–కామర్స్ పోర్టల్‌కు అనుసంధానం వంటి అంశాల్లో ప్రభుత్వం సహకారం అందిస్తుంది. అలాగే ప్రపంచ వాణిజ్య అవకాశాలు అందిపుచ్చుకునేందుకు వీలుగా విశాఖపట్నం, అమరావతి, తిరుపతిలలో మూడు అంతర్జాతీయ వాణిజ్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ముఖ్యమంత్రి దార్శనికతకు వాస్తవ రూపం ఇచ్చే విధంగా అధికారులు క్రియాశీలకంగా పనిచేస్తే ఎంఎస్ఎంఈ రంగంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నత స్థానానికి చేరడమే కాక ‘మేకిన్ ఇండియా’ ఉత్పత్తులకు తోడుగా ‘మేడిన్ ఆంధ్రా’ ఉత్పత్తులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చలామణి కావడం అసాధ్యమేమీ కాదు.

లింగమనేని శివరామప్రసాద్

Updated Date - Oct 22 , 2024 | 12:16 AM