ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రజలు మెచ్చే బాటలో పాలనా రథం

ABN, Publish Date - Jul 13 , 2024 | 04:09 AM

ఓ వైపు వరుస సమీక్షలు, ఆకస్మిక తనిఖీలు, మరోవైపు క్షేత్ర స్థాయి పర్యటనలు, హామీల అమలుతో రాష్ట్రంలో పాలనా రథం పరుగులు పెడుతున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం రాష్ట్రంలో కొలువు దీరి జూలై ఏడో తేదీకి ఏడు నెలలు పూర్తయింది.

ఓ వైపు వరుస సమీక్షలు, ఆకస్మిక తనిఖీలు, మరోవైపు క్షేత్ర స్థాయి పర్యటనలు, హామీల అమలుతో రాష్ట్రంలో పాలనా రథం పరుగులు పెడుతున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం రాష్ట్రంలో కొలువు దీరి జూలై ఏడో తేదీకి ఏడు నెలలు పూర్తయింది. పదేళ్ల పాటు గడీల్లో బందీ అయి సుప్తచేతనావస్థలోకి వెళ్లిన పాలనా వ్యవస్థను గాడిన పెట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిరోజు నుంచే నడుం బిగించారు. ఒక వైపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూనే, ఇంకోవైపు దొర గడీగా మార్చుకున్న ప్రగతి భవన్ ఎదుట ఇనుప కంచెలు తొలగింపజేశారు. రాష్ట్ర ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు వీలుగా అక్కడే ప్రజావాణి నిర్వహిస్తున్నారు.

తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని డిసెంబరు 9న మహాలక్ష్మి పేరిట మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పించారు. చిరు వ్యాపారాలు చేసుకునే మహిళలు, పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ఎందరో మహిళలకు ఈ ఉచిత బస్సు ప్రయాణం ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తున్నది. జూన్ 30 వరకు రాష్ట్రంలో 60.49కోట్ల మంది మహిళలు రూ.2,083 కోట్ల విలువైన ఉచిత ప్రయాణం చేశారు.

హామీల అమలులో భాగంగా రూ.500కే గ్యాస్ సిలెండర్ సరఫరాను ప్రజాప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకంలో జూలై 8 మధ్యాహ్నం నాటికి 55,37,034 మంది లబ్ధిపొందారు. వారికి గ్యాస్ రాయితీ కింద ప్రభుత్వం రూ.165.32 కోట్లు ఖర్చు చేసింది. ప్రజా సదస్సుల నిర్వహణలో 1,25,84,383 దరఖాస్తులు వచ్చాయి. ఆ దరఖాస్తుల ఆధారంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. గృహజ్యోతి కింద 200 యూనిట్ల లోపు విద్యుత్ ఉపయోగించుకున్న వారికి కరెంట్ బిల్లు లేకుండా చేసింది ప్రజా ప్రభుత్వం. త్వరలోనే రేషన్ కార్డులు మంజూరు చేయనుంది.


దక్షిణ తెలంగాణకు జీవనాడి అయిన పాలమూరు–రంగారెడ్డి; భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు సాగు నీరు ఇచ్చే సీతారామ ఎత్తిపోతల పథకాలను కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ రెండు ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. సీతారామ ఎత్తిపోతల పథకం పనులు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. ఇటీవలే ట్రయల్ రన్ సైతం పూర్తయింది. దశాబ్దాలుగా సాగునీటికి నోచుకోక, వలసలకు నిలయమైన కొడంగల్, నారాయణపేట, మక్తల్ ఎత్తిపోతల ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు రూ.3 వేల కోట్లు కేటాయించారు. ప్రస్తుతం ఆ ప్రాజెక్టు పనులు ప్రగతి దిశలో ఉన్నాయి.

విద్యార్థుల బలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో గత పాలకులు తమ కుటుంబానికి కొలువులు ఇచ్చుకున్నారే తప్ప యువతకు కొలువుల విషయాన్ని పట్టించుకోలేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలుత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళనపై దృష్టి సారించారు. యూపీఎస్సీ తీరును అధ్యయనం చేసేందుకు స్వయంగా ముఖ్యమంత్రి యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోని, కమిషన్ సభ్యులు, అధికారులతో భేటీ అయ్యారు. తర్వాత టీజీ పీఎస్సీ సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసి పారదర్శకంగా కమిషన్ చైర్మన్‌ను, సభ్యులను నియమించారు. తర్వాత టీజీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ చేయగా 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. జూన్ నెలలో జరిగిన ప్రిలిమినరీ పరీక్షకు 3.02 లక్షల మంది హాజరయ్యారు. మెయిన్స్‌కు అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారు. 11,062 ఉపాధ్యాయ నియామకాలకు డీఎస్సీ నోటిఫికేషన్ ప్రభుత్వం విడుదల చేసింది. ఎక్కువ మంది డీఎస్సీ పరీక్షలు రాసేందుకు వీలుగా టెట్ నిర్వహించగా రెండు పేపర్లకు కలిపి 2.86 లక్షల మంది పరీక్షలు రాశారు. ప్రజారోగ్యంపై శ్రద్ధతో 531 సివిల్ అసిస్టెంట్ సర్జన్, 193 ల్యాబ్ టెక్నీషియన్, 31 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రూప్ 2, 3 పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. స్టాఫ్ నర్సులు, కానిస్టేబుళ్లు, గురుకుల ఉపాధ్యాయులకు సంబంధించి ఇప్పటికే 29,042 మందికి నియామక పత్రాలను ప్రభుత్వం అందజేసింది. ఆధునిక కాలం అవసరాలకు అనుగుణంగా యువతలో నైపుణ్యాభివృద్ధికి గానూ ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా (ఏటీసీ) మార్చేందుకు శ్రీకారం చుట్టారు.


పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్‌లో జరిగిన 54వ ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరయ్యారు. సదస్సులో అమెజాన్, నోవార్టిన్ కంపెనీల డైరెక్టర్లతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలతో చర్చించారు. మొత్తంగా రాష్ట్రంలో రూ.40వేల కోట్ల పెట్టుబడులకు వారిని ఒప్పించారు. దావోస్‌లో జరిగిన ఒప్పందాలతోనే జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ తెలంగాణలో రూ.9 వేల కోట్లతో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు, గోద్రెజ్ ఇండస్ట్రీస్ రూ.270 కోట్లతో ఖమ్మం జిల్లాలో ఇంటిగ్రేటెడ్ ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ కాంప్లెక్స్, రూ.వెయ్యి కోట్లతో రాష్ట్రంలో కెమికల్ ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధమయ్యాయి. యూకేకు చెందిన సర్జికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ గ్రూప్ హెల్డింగ్ హైదరాబాద్‌లో తమ ఉత్పత్తుల పరిశ్రమ, వెల్ స్పాన్ గ్రూప్ టైర్ 2, 3 సిటీల్లో ఐటీ అభివృద్ధికి, వెబ్ వెర్క్స్ సంస్థ రూ.5,200 కోట్ల పెట్టబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి.

గత ప్రభుత్వ పాలకులు ఢిల్లీ పెద్దలతో చీకటి ఒప్పందాలకే పరిమితమై స్వీయ ప్రయోజనాలకు పెద్దపీట వేశారు. స్వీయ ప్రయోజనాలకు భంగం కలుగుతుందని భావించినప్పుడు ఒంటెద్దు పోకడలతో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావల్సిన నిధులు రాబట్టకుండా నిర్లక్యం వహించారు. అందుకు భిన్నంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాఖ్య స్ఫూర్తికి కట్టుబడి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీలతో సమావేశమై ఆయా శాఖల నుంచి రాష్ట్రానికి రావల్సిన బకాయిలు, అనుమతుల సాధనకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజ్‌నాథ్ సింగ్‌తో జరిపిన చర్చలు ఫలించడంతోనే నగరంలో పలు ప్రాంతాల్లోని రక్షణ శాఖ భూములు బదిలీ చేయడానికి ఆ శాఖ అంగీకరించింది. దాంతో రాజధాని నగరంలో కీలకమైన ప్యాట్నీ జంక్షన్ నుంచి శామీర్‌పేట జంక్షన్ వరకు ఎలివేటెడ్ కారిడార్, ప్యారడైజ్ జంక్షన్ నుంచి డెయిరీ ఫాం జంక్షన్ వరకు డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి మార్గం సుగమమైంది.

వరంగల్, కరీంనగర్ నగరాల్లో స్మార్ట్ సిటీ మిషన్ పనులు పూర్తికానందున మిషన్ కాలపరిమితిని మరో ఏడాది పొడిగించాలని ఇటీవల కేంద్ర మంత్రి ఖట్టర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. స్పందించిన కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ మిషన్ కాలపరిమితిని ఏడాది పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో పలు దఫాలు భేటీ అయి హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి ఆరు వరుసల విస్తరణకు, రాష్ట్రంలో పలు జాతీయ రహదారులు, ఆర్వోబీలు, ఆర్యూబీలకు అనుమతులు సాధించారు. రాజకీయ వైరుధ్యాలతో ప్రజల ప్రయోజనాలను ఫణంగా పెట్టకూడదనే విచక్షణతో వ్యవహరిస్తూ, కేంద్ర, రాష్ట్ర సంబంధాల విషయంలో సమాఖ్య స్ఫూర్తిని చాటుతూ ముఖ్యమంత్రి రాజనీతిజ్ఞునిగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర విభజనతో పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా లేకున్నా రైతు భరోసాను అందించారు. కీలకమైన రైతులకు రూ.2 లక్షల రుణమాఫీని ఆగస్టు 15 నాటికి పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుదలతో ఉన్నారు. ఉద్యోగాలు, పెట్టుబడులు, సంక్షేమం ఇలా అన్ని రంగాల్లో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విరామం లేకుండా పని చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించి ఏడు నెలలు పూర్తయినా అందులో మార్చి 16 నుంచి జూన్ 6 వరకు వరకు 80 రోజులు లోక్‌సభ ఎన్నికల కోడ్‌తో ప్రభుత్వం ఏ పనీ చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. ఆ రకంగా చూస్తే కేవలం 130 రోజుల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సమర్థమైన పాలనతో ఎన్నో పనులు చేయగలిగారు.

ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించి ఏడు నెలలు పూర్తయినా అందులో మార్చి 16 నుంచి జూన్ 6 వరకు 80 రోజులు లోక్‌సభ ఎన్నికల కోడ్‌తో ప్రభుత్వం ఏ పనీ చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. ఆ రకంగా చూస్తే కేవలం 130 రోజుల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సమర్థమైన పాలనతో ఎన్నో పనులు చేయగలిగారు.

డి. విజయకుమార్

రాష్ట్ర ముఖ్యమంత్రి పీఆర్వో

Updated Date - Jul 13 , 2024 | 04:09 AM

Advertising
Advertising
<