ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మణిపూర్‌పై ఇంకా మీన‘మోషా’లేనా?

ABN, Publish Date - Nov 21 , 2024 | 05:30 AM

మణిపూర్‌కు అదనపు సిఆర్‌పిఎఫ్ బలగాలను పంపించడం, అయిదు జిల్లాల్లోని ఆరు పోలీస్ స్టేషన్ల పరిధిలో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని

మణిపూర్‌కు అదనపు సిఆర్‌పిఎఫ్ బలగాలను పంపించడం, అయిదు జిల్లాల్లోని ఆరు పోలీస్ స్టేషన్ల పరిధిలో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (ఎఎఫ్‌ఎస్‌పిఎ) అమల్లో పెట్టడం, ఇంటర్నెట్‌ను నిషేధించడం, ఆందోళనకారులు ఎమ్‌ఎల్‌ఎల ఇళ్లను ధ్వంసం చేయడం జాతీయ విషాదం! ఏడాదిన్నరగా అక్కడ అంతర్యుద్ధం వంటి పరిస్థితులు కొనసాగుతూ ఉండడం దేశ పాలకుల వైఫల్యాన్నే చాటుతున్నది.

బాధిత ప్రజల మనోభావాలను గౌరవించడం, సంయమనంతో కూడిన చర్చల ద్వారా సమస్యను న్యాయమైన పద్ధతిలో పరిష్కరించడం బీజేపీకి బొత్తిగా గిట్టదు. మైదాన ప్రాంతమైన ఇంఫాల్ లోయలో నివసిస్తున్న మెజారిటీ మెయితీలను కూడా ఎస్టీలుగా గుర్తిస్తూ కేంద్రానికి సిఫార్సులు పంపాలని గత సంవత్సరం ఏప్రిల్ 20న మణిపూర్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ఎం.వి. మురళీధరన్ జారీ చేసిన ఉత్తర్వులు గిరిజన తెగ అయిన కుకీలలో తీవ్ర అభద్రతా భావం సృష్టించి వారిని ఆందోళన మార్గం పట్టించింది. హైకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా అఖిల మణిపూర్ గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్రమంతటా నిరసనకు ఇచ్చిన పిలుపు విజయవంతమైంది. ఆ తర్వాత గత ఏడాది మే 3న మెయితీ మూకలు పోలీసుల సహకారంతో కుకీ మహిళలను వివస్త్రలను చేసి హత్యాచారానికి గురి చేశారు, వారి మగవారినీ హతమార్చారు. దానితో ఉభయ వర్గాల మధ్య ఘర్షణలు పెద్ద ఎత్తున చోటు చేసుకున్నాయి. అలా కొనసాగిన హింస వల్ల 250 మందికి పైగా మరణించారు. 60,000 మందికి మించి నిర్వాసితులై పునరావాస శిబిరాల్లో దుర్భరమైన బతుకులు ఈడుస్తున్నారు. రెండు వైపులా గల ఆందోళనకారులు పోలీస్ స్టేషన్లపై దాడులు చేసి ఆయుధాలను పెద్ద సంఖ్యలో ఎత్తుకుపోయారు. ఇది కూడా హింస నిరవధికంగా కొనసాగడానికి దారి తీస్తున్నది.

కొద్ది కాలం నివురు గప్పినట్టున్న మణిపూర్ ఇటీవల తిరిగి వేడెక్కడం మొదలు పెట్టింది. ఈ మధ్యనే పదిమంది కుకీలను మిలిటెంట్లుగా భావించి జిరిబమ్ జిల్లాలోని సిఆర్‌పిఎఫ్‌ దళాలు కాల్చి చంపారు. దానితో కుకీ తెగవారు కోపోద్రిక్తులయ్యారు. వారు మిలిటెంట్లు కాదని, తమ వాలంటీర్లు అని కుకీలు వాదిస్తున్నారు. ఆ తర్వాత ముగ్గురు మెయితీ మహిళల, వారి ముగ్గురి బాలల అపహరణ, హత్య జరిగిపోయాయి. పర్యవసానంగా 2000 మందికి పైగా అదనపు సిఆర్‌పిఎఫ్ దళాలను మణిపూర్‌కి పంపించి, అపరిమిత అధికారాలను సాయుధ దళాలకు కట్టబెడుతున్న ఎఎఫ్‌ఎస్‌పిఎ (AFSPA)ను తిరిగి విధించారు.

2021 జనాభా లెక్కల ప్రకారం మణిపూర్ జనాభాలో 53 నుంచి 60శాతం మంది మెయితీలు, 20 శాతం మంది నాగాలు, 16 శాతం మంది కుకీలు ఉన్నారు. మణిపూర్ భూభాగంలో 89 శాతం కొండ ప్రాంతం ఉంది. ఇది గిరిజన తెగలైన నాగాలు, కుకీలు, తదితరులు నివసిస్తున్న ప్రదేశం. మెజారిటీ మెయితీలు నివసిస్తున్న ఇంఫాల్ లోయ ఉన్నది 11శాతమే. కాని ఆ రాష్ట్ర అభివృద్ధి నిధుల్లో 80 శాతం ఈ లోయకే చెందుతున్నాయి. మిగిలిన 20 శాతం మాత్రమే గిరి ప్రాంతాల్లో ఖర్చవుతున్నది. ఆ విధంగా మెయితీలు పాలకుల ఆదరాభిమానాలకు పాత్రులు అవుతున్నారు. కొండల్లోని తెగలు పాలకుల ఆదరానికి దూరంగా బతుకుతున్న దృశ్యం కనిపిస్తున్నది. 60 మంది సభ్యులున్న శాసనసభలో మెయితీలకు చెందిన మైదాన ప్రాంతం (ఇంఫాల్ లోయ) నుంచి 40 మంది ప్రాతినిధ్యం వహిస్తుండగా, గిరిజన వర్గాల నుంచి ప్రతినిధులు 20 మంది మాత్రమే. మెయితీలు అనుభవిస్తున్న అప్రతిహత ఆధిపత్యం గురించి ఇంతకు మించి వివరించనక్కరలేదు. పైపెచ్చు మెయితీలు హిందువులు. నాగాలు, కుకీలు క్రైస్తవులు.

2022లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో 32 మంది బలంతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. వాస్తవానికి మణిపూర్‌లో పూర్వం నుంచి ఉంటున్నవారు మెయితీలు, నాగాలే. బ్రిటిష్ పాలనలో వచ్చి చేరిన కుకీ తెగవారు కొండల్లో చిన్న చిన్న గ్రామాలు ఏర్పాటు చేసుకొని బతకడం ప్రారంభించారు. ఆ దశలో నాగాలకు, కుకీలకు ఘర్షణలు జరిగాయి. కాని ఇప్పుడు కుకీల ఆందోళనకు నాగాలు మద్దతు ఇస్తున్నారు. నిధుల్లో, అధికారంలో గుత్తాధిపత్యం వహిస్తున్న మెయితీలకు ఎస్టీ గుర్తింపు లభిస్తే తమకు తీవ్ర నష్టం జరుగుతుందని, మజ్జిగ పలచబడి మరింత అన్యాయానికి గురి అవుతామనే అవగాహనతో, చైతన్యంతో కుకీల మాదిరిగానే నాగాలు కూడా భయపడుతున్నారు. సమష్టి ఆందోళనకు సహకరిస్తున్నారు.

తాత్కాలిక దృష్టితో చూసినప్పుడు కుకీలను తీవ్రంగా ద్వేషిస్తూ వారిని తక్కువ చూపు చూస్తున్న బీజేపీ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఈ సంక్షోభ విస్తరణకు తక్షణ బాధ్యుడని బోధపడుతున్నది. కుకీలు బయటి నుంచి వచ్చారని, గంజాయి సాగు చేస్తారని... ఇలా పలు రకాల ద్వేష భాషను ముఖ్యమంత్రి వారిపై ప్రయోగించారు. వాస్తవానికి మణిపూర్‌లోని అన్ని వర్గాలు గంజాయి సాగు చేస్తాయని, కానీ కుకీలను మాత్రమే వేలెత్తిచూపడం అలవాటుగా మారిందని అభిప్రాయం ఉన్నది. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ 19మంది బీజేపీ శాసనసభ్యులు ప్రధాని మోదీకి ఇటీవలనే లేఖ రాశారు. అయినా కేంద్రంలో చలనం లేదు. ఇప్పుడు తాజా కల్లోల పరిస్థితుల నేపథ్యంలో బీరేన్ సింగ్ ప్రభుత్వానికి రెండు భాగస్వామ్య పక్షాలు మద్దతు ఉపసంహరించుకున్నాయి.

1948–49లో మణిపూర్ భారతదేశంలో విలీనం కాకముందు తాము ఎస్టీలమని ఆ హోదాను తమకు తిరిగి ఇవ్వాలని మెయితీలు వాదిస్తున్నారు. మణిపూర్ విలీనం తర్వాత తమకు ఆదివాసీ హోదా కొనసాగించక పోడానికి కారణం తాము మైదాన ప్రాంతీయులుగా సకల సౌకర్యాలు కలిగి ఉన్నందువల్లనే అనే వాస్తవాన్ని పూర్తిగా తెలిసి కూడా వారు ఎస్టీ హోదాను ఆశించడం తగనిది. గత మే 3వ తేదీ నాటికి అంటే కల్లోలం మొదలై ఏడాది ముగిసినప్పటికీ ఘర్షణల్లో 221 మంది మరణించగా ఈ సంఖ్య ఇప్పుడు 250కి మించినట్టు రూఢి అవుతున్నది. అన్నింటికీ మించి ఇంతగా భిన్న వర్గాల ప్రజల మధ్య ఘర్షణలు, మారణకాండ జరుగుతూ, అమాయకులు నిర్వాసితులు అవుతుంటే దేశ ప్రధానమంత్రి ఆ రాష్ట్రాన్ని సందర్శించకపోడం, పార్లమెంటులో దీని గురించి వివరంగా మాట్లాడకపోడం బాధితులకు పుండు మీద కారం చల్లినట్టు ఉంది. తమకు ప్రత్యేక పాలన వ్యవస్థను, శాసనసభను ఏర్పాటు చేయాలని కుకీలు కోరుతున్నారు.

మణిపూర్‌లో ఇంకా వలస పాలనే కొనసాగుతున్నదని, భారత చరిత్ర పాఠ్య గ్రంథాలలో ఈశాన్యానికి తగిన ప్రాతినిధ్యం లేదని, అందుచేతనే ఆ ప్రాంత ప్రజలు బయటివారుగా పరిగణన పొందుతున్నారని, తమ సంక్షోభంపై కేంద్రం పాటిస్తున్న మౌనానికి ఇదే కారణమని మణిపూర్ ఎంపీ బిమల్ అకోయిజం పార్లమెంటులోనే ప్రకటించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై గత జూలై మొదటివారంలో ఆ రోజు చిట్టచివరి వక్తగా ఆయనకు మాట్లాడే అవకాశం రాత్రి 11.45కి దక్కడాన్ని బట్టి మణిపూర్ సంక్షోభం పట్ల కేంద్రానికి గల నిర్లక్ష్యం రుజువు అవుతున్నది. పార్లమెంటు సంయుక్త సమావేశాలను ఉద్దేశిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగంలో సుదీర్ఘ మణిపూర్ కల్లోలం ప్రసక్తి లేకపోడాన్ని కూడా బిమల్ అకోయిజం ఎత్తి చూపారు. మణిపూర్‌లో ఏడాదిన్నరకు పైగా అంతర్యుద్ధం సాగుతుండగా ప్రధాని నోరువిప్పి దానిపై ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని, ఆయన తన మౌనవ్రతం వీడితే తాను మాట్లాడడం ఆపేస్తానని బిమల్‌ అన్నారు.


మణిపూర్ ఏమైపోయినా ఫర్వాలేదు మెజారిటీ ఓటు తమవైపు ఉండాలి, హిందువుల వైపు నిలబడ్డామనే సంకేతాన్ని పంపాలి అని కేంద్రంలోని బీజేపీ ‘ప్రభువులు’ నిర్ణయించుకొన్నారని మనం భావించాలి. సమస్య అంతర్గతంగా భిన్న వర్గాల ప్రజల మధ్య హెచ్చు తగ్గుల ఘర్షణలకు చెందినది అయితే, దృష్టిని సరిహద్దు వైపు మళ్ళించి బయటినుంచి చొచ్చుకు వస్తున్నవారిని నిరోధించడమే పరిష్కారమనే అభిప్రాయాన్ని కలిగించడానికి హోం మంత్రి అమిత్ షా ప్రయత్నిస్తున్నారు. మయన్మార్‌తో గల 1500కి.మీ. సరిహద్దు పొడుగునా కంచె నిర్మించే ప్రణాళికను ప్రకటించారు. సరిహద్దులకు ఆవలి ఈవలి వారు స్వేచ్ఛగా గీత దాటడానికి అవకాశమిస్తూ గతంలో ఇండియా, మయన్మార్ల మధ్య కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేసే ఉద్దేశాన్నీ వెలిబుచ్చారు. మణిపూర్‌కి భౌగోళికంగా విశేష ప్రాధాన్యముంది. మయన్మార్‌తో సరిహద్దులు ఆగ్నేయాసియాతో సంబంధాలకు ఇండియాకు ముఖద్వారం వంటివి. మయన్మార్‌తో చైనా సాన్నిహిత్యం పెరుగుతున్న నేపథ్యంలో దాని జోరుకు కళ్లెం వేయవలసి ఉంది. అందుకోసం మణిపూర్‌లో శాంతికి అమిత ప్రాధాన్యముంది. మయన్మార్‌తో సరిహద్దుల మూసివేత ఇందుకు విఘాతం కలిగించవచ్చు.

ఒకటి రెండుసార్లు మణిపూర్‌కి చెందిన మెయితీ, కుకీ, నాగా ఎమ్మెల్యేలతో కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన చర్చలు ఫలించలేదు. ఆందోళన రెండు వర్గాల్లోని ప్రజానీకంలోకి, ముఖ్యంగా యువతలోకి చొచ్చుకుపోయింది. ఎమ్మెల్యేల పలుకుబడి అంతరించిపోయింది. ప్రజలు వారిని విశ్వసించడం మానేశారు. ఇప్పుడిక ఇది మీన ‘మో–షా’లు లెక్కబెట్టే పరిస్థితి కాదు. బీరేన్ సింగ్ ప్రభుత్వాన్ని తక్షణం తొలగించాలి. తాత్కాలికంగానైనా రాష్ట్రపతి పాలన విధించాలి. బరువు బాధ్యతలు బలగాల మీద వదిలి ప్రధానమంత్రి విదేశీ పర్యటనలు చిత్తగించడం మేలు చేయదు. వీలయితే స్వయంగా అఖిలపక్షాన్ని తోడ్కొని మోదీ మణిపూర్‌ను సందర్శించాలి. ఒక్క మణిపూర్‌నే కాదు, దూరంగా విసిరేసినట్టున్న మొత్తం ఈశాన్య ప్రాంతాన్ని మరింత సమ్మిళిత దృష్టితో చూడడడం దేశానికి శ్రేయస్కరం.

మణిపూర్‌లో ఇంతగా భిన్న వర్గాల ప్రజల మధ్య ఘర్షణలు, మారణకాండ జరుగుతూ, అమాయకులు నిర్వాసితులు అవుతుంటే దేశ ప్రధానమంత్రి ఆ రాష్ట్రాన్ని సందర్శించకపోడం, పార్లమెంటులో దీని గురించి వివరంగా మాట్లాడకపోవడం బాధితులకు పుండు మీద కారం చల్లినట్టు ఉంది. మణిపూర్ ఏమైపోయినా ఫర్వాలేదు మెజారిటీ ఓటు తమవైపు ఉండాలి, హిందువుల వైపు నిలబడ్డామనే సంకేతాన్ని పంపాలి అని కేంద్రంలోని బీజేపీ ‘ప్రభువులు’ నిర్ణయించుకొన్నారని మనం భావించాలి.

n జి. శ్రీరామమూర్తి

సీనియర్‌ జర్నలిస్ట్‌

Updated Date - Nov 21 , 2024 | 05:30 AM