ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పారిశ్రామిక రత్నం

ABN, Publish Date - Oct 11 , 2024 | 01:45 AM

ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌టాటా ఎనిమిదిపదులు దాటిన వయసులో కన్నుమూసిన వార్త ఆశ్చర్యం కలిగించకున్నా, దేశానికి ఎంతో ఆవేదన మిగల్చింది. పారిశ్రామికవేత్తలు మరణించినప్పుడు ఉన్నతస్థానాల్లోని వారంతా నివాళులు అర్పించడం...

ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌టాటా ఎనిమిదిపదులు దాటిన వయసులో కన్నుమూసిన వార్త ఆశ్చర్యం కలిగించకున్నా, దేశానికి ఎంతో ఆవేదన మిగల్చింది. పారిశ్రామికవేత్తలు మరణించినప్పుడు ఉన్నతస్థానాల్లోని వారంతా నివాళులు అర్పించడం సర్వసాధారణం. కానీ, రతన్‌ టాటా మరణవార్త చెవినపడగానే, సామాన్యులు, మధ్యతరగతి జనం సైతం ఆత్మబంధువును కోల్పోయినట్టుగా బాధపడటం ఆశ్చర్యం కలిగిస్తుంది. సామాజిక మాధ్యమాల్లో ఆయన చిత్రాలు, విడియోలు విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. ఎవరి మనసుకు తోచిన మాటతో వారు తమ బాధను పంచుకుంటున్నారు. బడాపారిశ్రామికవేత్తలపట్ల సమాజంలో సహజంగా ఉండే గిట్టనితనం రతన్‌టాటాకు వర్తించపోవడానికి ఆయన అరుదైన, ఆదర్శవంతమైన జీవనవిధానం కారణం.


స్వాతంత్ర్యానికి పూర్వంనుంచే ఆయన సంస్థ ఉంది. పెట్టుబడికి తగిన లాభాన్ని రాబట్టే పట్టుదలతో పాటు, దేశంపట్ల ప్రేమ, సమాజం పట్ల బాధ్యత కూడా ఆ కుటుంబీకుల్లో ఉంది. దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలు అడుగిడిన తరుణంలో బాధ్యతలు స్వీకరించిన రతన్‌టాటా హయాంలో గ్రూప్‌ పరిశ్రమలు, వ్యాపారాలు విస్తరించాయి. ఇప్పటి ఆశ్రితపెట్టుబడిదారుల మాదిరిగా అప్పటిపాలకులనుంచి అంతగా లబ్ధిపొందకపోయినా, అడ్డుతోవలు తొక్కకపోయినా రతన్‌ తన హయాంలో టాటా గ్రూప్‌ను ఎంతో విస్తరించగలిగారు. పాలకుల ఆశీస్సులతో అనతికాలంలోనే అతివేగంగా ఎదిగిపోయి, అపరకుబేరులుగా అవతరించడమనే అబ్బురపరచే విన్యాసాలు లేవు కానీ, రెండు దశాబ్దాల చైర్మన్‌గిరీలో ఆయన తన గ్రూప్‌ను నలభైరెట్లు విస్తరించారు, లక్షలాదిమందికి ఉపాధి కల్పించారు. ఒట్టిపోయిన పశువులను కబేళాకు పంపినట్టుగా, అవసరం తీరగానే ఉద్యోగులను ఆవలకు నెట్టేసే విధానాలను ఆయన తన సంస్థల్లో ప్రోత్సహించలేదు. వాటి పని సంస్కృతి, పద్ధతులు కూడా భిన్నమైనవని అంటారు. వ్యక్తిగత, వృత్తిగత జీవితంలో అనేక ఎదురుదెబ్బలు తిన్న రతన్‌, బహుశా తన కలల ప్రాజెక్ట్‌ నానో విషయంలో ఎక్కువ ఒత్తిడికి గురై ఉంటారు. తన రాజకీయ ప్రయోజనాలకోసం మమతాబెనర్జీ ఆదిలోనే ఆ ప్రాజెక్టుకు గండికొట్టడం, దానిని మరొకచోటకు తరలించి, కాస్తంత ఆలస్యంగా ఉత్పత్తి ఆరంభించినా, తాను ఊహించినంతగా ఈ దేశప్రజలు ఆ కారును ఆదరించకపోవడం ఆయన మరిచిపోలేనివి.


ధనికులు మాత్రమే ప్రవేశించగలిగే ముంబైలోని తాజ్‌హోటల్‌లో వీధికుక్కలపట్ల అక్కడి సిబ్బంది ప్రేమపూర్వకంగా వ్యవహరిస్తారనీ, వాటికోసం రతన్ టాటా ప్రత్యేక ఆస్పత్రి నెలకొల్పారని ఆయన జీవకారుణ్యం మీద విభిన్నమైన కథనాలు వస్తున్నాయి. తన పెంపుడు శునకం అనారోగ్యంతో ఉండటంతో బ్రిటిష్‌రాజు ప్రకటించిన జీవనసాఫల్యపురస్కారాన్ని స్వీకరించడానికి రతన్‌ టాటా వెళ్ళలేదట. లక్షలకోట్ల రూపాయల దాతృత్వంతో, చారిటబుల్ సంస్థల ఏర్పాటుతో, గుప్తదానాలతో ఆయన ఈ దేశప్రజలను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆదుకున్నారు. ఆస్పత్రులనుంచి వృద్ధాశ్రమాలవరకూ అన్నింటి ఏర్పాటు వెనుకా ఆయన ఉన్నారు. దోచుకోవడం, దాచుకోవడం తప్ప, ప్రజలకు ఇవ్వడం తెలియని నయాకుబేరుల కాలంలో రతన్‌ టాటా ఔన్నత్యం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించడం, రాజకీయపార్టీలతో చేయికలిపి, తమ పెట్టుబడితో వాటిని అధికారంలోకి తెచ్చి ఆశ్రితపెట్టుబడిదారీ తనంతో లబ్ధిపొందడం ఇప్పుడు చూస్తున్నాం. కరోనాకాలంలోనూ సామాన్యులను దోచుకున్న కంపెనీలను, కోట్లు పోగేసుకున్న ఫార్మా యజమానులనూ చూశాం. రతన్‌టాటా వలె పేదల పట్ల ఆదరణతో, బాధ్యతతో వ్యవహరిస్తూ, వారి ఆరోగ్యం గురించి తన జీవితమంతా ఏకరీతిన కృషిచేసినవారు, అంతపట్టింపుతో పనిచేసినవారు అరుదు. ఈశాన్యరాష్ట్రాలపై పాలకులు పెద్దగా దృష్టిపెట్టనికాలంలోనే ఆయన తన విద్యాసంస్థలను అక్కడకు వ్యాపింపచేసి, చాలా రంగాల్లో ఈశాన్య ప్రజల భాగస్వామ్యాన్ని పెంచారు. కాన్సర్‌ ఆస్పత్రులతో సహా పలు వైద్యసంస్థలను నెలకొల్పారు. కొత్తతరం పారిశ్రామికవేత్తల ధనవ్యామోహం, ఆడంబరాలు గమనించినప్పుడు అనాదిగా టాటాల నిరాడంబర జీవన విధానం గుర్తుకొస్తుంది. ఆ వారసత్వానికి తీసిపోనిరీతిలో, మరింత ఉన్నతమైన, ఉదాత్తమైన ప్రవర్తనతో రతన్‌టాటా జీవించారు. ఒక పెద్ద గ్రూప్‌ అధిపతిగా ఉన్నప్పుడూ, లేనప్పుడూ కూడా ఒక కర్మయోగిలాగా వ్యవహరిస్తూ టాటాల పేరును ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచేట్టుచేశారు.

Updated Date - Oct 11 , 2024 | 01:45 AM