ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అతివృష్టి... అనావృష్టి...

ABN, Publish Date - Jul 04 , 2024 | 04:19 AM

గత రెండేళ్లుగా ఆలస్యంగా వస్తున్న నైరుతీ రుతుపవనాలు ఈ ఏడాది చాలా త్వరగా వచ్చాయి. వర్షాలు సమృద్ధిగా పడతాయని అందరూ ఆశించారు. కానీ జూన్‌లో ఆశించిన మేర వర్షాలు కురవలేదు...

గత రెండేళ్లుగా ఆలస్యంగా వస్తున్న నైరుతీ రుతుపవనాలు ఈ ఏడాది చాలా త్వరగా వచ్చాయి. వర్షాలు సమృద్ధిగా పడతాయని అందరూ ఆశించారు. కానీ జూన్‌లో ఆశించిన మేర వర్షాలు కురవలేదు. దేశవ్యాప్తంగా జూన్‌లో వర్షపాతం సాధారణంతో పోలిస్తే 11 శాతం తక్కువగా ఉందని తాజా గణాంకాలు చెబుతున్నాయి. అయితే వర్షపాతం లోటు కంటే వివిధ ప్రాంతాల్లో వర్షపాత స్థాయిల్లో ఉన్న భారీ వ్యత్యాసాలు ఎక్కువగా కలవరపెడుతున్నాయి. దేశంలో 49 శాతం జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. వాటిలో 18 శాతం జిల్లాల్లో వర్షపాతం లోటు 60 శాతానికి పైగా ఉంది. అయితే ఇదే సమయంలో కొన్ని ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి. జూన్‌లో వర్షాలు తక్కువగా ఉండే లద్దాఖ్‌ ప్రాంతంలో ఈసారి సాధారణం కంటే 385 శాతం ఎక్కువగా వర్షపాతం నమోదైంది. మొన్నటిదాకా తీవ్రమైన కరువుతో నీటి ఎద్దడిని ఎదుర్కొన్న రాజధాని ఢిల్లీ ఇప్పుడు వరదలతో అతలాకుతలమవుతోంది. సాధారణంగా మంచి వర్షాలు పడే కేరళలో ఈ ఏడాది 25 శాతం లోటు కనిపిస్తోంది.


మొన్న వేసవిలో భారతదేశం గత వందేళ్లలో ఎన్నడూ ఎరుగనంత తీవ్రమైన ఎండల్ని చవిచూసింది. అనేక ప్రాంతాల్లో 50 డిగ్రీలు దాటిన రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడగాడ్పుల వల్ల వందల మంది ప్రాణాలు కోల్పోయారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఢిల్లీ, బెంగళూరు సహా అనేక ప్రాంతాల్లో నీటి ఎద్దడి తీవ్ర స్థాయికి చేరింది. ఇప్పుడు వర్షాకాలం వచ్చినా కొన్ని చోట్ల అతివృష్టి, కొన్నిచోట్ల అనావృష్టి కనిపిస్తున్నాయి. భూగోళం వేడెక్కడం, తద్వారా వస్తున్న వాతావరణ మార్పుల వల్లే ఈ వైపరీత్యాలు సంభవిస్తున్నాయని నేడు సామాన్య ప్రజలకు కూడా అర్థమవుతోంది. కానీ తాజా లోక్‌సభ ఎన్నికల్లో గ్లోబల్‌ వార్మింగ్‌, వాతావరణ మార్పులపై రాజకీయ పార్టీల్లోగానీ, సామాన్య ప్రజల్లోగానీ ఎలాంటి చర్చ జరగలేదు. న్యూజిలాండ్‌లోను, కొన్ని ఐరోపా దేశాల్లోను పర్యావరణ సమస్యలు ఎన్నికల్లో ప్రధానాంశాలు అవుతుంటాయి. పర్యావరణపరంగా యాభై, అరవై ఏళ్ల తర్వాత జరగబోయే పరిణామాలు కూడా ఎన్నికల రాజకీయాల్లో చర్చకు వస్తుంటాయి. కానీ మన ఎన్నికలు మాత్రం ఎక్కువగా మతపరమైన, కులపరమైన అంశాల చుట్టే తిరిగాయి. బహిరంగ సభల్లో, రోడ్‌ షోల్లో వాతావరణ మార్పుల ఊసే ఎక్కడా వినిపించలేదు.


భారతదేశానికి మూడు వైపుల సముద్రం, ఒకవైపు హిమాలయాలు ఉన్నాయి. ఈ కారణంగా వాతావరణ మార్పులతో మన దేశం అత్యధిక నష్టాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉంది. భూగోళం వేడెక్కడం వల్ల సముద్ర మట్టాలు పెరుగుతాయి. దానివల్ల తీర ప్రాంతాల్లో వ్యవసాయ భూములు సాగు యోగ్యం కాకుండా పోతాయి. తాగునీటి సమస్య ఏర్పడుతుంది. డయేరియా, కలరా వంటి వ్యాధులు ప్రబలుతాయి. హిమానీనదాలు కరిగిపోవడం వల్ల సింధు, బ్రహ్మపుత్ర నదులు ఉగ్రరూపం దాల్చి వరదలతో ముంచెత్తుతాయి. తీవ్రమైన కరవులు, లేదంటే తీవ్రమైన వరదలు ఏర్పడతాయి. ఈ రకమైన వాతావరణాన్ని మనం ఇప్పటికే చవిచూస్తున్నాం. గత ఏడాది కాలంలో దేశంలోని 90 శాతం ప్రాంతాల్లో ఇటువంటి విపరీతపు వాతావరణ పోకడలు కనిపించాయని ఢిల్లీకి చెందిన సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ తన తాజా నివేదికలో తెలిపింది. అయినా మన ఎన్నికల రాజకీయాల్లో ఇవి చర్చనీయాంశాలు కాలేదు.

ప్రధాన జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు రెండూ తమ మేనిఫెస్టోల్లో గ్లోబల్‌ వార్మింగ్‌, వాతావరణ మార్పుల గురించి కొంత ప్రస్తావించాయి. శిలాజేతర ఇంధనాల వాడకం ఇప్పటికే 44 శాతం ఉందని, దీనిని మరింత పెంచుతామని ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ తన మేనిఫెస్టోలో తెలిపింది. 500 గిగావాట్ల పునర్వినియోగ ఇంధన ఉత్పత్తి తమ లక్ష్యమని చెప్పింది. కానీ అందుకు ఎలాంటి గడువునూ పేర్కొనలేదు. కాలుష్యాన్ని అరికట్టడం కోసం విద్యుత్‌ వాహనాలను విరివిగా వాడుకలోకి తెస్తామన్నది కానీ థర్మల్‌ విద్యుదుత్పత్తి ద్వారా ఏర్పడే కాలుష్యం గురించి మాట్లాడలేదు. దేశంలో బొగ్గు వినియోగం నానాటికీ పెరుగుతూనే ఉంది. 2023లో భారత్‌లో బొగ్గు వినియోగం మొత్తం ఉత్తర అమెరికా, ఐరోపాల వినియోగం కంటే ఎక్కువగా ఉంది.


గ్లోబల్‌ వార్మింగ్‌ను, వాతావరణ మార్పుల్ని అడ్డుకోవడానికి ప్రభుత్వాలు భవిష్యత్తులో భారీఎత్తున చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి చర్యలకు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది. రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ఆయా అంశాలను ప్రజల్లో చర్చకు పెట్టకపోతే, వాటికి పరిష్కారాలను ఆలోచించకపోతే, వాటిపై ప్రజల్లో ఏకాభిప్రాయాన్ని నిర్మించకపోతే రేపు ఎలాంటి దిద్దుబాటు చర్యలైనా తీసుకోవడం చాలా కష్టమవుతుంది. కానీ మన పార్టీల్లో ఆ అవగాహన కానీ, ఆసక్తి గానీ కనిపించకపోవడం విచారకరం. ప్రకృతి వైపరీత్యాల అతివృష్టిని రాజకీయ శ్రద్ధాసక్తుల అనావృష్టితో ఎదుర్కోవడం అసంభవం.

Updated Date - Jul 04 , 2024 | 10:36 AM

Advertising
Advertising