ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బైడెన్‌ చిచ్చు

ABN, Publish Date - Nov 21 , 2024 | 05:19 AM

అలా ఓడిపోయి, ఇక దిగిపోబోతున్న తరుణంలో, డోనాల్డ్‌ ట్రంప్‌కు ఇంత సెగపెట్టిపోవాలన్న ఆలోచన జో బైడెన్‌కు ఎందుకు కలిగిందో మరి. అమెరికా తయారీ లాంగ్‌రేంజ్‌ మిసైల్స్‌ను రష్యన్‌ భూభాగాలమీద

అలా ఓడిపోయి, ఇక దిగిపోబోతున్న తరుణంలో, డోనాల్డ్‌ ట్రంప్‌కు ఇంత సెగపెట్టిపోవాలన్న ఆలోచన జో బైడెన్‌కు ఎందుకు కలిగిందో మరి. అమెరికా తయారీ లాంగ్‌రేంజ్‌ మిసైల్స్‌ను రష్యన్‌ భూభాగాలమీద ప్రయోగించడానికి ఆయన అనుమతించిన కొద్దిగంటల్లోనే ఉక్రెయిన్‌ ఆ దుశ్చర్యకు పాల్పడింది. రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధానికి వెయ్యిరోజులు అవుతున్న సందర్భంలో బైడెన్‌ తీసుకున్న ఈ దూకుడు నిర్ణయం దాని దిశనూ తీవ్రతనూ ఒక్కసారిగా మార్చివేసింది. ఉక్రెయిన్‌పై రష్యా ప్రతిదాడి ఏ స్థాయిలో ఉంటుందో ఊహకు అందని పాశ్చాత్యదేశాలన్నీ అమెరికా బాటలో నడచి ఉక్రెయిన్‌ రాజధానిలో తమ రాయబార కార్యాలయాలను మూసేస్తున్నాయి. అణ్వాయుధాల వినియోగానికి అనుమతించే నిబంధనలను మరింత సులభం చేసుకొని, రష్యా అధ్యక్షుడు తన అమ్ములపొదిని చక్కదిద్దుకోవడం పరిస్థితిని వేడెక్కిస్తోంది. యుద్ధం మొదలైనప్పటినుంచి ఉక్రెయిన్‌కు ఆర్థిక, ఆయుధ సాయంతో అండగా ఉంటున్న బైడెన్‌, యుద్ధం ముగిసేవరకూ అలాగే నిలవాలనుకోవడంలో తప్పులేదు. ఆయన అధికారంలో కొనసాగితే వేరే విషయం. కానీ, అమెరికన్లు ఆయన పార్టీని ఓడించి, ప్రత్యర్థిని అధికారంలో కూచోబెడుతున్నప్పుడు, ఆఖరురోజుల్లో ఇలా అడ్డుతోవలు తొక్కడం నైతికంగా సరికాదు.

ట్రంప్‌ వచ్చేలోగా మరో రెండునెలలపాటు మంటలు రాజేయాలన్నది బైడెన్‌ ఆలోచనగా కనిపిస్తోంది. కమలాహారిస్ ఓటమి వెనుక ఉక్రెయిన్‌ యుద్ధం ఉన్నదో లేదో కానీ, ఆ యుద్ధాన్ని సత్వరమే ముగిస్తానన్న హామీ ట్రంప్‌ విజయంలో ఒక ముఖ్యమైన అంశం. యుద్ధం వెయ్యిరోజులకు చేరువవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఇటీవలే జర్మనీ సహా చాలా దేశాలు అది సత్వరమే ముగిసిపోవాలన్న ఆశాభావాన్ని వెలిబుచ్చాయి. వచ్చే ఏడాది తొలినాళ్ళలోనే దౌత్యంతో యుద్ధాన్ని ముగిసేట్టు చేయవచ్చునని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు సైతం వ్యాఖ్యానించాడు. యుద్ధం ముగిసిపోవాలన్న వాదనలు ఎప్పటినుంచో ఉన్నా, ఇప్పుడు అవి గట్టిగా వినబడటానికీ, జోరందుకోవడానికీ ప్రధాన కారణం ట్రంప్‌ విజయం. ఆయన గాజా యుద్ధం ఆపుతాడన్న ఆశ ఎవరికీ లేదుగానీ, పుతిన్‌ కోసమే కావచ్చు, ఉక్రెయిన్‌ యుద్ధాన్ని నిలువరిస్తాడన్న నమ్మకం మాత్రం అందరికీ ఉంది. తాను అధికారంలోకి వస్తే ఉక్రెయిన్‌కు ఇప్పటిలాగా అడ్డూఅదుపూ లేని ఆయుధసరఫరాలు ఉండబోవని ట్రంప్‌ ఇప్పటికే తేల్చేశాడు. యుద్ధాన్ని ముగించే ప్రణాళిక ఆయన వద్ద సిద్ధంగా ఉన్నదని ప్రచారం కూడా జరుగుతోంది. నాటోతో ఏ బాంధవ్యాలు, బాదరబందీలు లేనివాడు కాబట్టి, ఉక్రెయిన్‌ అన్నా, జెలెన్‌స్కీ అన్నా విశేషమైన ప్రేమాభిమానాలేమీ లేవు కనుక, పుతిన్‌ పక్షాన న్యాయనిర్ణయం చేస్తాడన్న వాదనలు బలంగా ఉన్నాయి.


ఉక్రెయిన్‌ను అడ్డుపెట్టుకొని రష్యామీద కక్ష తీర్చుకోవాలన్న కోరిక లేకుంటే ఈ యుద్ధం నిజానికి ఎప్పుడో ఆగిపోవాలి. రెండేళ్ళక్రితం కొన్ని కీలకమైన భూభాగాలు కోల్పోయిన ఉక్రెయిన్‌కు, ఇప్పుడు అది ఉన్నస్థితికీ తేడావుంది. ఆయుధసరఫరాలు నిరవధికంగా కొనసాగుతుంటే ఏ యుద్ధమూ ఆగదు. ఇజ్రాయెల్‌ విషయంలో మరింత అధికంగా జరుగుతున్నది ఇదే. అమెరికా అందించిన ఆయుధాలతో అది ఏకకాలంలో అనేకమంది శత్రువులతో యుద్ధం చేయగలుగుతోంది, వేలాదిమందిని ఊచకోతలు కోస్తోంది, పొరుగుదేశాల్లోకి చొచ్చుకుపోతోంది. ఉక్రెయిన్‌ యుద్ధంలో అటువైపు అణ్వాయుధాలున్న రష్యా ఉన్నందున, ఆయుధాల వినియోగం మీద అమెరికా ఇంతకాలమూ కొన్ని నియంత్రణలు పెట్టింది. ఇప్పుడు ఆ నిబంధనలకు స్వస్తిచెప్పి, రష్యా భాషలో చెప్పాలంటే, మూడోప్రపంచయుద్ధానికి బైడెన్‌ స్వాగతం పలుకుతున్నారు. తాను దిగేలోగా, రేపు ట్రంప్‌కు పరిష్కారం సాధ్యంకాని స్థాయికి యుద్ధాన్ని తీసుకుపోవాలనీ, దౌత్యాలు, చర్చలు, ఇచ్చిపుచ్చుకోవడాలకు వీల్లేనిరీతిలో చిక్కుముళ్ళువేసిపోవాలనీ ఆయన అనుకుంటున్నారు. యుద్ధంతో ఇప్పటికే ఉక్రెయిన్‌ తీవ్రంగా నష్టపోయింది. రష్యాదాడుల్లో సర్వమూ నేలమట్టమై, నాలుగోవంతు జనాభాను కోల్పోయి, ఆర్థికంగా తేరుకోలేనిదశకు చేరుకుంది. పునర్నిర్మాణానికి ఐదువందలబిలియన్‌ డాలర్లు ఖర్చవుతాయన్నది ఎప్పుడో వేసిన అంచనా. ఇందుకు భిన్నంగా, ఆంక్షలతో మరింత లాభపడి, ఆర్థికంగా ఏ సమస్యలూ లేని రష్యా మరింతమంది సైనికులను బలిపెట్టడానికి సిద్ధంగా ఉంది. యుద్ధం తీవ్రమైతే అపారనష్టాలకు గురికావాల్సిన ఐరోపాదేశాలు తక్షణమే రంగంలోకి దిగి, రష్యాతో చర్చలు జరిపి, నిర్దిష్టమైన హామీలతో దానిని చల్లార్చాల్సిన అవసరం ఉంది.

Updated Date - Nov 21 , 2024 | 05:19 AM