‘కోచింగ్’ విషాదం
ABN, Publish Date - Jul 30 , 2024 | 03:23 AM
ఢిల్లీలో సివిల్స్ శిక్షణపొందుతున్న ముగ్గురు విద్యార్థులు దుర్మరణం పాలైన ఘటన అత్యంత విషాదకరమైనది. భారీ వర్షం కారణంగా వరదనీరు సదరు కోచింగ్ సెంటర్ సెల్లార్‌ను ముంచెత్తడంతో...
ఢిల్లీలో సివిల్స్ శిక్షణపొందుతున్న ముగ్గురు విద్యార్థులు దుర్మరణం పాలైన ఘటన అత్యంత విషాదకరమైనది. భారీ వర్షం కారణంగా వరదనీరు సదరు కోచింగ్ సెంటర్ సెల్లార్‌ను ముంచెత్తడంతో, ఈ ముగ్గురు అక్కడి లైబ్రరీలో చిక్కుబడిపోయి ప్రాణాలు కోల్పోయారు. నీరు చేరడమే తప్ప బయటకు పోయే దారిలేని సెల్లార్‌లో విద్యార్థులకు అత్యంత అవశ్యకమైన లైబ్రరీ నిర్వహించడం ఆ సంస్థ బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. ప్రమాద సమయంలో అక్కడ ముప్పైమంది విద్యార్థులున్నారు. కొంతమంది తమకు తాముగా బయటపడ్డారు, మిగతావారిని తోటివారు కష్టపడి కాపాడారు. కానీ, ఈ ముగ్గురూ ఆదుకొనే నాథుడు లేక నాలుగుగంటలపాటు అక్కడే చిక్కుబడిపోయి చివరకు ప్రాణాలు వదిలేశారు. ఆ ప్రాంతంలో డ్రైనేజ్ వ్యవస్థ ఘోరంగా ఉన్నదని పదిరోజులక్రితమే అధికారులకు, స్థానిక కౌన్సిలర్‌కు స్వయంగా ఫిర్యాదు చేసినట్టు విద్యార్థులు చెబుతున్నారు. ఆ ప్రాంతంలో మురుగునీరు వెళ్ళే కాలువలు ఆక్రమణలకు గురై పూడుకుపోయాయని అధికారులు అంటున్నారు. నీటిధాటీకి పైప్‌లైన్లు పగిలిపోయి నీరు భారీగా సెల్లార్‌లోకి చేరడంతో ఈ ఘోరం జరిగింది. కోచింగ్ సెంటర్‌ల ధనాపేక్ష, అధికార యంత్రాంగాల నేరపూరితమైన నిర్లక్ష్యం ఈ ముగ్గురి కలెక్టర్ కలను చిదిమేశాయి.
ఈ మహావిషాదాన్ని అన్ని పార్టీలూ ముక్తకంఠంతో ఖండించాయి, ఆవేదన వెలిబుచ్చాయి. ఎంతమాత్రం రాజకీయం తగదని ఏకమాటగా అంటూనే అంతిమంగా అదేపనిచేశాయి. పాపం మీదంటే మీదని పరస్పరం విమర్శించుకుంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ, భారతీయ జనతాపార్టీ పక్షాన లోక్‌సభ, రాజ్యసభల్లో మోహరింపులు జరిగాయి. ఆ స్వల్పకాలిక చర్చలో కూడా ఎదుటివారిని తప్పుబట్టడమో, నేరం నెట్టివేయడమో ప్రధానమైపోయింది. ‘ఢిల్లీ మునిసిపాలిటీ ఏకంగా పదిహేనేళ్ళుగా మీ చేతుల్లో ఉన్న ఫలితంగా వ్యవస్థలన్నీ నాశనమైనాయి, ఇప్పుడేమో డ్రైనేజ్ రిపేర్ చేయమని పదిహేనురోజులుగా పోరుతున్నా అధికారులు మా మాట వినడం లేదు’ అని బీజేపీని ఆప్ విమర్శిస్తే, బీజేపీ తరఫున మాట్లాడినవారంతా ఆప్ అసమర్థతను తప్పుబట్టారు. ఢిల్లీలో ఈ రెండుపార్టీల మధ్యా ఉచ్ఛస్థితికి చేరిన రాజకీయవైరం ప్రజల ప్రాణాలకు ప్రమాదకరంగా పరిణమించిందని ఈ ఘటన తెలియచేస్తోంది. మంత్రుల ఆదేశాలను అమలుచేసిన అధికారులను లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వేధిస్తున్నారని ఆప్ విమర్శిస్తోంది. ఏతావాతా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం, అమలుచేయనిపక్షంలో అడగడం వంటివి ఎవరికీ పట్టని వ్యవహారంగా మారిపోయింది. ఇప్పుడు ముఖ్యమంత్రి జైల్లో ఉండటంతో కుంటుతున్న వ్యవస్థకూడా కుప్పకూలింది. ఆప్ ముక్కలు చెక్కలైపోయి, ఏడు ఎంపీస్థానాలు గెలుచుకున్న బీజేపీ అసెంబ్లీని కూడా వశపరచుకొనేవరకూ ఈ ఘర్షణ తప్పదేమో! కోచింగ్ సెంటర్‌ముందు ఆందోళన చేస్తున్న విద్యార్థులు ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ సహా, బీజేపీ, ఆప్‌లకు చెందిన పలువురు నాయకులను తీవ్ర నిరసనలతో వెనక్కు పంపేయడం గమనించాల్సిన అంశం.
ఈ ఘటన తరువాత బుల్‌డోజర్లు వచ్చాయి, ఫుట్‌పాత్‌లను, నాలాలను దురాక్రమించిన మిగతా కోచింగ్ సెంటర్లను పాక్షికంగా కూలగొట్టాయి. ఒకరిద్దరు అధికారులు కూడా సస్పెండ్ అయ్యారు. మూడుప్రాణాలు పోయిన తరువాత ఏకంగా ఒకరోజులోనే పదిహేను కోచింగ్ సెంటర్‌ల అతిక్రమణలను, అక్రమాలను గుర్తించి, శిక్షించిన ఈ అధికారులకు ఇంతకాలమూ సదరు కోచింగ్ సెంటర్ పార్కింగ్‌కోసమో, స్టోర్‌రూముగానో వాడాల్సిన సెల్లార్‌ను లైబ్రరీగా మార్చిందని తెలియరాలేదనుకోలేం. ఆ సెంటర్‌లో చదువుతున్న ఓ విద్యార్థి, పక్కనే నివాసం ఉంటున్న ఓ పెద్దమనిషి సహా పలువురు ఫిర్యాదు చేసినా వారు బేఖాతరుచేశారు. నిబంధనలు, ప్రమాణాలకు అనుగుణంగా సదరు సంస్థ నడుస్తున్నదని వివిధ విభాగాలు కనీసం తనిఖీ కూడా చేయకుండా సర్టిఫికేట్లు ఇచ్చేయడం ఆశ్చర్యం. ఇప్పుడు ఉన్నతస్థాయి కమిటీ స్వల్పకాలంలో వేగవంతమైన విచారణతో ఏ కొత్తనిజాలు వెలుగులోకి తెస్తుందో తెలియదు కానీ, లక్షలాది రూపాయలు వసూలుచేస్తూ, విద్యార్థుల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్న కోచింగ్ సెంటర్‌ల ఇష్టారాజ్యానికి సమస్త వ్యవస్థలు కలసికట్టుగా సహకరిస్తున్నాయన్నది వాస్తవం.
Updated Date - Jul 30 , 2024 | 03:23 AM