బైడెన్ లేని పోటీ
ABN, Publish Date - Jul 23 , 2024 | 04:54 AM
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరినుంచి జోబైడెన్ నిష్ర్కమణ ఆయన పార్టీనేతల, సభ్యుల ఒత్తిడిమేరకు జరిగిపోయింది. బైడెన్ అడ్డంకి తొలగిపోతే, మరింత సమర్థవంతమైన నాయకత్వంలో రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌ను ఢీకొనగలమని...
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరినుంచి జోబైడెన్ నిష్ర్కమణ ఆయన పార్టీనేతల, సభ్యుల ఒత్తిడిమేరకు జరిగిపోయింది. బైడెన్ అడ్డంకి తొలగిపోతే, మరింత సమర్థవంతమైన నాయకత్వంలో రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌ను ఢీకొనగలమని డెమోక్రాట్లు నమ్ముతున్నారు. అధ్యక్ష ఎన్నికల వేడి రాజుకోకముందే చాలా సర్వేలు బైడెన్ వెనుకబడివున్న విషయాన్ని తేల్చాయి. జూన్ 28న జరిగిన తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్‌లో బైడెన్ తడబాటు, గందరగోళం తరువాత ఉన్న ఆ కాస్త మద్దతు కూడా నీరుగారిపోయింది. మరోపక్క, ట్రంప్‌మీద జరిగిన హత్యాయత్నంతో ఆయనమీద సానుభూతిహెచ్చిందనీ, పాపులారిటీ పెరిగిందనీ అందరూ నమ్మారు. ఈ దశలో ట్రంప్‌ను ఓడించాలంటే వేరొకరు రావాలన్న పార్టీలోని అత్యధికుల విశ్వాసం సరైనదో కాదో రేపటి ఎన్నికల్లో తేలుతుంది కానీ, బైడెన్‌కు బైబైచెప్పే విషయంలో జరిగిన జాప్యం పార్టీకి కొంత నష్టం చేసిన మాట నిజం.
న్యాయ వివాదాల్లో, కేసుల్లో ఇరుక్కున్నప్పటికీ, అధ్యక్ష ఎన్నికల దిశగా ట్రంప్ తన నడకలో ఎన్నడూ తడబడలేదు. ప్రచారం ఉధృతంగా సాగుతున్న తరుణంలో హత్యాయత్నం జరగడం, ఒక్కక్షణం ట్రంప్ నిర్ఘాంతపోయినా మరుక్షణం తేరుకొని పిడికిలిబిగించి నినదించడం, భద్రతాసిబ్బంది వాహనంలోకి ఎక్కించేవరకూ రక్తమోడుతున్న తన మొఖాన్ని చూపించడం వంటివి ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేసే అంశాలే. తనమీద జరిగిన హత్యాయత్నాన్ని రాజకీయంగా వాడుకున్నప్పటికీ, ఆ తరువాత రిపబ్లికన్ పార్టీనుంచి నామినేషన్‌ను స్వీకరిస్తున్న సందర్భంలో ఆయన బాధ్యతాయుతంగా మాట్లాడారు. అధికారంకోసం సమాజంలో విద్వేషాలు రగల్చడానికీ, మనుషులను చీల్చడానికీ, వ్యవస్థలమీద దాడులు చేయించడానికీ వెనుకాడని ట్రంప్ ఈ హత్యాయత్నం తరువాత సమైక్యత గురించి మాట్లాడటం ద్వారా తటస్థ ఓటర్లను సైతం ఆకర్షించాడని వార్తలు వచ్చాయి.
ట్రంప్ విజయం ఖాయమైన ఈ ఆఖరుదశలో, పోటీనుంచి తప్పుకోవడం ద్వారా బైడెన్ తన పార్టీకి చేయగలిగే మేలు ఎక్కువగా ఉండకపోవచ్చు. కమలా హారిస్‌కు మద్దతు ఇవ్వడానికి ఆయన ఆఖరుక్షణం వరకూ ఇష్టపడలేదని వార్తలు వచ్చాయి కానీ, ఆయన ప్రకటన తరువాత పార్టీఅంతా ఆమె పక్షాన రావచ్చు. కానీ, ఆమెకు పార్టీలో మిగతావారినుంచి ఏ మాత్రం పోటీ ఉండబోదని ఇప్పుడే కచ్చితంగా చెప్పలేం. ఒకసారి బైడెన్ తప్పుకున్న తరువాత కమలకంటే ట్రంప్‌ను బలంగా ఢీకొట్టగలిగేవారు ఎవరైనా ఉన్నారా అన్న ప్రశ్న, చర్చ తప్పవు. స్వల్పకాలంలోనే ఆ అన్వేషణ ముగిసి, కమల ఖాయమైన తరువాత పార్టీ తన పూర్తి శక్తియుక్తులను ఆమె పక్షాన మోహరించడం జరుగుతుంది. విధిగా తప్పుకోవాల్సివచ్చిన ఈ స్థితిలో, కమలకు మద్దతు ప్రకటించి బైడెన్ డెమోక్రాటిక్ పార్టీ మూలసిద్ధాంతాలకు అనుగుణంగా వ్యవహరించారు. భారత్–జమైకా సంతతికి చెందిన ఈమెకు ఆఫ్రికా, ఇండియా మూలాలున్న ఓటర్లు అండగా నిలవవచ్చు. అలాగే, ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో, అబార్షన్ హక్కుల విషయంలో ఆమె ప్రదర్శించిన పోరాటస్ఫూర్తి మహిళా ఓటర్లను విస్తృతంగా ఆకర్షించింది. బైడెన్ వయసు లక్ష్యంగా ట్రంప్ దాడి సాగింది కనుక, ఇప్పుడు తమ అభ్యర్థిని మార్చుకుంటున్న డెమోక్రాట్లు ట్రంప్‌ను హాయిగా అపహాస్యం చేయవచ్చు. కమలాహారిస్ అంత అద్భుతమైన వక్త కాదు కానీ, బైడెన్‌కు ఉన్న మతిమరుపు సమస్య ఆమెకు లేదు కనుక, లోతైన అధ్యయనంతో అన్ని అంశాలమీదా ట్రంప్‌ను ఆమె బలంగా ఢీకొట్టవచ్చు. ప్రెసిడెన్షియల్ డిబేట్‌లో ట్రంప్ గతాన్ని ప్రజలకు బలంగా గుర్తుచేసి, తన అభిమానులను రెచ్చగొట్టి అమెరికన్ కాంగ్రెస్ భవనంమీద దాడులుచేయించిన ఆయన తన చర్యలు, చేష్టలతో అమెరికాకు తెచ్చిన అపకీర్తిని ఏకరువుపెట్టవచ్చు. ఆయనమీద ఉన్న కేసులు దేశం పరువు దిగజార్చిన మాట వాస్తవం. అధ్యక్ష రేసునుంచి బైడెన్ తప్పుకున్నప్పటికీ, ఫలితం ఏకపక్షంగానే ఉండబోతోందన్న విశ్లేషణలు పూర్తిగా కొట్టిపారేయలేనివి. బైడెన్ మద్దతు తరువాత కూడా కమలాహారిస్‌కు ప్రత్యామ్నాయంగా మిచెల్లే ఒబామా వంటి కొన్ని పేర్లు కనీసం ప్రచారంలో ఉన్న మాట నిజం. ఎన్నికలు ముంచుకొస్తున్న ఈ చివరిదశలో డెమోక్రాట్ల తరఫున బరిలోకి దిగినవారెవ్వరైనా ట్రంప్‌మీద విజయం సాధించగలిగితే అది మహాద్భుతమే అవుతుంది. ఒకవేళ అలా జరగకపోయినా, ఇప్పటికే జరిగిపోయిన నష్టాన్ని కొంతమేరకు పూడ్చుకొని కనీసం గట్టిపోటీ ఇవ్వగలరా అన్నది చూడాలి.
Updated Date - Jul 23 , 2024 | 04:54 AM