ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వయోవృద్ధుల అధికార లాలస

ABN, Publish Date - Jul 27 , 2024 | 05:53 AM

మాతృభూమితో పాటు నాకు బాగా తెలిసిన దేశం అమెరికా. నేను మొట్టమొదట ఆ దేశాన్ని 38 సంవత్సరాల క్రితం సందర్శించాను. ఆ తరువాత అనేక సార్లు ఆ దేశానికి వెళ్లాను. చివరిసారి అక్టోబర్ 2022లో వెళ్లాను. అమెరికా అధ్యక్షుడుగా జో బైడెన్ అప్పటికి ఇంకా రెండు సంవత్సరాలు కూడా పూర్తిచేసుకోలేదు.

మాతృభూమితో పాటు నాకు బాగా తెలిసిన దేశం అమెరికా. నేను మొట్టమొదట ఆ దేశాన్ని 38 సంవత్సరాల క్రితం సందర్శించాను. ఆ తరువాత అనేక సార్లు ఆ దేశానికి వెళ్లాను. చివరిసారి అక్టోబర్ 2022లో వెళ్లాను. అమెరికా అధ్యక్షుడుగా జో బైడెన్ అప్పటికి ఇంకా రెండు సంవత్సరాలు కూడా పూర్తిచేసుకోలేదు. ఆ స్వల్పకాలిక పర్యటనలో మిత్రులతో జరిపిన సంభాషణలు, నా సొంత పరిశీలనల నుంచి అమెరికా అధ్యక్షుడు తన బాధ్యతలను సమర్థంగా, ప్రశస్తంగా నిర్వహిస్తున్నారని నాకు అవగతమయింది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షత కాలంలో రగుల్కొన్న విభేదాలు, వైషమ్యాలను అమెరికా ప్రజలు అధిగమించేందుకు బైడెన్ విశేషంగా తోడ్పడ్డారనడంలో సందేహం లేదు. అయితే తన పైబడిన వయసు, ఆరోగ్య దుర్బలతల కారణంగా బైడెన్ రెండో సారి అధ్యక్ష పదవికి ఆరాటపడకుండా ఉంటే బాగుండేది.

ఏ విధంగానైనా అధికారంలో కొనసాగి తీరాలన్న ఆరాటం అమెరికా ప్రస్తుత అధ్యక్షుడి లక్షణం మాత్రమే కాదు. అధికారాన్ని, వృత్తిగత విజయాలను చవిచూసిన వ్యక్తుల స్వతస్సిద్ధ స్వభావమది. ఈ ధరిత్రిపై ప్రతి దేశంలోను అటువంటి వ్యక్తులు ఉన్నారు. భౌతిక, మానసిక సామర్థ్యాలు క్షీణిస్తున్నప్పటికీ, తమ బాధ్యతలను సమర్థంగా కాదుకదా, మామూలు స్థాయిలో కూడా నిర్వహించగలగడం అసాధ్యమని స్పష్టమవుతున్నప్పటికీ అధికార లాలస నుంచి బయటపడని నేతలు అన్ని దేశాలలోను ఉన్నారు. రాజకీయాలలోనేకాదు, ఇతర రంగాలలోను అటువంటి వ్యక్తులు ఉన్నారు. ఈ వాస్తవం మన దేశంలో క్రికెట్ అభిమానులకు బాగా తెలుసు. 35 ఏళ్ల వయసు దాటిన తరువాత క్రికెటర్లు గతంలో వలే ప్రశస్తంగా ఆడలేకపోవడం సహజం. అయితే ఈ వాస్తవాన్ని గుర్తించిన క్రికెటర్లు ఎంత మంది ఉన్నారు? ఇందుకొక మినహాయింపు సునీల్ గవాస్కర్ ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో ఉత్కృష్టంగా ఆడి టీమ్ ఇండియాకు విజయం సాధించిన తరువాత ఆయన క్రికెట్ నుంచి పూర్తిగా వైదొలిగారు.

వ్యాపార వాణిజ్య రంగాలలోనూ ప్రతిభావంతులైన యువ మేనేజర్లను ప్రోత్సహించడంలో తాత్సారం చేసే కార్పొరేట్ అధిపతులు చాలా మంది ఉన్నారు. పౌర సమాజ ఉద్యమాలలో పనిచేసేవారిలో కూడా తామే సుదీర్ఘకాలం ఉన్నతస్థాయి నాయకత్వంలో కొనసాగాలని అభిలషించేవారున్నారు. ఈ అవగుణానికి మేధో రంగమూ మినహాయింపు కాదు బొంబాయి నుంచి వెలువడే సామాజిక శాస్త్రాల పత్రిక ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ (ఈపిడబ్ల్యు) విషయాన్నే చూడండి. ఒకప్పుడు ఈ జర్నల్‌కు అంతర్జాతీయంగా విశేష పేరు ప్రఖ్యాతులు ఉండేవి. సామాజికశాస్త్రాలలో పరిశోధన చేసే ప్రతి ఒక్కరూ ఆ జర్నల్‌ను చదవుతూ ఉండేవారు. యువ పరిశోధకులు తమ పరిశోధనా పత్రాలు ఆ జర్నల్‌లో ప్రచురితం కావాలని ఆకాంక్షించేవారు. విద్యావేత్తలతో పాటు జర్నలిస్టులు, సివిల్ సర్వెంట్‌లు, ప్రజా ఉద్యమాల లోని క్రియాశీలురు కూడా ఈపిడబ్ల్యును తప్పక చదువుతుండేవారు. అయితే ఇటీవలి సంవత్సరాలలో ఆ జర్నల్ ప్రమాణాలు బాగా పడిపోయాయి. అందులో ప్రచురితమవుతున్న వ్యాసాలు, పరిశోధనా పత్రాలు గతంలో వలే కొత్త పథనిర్దేశం చేసేవిగా ఉండడం లేదు. ఒకప్పుడు మన దేశంలో సమున్నత మేధోచర్చలకు వేదికగా ఉన్న ఆ జర్నల్ ఇప్పుడు అంత ఉత్కృష్టంగా లేదు.

ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ ప్రతిష్ఠ దిగజారిపోవడానికి ప్రధాన కారణం దానిని నిర్వహిస్టున్న ట్రస్ట్ సభ్యులు (అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మాదిరిగా) జీవిత కాల సభ్యులు కావడమే. ట్రస్ట్ ప్రస్తుత సభ్యులలో అందరి కంటే చిన్న వ్యక్తి వయసు 69 ఏళ్లు కాగా పెద్దాయన వయసు 93 ఏళ్లు. ట్రస్ట్‌లోని పది మంది సభ్యులలో తొమ్మిది మంది పురుషులే. మొత్తం సభ్యుల సగటు వయసు ఇంచు మించు 80 ఏళ్లుగా ఉన్నది. మరి సామాజికశాస్త్రాలలో ఉత్కృష్ట పరిశోధనలు జరిగేది పరిశోధకులు 30 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసులో ఉన్నప్పుడే కదా. జర్నల్‌ను నడిపేవారి, అందులో పరిశోధన పత్రాలు ప్రచురించే స్కాలర్ల సగటు వయసు మధ్య ఇంత వ్యత్యాసంతో ఈపిడబ్ల్యు తన ప్రతిష్ఠను పెంపొందించుకోవడం అటుంచి కనీసం నిలబెట్టుకోగలదా?

ఈపిడబ్ల్యు ప్రతిష్ఠ సన్నగిల్లడం స్వయంకృతమే. నాకు తెలిసిన మరో మేధో సంస్థ గాథ ఆ ప్రతిష్ఠాత్మక జర్నల్ చరిత్రకు పూర్తిగా భిన్నమైనది. బెంగళూరులోని నేషనల్ సెంటర్ ఆఫ్ బయోలాజికల్ సైన్సెస్ (ఎన్‌సిబిఎస్‌) గురించి నేను ప్రస్తావిస్తున్నాను. ఈ ఉత్కృష్ట ఉన్నత విద్యా సంస్థ తొలుత టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ (టిఐఎఫ్ఆర్) విభాగంగా ప్రభవించింది. 1940లో బాంబేలో స్థాపితమైన టిఐఎఫ్ఆర్‌లో మొదటి పదిహేనేళ్లు భౌతిక, గణితశాస్త్రవేత్తల ప్రాబల్యముండేది. 1960వ దశకంలో ప్రతిభావంతుడైన యువశాస్త్రవేత్త ఒబైద్ సిద్దిఖి ఆ సంస్థలో చేరారు. రెండు దశాబ్దాల పాటు టిఐఎఫ్ఆర్‌లో పనిచేసిన అనంతరం సిద్దిఖి బాంబే నుంచి బెంగళూరుకు మారి అక్కడ ఒక కొత్త జీవశాస్త్ర పరిశోధనా సంస్థను నెలకొల్పారు. సామాజిక శాస్త్రవేత్తగా శిక్షణ పొందిన నాకు భారతీయ వైజ్ఞానిక ప్రపంచంతో కూడా చెప్పుకోదగిన పరిచయం ఉన్నది. మా నాన్నగారు, తాతగారితో సహా మా కుటుంబానికి చెందిన పలువురు శాస్త్రవేత్తలే.


ఎన్‌సిబిఎస్‌ గురించి ఒక విశేషాన్ని నేను తొట్ట తొలుత చెప్పదలుచుకున్న విశేషం: నాకు తెలిసిన మరే ఇతర భారతీయ ఉన్నత విద్యా సంస్థలో కంటే ఈ పరిశోధనా సంస్థలో అధికార క్రమం కనిష్ఠ స్థాయిలో ఉండడం. విద్యావ్యాసంగాలలో సమష్టి కృషి, దాపరికం లేని విస్తృత మేధో సంభాషణలు, అందరూ అరమరికలు లేకుండా పాల్గొనే మేధో సంవాదాలు అక్కడ జరగుతాయి. సిఎస్ఐఆర్‌కు అనుబంధంగా ఉన్న 37 పరిశోధనా కేంద్రాలలో ఎన్‌సిబిఎస్‌లో ఉన్నటువంటి స్వేచ్ఛాయుత మేధో వాతావరణం చాలా వరకు లేదని చెప్పవచ్చు. ఐఐటిలలో సైతం అటువంటి స్ఫూర్తిదాయక మేధావరణం లేదు.

ఎన్‌సిబిఎస్‌లో అటువంటి ప్రజాస్వామిక, భాగస్వామ్య మేధో సంస్కృతికి ప్రధానకారకుడు ఒబైద్ సిద్దిఖి అనడంలో సందేహం లేదు. ఆయన్ని నేను చాలా సన్నిహితంగా పరిశీలించాను. ఆయనతరం అగ్రశ్రేణి భారతీయ శాస్త్రవేత్తల వలే కాకుండా సిద్దిఖి ఎటువంటి పటాటోపం లేని మనిషి. ఆత్మస్తుతి ఆయన స్వభావానికి పూర్తిగా విరుద్ధం. అధికార క్రమంపై సిద్దిఖికి ఎటువంటి అనురక్తి లేదు. అందరినీ సమరీతిలో గౌరవించే ఉదాత్తుడు. యువ శాస్త్రవేత్తలు ఉత్కృష్ట పరిశోధనలు చేస్తున్నారని ఆయనకు బాగా తెలుసు వారి పరిశోధనలకు, ప్రతిభా పాటవాల వికాసానికి సానుకూల పరిస్థితులను కల్పించడమే తన విధ్యుక్తధర్మంగా సిద్దిఖి భావించారు. ఏ ఒక్కరినీ తన మాదిరిగా రూపొందించాలని ఆయన కోరుకోలేదు. సిద్దిఖికి శాస్త్ర జగత్తు వెలుపల కూడా విశాల మేధో ఆసక్తులు ఉన్నయి. తత్వశాస్త్ర కోవిదులు, చరిత్రకారులు, సామాజిక శాస్త్రవేత్తలతో భావాల వినిమయం చేసుకోవాడానికి ఆయన సదా ప్రయత్నించేవారు.

ఎన్‌సిబిఎస్ డైరెక్టర్‌గా తన పదవీ కాలం ముగిసిన తరువాత తాను స్థాపించిన ఆ సంస్థనే అంటి పెట్టుకుని ఉండిపోవాలని సిద్దిఖి కోరుకోలేదు. అటువంటి ఉన్నత స్థానాలలో ఉన్న ఇతర భారతీయ శాస్త్రవేత్తలలో అత్యధికులు అలా చేసినవారు, చేసేవారే. ఎన్‌సిబిఎస్‌ నిర్వహణా బాధ్యతలను తన యువ సహచరుడికి వదిలివేసి, విద్యా వినమ్రతతో సిద్దిఖి తన పరిశోధనా వ్యాసంగంలో నిమగ్నమయ్యారు. సిద్దిఖి స్థానంలో ఎన్‌సిబిఎస్‌ డైరెక్టర్ అయిన శాస్త్రవేత్త కూడా తన పదవీ విరమణ అనంతరం ప్రతిభావంతుడైన సహచర యవ శాస్త్రవేత్తకు ఆ బాధ్యతలను అప్పగించారు. ఈ మూడో డైరెక్టర్ సైతం సిద్దిఖి స్ఫూర్తితో నాలుగో డైరెక్టర్‌కు బాధ్యతలు అప్పగించారు. ఈ నాలుగో డైరెక్టర్ ఎన్‌సిబిఎస్‌ డైరెక్టర్ కాక ముందు ఆ సంస్థతో ఎటువంటి సంబంధం లేని శాస్త్రవేత్త. అయితే ఆయన కొత్త భావాలు, సమున్నత భిన్నానుభవాలను తనతో తీసుకొచ్చి ఎన్‌సిబిఎస్‌ ప్రతిష్ఠను మరింతగా పెంచారు.


ఒబైద్ సిద్దిఖి ఒక అపూర్వ భారతీయ పరుషుడు కాక పోయి ఉంటే ఎన్‌సిబిఎస్ అలా సమున్నతంగా వర్ధిల్లేది కాదు ఆ సంస్థ శాశ్వత విజయానికి మరో కారణం అది అంగీకరించి, అనుసరించిన నిర్వహణ పద్ధతులు. డైరెక్టర్ రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తాడు. డైరెక్టర్‌కు మార్గదర్శకత్వం వహించేందుకు, అవసరమైన మద్దతును సమకూర్చేందుకు ఒక మేనేజ్‌మెంట్ బోర్డ్ ఉన్నది. 15 మంది ఉండే ఈ బోర్డ్‌లో ఐదుగురు భారత ప్రభుత్వ, టిఐఎఫ్ఆర్ ప్రతినిధులు కాగా మిగతా పది మంది ప్రపంచ వ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలలో పరిశోధకులుగా ఉన్న శాస్త్రవేత్తలు వీరిలో ఐదుగురు మహిళలు. ఎన్‌సిబిఎస్‌ మేనేజ్‌మెంట్ బోర్డ్ సభ్యుడి పదవీ కాలం మూడు సంవత్సరాలు. ఒక పర్యాయం పొడిగించే అవకాశమున్నది. బహుశా రెండోసారి కూడా పొడిగించవచ్చు. అంతటితో సరి. ఈపిడబ్ల్యును నడిపే ట్రస్ట్ విషయంలో వలే ఎన్‌సిబిఎస్‌ బోర్డ్‌లో ఏ ఒక్కరు జీవిత కాలం సభ్యులుగా ఉండరు. ఎట్టి పరిస్థితులలోను తొమ్మిది సంవత్సరాలకు మించి ఎవరూ సభ్యుడుగా ఉండరు. అదే ఈపిడబ్ల్యు ట్రస్ట్ సభ్యులలో కొంత మంది మూడు దశాబ్దాలుగా ఉన్నారు.

చివరగా ఒక వాస్తవాన్ని పేర్కొంటాను. ‘సాధ్యమైనంత వరకు ఉన్నత స్థానంలోనే ఉండితీరుదాం’ అనే లాలసకు శక్తిమంతమైన, విజయవంతమైన మహిళలు లోనుకానివారు కానప్పటికీ అటువంటి ఆకాంక్ష పురుషులలో చాలా ప్రబలంగా ఉన్నది. ఒబైద్ సిద్దిఖిలో ఆ లాలస మచ్చుకు కూడా లేదు. ఆయన దానికి కచ్చితంగా ఒక మినహాయింపు. పురుష శాస్త్రవేత్తలలోను, భారతీయ వైజ్ఞానిక జగత్తులోను సిద్దిఖి ఒక అరుదైన వ్యక్తి. రాజకీయాలు, క్రీడలు, వ్యాపార వాణిజ్యాలు, పౌర సమాజం, విద్యా ప్రపంచంలో అసంఖ్యాక భారతీయులు తమ తమ ఉన్నత స్థానాలలో కొనసాగేందుకు ప్రస్తుత అమెరికా అధ్యక్షుడులా వ్యవహరించినవారే. వారు అదే విధంగా వ్యవహరించడాన్ని తప్పక కొనసాగిస్తారు. ముందు చూపులేని, స్వార్థపర స్వభావంతో కూడిన అటువంటి పెద్ద మనుషుల ప్రవర్తనకు ప్రతిభావంతులు, ప్రజ్ఞా ధురీణులు అయిన వారి జూనియర్ సహచరులతో పాటు యావత్ సమాజమూ అమితంగా నష్టపోవడంతో పాటు, భారీ మూల్యాన్ని చెల్లిస్తోంది.

ఏ విధంగానైనా అధికారంలో కొనసాగి తీరాలన్న ఆరాటం అమెరికా ప్రస్తుత అధ్యక్షుడి లక్షణం మాత్రమే కాదు. ఈ ధరిత్రిపై ప్రతి దేశంలోను అటువంటి వ్యక్తులు ఉన్నారు. భౌతిక, మానసిక సామర్థ్యాలు క్షీణిస్తున్నప్పటికీ, బాధ్యతలను సాధారణస్థాయిలో కూడా నిర్వహించగలగడం అసాధ్యమని స్పష్టమవుతున్నప్పటికీ అధికార లాలస నుంచి బయటపడని వారు రాజకీయాలలోనేకాదు, ఇతర రంగాలలోనూ ఉన్నారు. స్వార్థపర స్వభావంతో కూడిన ఆ పెద్ద మనుషుల ప్రవర్తనకు ప్రతిభావంతులైన వారి జూనియర్ సహచరులతో పాటు యావత్ సమాజమూ అమితంగా నష్టపోతోంది.

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Updated Date - Jul 27 , 2024 | 05:53 AM

Advertising
Advertising
<