ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కోటా కలహంలో బంగ్లా

ABN, Publish Date - Jul 25 , 2024 | 05:44 AM

పదిరోజులపాటు తీవ్ర హింసనీ, రక్తపాతాన్ని చవిచూసిన బంగ్లాదేశ్‌ ప్రస్తుతం కర్ఫ్యూ కారణంగా నివురుగప్పిన నిప్పులాగా ఉంది. మళ్ళీ అగ్గిరాజుకుంటుందో, ప్రశాంతతనెలకొంటుందో ఇప్పుడే చెప్పలేం కానీ...

పదిరోజులపాటు తీవ్ర హింసనీ, రక్తపాతాన్ని చవిచూసిన బంగ్లాదేశ్‌ ప్రస్తుతం కర్ఫ్యూ కారణంగా నివురుగప్పిన నిప్పులాగా ఉంది. మళ్ళీ అగ్గిరాజుకుంటుందో, ప్రశాంతతనెలకొంటుందో ఇప్పుడే చెప్పలేం కానీ, రిజర్వేషన్ల రద్దుకోసం పోరాడిన యువకులమీద పోలీసులు, మిలటరీ అమానుషంగా విరుచుకుపడిన ఆ దృశ్యాలు మనసు కలిచివేస్తాయి. దాదాపు రెండువందలమంది యువకులు మరణించారు, వేలాదిమంది తీవ్రంగా గాయపడ్డారు. భద్రతాదళాలు అంత అరాచకంగా వ్యవహరించడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

బంగ్లాదేశ్‌ స్వాతంత్ర్యపోరాటంలో ప్రాణత్యాగం చేసినవారి కుటుంబీకులకు ప్రభుత్వోద్యోగాల్లో ముప్పైశాతం కోటానిచ్చే అంశం తిరిగి తెరమీదకు రావడం ఈ రక్తపాతానికి ప్రధాన కారణం. ఆరేళ్ళక్రితం ఇదే తరహా ఉద్యమాలవల్ల ఆ విధానాన్ని నిలుపుదలచేసిన హసీనా, ఇటీవల హైకోర్టు తీర్పు మేరకు మళ్ళీ దానిని పునరుద్ధరించేందుకు సిద్ధపడుతూండటంతో విద్యార్థులు రగిలిపోయారు. పాత రిజర్వేషన్‌ వ్యవస్థను పునరుద్ధరించమంటూ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు వెనుక హసీనా హస్తం ఉన్నదని వారు పరిపూర్ణంగా విశ్వసించారు. మిగతా రిజర్వేషన్లన్నీ కలుపుకుంటే యాభైఆరుశాతాన్ని దాటిపోయి, ఓపెన్‌ కాంపిటేషన్‌లో దక్కే ఉద్యోగాలు కుంచించుకుపోతాయి కనుక, విద్యార్థిలోకం ఈ కోటాకు వ్యతిరేకంగా తీవ్రంగా పోరాడింది. ఉద్యమం యూనివర్సిటీలను దాటి అన్ని నగరాలకు విస్తరించింది.


భద్రతాదళాలన్నీ ఏకమై విరుచుకుపడినా ప్రాణాలకు వెరవకుండా, తోటివారు కళ్ళముందే పిట్టల్లారాలిపోతున్నా జడవకుండా యువత పోరాడింది. దేశ స్వాతంత్ర్యపోరాటంలో ప్రాణత్యాగాలు చేసినవారి కుటుంబీకులను ఈ రీతిన ఆదుకోవాల్సిన బాధ్యత సమాజం మీద ఉన్నదని ప్రధాని షేక్‌ హసీనా వాదన సముచితమైనదే. ఆమె తండ్రి ముజబూర్‌ రహ్మాన్‌ నాయకత్వంలో, పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా, బంగ్లాదేశ్‌ సాగించిన విముక్తి పోరాటంలో లక్షలాదిమంది మరణించారు, వేలాదిమంది స్త్రీలు అత్యాచారాలకు గురైనారు. పాకిస్థాన్‌ సైన్యమూ, దానికి అండగా నిలిచిన శక్తులు కలసిచేసిన అకృత్యాలకు అంతేలేదు. చివరకు భారతసైన్యం ప్రవేశంతో కానీ తూర్పుపాకిస్థాన్‌కు విముక్తి దక్కలేదు. ఈ నేపథ్యంలో, స్వాతంత్ర్యానంతరం 1972నుంచి బంగ్లాదేశ్‌లో ఈ కోటా విధానం అమలులోకి వచ్చింది. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా పోరాడిందీ, ప్రాణాలు కోల్పోయిందీ ముజబూర్‌ రహ్మాన్‌ సారథ్యంలోని శక్తులే కనుక, ఈ కోటా విధానం ఆయన అనుచరణగణానికీ, పార్టీకే మేలుచేసిందన్న విమర్శలు సహజం.

ఈ కోటాద్వారా ప్రభుత్వంలోని సమస్తవ్యవస్థల్లోనూ అవామీలీగ్‌ మనుషులు తిష్టవేశారని విపక్షనేతల విమర్శ. నిజానిజాలు అటుంచితే, ఇప్పటి విద్యార్థి ఉద్యమానికి విపక్ష బంగ్లాదేశ్‌ నేషనలిస్టు పార్టీ మద్దతు ఇచ్చినంత మాత్రాన, కోటాకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నవారినంతా రజాకార్లుగా హసీనా అభివర్ణించడం ఉద్రిక్తతలను పెంచింది. పాకిస్థాన్‌తో అంటకాగి, తూర్పుపాకిస్థాన్‌లో స్థానికులపై అఘాయిత్యాలకు, ఊచకోతలకు కారకులైన రజాకార్ల పేరిట ఈ విమర్శలు చేయడం వారికీ, ప్రభుత్వానికీ మధ్య అగాధాన్ని పెంచింది. దీనికితోడు, హసీనా ప్రభుత్వాన్ని ఎన్నికలతో సహా సమస్త సందర్భాల్లోనూ కంటికిరెప్పలాగా కాపాడుకొచ్చే అవామీలీగ్‌ విద్యార్థివిభాగం కూడా ఈ సందర్భంలో సైనికబలగాలతో కలసి విద్యార్థులపై దాడులు సాగించింది.


ఈ తీవ్ర ఉద్రిక్త వాతావరణంలో, స్వాతంత్ర్యసమరయోధుల కోటాను 5శాతానికీ, మొత్తం రిజర్వేషన్లన్నీ ఏడుశాతానికీ పరిమితం చేస్తూ ఆదివారంనాడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కోటా వ్యతిరేక విద్యార్థి ఉద్యమకారులకు అమితబలాన్నిచ్చింది. కానీ, హసీనా ప్రభుత్వం ఈ ఆదేశాలను వమ్ముచేయడానికి ప్రయత్నిస్తుందన్న అనుమానం వారిని ఇంకా వెంటాడుతోంది. ఈ కొత్త రిజర్వేషన్ల విధానాన్ని యథాతథంగా అమలులోకి తెచ్చేవరకూ పోరాటాన్ని ముగించబోమని, తాత్కాలికంగా నిలుపుదలచేస్తామని వారు ప్రకటించారు. హసీనా ప్రభుత్వం కూడా ఈ వ్యవహారాన్ని సాగదీయకుండా తక్షణమే పరిష్కరించడం సముచితం. బంగ్లాదేశ్‌లో ప్రతీ ఉద్యమంలోనూ, ప్రజాపోరాటాల్లోనూ విపక్ష బీఎన్పీతో పాటు దానికి మద్దతునిచ్చే ఇస్లామిక్‌ శక్తులు చేరడం, ప్రతిగా హసీనా తీవ్రంగా విరుచుకుపడటంతో అవి హింసాయుతంగా మారిపోతున్నాయి. హసీనా అభద్రత, పరిస్థితి తెలిసిందే కానీ, వరుసగా నాలుగుసార్లు గెలిచి, ఇటీవలే ఐదోసారి ప్రధాని అయిన ఆమె ఇంకా అదే అణచివేత ధోరణితో, అమానుషంగా వ్యవహరిస్తూ తీవ్రమైన అప్రదిష్ట మూటగట్టుకుంటున్నారు.

Updated Date - Jul 25 , 2024 | 05:44 AM

Advertising
Advertising
<