ఎన్నికలతోనే కశ్మీర్‌కు న్యాయం
ABN, Publish Date - Aug 10 , 2024 | 05:29 AM
జమ్మూకశ్మీర్‌లో సాధ్యమైనంత త్వరలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్ అన్నారు. ఇక్కడి రాజకీయ పక్షాలన్నింటితో ఎన్నికల సంఘం బృందం భేటీ
జమ్మూకశ్మీర్‌లో సాధ్యమైనంత త్వరలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్ అన్నారు. ఇక్కడి రాజకీయ పక్షాలన్నింటితో ఎన్నికల సంఘం బృందం భేటీ అయినప్పుడు, ఆ పార్టీలన్నీ ఏకకంఠంతో వెంటనే ఎన్నికలు జరగాలని డిమాండ్ చేశాయి. సీఈసీతో పాటు ఇద్దరు కమిషనర్లు కూడా ఈ పర్యటనలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వ ఉన్నతాధికారులతో, పోలీసు డైరక్టర్ జనరల్‌తో భేటీ అయ్యారు. అన్నిపార్టీలూ తక్షణమే ఎన్నికలు జరగాలని అంటున్నాయనీ, సాధ్యమైనంత త్వరగా ఆ పనిచేస్తామన్న హామీకి తాము కట్టుబడివున్నామని సీఈసీ మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. సెప్టెంబరు ముప్పైలోగా ఎన్నికలు జరిగిపోవాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఒమర్ అబ్దుల్లా మరోసారి గుర్తుచేస్తున్నారు. సెప్టెంబరులో ఎన్నికలు ఖాయమని మొన్ననే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. మరో కేంద్రమంత్రి రామ్‌దాస్ అథవాలే గురువారం శ్రీనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ, అక్టోబర్‌లో రాష్ట్రహోదా పునరుద్ధరణతో పాటు, అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయనీ, మహారాష్ట్ర, హర్యాణా, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు వీటిని నిర్వహిస్తామన్నారు. ఏది నిజమో, ఏమి జరుగుతుందో తెలియదు కానీ, త్వరలో ఎన్నికలు అంటూ ఈసీ ఎంతోకాలంగా ఊరిస్తూండటంతో ఈ సరికొత్త హామీ కూడా ఎక్కువమందిలో నమ్మకం కలిగించలేకపోతోంది.
ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియదు కానీ, ఏదో హడావుడి అయితే మొదలైంది. ఆర్టికల్ 370 రద్దుచేస్తున్నప్పుడే కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్మూకశ్మీర్‌కు రాష్ట్రహోదా తిరిగి ఇచ్చేస్తామని, ఎన్నికలు కూడా జరిపేస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని అక్కడ పర్యటించిన ప్రతీ కేంద్రమంత్రీ గుర్తుచేస్తున్నారు. అమిత్ షా ఆడిన మాట తప్పరని కూడా భరోసా ఇస్తున్నారు. ఈ నెల ఐదవ తేదీకి 370వ అధికరణను రద్దుచేసి ఐదేళ్ళవుతోంది. ప్రత్యేక ప్రతిపత్తిని పీకివేసి, రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చేస్తున్నప్పుడు పాలకులు చాలా మాటలు చెప్పారు. ఉగ్రవాదానికి రక్షణకవచంగా ఉంటున్న ఈ అధికరణ తొలగింపుతో శాంతిసుస్థిరతలు వెల్లివిరుస్తాయనీ, మిగతాదేశంతో అసంపూర్తిగా జరిగిన జమ్మూకశ్మీర్ విలీనం ఇక పరిపూర్ణమవుతుందనీ అన్నారు. ఉగ్రవాదం నశించి, వేర్పాటువాదం బలహీనపడి, ఆర్థికవృద్ధి హెచ్చి నయా కశ్మీర్ అవతరిస్తుందన్నారు. 370 రద్దుతో మొత్తమే మారిపోయిందని ప్రధానితో పాటు చాలామంది బీజేపీ నాయకులు వాదిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అది ప్రతిఫలించడం లేదు. సుదీర్ఘకాలం తీవ్రనిర్బంధం అమల్లో ఉంటూ, సైనికబలగం ఎంతో హెచ్చిన తరువాత అల్లర్లు, నిరసనలు ఆమాత్రం తగ్గుముఖం పట్టడం సహజం. ఉగ్రవాద ఘటనలు పెద్దగా తగ్గకపోగా, జమ్మూకు వ్యాపించడం మరింత భయపెడుతున్నది. దీనికితోడు ఈ ఐదేళ్ళకాలంలో ఆర్థికవృద్ధి మందగించిందనీ, ఉత్పత్తి పడిపోయిందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ప్రత్యేక ప్రతిపత్తి రద్దుకు ముందు కశ్మీర్ మాత్రమే రగిలిపోయేదని, ఇప్పుడు జమ్మూ, లద్దాఖ్ కూడా మండుతున్నాయన్న వ్యాఖ్యలో అసత్యమేమీ లేదు. ఐదేళ్ళక్రితం ప్రత్యేకప్రతిపత్తి తొలగింపును స్వాగతించిన మిగతా ప్రాంతాలవారు ఇప్పుడు ఆ నిర్ణయం తమకు తీవ్ర నష్టం తెచ్చిందని బాధపడుతున్నారు.
జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగి పదేళ్ళయింది. 2018లో రాష్ట్ర శాసనసభ రద్దయింది. 2019లో ఎన్నికలు జరగాల్సి ఉండగా, ఆగస్టులో ఆ రాష్ట్రం రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మారిపోయింది. 2022లో డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయినా సరే, ఇప్పటివరకూ ఎన్నికలు జరపకపోవడానికి కారణాలు ఏమిటో తెలియదు. అత్యంత సమస్యాత్మకమైన పరిస్థితుల మధ్య 1996లో సైతం అక్కడ ఎన్నికలు నిర్వహించగలిగినప్పుడు, ఇప్పుడు ఎందుకు సాధ్యంకాదని నాయకులు అడుగుతున్నారు. ఎన్నికల నిర్వహణకు ఉగ్రవాదం అడ్డుకాబోదనీ, వరుస ఉగ్రవాద దాడులు తమను నిలువరించలేవనీ అటు ఎన్నికల సంఘం అధికారులు, ఇటు లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ఎంతో గంభీరంగా చెబుతున్నారు. లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ఏలుబడిలో అభివృద్ధి అద్భుతంగా ఉన్నదనీ, ప్రజలు మెచ్చుకుంటున్నారని బీజేపీ నాయకులు అంటున్నారు. మరి, ఎన్నికల నిర్వహణకు వారిని నిలువరిస్తున్నదేమిటో తెలియదు. రాష్ట్ర హోదాను పునరుద్ధరించిన తరువాతే ఎన్నికలు జరపాలని చాలామంది కోరిక. ఐదేళ్ళక్రితం చేసిన అన్యాయాన్ని సాధ్యమైనంత వేగంగా సరిదిద్దాల్సిన బాధ్యత కేంద్రప్రభుత్వం మీద ఉంది.
Updated Date - Aug 10 , 2024 | 05:29 AM