ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మార్పు మంచిదే..!

ABN, Publish Date - Oct 10 , 2024 | 04:35 AM

మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్‌ ముయిజ్జు భారత పర్యటనతో ఉభయదేశాల మధ్యా ఇటీవలికాలంలో పెరిగిన దూరం ఇకపైన తగ్గవచ్చు. ఈ పర్యటన సందర్భంలో భారత ప్రధాన మీడియా ఓమారు గతాన్ని...

మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్‌ ముయిజ్జు భారత పర్యటనతో ఉభయదేశాల మధ్యా ఇటీవలికాలంలో పెరిగిన దూరం ఇకపైన తగ్గవచ్చు. ఈ పర్యటన సందర్భంలో భారత ప్రధాన మీడియా ఓమారు గతాన్ని స్మరించుకోకుండా ఉండలేకపోతున్నది. ఇండియా అవుట్‌ నినాదంతో ఎన్నికల్లో గెలిచి, ఆ తరువాత భారత్‌ భద్రతకే సమస్యాత్మకమైన నిర్ణయాలు తీసుకొని, అనుచితంగా ప్రవర్తించిన ముయిజ్జుకు, ఇప్పుడు మన ‌ సాయం కావాల్సివచ్చిందా? అంటూ చాలా విమర్శలు వినబడుతున్నాయి. ఆయన ఆర్థికావసరాల మాట అటుంచితే, దశాబ్దాలుగా మనకు ఎంతో సన్నిహితంగా ఉంటూ, వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన మాల్దీవులను ఎవరికారణంగానో దూరం చేసుకోవడమన్నది సరైనది కాదు. ఎన్నిపొరపొచ్చాలు వచ్చినా అనాదిగా మన పాలకులు చుట్టుపక్కల దేశాలతో అనుసరిస్తున్న విధానమే అది.


మొన్న జూన్‌లో నరేంద్రమోదీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కార్యక్రమానికి మొయిజ్జు వచ్చినప్పటికీ, అధ్యక్షహోదాలో భారతదేశంలో తొలి అధికారిక పర్యటన ఇదే. బాధ్యతలు స్వీకరించిన తరువాత భారత్‌లో పర్యటించే సంప్రదాయాన్ని పక్కనబెట్టి ఆయన ఈ ఏడాది జనవరిలో తుర్కియే, చైనా వెళ్ళివచ్చారు. చైనాకు మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నించారు. రెండుదేశాలదీ రక్తసంబంధం అన్నంత స్థాయిలో వ్యాఖ్యలు చేశారు, భారీ పెట్టుబడులు పెట్టాలనీ, ఆర్థికంగా ఆదుకోవాలనీ, చైనానుంచి టూరిస్టులు కుప్పలుతెప్పలుగా రావాలని చాలా కోరికలు కోరారు. ఆ పర్యటన ద్వారా తాను భారత్‌ను ఖాతరుచేయడం లేదని చెప్పడం ఆయన ఉద్దేశం కావచ్చు. ఆయన అక్కడ ఉండగానే మాల్దీవులకు చెందిన కొందరు మంత్రులు భారతప్రధానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, భారత ప్రధాని నరేంద్రమోదీ లక్షద్వీప్‌ పర్యటన, మనదేశంలోని ప్రముఖులు బాయ్‌కాట్‌ మాల్దీవ్స్‌ అంటూ పిలుపునివ్వడం వంటివి కూడా రెండుదేశాల మధ్యా దూరం పెంచాయి. తమదేశంలో ఉన్న 80మంది భారత సైనికులస్థానంలో సాంకేతిక నిపుణులను నియమించేవరకూ మాల్దీవులు పట్టువిడవలేదు. భారత్‌ చేపడుతున్న హైడ్రోగ్రాఫిక్స్ సర్వేను రద్దుచేయడం, చైనా పరిశోధనా నౌకను అనుమతించడం వంటివి అగ్గికి ఆజ్యం పోశాయి.


ఈ నేపథ్యంలో, రెండు దేశాలూ ఇటీవల తమ దౌత్యసంబంధాలకు అతుకువేసే ప్రయత్నం విశేషంగా చేశాయి. ఆగస్టులో విదేశాంగమంత్రి జయశంకర్‌ మాల్దీవుల పర్యటన, సెప్టెంబరులో ముయిజ్జు అమెరికాలో విలేకరులతో తాను భారతవ్యతిరేకిని కానంటూ చేసిన వ్యాఖ్యలు వాతావరణాన్ని మార్చాయి. ఆహారం సహా చాలా అవసరాలకు మాల్దీవులు భారత్‌మీద ఆధారపడాల్సిందే. అవసరాలు తీర్చడమే కాదు, కష్టకాలాల్లోనూ భారత్‌ ఆ దేశాన్ని ఆదుకుంది. అదంతా వెనక్కునెట్టేసి, భారత్‌ పెత్తనం, ఆధిపత్యం, అంతర్గత జోక్యం ఇత్యాది విమర్శలు మాత్రమే చేసి, రాజకీయంగా లబ్ధిపొందిన ముయిజ్జు ఇప్పుడు అప్పుల్లో నిండామునిగిన మాల్దీవులను రక్షించమంటూ ఇలా పరుగెత్తుకొచ్చారు. ఐదేళ్ళపాటు రుణచెల్లింపులు వాయిదావేస్తానని బీజింగ్‌ హామీ ఇచ్చినట్టు ముయిజ్జు చెప్పుకున్నారని, ఇప్పుడది ఆర్థికసాయం గురించి మాట్లాడకపోవడంతో భారత్‌ పరిగెత్తారని ఆయన విమర్శకులు అంటున్నారు. ముయిజ్జు పర్యటనలో ‌ మాల్దీవులకు భారత్ పలు వరాలు కురిపించడం వెనుక స్వలాభాపేక్ష లేదని ఎవరూ అనుకోరు. ముయిజ్జుతో కానీ, మాల్దీవులతో కానీ తనకు వైరం లేదని చెప్పడానికి కాబోలు భారత్‌ మరింత ఉదారంగా, సానుకూలంగా వ్యవహరించిందని చాలామందికి అనిపించింది. స్వేచ్ఛావాణిజ్య ఒప్పందంతో భారత్‌ పెట్టుబడులు ప్రవహించాలని ముయిజ్జు ఆకాంక్షించారు. భారత పర్యాటకుల ఆగ్రహం ప్రభావమెంతో స్వల్పకాలంలోనే తెలిసొచ్చింది కనుక, మీరే మాకు ముఖ్యం, మీ రాకే మాకు సంతోషం అంటూ టూరిస్టులను అనుగ్రహించమని కూడా కోరారు. బంగ్లాదేశ్‌లో షేక్‌హసీనా ప్రభుత్వం కూలిపోవడం, నేపాల్‌లో కేపీ శర్మ ఓలీ ప్రధాని కావడం, శ్రీలంకలో అనూరకుమార దిస్సనాయకే అధ్యక్షుడు కావడం ఇత్యాది పరిణామాల నేపథ్యంలో, మొయిజ్జులో వచ్చిన మార్పు భారత్‌కు మంచిదే.

Updated Date - Oct 10 , 2024 | 04:35 AM